స్త్రీ చైతన్యానికి కొత్త సరిహద్దు సలీమా కవిత

    మకాలీన తెలుగు సాహిత్యంలో స్త్రీ అస్తిత్వ చైతన్యాన్ని, సామాజిక వాస్తవికతను నిశితంగా శోధిస్తున్న సృజనకారిణి సలీమా. వృత్తిరీత్యా సీనియర్ జర్నలిస్ట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, ‘నవతెలంగాణ’ సండే బుక్ ‘సోపతి’ వేదిక ద్వారా అక్షర ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ఆమె అంతరంగం నిరంతరం సామాజిక ప్రశ్నలతోనే స్పందిస్తుంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుండి ‘భారత స్వాతంత్ర్యోద్యమంలో మహిళల పాత్ర’ అనే అంశంపై పరిశోధన చేసి పిహెచ్.డి పట్టా పొందిన సలీమా గారి ప్రతి అక్షరంలోనూ ఆ చారిత్రక స్పృహ, సామాజిక బాధ్యత కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.

జర్నలిజంలో భాగంగా ఆమె ‘మానవి’ శీర్షిక ద్వారా వందకు పైగా మహిళా సాహితీవేత్తలను పరిచయం చేయడం తెలుగు సాహిత్య రంగంలో ఒక మైలురాయి. మూడు వందలకు పైగా కవితలు, పదికి పైగా కథలు రాసిన ఆమె కలం నుండి, తెలుగు విశ్వవిద్యాలయ సహకారంతో వెలువడిన “జవాబు కావాలి” కవితా సంపుటి, సుశీల నారాయణరెడ్డి ట్రస్ట్ బాసటతో వచ్చిన “పథగమనం” కథా సంపుటి స్త్రీవాద అభ్యుదయ సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన “మై హూ మలాలా” గ్రంథాన్ని “నేను మలాలా” పేరుతో ఆమె సహచరుడు మహేశ్ తో కలిసి  చేసిన తెలుగు అనువాదం విస్తృత పాఠకాదరణ పొందడమే కాకుండా, అణచివేతపై పోరాడే స్త్రీల గొంతుకగా ఆమెకున్న అంతర్జాతీయ అవగాహనకు నిదర్శనంగా నిలిచింది. అలాంటి ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అంతరంగం నుండి, స్త్రీ స్వేచ్ఛా చైతన్యానికి ప్రతీకగా వెలువడిన సమున్నతమైన కవితా శిల్పమే ఈ “ప్రశ్న మొదలయింది” కవిత. ఈ కవితపై ప్రత్యేక విశ్లేషణ సారంగ పాఠకులకు ప్రత్యేకం.

ప్రశ్న మొదలయింది

 

​గుండె పొరల్లో గడ్డకట్టిన

వ్యధలన్నీ ఇప్పుడు 

బయట పడుతున్నాయి

అందమైన బాల్యానికి అర్థం తెలియని

అమాయకత్వపు గోడల మధ్య

ఆమె శ్వాసించే నిశ్శబ్దమయింది

 

పలకా బలపం పట్టాల్సిన చేతులతో

చిన్ని తమ్ముడికి లాలనయింది

వంట గదిలో యంత్రమయింది

పసి ఛాయలు వీడక ముందే

పరదాల చాటున బంధించి

చిన్ని మనసుకు సంకెళ్లు వేస్తే

తనంటే ఇదేనేమోనని

అలాగే ముడుచుకు పోయింది

వయసు పెరిగే కొద్దీ

జీవితమనే రంగస్థలంలో

తనకోసమే రచించబడి

పరిమితులు పెట్టిన పాత్రలో

ఇమడలేక అలసి పోయింది

ఏండ్లుగా గడ్డకట్టిన వేదనే ఇప్పుడు

కరిగి ఉప్పొంగే సముద్రమయింది

మూగబోయిన స్వరపేటికను

కాస్త సవరించి తనకేం కావాలో

ప్రశ్నించేందుకు సిద్దమయింది

ఎర్రని మందారంలా 

వికసించాలని కలలు కంటోంది

 

ఆ నిలదీసే ఎద భారాన్ని తగ్గించి

మనసు భావాల అక్షర రూపమై

తన అసలైన పాత్రను

తనే రచించుకునేలా చేసింది

తరతరాలుగా

అతని హుకుంలకు భయపడి

జీ హుజూర్ అన్న ఆమె

మనిషిగా బతకడం

ఇప్పుడిప్పుడే మొదలుపెట్టింది..!

సలీమా గారి “ప్రశ్న మొదలయింది” కవిత ఆధునిక స్త్రీ అస్తిత్వ చైతన్యానికి, శతాబ్దాల అణచివేత నుండి ఆమె పొందుతున్న విముక్తికి పట్టిన దర్పణం. ఈ కవితా వస్తువు కొత్తదేమీ కాకపోయినా, దానిని ఆవిష్కరించిన విధానంలోనూ, వాడిన కవిత్వ నిర్మాణ పరికరాలలోనూ ఒక విశిష్టమైన ప్రామాణికత కనిపిస్తుంది.

     ఒక నిరంతర ప్రవాహంలా సాగే ఈ కవితా శిల్పంలో వాక్య నిర్మాణం, బింబ కల్పన, రూపకాలు, ప్రతీకలు ఒకదానికొకటి పెనవేసుకొని ఒక గంభీరమైన అభివ్యక్తిని సాధించాయి. నినాదాల వాచ్యతకు దూరంగా, శుద్ధ కవిత్వ ధ్వని గుణంతో పాఠకుడి అంతరంగాన్ని కదిలించే శైలి ఇందులో వ్యక్తమవుతుంది.

     కవిత ప్రారంభమే ఒక తీవ్రమైన పరిణామానికి సూచికగా మారుతుంది.

     గుండె పొరల్లో గడ్డకట్టిన  

     వ్యధలన్నీ ఇప్పుడు 

     బయట పడుతున్నాయి 

అనే కవితా పాదాలు కేవలం శారీరక వేదనను మాత్రమే కాక, అంతరంగంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన నిశ్శబ్ద పోరాటాన్ని సూచిస్తాయి. ఇక్కడ ‘గుండె పొరలు’ అనే రూపక ప్రయోగం (Metaphor) వేదన యొక్క లోతును స్పష్టం చేస్తుంది. ఆ తర్వాత వచ్చే బాల్య చిత్రణ ఆధునిక వచన కవిత్వంలో ఒక అద్భుతమైన బింబ కల్పనకు (Imagery) నిదర్శనం.

     అందమైన బాల్యానికి అర్థం తెలియని 

     అమాయకత్వపు గోడల మధ్య 

     ఆమె శ్వాసించే నిశ్శబ్దమయింది

 అన్నప్పుడు, ‘అమాయకత్వపు గోడలు’ అనే రూపకం స్త్రీ చుట్టూ సమాజం అల్లిన అదృశ్య కట్టుబాట్లను, ‘శ్వాసించే నిశ్శబ్దం’ అనే పరస్పర విరుద్ధ పదాల కలయిక (Oxymoron) ఆమె ఉనికి ఉండి కూడా లేనట్లుగా బతికిన జీవచ్ఛవ స్థితిని అత్యంత ఆర్ద్రంగా ధ్వనింపజేస్తాయి.

     కవితా ప్రవాహం ముందుకు సాగే కొద్దీ అభివ్యక్తిలోని గాఢత మరింత పదును దేరుతుంది.

     పలకా బలపం పట్టాల్సిన చేతులతో  

     చిన్ని తమ్ముడికి లాలనయింది  

     వంట గదిలో యంత్రమయింది 

అనే పాదాలు శ్రమ దోపిడీని, స్త్రీ బాల్య చౌర్యాన్ని కళ్ళకు కట్టే దృశ్య బింబాలుగా నిలుస్తాయి. వయసుతో పాటు పెరిగే బంధనాల తీవ్రతను చూపడానికి కవయిత్రి సమాజపు కఠినత్వాన్ని

     పరదాల చాటున బంధించి  

     చిన్ని మనసుకు సంకెళ్లు వేస్తే

అంటూ సంకెళ్లను ప్రతీకగా (Symbolism) చిత్రించారు. ఇది కేవలం భౌతికమైన పరదా మాత్రమే కాదు, స్త్రీ ఆలోచనా పరిధిని నియంత్రించే సామాజిక మానసిక పరదా. ఈ బంధనాల వల్లే;

     తనంటే ఇదేనేమోనని 

     అలాగే ముడుచుకు పోయింది

అనడం స్త్రీ తన ఉనికిని తానే మరచిపోయే ఆత్మవిస్మృతి స్థితికి అద్దం పడుతుంది.

     ఈ కవితలో అత్యంత ప్రాధాన్యత కలిగిన కవిత్వ పరికరం ‘జీవితం ఒక రంగస్థలం’ అనే విస్తృత రూపకం (Extended Metaphor).

     వయసు పెరిగే కొద్దీ  

     జీవితమనే రంగస్థలంలో 

     తనకోసమే రచించబడి 

     పరిమితులు పెట్టిన పాత్రలో 

     ఇమడలేక అలసి పోయింది 

అనే పాదాలు పురుషాధిక్య సమాజం స్త్రీకి కేటాయించిన సాంప్రదాయక పాత్రను, ఆ పరిమితుల గిరిని దాటలేక ఆమె పడే శ్వాసకోశ వేదనను శిల్పబద్ధంగా ఆవిష్కరించాయి. ఇక్కడ అలసట అనేది శారీరకం కాదు, అస్తిత్వ పరమైన అలసట. ఈ అలసట నుండి, వేదన నుండి పుట్టుకొచ్చిన తిరుగుబాటును కవయిత్రి

     ఏండ్లుగా గడ్డకట్టిన వేదనే ఇప్పుడు 

     కరిగి ఉప్పొంగే సముద్రమయింది 

అంటూ ఉదాత్తమైన ప్రకృతి ప్రతీక ద్వారా చూపించారు. గడ్డకట్టిన వేదన ‘సముద్రం’గా ఉప్పొంగడం అనేది ఇక్కడ విప్లవాత్మకమైన అంతర్గత చైతన్యానికి సంకేతం.

     కవిత యొక్క ఉత్తరభాగం అణచివేత నుండి నిలదీత వైపు సాగే పరిణామాన్ని శక్తిమంతమైన క్రియాన్వయ శిల్పంతో (Action-oriented Syntactic Flow) ఆవిష్కరిస్తుంది.

     మూగబోయిన స్వరపేటికను 

     కాస్త సవరించి తనకేం కావాలో       

     ప్రశ్నించేందుకు సిద్దమయింది

అనడంలో కవయిత్రి క్రియలను ఒకదాని వెనుక ఒకటి అమరుస్తూ వాక్య వేగాన్ని పెంచారు. ఈ క్రియా ప్రాధాన్యత కలిగిన వాక్య నిర్మాణం బాహ్య ప్రపంచపు నిశ్శబ్దాన్ని ఛేదించే ఒక తక్షణ అంతర్గత సన్నాహాన్ని, ఆ బంధనాల నుండి విముక్తి పొందే తపనను దృశ్యమానం చేస్తుంది. ఆ వెనువెంటనే వచ్చే

ఎర్రని మందారంలా 

వికసించాలని కలలు కంటోంది 

అనే పాదంలో ‘ఎర్రని మందారం’ అనేది కేవలం అందానికి మాత్రమే కాదు, విప్లవానికి, నూతన ఉదయానికి, ఆత్మగౌరవ ప్రకటనకు ఒక శక్తిమంతమైన ప్రతీకగా నిలుస్తుంది. ఇక్కడ వాడిన ఉపమానం (Simile) స్త్రీ అంతరంగంలో మొలకెత్తిన చైతన్య వికాసాన్ని పాఠకుడి గుండెకు హత్తుకునేలా చేస్తుంది.

     అంతరంగంలో మొదలైన ఈ ప్రశ్న బాహ్య జగత్తులో ఆమె ఉనికిని ఎలా మార్చిందో కవయిత్రి శైలీ శాస్త్ర రీత్యా చాలా పటిష్టంగా చెప్పారు.

     ఆ నిలదీసే ఎద భారాన్ని తగ్గించి 

     మనసు భావాల అక్షర రూపమై  

     తన అసలైన పాత్రను 

     తనే రచించుకునేలా చేసింది

అన్నప్పుడు, ఇంతకాలం ఇతరులు రాసిన స్క్రిప్ట్ ప్రకారం నడుచుకున్న నటి, ఇప్పుడు తన జీవిత నాటకానికి తనే రచయితగా మారిన ఆత్మవిశ్వాసం వ్యక్తమవుతుంది. ఇక్కడే కవిత అత్యున్నత శిఖరానికి చేరుకుంటుంది. తరతరాలుగా కొనసాగుతున్న ‘జీ హుజూర్’ సంస్కృతిని తిరస్కరిస్తూ, పురుషస్వామ్య ‘హుకుంల’ పరిధిని దాటిన ఒక చారిత్రక సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తాం.

     ఈ కవిత సాధించిన అతిపెద్ద శిల్ప ఔచిత్యం దాని ముగింపులోనే ఉంది. ఎలాంటి నినాదాలు, ఉపదేశాలు లేకుండా, కవిత్వాన్ని శుద్ధ కళాత్మక రూపంలో నిలిపి ఉంచుతూ

     తరతరాలుగా 

     అతని హుకుంలకు భయపడి  

     జీ హుజూర్ అన్న ఆమె  

     మనిషిగా బతకడం 

     ఇప్పుడిప్పుడే మొదలుపెట్టింది..!

అని ముగించడం ఒక మహా కావ్యాంత నిశ్శబ్దాన్ని (Poetic Silence) సృష్టిస్తుంది. ఆ ‘ఇప్పుడిప్పుడే’ అనే పదబంధంలో ఒక సుదీర్ఘమైన నిరీక్షణ, ఒక సగర్వమైన ఆరంభం, పాఠకుడి గుండెల్లో నిరంతరం ప్రతిధ్వనించే ఒక ఆశావాహ దృక్పథం దాగున్నాయి. వాచ్యమైన పిలుపుల కంటే ఈ నిశ్శబ్ద ముగింపే పాఠకుడిలో సామాజిక బాధ్యతను మరింత బలంగా మేల్కొల్పుతుంది.

     వస్తు, శిల్పాల సమన్వయంతో, సముచిత రూపక ప్రయోగాలతో ఆధునిక వచన కవిత్వ విమర్శా ప్రమాణాలకు అనుగుణంగా సాగిన ఒక ఉత్తమమైన, ప్రామాణికమైన కవితా ఖండిక ఇది. సలీమా గారూ! మంచి కవితను సృష్టించిన మీ సృజనకు హాట్సాఫ్.

*

విల్సన్ రావు కొమ్మవరపు

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ప్రతిష్టాత్మక *సారంగ* ఈ శీర్షికను నేను నిర్వహించడం గర్వంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన అఫ్సర్ గారికి వారి బృందానికి ధన్యవాదాలు. సీరియస్ సాహిత్య పాఠకులు ఈ విశ్లేషణలు చదివి స్పందిస్తే సంతోషం.

  • సలీమా గారి పరిచయోక్తులతోపాటు ప్రశ్న మొదలైంది అనే కవిత మీ విశ్లేషణతో మరింత ఆలోచనీయమైంది.సగటు మహిళ బాల్యావరోధాలనుండి యౌవన గార్హ్యస్థ జీవితందాకా కలిగిన ఒడిదుడుకుల నుండి బయటపడాలనే దశదాకా వస్తువు కవిత్వ రూపం సంతరించుకుంది .కప్పితెప్పిన కవిత్వంలో విప్పిచెప్పని విషయాలెన్నో విస్తరించి ఉన్నాయి. మంచి కవితను ఎంపిక చేసుకుని విశ్లేషణాత్మకంగా చదువరులకు పంచిన మీ ప్రయత్నానికి, చక్కని కవితను రాసిన సలీమా గారికి ప్రచురించిన సారంగ సమూహానికి అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.