అధిక వచనం, అనల్ప కవిత్వ కల-వరింత!

ఒకవైపు అంబేద్కర్ మరోవైపు మార్క్స్ యితని రాతలనిండా కన్పిస్తారు. ఆ లాల్ – నీల్ సంయోగాన్ని కలగనే ప్రేమ యితడిది.

ఖ్వాబ్– ఒక సామాజిక కలవరింత. ఇదంతా కలల ముచ్చట కనుక ఖ్వాబ్ అని పెట్టాను అంటాడు రచయిత ఒకచోట. ఒక వూహాజనిత ప్రేయసి యాదుల్నే గాక తన బాధలనూ రాసుకున్న రాతలివి. ఏ రాత్రులందో నిద్ర పట్టక మాయానజ్మ్ రాసుకున్నట్లు, కలలందు యాదుల్లో నాలుగు వాక్యాలు రాసుకుంటున్నాను అంటాడు యింకోచోట. ‘నిజమే, యిరిగిపోయిన కలలు చాలా నేర్పించాయి. ఎదలో నిండిన నీవు కనుచూపుమేరలో లేవు. ఏ గాఢనిద్రలోనో నువ్వు యాదికొస్తే ఉలిక్కిపడి లేస్తాను. తర్వాతిక నిద్రపట్టదు. ఇప్పుడు యిక్కడ జనాల పరిస్థితి అదే. ఊరు పోతుందని నిద్ర పట్టడం లేదన్నారు’. ఇట్లా వూహాజనిత ప్రేయసి చేసిన నిద్రాభంగం తో ప్రారంభించి, ఆ యింత వైయ్యక్తిక విషయంతో మొదలుపెట్టి తర్వాతంతా సామాజిక పలవరింతను మనకు వినిపిస్తాడు.

     పేరుకు కలలు అన్నాడు గానీ, ఇవన్నీ కలలైతే కావు. పేరుచెప్పని ప్రేయసి కి రాసిన అపరిపూర్ణ లేఖలు. లేఖలంటే లేఖలూ గావు. వర్తమాన సామాజిక వ్యాఖ్యలు. ప్రేమలేఖలని అంటుంటాడు గానీ ప్రేమరాహిత్యంలో చేసిన కలవరింతలే యివన్నీ. ఈ కలల కథావస్తువు సామాజికమే. చాలా చోట్ల రొమాంటిసిజం రావడానికి ప్రయత్నిస్తుంది గానీ యీ రచయిత దాన్ని గడ్డువాస్తవికతగానే మలుస్తాడు. ఇంత వాస్తవికతతో నిండిపోవడం వల్ల అక్కడక్కడా కన్పించే రొమాన్స్ మనకు మింగుడుపడదు. నప్పదూ . అట్లా అని,  పుస్తకం అట్ట మీద “of love and revolution” అనే టైటిల్ వుందిగదా పుస్తకం అంతా రెవెల్యూషన్ మీద ప్రేమ గురించేమో అని అనుకోవడానికి లేదు. ఈ రచయిత ఆలోచనలలో class questions కు సంబంధించిన వుదాహరణలకంటే cast questionకు సంబంధించిన వుదాహరణలే యెక్కువ. ఏదోమేరకు యీ లేఖల్లో భారత సామాజిక దొంతరల విషవలయాలనూ దాని నిజప్రభావాలనూ యెత్తిచూపడమే మనం కనుగొనే రచనాకళ.
 ఒక ముప్పైతొమ్మిది, ఒకటి నుంచి మూడు పేజీల నిడివి గల రైటప్ లివన్నీ. వీటి తెరచుకునే తలం యీ కాలపు పాతికేళ్ల యువకుడి రొమాంటిక్ తలపులు. నడిచేనిడివంతా వైయ్యక్తిక భగ్నహృదయ నేపధ్యంలో విశాల సామాజిక విషాదాలు. మధ్య మధ్యలో కొన్ని కవితా పాదాల వుళ్లేఖనలు. స్వంత కవితలతో పాటు ఫైజ్ తలత్ మెహదీహసన్ శైలేంద్ర కీట్స్ రాబర్ట్ గ్రేవ్స్ ముగ్ధూం గుల్జార్ అమృతాప్రీతం యిలాంటి కవుల వాక్యాలతో వచనాన్ని నడుపుతాడు. ఇతని వాక్యానికి కవిత్వం సంగీతం రంగురుచీవాసనను యిచ్చాయి. ఒకచోట అంటాడు,  ‘శైలేంద్ర రాతను రఫీ పాడుతుంటే నీతో పాటే నల్లమల యాదికొచ్చింది’ అని. ఇట్లాంటి యిష్టమైన పాటనో కవితనో చెప్తూ చెప్తూ ఆమె జ్ఞాపకాల మీదుగా, నేల నుంచి విసరేయబడ్డ మనుషులనో, సెజ్ వల్ల నిర్వాసితులైన వారినో, యురేనియం తవ్వకాలకు బలయ్యే నల్లమల ఆదివాసీలనో, కంచికచర్ల కోటేసునో, వాఘా సరిహద్దు దాకా వెళ్లి మూర్ఖ బత్తాయిలు రగిలిస్తున్న యుధ్ధక్షేత్రంలోనో మనల్ని తిరుగాడనిస్తాడు. మొత్తం పుస్తకాన్ని యెవరికో చెబుతున్నట్టు అడ్రస్సింగ్ ఫాంలో నిర్మించాడు. ఆ క్రమంలో సాహిత్యం లో వున్న అన్ని జానర్లనీ వాడుకున్నాడు. కధనం, కవిత్వం, బుక్ రివ్యూ, సినిమా రివ్యూ, ట్రవెలోగ్ యిట్లా ఒక్క డ్రామా మాత్రమే లేదు. కొందరు యీ పుస్తకాన్ని కవిత్వం అని భ్రమపడ్డారు . ఎందుకంటే,  ఇందులో ఏడెనిమిది యీ రచయితవి  కవితలూ  వున్నాయి. ఇండస్ మార్టిన్ కటినపూలు మీద రివ్యూ రాస్తూ,  తెలుగు వాడల నుంచి నల్లమలకు తీసుకుపోతాడు.ఇంకా రెండు సినిమా రివ్యూలు మూడు ట్రావెలోగ్లూ నాలుగైదు అసలసిసలైవ ప్రేమలేఖలూ   మనం చదవొచ్చు.
     ‘అరుణాంక్ లత’, అని  తల్లి పేరును తన పేరులో జత చేసుకున్న యీ రచయిత కలలో తల్లి మాత్రం కనబడదు. ఏమైనా చెబుతాడేమోనని మనం యెంత వెతికినా తన యాదుల్లో అమ్మ లేదు. శకలాల శకలాల ప్రేయసి కనబడుతుందే గానీ తన ప్రియురాలి సంపూర్ణ రూపమూ ఆవిష్కరింపబడలేదు. సంగీత సాహిత్యాల సాంగత్యం, బలమైన వ్యక్తీకరణకు కారణంగా కనిపిస్తుంది. ఈ పుస్తకం మొత్తం బ్యాక్ గ్రౌండ్ లో విషాదస్వరమే వినిపిస్తుంది. అది హైందవ కులజంధ్యప్పోగులు ప్రేమగొంతుకు వురులు బిగిస్తున్నప్పటి కలవరింత. అందుకే యీ పుస్తకం దుఖ్ఖస్వప్నాలు చిగురించే నిద్రలేమిది.
      ఈ రచయిత కు రాజకీయాలున్నాయి. ప్రేమకు విప్లవానికి వైయ్యక్తిక వొంటరితనానికీ రాజకీయాలు వున్నాయని భావిస్తాడు. అలాగే విప్లవానికి ప్రేమకూ కూడా కులరాజకీయం వుందనీ నమ్ముతాడు. ఈ లేఖల నిండా యిదంతా వుంది. ఒకవైపు అంబేద్కర్ మరోవైపు మార్క్స్ యితని రాతలనిండా కన్పిస్తారు. ఆ లాల్ – నీల్ సంయోగాన్ని కలగనే ప్రేమ యితడిది. ఆ ప్రేమ నిజమవ్వాలనీ, అది పండి  ఇతడిని భగ్నప్రేమికుడిగా మిగలకుండా చూడాలని మనం కోరుకుందాం.
*

వెంకట కృష్ణ

ఇంటర్మీడియట్ చదివే రోజులనుండి కవిత్వం రాస్తున్నా.నా తరం అందరిలాగే శ్రీశ్రీ ప్రభావం నామీదుంది.అయితే పుస్తకాలు చదివే అలవాటు వల్ల రా.వి.శాస్త్రి రుక్కులూ, రంగనాయకమ్మ బలిపీఠం హైస్కూల్ దినాలకే చదివున్నాను.యండమూరీ,చందూసోంబాబు,తదితర కమర్షియల్ సాహిత్యం కూడా ఇంటర్ రోజుల్లో విపరీతంగా చదివున్నా సీరియస్ తెలుగు సాహిత్యం తోనే నా ప్రయాణం కొనసాగింది.1994 నవంబర్ నెలలో మొదటి కథ ఆంధ్ర ప్రభ సచిత్ర వారపత్రికలో అచ్చైంది . అప్పటిదాకా రాసుకున్న అచ్చు కాని కవిత్వాన్ని 2000 సంవత్సరం లో లో గొంతుక గా నా మొదటి కవితా సంపుటి.1994నుండీ 2000 దాకా నెమ్మదిగా రాసాను.2000 తర్వాత రెగ్యులర్ గా రాస్తున్నా.

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు