స్వప్నవాసవదత్త …అట్లా దిగివచ్చిన సందర్భం!

కేవలం చదవడం కాక కావ్యవాక్కును మననం చెయ్యాలని చెప్పేవారు మాష్టారు. అలా ఐతే అందుతాయి ఆ ఎత్తులు, లోతులూ!

ఆంధ్ర యువతీ సంస్కృత కళాశాలలో భాషాప్రవీణ నాల్గవ సంవత్సరం చదువుతున్న రోజులు. 1972అనుకుంటాను. మాష్టారు మల్లంపల్లి శరభయ్యగారు ఎందుకన్నారో గుర్తులేదుకానీ భాసుడి స్వప్నవాసవదత్త నాటకం మీ చేత వేయించాలనుంది అన్నారు. ఆయనకి అప్పటికి ఈ దర్శకత్వ విద్య తెలియదు. స్వప్నవాసవదత్త నాటకం లో చతుర్ధాంకాన్ని మించినది లేదనీ అదే వెయ్యాలనీ అన్నారు. ఎందుకలా అన్నారో అప్పుడు అంత బాగా తెలియలేదు కానీ ఇప్పుడు మరోసారి చదివితే నిజంగా మతిపోయింది.
ఏమి రంగస్థలనిర్మాణం?? ఏమిసన్నివేశకల్పన?? ఏలాంటి సంభాషణలు!!! వాటిద్వారా ఎంతటి హృదయసంవేదనల ఆవిష్కరణ. భాసుడి లాంటి కవి గానీ నాటకకర్త గానీ మరొకరున్నారా అనిపించింది.
నాటకం లోని చతుర్ధాంకం కథ స్థూలంగా.. వత్సదేశపు రాజైన ఉదయనమహారాజు అవంతీరాజపుత్రి వాసవదత్త కు వీణావాదనం నేర్పుతూ పరస్పరం ప్రేమలో మునిగి పెళ్లిచేసుకుంటాడు. అనురాగ భరితమైన అపురూపప్రేమజీవనం వారిది. ఈ మాట తాలూకు గాఢత్వం చతుర్థాంకం లో మనకు బాగా తలకెక్కుతుంది. మనమూ ఆ విషాదప్రేమ మత్తులో తెప్పరిల్లలేనంతగా ములిగిపోతాం
సంగీతసారస్వతాలే జీవితంలా గడిపే ఉదయనమహారాజు రాజ్యం కోల్పోయాడు. అరణ్యాలు పట్టేడు. జ్యోతిష్కులు రెండవవివాహ యోగం ఉంది. అది జరిగితే తిరిగి రాజ్యం లభిస్తుందని చెప్పేరు. రాజు అంగీకరించడని అందరికీ తెలుసు. కానీ మంత్రి యౌగంధరాయణుడు గానీ ప్రేయసివంటి భార్య వాసవదత్త గానీ రాజును అలా రాజ్యవిహీనుడై అడవులు పట్టడం చూసి తట్టుకోలేరు.
ఇద్దరూ కలిసి రాజు కోసం పధకం ప్రకారం అబద్ధం సృష్టిస్తారు. వాసవదత్త అగ్నిప్రమాదంలో మరణించింది అన్నది ఆ అబద్ధం. యౌగంధరాయణుడు వాసవదత్తను తన చెల్లెలని చెప్పి మరో రాజ్యం లో న్యాసం గా దాస్తాడు. ఆ రాజపుత్రి పద్మావతి. ఆమెతోనే రాజుకు వివాహం నిర్ణయించి రాజును బలవంతం మీద ఒప్పించి వివాహం జరిపిస్తాడు.
ఇక్కడనుంచి చతుర్ధాంక కథ మొదలవుతుంది.
వివాహం అయింది. రాజు మనస్థితి ఏమిటి? పద్మావతి ఎలాంటివ్యక్తిత్వం ఉన్న స్త్రీ? అంతటి అనురాగమూర్తి వాసవదత్త హృదయ సంవేదనలేమిటి? ఈ మూడు హృదయాల ప్రేమ భావాల సున్నితాలూ, సంఘర్షణ అలజడి లేని అంగీకృత హృదయభాషలూ ఈ అంకం లో పొందుపరచాడు కవుకులగురువుకు గురువు లాంటి భాసమహాకవి.
విడిది నుంచి నూతనవరుడైన ఉదయనుడూ విదూషకుడైన వసంతకుడూ తోటలోకి వస్తారు. అయితే అప్పటికే పద్మావతీ, వాసవదత్తా చెలికత్తె తో సహా వచ్చిఉన్నారు. వారు అప్పటిదాకా ఏం మాట్లాడుకుంటూ ఉన్నారో కవి ఇలా రాస్తాడు.
ఉద్యానవనం లో శేఫాలికా పుష్పాల నికుంజాలు పుష్కలంగా పూసి ఉన్నాయి. పరిచారికను సంస్కృతనాటకాలలో చేటి అంటారు. ఆమె కొన్నికోసి దోసిటనింపి పద్మావతికి చూపించింది. పద్మావతి ఇక చాలు కొయ్యవద్దు అంది. వాసవదత్త “కిం నిమిత్తం వారయసి” అనిఅడిగింది. (ఎందుకు వద్దన్నావు)
పద్మావతి సమాధానం ఇది. “ఆర్యపుత్రులు ఇక్కడికి వస్తారు ఈపువ్వులన్నీ వారు చూసి ఆనందించడం నాకు గొప్ప ప్రశంస కదా”
అప్పుడు వాసవదత్త ఇలా అంటుంది.
“హలా!! ప్రియాస్తే భర్తా” చెలీ నీ భర్త నీకు ప్రేమాస్పదుడయ్యాడా అని.
పద్మావతి సమాధానం ఇది.
“ఆర్యే నజానామి. ఆర్యపుత్రేణ విరహితోత్కంఠితా భవామి”
” ఏమో తెలియదు. కానీ ఆయనవిరహం నన్ను ఉత్కంఠితను చేస్తోంది “
దీనికి వాసవదత్త ఏమనుకుని ఉంటుంది
ఇలా అనుకుంది.” దుష్కరం ఖలు అహం కరోమి “నేను చేస్తున్న పని దుష్కరమే సుమా”అని.
పద్మావతి మళ్లీ ఒక ప్రశ్న అడుగుతుంది.
“యధామమ ఆర్యపుత్రః తధైవ ఆర్యాయాః వాసవదత్తాయాః “
” ఆర్యపుత్రులు నాతో ఎలాగో పూజ్యురాలైన వాసవదత్త తో కూడా అలాగేనా” అని.
కొత్తపెళ్లికూతురి నోటివెంట ఎంత సున్నితంగా అడిగించేడో ఆ ప్రశ్న ని కవి.
వాసవదత్త వెంటనే “అతోప్యధికం” అంది.
అంతకన్నా ఎక్కువ అని. పద్మావతికి వాసవదత్త ఆమే అని తెలియదు కదా. వెంటనే నీకెట్లా తెలుసు? అంది.
వాసవదత్త కంగారు పడి వెంటనే వారు ఏ కొద్దికాలపు స్నేహాన్నీ కూడా మరువనివారు కదా అని సద్దుకుంటుంది.
ఇంతలో చేటి “అమ్మా నువు రాజుగారిని వీణ నేర్పమని అడగలేకపోయావా” అంటుంది.
సంభాషణలు సంస్కృతం లోనే చదివితే ఆ అందం వేరు.
“ఉక్తో మయా ఆర్యపుత్రః” “అడిగాను” . అంది
“తతః కి భణితం” “ఏమన్నారు” వాసవదత్త అడిగింది
“అభణిత్వా కించిత్ దీర్ఘం నిశ్వస్య తూష్ణీకః సంవృత్తః”
“ఏమీ మాటాడకుండా దీర్ఘం గా నిట్టూర్పు ఉదాశీనంగా ఉండిపోయారు”
దాన్ని నువ్వెలా అర్ధం చేసుకున్నావు అని వాసవదత్త అడిగింది.
ఈ మాటకు పద్మావతి చెప్పిన సమాధానంతో ఆ పాత్ర తాలూకు సమస్త వ్యక్తిత్వమూ మనకు అవగతం చేస్తాడు కవి.
” తర్కయామి ఆర్యాయాః వాసవదత్తాయాః గుణాన్ స్మృత్వా దక్షిణతయా మమ అగ్రతో న రోదితి ఇతి”
” పూజ్యురాలైన వాసవదత్త గుణాలు తలుచుకుని నా పట్ల దయతో నా ఎదురుగా కన్నీరు ఆపుకున్నారు” అని అనుకున్నాను అంటుంది నూతన వధువు పద్మావతి. ఇక్కడ ఆమె సహృదయత అంతా ‘దాక్షిణ్యంతో’ అనడం లో ఉంది.
” ధన్యా ఖల్వస్మి యద్యేదం సత్యం భవేత్” ఇదే నిజమైతే నా కంటె ధన్యులు లేరు అని
 వాసవదత్త మనసులో నిట్టూరుస్తుంది.
ఇదొక కీలకమైన ఘట్టం. నాలుగే నాలుగు సంభాషణల్లో ముగ్గురి వ్యక్తిత్వాలు, సంస్కారాలు, ముక్కోణపు ప్రేమ ఎంత పట్టుగా నడిపేడు. కేవలం సంభాషణ ల ద్వారా.
ఇక తర్వాత రంగాన్ని మరింత విశాలం చేశాడు.
ఉదయనమహారాజు, విదూషకుడూ ప్రవేశించారు. రాగానే విదూషకుడు రాజకుమార్తె వచ్చి వెళ్లిందని గుర్తుపట్టేడు. ఎలా అంటే శేఫాలికా పుష్పాలు కోయగా శూన్యమైన వృంతాలున్న పొదలవల్ల అంటాడు. కానీ రాజు మనసు ఇక్కడ లేదు. కొత్తగా వచ్చిన తన అవస్థ తనకే చిత్రం గా ఉంది.
తొలినాళ్ల లో ఉజ్జయిని వెళ్లినప్పుడు వాసవదత్తను చూసినప్పుడు మన్మధుడు తనమీద ఐదు బాణాలూ ప్రయోగించాడు. ఇప్పటికీ ఆ బాణాల శల్యాలు హృదయం లో నాటుకునే ఉన్నాయి. ఆయనకు ఐదే బాణాలు కదా. ఇప్పుడు ఈ ఆరో బాణం ఎలా వెయ్యగలిగాడు? అంటాడు
శృంగారవర్ణనల్లో ఇలాంటి కవిసమయాలను  వాడుతూ తర్వాత ఎందరో రాశారు. రాయగా రాయగా కొంత కాలానికి కృతకంగా మారిపోయాయి కూడా. కానీ ఇక్కడ అదే కవిసమయాన్ని ఒక సంక్లిష్టమైన ప్రేమ భావం నిండిఉన్న పురుషహృదయాన్ని ఆవిష్కరించడానికి ఎంత బాగా వాడాడు.
కామేనోజ్జయినీం గతేమయితదా కామప్యవస్తాం గతే
దృష్ట్వా స్వైరమవన్తిరాజ తనయాం పంచేషవః పాతికః
తైరద్యాపి సశల్యమేవ హృదయం భూయశ్చ విధ్దా వయం
పంచేషుర్మదనో కధమయం షష్టశ్శరః పాతితాః
అవన్తిరాజ తనయను చూడగానే పంచబాణాల దెబ్బకి పడిపోయాను.-(ప్రేమలో పడిపోయాను అన్నట్టు.) ఇప్పటికీ ఆమెకు చెందిన ఆ అనురాగపు వేదనా శల్యం అలాగే ఉంది అంటున్నాడు రాజు.
ప్రపంచం లో ఉండినంత ప్రేమా, ప్రపంచం పట్టనంత ప్రేమా ఆమెయందే కలిగింది. కానీ మళ్లీ ఈ కొత్త బాణాఘాతమేమిటి? అంటూ రాజు ఎంతో నిజాయితీగా తన నర్మ సచివుడికి నర్మ గర్భంగా చెప్పుకుంటున్నాడు తనకు కలిగిన పద్మావతి పట్ల ఇష్టం గురించి.
ఇది ఎంత సంక్లిష్టమైన అవస్థ. అతను సాధారణ పురుషుడు కాడు. ధీరలలితుడైన నాయకుడు. పద్మావతిపట్ల ఆమె చెప్పిన దాక్షిణ్యభావంతో పాటు ఆమె యందు కలిగిన అనురాగ భావాన్ని కూడా అతను దాచడం లేదు.
ఇదంతా కవి ఆ శ్లోకంలో ఇమిడ్చాడు.
ఇటు మాధవీ లతామంటపం లో రాజకుమార్తెలూ అటు తోటలో శిలాఫలకం మీద రాజూ విదూషకుడు కూర్చున్నారు. వారిని ప్రేక్షకులకు పైనుంచి అంటే ఏరియల్ వ్యూ లో చూపించాలి. ఎలా?
ఇద్దరికోణాలనుంచీ ఆకాశంలో కదిలే ఒక దృశ్యాన్ని చూపించడం ద్వారా ఆ రంగస్థలసన్నివేశాన్ని మన కళ్లముందుకు తేవచ్చు. ఇక్కడ నాటకకర్త గా ఆయన తన నైపుణ్యం చూపదలచుకున్నాడు.
ఆకాశంలో కొంగలగుంపు ఎగురుతోంది. దాన్ని రాజు చూశాడు. అంతకుముందు విదూషకుడు చూసి రాజుకు చూపించాడు. చేటిికూడా చూసి నాయికలిద్దరికీ చూపించింది. ఇలాంటి సన్నివేశం కూర్చడం వెనకఉన్న భాసుడి దృష్టి గమనించగలిగితే అంతకు మించిన రసాస్వాదన లేదు.
నాటకం నడుస్తోంది. కాలగమనం చూపించాలి. రంగస్థలం మీద గడియారం పెట్టలేడు కదా. అంతకుముందే పూలుకోసేసిన తొడిమలున్న లతాగుల్మాలు చూపించాడు. ఇప్పుడు ఆకాశంలో ఎగిరుతూన్న కొంగలగురించి చెప్తున్నాడు.
ఋజ్వాయతాం చ విరలాంచ నతోన్నతాంచ
సప్తర్షివంశకుటిలాంచ నివర్తనేషు
నిర్ముచ్యమాన భుజగోదర నిర్మలస్య
సీమామివాంబరతలస్య విభజ్యమానాం
కొంగలగుంపు మొదట తిన్నగా ఒకే గీతలా వెళ్లేయి. ఆ తర్వాత విడివడ్డాయి. అంటే కాస్త కాస్త ఎడమయ్యాయి. కిందకిదిగుతూ పైకి లేస్తూ మరి కాసేపు ఎగిరేయి. అలా కొంతదూరం వెళ్లి వెనక్కి మరలేయి. నివర్తన సమయంలో సరిగ్గా సప్తర్షిమండలం లాంటి ఒంపు కనిపించేలా వెనక్కి తిరిగేయి. .
ఇక్కడిదాకా కొంగల పంక్తి తాలూకు చలనస్థితి చెప్పి ఇక ఆ పంక్తి వెనకఉన్న ఆకాశం గురించి చెప్తా డు.
 అది నిర్ముచ్యమాన భుజగోదరం లా ఉందట. కుబుసం విడిచిన పాము పొట్ట అంత నిర్మలంగా. అలాంటి ఆకాశాన్ని విభజించే విభజన రేఖలా ఈ బలాకపంక్తి ఉంది.
ఏమి వర్ణన!!!
ఇదే కాళిదాసు అందుకున్నాడనిపిస్తుంది.
కుమారసంభవం కావ్యం లో మొదటి శ్లోకం లో హిమాలయపర్వతం పూర్వపశ్చిమ సముద్రాలను కలుపుతూ భూమిని కొలిచే మానదండం(స్కేల్) లా ఉందంటాడు. ‘అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా’.
మన రచయితలు ఇంకా ఇలాగే రాస్తారు. “సాయంకాలమయింది. జాజులు పూసేయి. ఆకాశంలో కొంగలెగురు తున్నాయి” అంటూ.
కానీ ఈ కవి ఎప్పుడో నమూనా వేసిపెట్టాడు. కొంగలగుంపు చలనసౌందర్య వర్ణన లోంచి కాలగమనమూ, పుష్పాపచయం తర్వాత చూపించిన పూపొదల ద్వారా పాత్రప్రవేశ, లేదా నిష్క్రమణ సూచన. మనం అందుకోగలగాలి. కేవలం చదవడం కాక కావ్యవాక్కును మననం చెయ్యాలని చెప్పేవారు మాష్టారు. అలా ఐతే అందుతాయి ఆ ఎత్తులు, లోతులూ
విదూషకుడు పద్మావతిని వెతుకుతూ ఉంటాడు కదా ఆకాశం కేసి చూస్తే అవి కనిపించేయి. సరిగ్గా చేటిికూడా చూసింది. ఇరువురూ ఒకరికి తెలీకుండానూ, ఒకరికి తెలిసీ ఆ రంగస్థలం మీదే ఉన్నారు. ప్రేక్షకుడి దృష్టి ఇరువర్గాలమీదా పడాలి. ఒకసారి ఆకాశదృశ్యాన్ని పాత్రలమాటలమీంచి చూసిన ప్రేక్షకుడు తిరిగి ఆకాశం వేపు నుంచి పాత్రవేపు తిరగాలి. అదీ కల్పన. విదూషకుడు ఆ పంక్తి బలరాముడి చెయ్యిలా ఉందంటే చేటి కలువపూల మాలలా ఉందంటుంది. ఇలా వారి దృష్టికోణాల ద్వారా స్వభావాలు చెప్పడం.
ఇంతలో రాజును విదూషకుడు అడిగాడు.” ఇప్పుడు ఒకామె ఈ లోకంలో లేదు. మరొక ఆమె ఇక్కడలేదు. కాబట్టి నీ మనసులో మాట చెప్పు. ఆ ఇద్దరిలోనూ ఎవరు ఎక్కువ ఇష్టం”
అయితే ఆ ఇద్దరు స్త్రీలూ పక్కన మాధవీలతామంటపంలోనే ఉన్నారు వీరి మాటలు వారికి వినిపించేలా.
ఎంతో బలవంతం మీద రాజు ఇలా చెప్తాడు
“పద్మావతీ బహుమతా మమ యద్యపి
రూపశీలమాధుర్యైః
వాసవదత్తా బద్ధం నతు తావన్మే మనోహరతి “
” పద్మావతి మంచిపిల్ల. అందగత్తె, అనురాగవతీ కూడా. కానీ నా మనసు వాసవదత్తా బద్ధం. ఆమనసును ఆమెనుంచి ఈమె హరించలేకపోతోంది.” అంటాడు.
 ఈ మాటలు పద్మావతీ వాసవదత్తా విన్నారు. పద్మావతి రాజు హృదయాన్ని అర్ధం చేసుకోగల మనోవివేకంతో ఉంది. కానీ చెలికత్తెలు ఊరుకోరుగా.
వెంఠనే ” అదాక్షిణ్యః ఖలు భర్తా ” అనేసింది చేటి. “ఈయనకి దయాదాక్షిణ్యాలు లేవు “
వెంటనే పద్మావతి” కాదు కాదు ఆయనకి దాక్షిణ్యం పుష్కలంగా ఉంది కాబట్టే ఇప్పుడు కూడా ఆమెను తలచుకుంటున్నాడు” అంది.
వాసవదత్త కి అది పెను ఓదార్పు.” ఈ పరిదేవనానికి(వేదనకు) ఫలం దొరికింది. ఈ అజ్ఞాతవాసం ఊహించని ఆనందాలు ఇస్తోంది” అని మనసులో అనుకుంటుంది ఆమె.
ఇక రాజు విదూషకుడిని అదే ప్రశ్న అడుగుతాడు. విదూషకుడు బాగా బతిమాలించుకుని లౌక్యంగా ఇలా చెప్తాడు.
” వాసవదత్త నాకు ఇష్టమే గానీ ఈ పద్మావతమ్మ నా మంచిచెడులు కనుక్కుంటూ ఆకలిదప్పులు చూస్తోంది. అంచేత నాకు ఈవిడే ఇష్టం “అన్నాడు.
వెంటనే రాజు “ఉండు వాసవదత్త కు చెప్తాను నీ పని”
అనగానే విదూషకుడు
“కుత్ర వాసవదత్తా చిరాత్ ఖలు ఉపరతా వాసవదత్తా” అంటూ రాజును వాస్తవం లో పడేస్తాడు.” ఇంకెక్కడి వాసవదత్త ఎప్పుడో చని పోయిందిగా “అనగానే రాజు ఒక్కసారి ఈ ప్రపంచం లో పడ్డాడు
” అవును కదా వాసవదత్త లేదుకదా” అని గుడ్లనీళ్లు కుక్కుకుంటూ అంటాడు. చాటునే ఉన్న వాసవదత్త అంతా విన్నది, చూసింది కూడా.విషాదానంద సమ్మిశ్రితమైన ఘట్టం ఇది. రంగస్థలం మీద ఊహించుకోవాలి.
వెంటనే పద్మావతి తో ” వెళ్లి రాజును సాంత్వన పరచు” అని చెప్పి పంపుతుంది.
ఊహించని సమయంలో పద్మావతి ప్రవేశించేసరికి రాజు కన్నుల నిండా నీళ్లు. నవవధువు ఈ కన్నీళ్లు చూస్తే ఎంత తల్లడిల్లుతుంది అని కంగారుపడతాడు.
శరచ్ఛశాంక గౌరేణ వాతావిద్ధేన భామినీ
కాశపుష్పలవేనేదం సాశ్రుపాతం ముఖం మమ
“ఇక్కడంతా రెల్లుపూలు పూసి ఉన్నాయి కదా. గాలికి వాటి పుప్పొడి వచ్చి కంట్లో పడింది. కళ్లనుంచి నీళ్లు కారి ముఖం అంతా తడిసిపోయింది” అని సద్దుకోబోతాడు.
వాసవదత్త లేదనే స్ఫురణ ఆయనకి అంత దుఃఖం కలిగించింది.
 పద్మావతికి అంతా తెలుసని మనకి తెలుసు. కానీ రాజుకు తెలియదు కదా, అనీ మనకు తెలుసు. ఉదయనమహారాజు మాటలు నిజం కాకపోయినా వాటికి అసత్యతా దోషం పట్టలేదు. ఎందుకంటే వాటి వెనుకా, వాటినిండా ఉన్నది దాక్షిణ్యమనే దయామృతం.
ఈ విరహమూ, దుఃఖమూ, విషాదమూ నేను ఎలా పోషించగలననుకున్నారు మా మాష్టారు?? ఈ ఉదయన మహారాజు వేషం నాచేత వేయించారు!!!
“ఏవం ఉపరతా వాసవదత్తా” అన్న మాట నాచేత ఎన్నోసార్లు పలికించారు. “నిజమే వాసవదత్త లేదుకదా “అని. నాకు చాతనయ్యేది కాదు. చివరికి “నీ మొహం నీకు విరహమంటే ఏం తెలుస్తుంది కుర్రకుంక వి” అని సరిపెట్టుకున్నారు.
ఇప్పుడైతే పలకగలనేమో గానీ మాష్టారు లేరు.
ఇంకా ఆ నెల్లాళ్ల నాటకం రిహార్సల్స్ తాలూకు గొప్ప సంగతులు చాలా ఉన్నాయి. మళ్లీ శేఫాలికలలో కలబోసుకుందాం.
*
వాడ్రేవు వీరలక్ష్మీ దేవి

వాడ్రేవు వీరలక్ష్మీ దేవి

19 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • అమ్మా, దృశ్యాన్ని మీరు ఏ వైపు తిప్పితే ఆ వైపు ఊహించుకుంటూ చూసినట్లుగా ఉంది.👌👌👌

  • థాంక్యూ వెరీమచ్ శశికళ గారూ

 • Veeralakshmi devi garoo! You affectionately force us back to read the greatest classics of all time. I wish I had a tad of your knack! Loved every bit of the introduction of Swapna Vasavadatta! Kudos!! V R Veluro

  • థాంక్యూ వెరీమచ్ సర్

 • Swapnaవాసవదత్త, ఇందులో, లీన మయి పోతున్నాము చదువు తు ఉన్నంత సేపు !కృతజ్ఞతలు. Ma’am !

  • థాంక్యూ వెరీమచ్ పద్మా

 • చాలా బాగా వివరించారు మీ జ్ఞ్యాపికని. ఈంకా విసేషమేమటంటే, నాటకంలో నాలుగవ అంకంలో వున్న రసార్ద్రతని అంత గొప్పగాను వర్నించారు. క్రితజ్ఞ్యతలు.

  • థాంక్యూ వెరీమచ్ లక్ష్మి గారూ

 • కొద్దిసేపు నేనుకూడా ఆ వనంలో విహరించినట్లు, పద్మావతి,వాసవదత్త,ఉదయనమహారాజుల ముక్కోణపు ప్రేమలో ఇరుక్కుపోయి ఉదాత్తమైపోయాను.మీ నాటకానుభవం అందించబోయే మరో శేఫాలిక కోసం ఎదురు చూస్తున్నాం.

  • థాంక్యూ వెరీమచ్ వసుధ గారూ

 • నలభై ఏడు సంవత్సరాల క్రితం నేను అయిదవతరగతి చదువుతున్న
  ప్పుడు మా అక్క కి నాన్ డిటైల్ పుస్తకంగా స్వప్న వాసవదత్త వుండేది. అప్పుడు చదివాను. ఆ తర్వాత మరి ఆ పుస్తకం దొరకలేదు. కాని ఎందుకో ఆ కథ నన్ను వదిలిపెట్టకుండా నా వెంటే వుండేది. ఖాళీగా వున్నప్పుడల్లా ఆ కథ నాకు తోడుండేది. యెక్కడా పుస్తకం దొరకలేదు. ఇన్నేళ్ళ తర్వాత మీరు రాసింది చదువుతుంటే ఎంత సంతోషమో చెప్పలేను…థాంక్యూ సో మచ్….

 • లక్ష్మీ! భాసుని నాటకం వాసవదత్త చదువుతుంటె కళ్ళముందు దృశ్యకావ్యంలా సాగిపోయింది. ! వేచిఉన్నాము తరువాతి భాగంకోసం!!

 • నాటకాన్ని చాలా చక్కగా ఒక మంచి నాటక దర్శకురాలిగా విశ్లేషించి చెప్పారు . ఢిల్లీ లో జరిగే నాటక ప్రదర్శనల్లో సంస్కృత నాటక శైలి లో చూసినట్టు జ్ఞాపకం. మళ్ళీ ఎప్పుడయినా అవకాశం దొరికితే తప్పక చూస్తాను .

  మన తెలుగు నాటక కార్య కర్తలు తప్పక ప్రయత్నించ వచ్చు.

  అభినందనలు వీరలక్ష్మి గారు.

  • థాంక్యూ సుబ్బూ గారూ

 • లక్ష్మీ గారు! వాసవదత్త బాసునినాటకం చదువుతుంటె దృశ్యకావ్యమై కళ్ళముందు నిలిచింది. ధన్యవాదాలు ! వేచిఉన్నాము next episode కోసం !

  • థాంక్యూ వెరీమచ్ సుశీల గారూ

 • చిన్నప్పుడు మాకీ పాఠం ఉండేది. అప్పుడేమీ అర్ధం కాలేదు.ఇప్పుడు మీరు ఎంత బాగా చెప్పారో ! అద్భుతం ! ప్రియతమ మాష్టారు చెబుతున్నట్టు వివరిస్తుంటే వినడం మా అదృష్టం కాక మరేంటి ? ధన్యవాదాలు లక్షి గారూ !

 • చిన్నప్పుడు స్కూల్ లో మాకీ పాఠం ఉండేది. అప్పుడేమీ అర్ధం కాలేదు.ఇప్పుడు మీరు ఎంత బాగా చెప్పారో ! అద్భుతం ! ప్రియతమ మాష్టారు చెబుతున్నట్టు వివరిస్తుంటే వినడం మా అదృష్టం కాక మరేంటి ? ధన్యవాదాలు లక్షి గారూ !

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు