పురుషపుంగవుల్లారా, మీ కోసమే ఈ కథ!

ప్రసవ సమయంలోనే గాక ఆ తరువాత కూడా కనీసం కొన్ని రోజులపాటు భార్యలకి కనుచూపు మేరలో లేని భర్తలకోసం ఈ కథ పరిచయం.

పిల్లాడు/పిల్ల తల్లిగర్భం నించీ బయటపడగానే మంత్రసాని ఒక గోళీని ఆ గది బయటకు విసిరగానే తండ్రి ఆనందించడం, ఆ గోళీ చేరిన క్షణాన్ని బట్టీ జ్యోతిష్కులు జాతకం వెయ్యడం చందమామ కథల్లో చదివాం, సినిమాల్లో చూస్తూంటాం. వాటివల్ల, గర్భధారణ, ప్రసవమూ, పిల్లాడు/పిల్ల ఎదగడమూ చిటికెలో అయిపోయే అంశాలుగా మస్తిష్కంలో ముద్రపడిపోతాయి. అందరూ సాధారణం అనుకునే గర్భధారణ కొందరికి బాగా ఆలస్య మయినప్పుడు వాళ్లు పడే వేదన గూర్చీ, గర్భధారణ కోసం చేసే ప్రయత్నాల గూర్చీ, ఆ ప్రయత్నాలు విజయవంత మయిన దాదాపు తొమ్మిది నెలల తరువాత క్షణాలు యుగాలుగా గడిచే ప్రసవం గూర్చీ, ఎక్కడా సాధారణంగా కనపడదు, వినపడదు. వీటికి తోడు అకాల జననంవల్ల ఆ సంతానం నియోనటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో (NICUలో) కొన్నిరోజులు గడపడం అంశంగా ఈ మధ్యనే వెలువడిన కథ ది లివర్. రచయిత మాథ్యూ క్లామ్. పేరున్న న్యూయార్కర్ మాగజీన్లో ఇది ప్రచురిత మయిన దంటే ఇలాంటి కథ ఇప్పటిదాకా ఇంగ్లీషులో రాలేదు అనుకోవడానికి ఆస్కారం ఎక్కువ. (తెలుగులో వచ్చే అవకాశం పూర్తిగా మృగ్యం!) కథ తండ్రి దృష్టికోణం నించీ రాసింది. ఇందులో పేర్కొన్న చాలా అంశాలు స్వీయానుభావాలని గుర్తుచేసి ఈ కథని పరిచయం చేయిస్తున్నాయి.

పిల్లలకోసం పడే ఆరాటం దంపతులు ఇద్దరిలోనూ సమంగా ఉండవచ్చు గానీ మిస్‌కారియేజెస్ ప్రభావాలనీ, గర్భవతి అయిన తరువాత తొమ్మిది నెలల భారాన్నీ మొయ్యాల్సింది ఒక్క స్త్రీ మాత్రమే. ఆ భారాలలో సహస్రాంశం కూడా పురుషులకి తెలిసే అవకాశం లేదాయే! అయితే, పాతిక, ముఫ్ఫయ్యేళ్ల క్రితం ఇండియా నించీ వలస వచ్చి, ప్రసవ సమయంలో అమెరికా హాస్పిటల్స్‌లో భార్యల పక్కన ఉన్న పురుషులు మాత్రం ఆనాడు ఇండియాలో కొత్తగా తండ్రు లయినవాళ్ల కంటే ఎక్కువ అనుభవాలని తమ ఖాతాలో జమచేసుకున్నారు. గర్భిణి స్త్రీకి ఏడవ నెల రాగానే ఆమెని పుట్టింటివారు తమతో తీసుకుపోవడం, కానుపు అయిన తరువాత మూడవ రోజుకో, పదవరోజుకో తండ్రి పిల్లనో పిల్లాడినో చూడడానికి రావడం, తరువాత ఒక మూడు నెలలదాకా ఆమె సంతానాన్ని తీసుకుని భర్తవద్దకు చేరకపోవడం ఇండియాలో ఆనాటి పద్ధతులు. ఈనాడు కూడా ఇండియాలో ఎంతమంది తండ్రులు ప్రసవ సమయంలో హాస్పిటల్లో భార్యపక్కన ఉంటారో తెలియదు గనుక ఈ కథ అక్కడి రెండు, మూడు జనరేషన్ల పురుషులందరికీ పరోక్షంగా నయినా వివరాలను తెలుసుకోవడానికి సహకరిస్తుంది.

ఉత్తమపురుషలో వెలువరించిన ఈ కథ ప్రసవం అయిన తరువాత హాస్పిటల్లో మొదలవుతుంది. కథకుని భార్య కేథీకి అనుకోకుండా రెండునెలల ముందుగానే సిజేరియన్ ఆపరేషన్ అవసర మవుతుంది. అందువల్ల డాక్టర్లు పిల్లని వెంటనే NICUకి తీసుకువెళ్లి జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అప్పుడు కథకుడికి కేథీ గర్భస్రావాలూ, మళ్లీ గర్భంకోసం యాంత్రికంగా చేసిన ప్రయత్నాలూ గుర్తొచ్చాయి. (“As a couple, we were finished, though still copulating. Between the dirty footage and the dregs of hope, the furtive inelegance of our biological necessity, we stayed in business.” యాంత్రికత గూర్చిన ఈ వాక్యాలని చదవగానే నా సహోద్యోగి, అతని భార్యా పిల్లలకోసం చేసిన ప్రయత్నాల మధ్యలో అతను ఒకరోజు ఆలస్యంగా ఆఫీసుకు రావడానికి చెప్పిన కారణం గుర్తొచ్చింది. స్త్రీ శరీర ఉష్ణోగ్రతని మానిటర్ చేస్తూ సరయిన సమయంలో సృష్టికార్యాన్ని జరపడం వాళ్ల ప్రయత్నాలలో ఒకటి. బయలుదేరబోతుండగా ఆమె తన ఉష్ణోగ్రతని చూసి, “ఇది సమయం” అన్నదట.) చివరికి అవి ఫలించిన తరువాత ఆమె జీర్ణకోశంతో పడ్డ అవస్థలూ, పడుకుంటే వాంతులవుతాయని వీలయినంతవరకు నిల్చునే నిద్రపోవడాలూ, అప్పుడప్పుడూ కాళ్లలో విద్యుత్తుపాకినట్లు తీపులూ, నెప్పులు తట్టుకోలేక మత్తుమందు కోరుకోవడాలూ గుర్తుకొస్తాయి. వసంతం వచ్చిన తరువాత అవుతుం దనుకున్న కానుపు రెణ్ణెల్ల ముందరే ఫిబ్రవరి నెలలో తలుపుతట్టడంవల్ల, రెండు రోజుల నించీ నెప్పులు వస్తున్నా చివరికి బయట మంచు కురుస్తున్నప్పుడు తెల్లవారుఝామున రెండు గంటలప్పుడు ఆమెను హాస్పిటల్ కు తీసుకువెళ్లాడు. డాక్టర్లు ఆ అకాల కానుపువల్ల కలిగే సంతానానికి ఆరోగ్యరీత్యా ఎన్ని ఇబ్బందులు రావచ్చో ముందే చెప్పి సంతకాలు తీసుకున్న తరువాతే ఆమెని సర్జరీకి తీసుకెళ్లారు. “It had begun wrong and now the wrongness would never end.” అన్న కథకుడి మనోభావం అలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్న అనేకమంది తల్లిదండ్రులు ఎలాంటి మానసిక వత్తిడులకి లోనవుతారో తెలియజేస్తుంది. కేథీ పొట్టని కత్తితో చీల్చి కూతురిని వెలుపలకు తియ్యడాన్ని కథకుడు ప్రత్యక్షంగా చూశాడు.

సిజేరియన్ తరువాత పిల్ల వేరే చోట ఉన్నాగానీ ప్రకృతి తనపని తను చేసుకుపోవడంవల్ల కేథీ స్తన్యం గూర్చి హాస్పిటల్ మెషీన్ ఏర్పాటు చేసింది. ఆ గదిలోనే కూర్చున్న కథకుడు ఆ వివరాలని గమనించకుండా తప్పించుకోలేడు. కాసేపయిన తరువాత NICUకి వెళ్లి ఒక చేతిలో పూర్తిగా పట్టే సైజున్న కూతురుకు నర్స్ సహాయంతో డైపర్ మారుస్తాడు. నర్స్ తీసుకొచ్చిన చిన్న ఫార్ములా పాల బాటిల్ పీకని కూతురు నోట్లో పెట్టి ఆమె ఆకలి తీర్చుకునేలా చేస్తాడు. రోజుల వయసున్న పిల్ల మెదడుకి ఇంకా పూర్తిగా నోటిని కదిపితే గానీ పాలు పొట్టలోకి చేరవనీ, పాలు పూర్తిగా తాగిన తరువాతే నిద్రపోవాలనీ, త్రేన్పుతో గాలితో బాటు తాగిన పాలు బయటకు వెళ్లకుండా చూసుకోవాలనీ తెలియదు గనుక, ఆ ఎరుక వాళ్లకి రావడానికి రెణ్ణెల్లు పడుతుంది గనుక అప్పటి దాకా తల్లిదండ్రులు వాళ్ల ఫీడింగ్ లని జాగ్రత్తగా చూసుకోవాలి. బొళుక్కున కక్కినప్పుడు శుభ్రం చెయ్యడమే గాక అవసర మయితే మళ్లీ పాలుపట్టాలి. ఇవన్నీ ఒక ఎత్తయితే, వీటన్నిటితో బాటు ఆ వయసు పిల్లలు గాలి పీల్చుకోవడం మరచిపోవడం ఇంకొక ఎత్తు. అలా మరచినప్పుడు NICUలో మానిటర్లు ఉంటాయి గనుక అవి అలారం మోగించి నర్సులని అప్రమత్తం చేస్తాయి.

కేథీ సర్జరీ నించీ కొద్దిగా కోలుకుని ప్రసవ మయిన రెండు రోజుల తరువాత NICUకి వీల్ ఛెయిర్లో వెళ్లి మొదటిసారి కూతురుని చూసి చనుబాలని ఇవ్వబోతే కూతురుకు ఎలా పాలు తాగాలో అర్థంకాకపోవడంవల్ల కథకుడే మళ్లీ ఆమెకు బాటిల్ పాలు పట్టాడు. కేథీ ఇంటికి చేరుకున్న రెండువారాలకి గానీ కూతురు ఆ ఇంటికి చేరలేదు. కథకుడు కూతురు డైపర్ మార్పుల, పాలు పట్టడాల, ఏడుపుని ఆపించడాల, నిద్రపుచ్చడాల అవస్థలని పేర్కొని అవి అతనికి కలిగించిన తృప్తిని జోడించి చెప్పడంతో కథ ముగుస్తుంది.

ఈ కథకు “ది లివర్” అని శీర్షిక ఎందుకు అని అనుమానం రావడం సహజం. “But this guy’s tough. He’s a liver.” అన్న కథలోని వాక్యాలని బట్టీ దృఢత్వానికి ప్రతీకగా లివర్ ని రచయిత ప్రస్తావించాడని తెలిసినా, ఇది సాధారణంగా వాడుక సంభాషణల్లో దొర్లే పోలికా లేదా మెడికల్ గా వాడేదా అన్న సందేహాన్ని పాఠకులు ఎవరయినా తీర్చగల రేమో చూడాలి.

ఈ కథలోని కొన్ని అంశాలతో నాకు ప్రత్యక్షంగా సంబంధం ఉండడం ఈ కథని పరిచయం చెయ్యడానికి ముఖ్యకారణమని ముందు చెప్పాను. మొదటగా స్వడబ్బా. కథకుడు చెప్పినట్లుగా మా పిల్ల లిద్దరికీ మొదటిసారి హాస్పిటల్లో డైపర్ మార్చింది నేనే. అంత ధైర్యం నాకు రావడానికి కారణం, మా అబ్బాయి పుట్టగానే ఆ గదిలో నర్సు వెల్లకిలా పడుకుని ఉన్న వాణ్ణి ఎడమ చేతిలో – చూపుడు, బొటనవేళ్ల మధ్యలో ఒక కాలూ, చూపుడు, మధ్య వేళ్ల నడుమ ఇంకొక కాలూ ఉండేలా – పట్టుకుని లేపి శుభ్రం చెయ్యడాన్ని చూడడం. బయటవాళ్లకంటే నా పిల్లవాణ్ణి నేనే బాగా చూసుకోగల నన్న నమ్మకం! భూమ్మీద వాడి మొదటి రాత్రి ఎక్కువసార్లు ఏడుపుతోనే గడిచింది. వాణ్ణి క్రిబ్బులోంచి తీసి నా భార్యకి అందించడం, ఆమె స్తన్య మివ్వడానికి ప్రయత్నించడం, విఫల ప్రయత్నం తరువాత మళ్లీ క్రిబ్బులో పడుకోబెట్టడం. అదొక అంతంలేని రాత్రిలాగా అనిపించింది. మధ్యలో నర్స్ స్టేషన్ కి వెళ్లి చెబితే, వాళ్ళు సన్నగా నవ్వి, “మొదటి కానుపా?” అని ప్రశ్నించడాన్ని ఎప్పటికీ మరువలేను.

మా అబ్బాయి పుట్టింది ఫిబ్రవరి నెలలో. నాకు పొద్దున్న నాలుగు గంటల ప్రాంతంలో మెలకువ వచ్చి చూస్తే నా భార్య మంచం మీద కూర్చుని ఉండడం, అంతకు ముందు రెండు గంటల నించీ నెప్పులు వస్తున్నా గానీ నేనెలాగో కాసేపట్లో లేస్తాను గనుక లేచినప్పుడు చేబుదాంలే అని ఆమె అనుకుని వాటిని భరిస్తూ కూర్చున్నదని చెప్పడం, అయిదు గంటలకి హాస్పిటల్ కు నా భార్యని తీసుకు వెడుతున్నప్పుడు అంతకుముందు పడిన మంచు పగటిపూట కరిగి రాత్రిపూట ఘనీభవించి పలుచని ఐస్ పొరగా రోడ్డు మీద – ముఖ్యంగా హైవే ఎగ్జిట్ రాంపుల మీద – ఉంటుందని గుర్తుండి జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యడం, హాస్పిటల్ కు వెళ్లిన తరువాత ఒక గంటలో ప్రసవం అయిపోతుంది అని చెప్పిన తరువాత ఆమె దాదాపు ఆరు గంటలు ఆ నెప్పులని భరించడం, ఇంటికి వచ్చిన తరువాత కొంతకాలంపాటు వాడు కక్కడాలూ, శుభ్రంచేసుకోవడాలూ, మళ్లీ తిండిపెట్టడాలూ – వీటన్నిటినీ ఈ కథ గుర్తుచేసింది. ప్రసవ సమయంలో నేను నా భార్య పక్కనే ఉండడం సహాయంకోసం ఒంటరిగా అమెరికా వచ్చిన మా అత్తగారికి అత్యంత ఆశ్చర్యకరం. వాడు పుట్టే ముందర నా స్నేహితుని తల్లి మా ఇంటికి వచ్చినప్పుడు పుట్టిన తరువాత స్తన్యం ఇవ్వడంకోసం ముందునించే ముచ్చికని ఎలా తయారుచేసుకోవాలో నా భార్యకు చెప్పడాన్ని కూడా. పాలు తాగుతున్న మధ్యలో నిద్రపోవడం మా అమ్మాయి ప్రత్యేకత. దానికి వాళ్లమ్మ అమలుజరిపిన విరుగుడు ఒక తడి గుడ్డని నుదుటిమీద పెట్టడం.

అకాల జననాల ఇబ్బందులు లేకపోయినా ఇలాంటి అవస్థలన్నీ మా తల్లిగారు పడేవుంటారని మొదటగా గుర్తుచేసుకుని, వాటిని ప్రత్యక్షంగా చూపెట్టిన నా భార్యతో మొదలుపెట్టి, మా చెల్లెళ్లకీ, మరదళ్లకీ, సమస్త స్త్రీలోకానికీ వందనా లర్పించడానికి ఈ కథ ఉపకరించింది. పురుషపుంగవుల్లారా, మీరు కూడా ఈ కథ చదివి వందన సమర్పణలో భాగస్వాములు కండి!

*

రచయిత వివరాలకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

 

తాడికొండ శివకుమార శర్మ

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు