గతభాగంలో కథాలజీలో కథ ముగింపు గురించి చర్చించి ఉదాహరణగా ఒక కథా ముగింపు ఇచ్చాను. ఆ కథలో ఉన్న లోపాలను చర్చించడం మొదలుపెట్టి, తొందరపాటు ముగింపు గురించి చెప్పాను. అదే కథని ఉదాహరణగా తీసుకోని, రచయితలు ముగింపులో తరచుగా చేసే మరో అయిదు తప్పులని ఈ భాగంలో వివరిస్తాను. (వీలైతే గత భాగంలో ఇచ్చిన “ఇంటికి వెళ్లే రైలు” అనే కథ చదివి కొనసాగించండి.)
- కథావస్తువును అతిగా వివరించడం
“ఇంటికి వెళ్లే రైలు” కథలో ఈ వాక్యాలని గమనించండి –
>> ప్రేమ లేనప్పుడు ఈ విజయాలు, డబ్బు, అహంకారాలకి ఎలాంటి అర్థమూ ఉండదని ఆనంద్ గ్రహించాడు. కుటుంబమే ఈ జీవితంలో అన్నింటికంటే పెద్ద సంపద అని, క్షమించడం అనేది ఎల్లప్పుడూ మనసుకు ప్రశాంతతను ఇస్తుందని అతనికి అర్థమైంది.<<
ప్రతి కథకి ఒక వస్తువు (Theme) ఉంటుంది. సామాన్యంగా అది ఒక సందేశమో, ఒక ప్రాపంచిక వాస్తవమో, తాత్విక చింతనో అయ్యుంటుంది. కథ మొదట్లో ప్రధాన పాత్ర ఆలోచనా విధానం చివరికి వచ్చేసరికి మారిపోతుంది. ఆ మార్పే అసలైన కథ. అదే థీమ్. “పిసినారి రాజబాబు, దానంలో ఉన్న ఆనందాన్ని తెల్సుకోవడం” ఒక కథ.” “పిరికివాడైన రాంబంటు, ప్రేమకోసం రాక్షసుడిని ఎదుర్కోవడం” మరో కథ. నవలలో, సినిమా కథలలో ఇది చాలా ముఖ్యమైన అంశం. అదలా ఉంచండి. గత భాగంలో మనం చెప్పుకున్న కథలో కథానాయకుడు – ఆనంద్‌లో వచ్చే మార్పేమిటి? కథ చెప్పే విధానం, రచయిత ఆలోచన ప్రకారం చాలా చెప్పే అవకాశం ఉంది. మన చర్చ కోసం – “ఆస్తే ముఖ్యమని తమ్ముడితో గొడవపెట్టుకున్న ఆనంద్, బంధాలే శాశ్వతమని తెల్సుకోవడం” కథ అనుకుందాం. అప్పుడు రచయిత ఏం చెయ్యాలి? కథ ద్వారా ఈ థీమ్‌ని పాఠకుల మనసులోకి చొప్పించాలి. అది చెయ్యకుండా, ముగింపుదాకా కథ నడిపి, ఆ థీమ్‌ని వాచ్యంగా చెప్పే రచయితలతోనే సమస్యంతా.
ఆనంద్ తన తమ్ముడి కోసం వెతకడం, ఇన్నేళ్ల ఎడబాటు తర్వాత అతన్ని హత్తుకోవడం, అహంకారాన్ని పక్కన పెట్టి కళ్లనీళ్లు పెట్టుకోవడం – ఇవన్నీ పాఠకులు కళ్లారా చూస్తున్నప్పుడు, దాని వెనుక ఉన్న అంతర్లీనమైన కథాంశాన్ని (థీమ్) వాళ్లంతట వాళ్లే చాలా సులువుగా అర్థం చేసుకోగలరు కదా? ఆ కథకు అర్థం ఏమిటో కథకుడు వచ్చి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు కదా? కానీ అలా చేయడం ద్వారా, చాలామంది రచయితలు తమకు తెలియకుండానే ఆ అనుభూతిని బలహీనపరుస్తారు. దాంతో ఆ కథ పాఠకుల చేతిలో పెట్టిన ఒక నీతి పాఠంలా అనిపిస్తుంది. ఒక జోక్ విని అందరూ నవ్వేసిన తర్వాత, అసలు ఆ జోక్‌లో కామెడీ ఏంటో కూర్చుని వివరించినట్లు ఉంటుంది. ఆ వివరణ వల్ల ఆ అనుభూతి పెరగకపోగా తగ్గిపోతుంది.
మంచి ముగింపులు పాఠకుల తెలివితేటలను నమ్ముతాయి. దుమ్ములో వదిలేయబడ్డ పాత ఫోటో, ఎన్నో ఏళ్ల చీకటి తర్వాత మళ్ళీ లైట్లు వెలిగిన ఇల్లు, ఇద్దరు అన్నదమ్ములు ఏమీ మాట్లాడకుండా పక్కపక్కనే నడుచుకుంటూ వెళ్లడం లాంటివి చాలా వివరంగా రాయబడ్డ పారాగ్రాఫ్‌ల కంటే ఎంతో శక్తివంతంగా కథా వస్తువును ఆవిష్కరించగలవు. ఈ విషయం రచయితలు గుర్తెరిగి ఉండాలి.
- బలవంతపు మలుపులు
చాలా కథలలో ట్విస్ట్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ట్విస్ట్ ఎండింగ్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే కథలో వచ్చే ఏ ట్విస్ట్కైనా కొంత ముందస్తు సంకేతాలు (Foreshadowing) ఉండాలి. చివర్లో వచ్చిన మలుపు చదవగానే “అవును కదా, నాకు ఫలానా చోట ఫలానా వాక్యం చదవగానే ముగింపు ఇలా ఉంటుంది అన్న అనుమానం రావాల్సింది కదా?” అని అనిపించాలి. కళ్ల ముందే ఉన్న క్లూస్ వదిలేసి చివర్లో నాలిక కరుచుకునే డిటెక్టివ్‌లా “అరెరే!” అనుకోవాలి. ఎందుకు? ఎలాంటి ముందస్తు సంకేతాలు లేని ట్విస్ట్ ఒక అద్భుతమైన మలుపులా కాకుండా కేవలం ఒక చౌకబారు జిమ్మిక్కులా అనిపించే ప్రమాదం ఉంది.
“ఇంటికి వెళ్లే రైలు” అని గతభాగంలో ఇచ్చిన కథ ముగింపులో కార్తీక్ తను ఇన్నేళ్లుగా ఆనంద్‌ను దూరం నుండి రహస్యంగా గమనిస్తూనే ఉన్నానని, ఆనంద్ ఒక మంచి మనిషిగా మారేంతవరకు బుద్ధిపూర్వకంగా ఎదురుచూసి ఇప్పుడే తిరిగి వచ్చానని చెప్తాడు. పైకి చూడటానికి, ఈ అంశం కథకి ఆశ్చర్యాన్ని, ఒక కొత్త మలుపుని జోడించినట్లు అనిపిస్తుంది. కానీ వాస్తవానికి, ఇది ముగింపుని కథని బలహీనపరిచే అంశంగా మారింది.
ఈ ఆకస్మిక వెల్లడికి కథలో ఎక్కడా ముందస్తు పునాది లేదు. పాఠకుడు వెనక్కి తిరిగి చూసి, “ఓహో! ఇప్పుడు అంతా అర్థమైంది” అని అనుకోవడానికి వీలుగా ఎక్కడా ఎలాంటి హింట్లు గానీ, అనుమానాస్పదమైన సంఘటనలు గానీ, సన్నివేశాలు గానీ లేవు. కేవలం ముగింపులో ఒక ఊహించని మలుపు ఉండాలనే ఉద్దేశంతో రచయితే ఈ ట్విస్ట్‌ను ఇక్కడ బలవంతంగా ఇరికించారని తెలిసిపోతోంది.
పాఠకులు కథలో ఆశ్చర్యకరమైన మలుపులని ఇష్టపడతారు, కానీ ఆ ఆశ్చర్యానికి కారణమైన సంఘటన, డైలాగ్, పాత్ర – ఇవన్నీ వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు కథా గమనంలో ‘అనివార్యమైనవి’ అని అనిపించినప్పుడు మాత్రమే ఆ ట్విస్ట్‌ని ఇష్టపడతారు. ఒక అద్భుతమైన మలుపు ఎప్పుడైనా పాఠకులను మళ్ళీ పాత దృశ్యాలను తిరిగి చూసుకునేలా చేస్తాయి. అలా వెనక్కి తిరిగి చూసుకునే పాఠకులకి ఆ ట్విస్ట్‌కి సంబంధించిన ఆధారాలు మొదటి నుంచీ కథలోనే ఉన్నాయనే విషయం తెలిసినప్పుడు ఆ ట్విస్ట్ సహజంగా అనిపిస్తుంది.
అలా కాకుండా, బలవంతంగా చొప్పించబడిన ట్విస్ట్, కథ విశ్వసనీయతను (Credibility) దెబ్బతీస్తుంది. ఎందువల్ల? బలవంతంగా ఇరికించిన ట్విస్ట్ చదివిన పాఠకులు తాము మోసపోయామని భావిస్తారు. రచయిత కథా నైపుణ్యాన్ని అభినందించాల్సింది పోయి, కేవలం తమకు ఒక షాక్ ఇవ్వడం కోసమే కొన్ని ముఖ్యమైన వివరాలను కావాలని దాచి చివర్లో మా ముఖాన కొట్టారు అని అనుకుంటారు. మన ఉదాహరణ మళ్లీ చూడండి – కార్తీక్ ఇన్నేళ్లుగా ఆనంద్‌ను గమనిస్తూనే ఉంటే, ఎప్పుడూ ఎందుకు ముందుకు రాలేదు? కచ్చితంగా ఇప్పుడే ఎందుకు రావాలి? ఈ ప్రశ్నలను కథ ఎక్కడా శోధించలేదు, ఎందుకంటే ఈ ట్విస్ట్ కేవలం కథ ముగించడానికి ఒక సాధనంగా మాత్రమే ఉపయోగించబడింది.
రచయితలు ఒక విషయం గుర్తుంచుకోవాలి — ఆకస్మికంగా వచ్చిపడే ట్విస్ట్‌లను ముందస్తుగా వేసుకున్న పునాది పైన నిలబెట్టాలి. ముగింపులో వెల్లడి కావాల్సిన పెద్ద నిజం ఉంటే అది కథలో ప్రత్యక్షమవడానికి ముందే ఆ కథలో నీడలా పరుచుకుని ఉండాలి. ముందస్తుగా ఇచ్చే ఆ సంకేతాలు (Foreshadowing) మరీ స్పష్టంగా ఉండాల్సిన అవసరం లేదు, కానీ కచ్చితంగా ఉండాలి.
- ఊహకందేలా సాగడం
చాలావరకు పాఠకులు కథని చదువుతున్నప్పుడు ఆ కథ ముగింపుని ఊహించే ప్రయత్నం చెస్తారు. వాళ్లు ఊహించినట్లుగానే కథ నడిచి, చివర్లో ఆ ఊహ ప్రకారమే కథ ముగిస్తే, ముందే ఊహించామన్న తృప్తి పాఠకులకి కలిగినా, కథ అంత గొప్పగా లేదు అనే అవకాశం ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచి వింటున్న జానపద కథలు, విదేశాల నుంచి వచ్చిన ఫెయిరీ టేల్స్ మొదలైన కథల్లో ముగింపు గమనించండి. అన్నీ చివర్లో they lived happily ever after అనే సుఖాంతం కథలే. నేను ఉదహరించిన కథ కూడా అలాగే ముగిసింది. ఇలాంటి పాతబడిన క్లిషే (Cliché) ముగింపు ఆధునిక పాఠకులను తృప్తి పరచవు. పైగా అదంతా ఒక ఫార్ములా ప్రకారం – అన్నదమ్ములు కలుసుకుంటారు, వెంటనే క్షమించేసుకుంటారు, కుటుంబ వ్యాపారాన్ని నిలబెడతారు, జీవితంలో ఇంకెప్పుడూ గొడవ పడరు, పైగా ఇతరుల సంబంధాలను నిలబెట్టడానికి సహాయం చేస్తారు. ఎంత contrived, predictable కథ ఇది?
కాకపోతే ఒక విషయం. ఊహకందేలా ఉండటం అనేది మాత్రమే పెద్ద లోపం అని చెప్పడానికి లేదు. ఎంతో ఆదరణ పొందిన చాలా కథలకు ఊహకందే ముగింపులే ఉంటాయి. కానీ వాటిల్లో ఒక సంక్లిష్టత గానీ, ఒక కొత్త ఆలోచనా కోణం గానీ ఉంటుంది. అది లోపించినప్పుడే అసలైన సమస్య వస్తుంది. పై కథలో ముగింపు ఎటువంటి అనిశ్చితీ లేకుండా, మనసులో ఎలాంటి ప్రశ్నలూ మిగల్చకుండా, ఎటువంటి ఇబ్బందీ లేకుండా, ఏ మాత్రం బరువును కూడా వదలకుండా ముగుస్తోంది. అదే సమస్య.
ఎందుకు? ఎందుకంటే నిజ జీవితం ఎన్నడూ ఇలాంటి పరిపూర్ణమైన ముగింపులను ఇవ్వదు. బంధాలు మళ్ళీ కలిసిన తర్వాత కూడా, పాత జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. నమ్మకం అనేది ఒకరోజుతో వచ్చేది, పోయేది కాదు. ఏ రోజుకారోజు ఇచ్చి పుచ్చుకునేది కాదు. దాన్ని క్రమంగా నిర్మించుకోవాలి. పాత అలవాట్లు మళ్ళీ చేతలలోకి వస్తాయి. దాని వల్ల మళ్లీ స్పర్థలు. జీవితంలో చాలాసార్లు క్షమాపణ ఒక ముగింపు కాదు, ఒక కొత్త ఆరంభం అవుతుంది. ఈ విషయం తెలియని రచయిత ఈ కథ రాయటం వల్ల ముగింపు పేలవంగా, సత్యదూరంగానూ ఉండి చందమామ నీతి కథని తలపిస్తోంది.
మరో విషయం. పాఠకులు తాము కేవలం తమ తెలివితేటలను తృప్తి పరిచే కథల కంటే, భావోద్వేగపరంగా కదిలించి, ఆలోచింపజేసే ముగింపులనే ఎక్కువగా గుర్తుంచుకుంటారు. ఇష్టపడతారు. ఒక చిన్న అనిశ్చితి ఉన్న ముగింపు కథని సహజంగా ముగిస్తుంది. “ఆ అన్నదమ్ములు ఇద్దరూ కలిసి బయటకి నడిచారు. రేపు ఏం జరగబోతోందో ఇద్దరికీ తెలియదు. తెలిసింది ఒక్కటే. పాదాలు వేరు వేరుగా ఉన్నా, కలిసి ఒకే వైపు అడుగులేస్తేనే ముందుకు వెళ్లగలరని.” వారిద్దరూ “మరెన్నడూ గొడవ పడలేదు” అనే ఖచ్చితమైన ముగింపు కన్నా కాస్త అనిశ్చితి ఉన్నా, మునుపటి కంటే ఆ అన్నదమ్ములు కాస్త మెరుగైన మనుషులయ్యారు అని చెప్పి వదిలేసిన ముగింపు ఎక్కువ జీవిత సత్యాన్ని ఆవిష్కరిస్తుంది.
పాత్రలకూ, పాఠకులకూ ఒక సంపూర్ణమైన ముగింపుని, తద్వారా సంతోషాన్ని/తృప్తిని ఇవ్వాలనే రచయిత తాపత్రయం నుంచే ఈ ఊహకందే ముగింపులు పుడతాయి. దాన్ని వదులుకోవడం చాలా అవసరం.
- శైలిలో అసంబద్ధత
కథ ఒకదారిలో నడిస్తే ముగింపు మరో దారిలో నడుస్తూ ఎదురురావటం మరో సమస్య. ఎన్నో ఏళ్ల పశ్చాత్తాపం, ఎడబాటు, మనసులో గాయాల లాంటి భావోద్వేగాలపైన నిలబడ్డ కథ, వాస్తవానికి దూరంగా ఉండే ఒక ఖచ్చితమైన, పరిపూర్ణమైన, అసహజమైన ముగింపుతో ముగియడం – తేడాగా అనిపించడంలేదూ? షడ్రసోపేతమైన 65 రకాల ఐటమ్స్ బఫే డిన్నర్ పెట్టి, చివర్లో “మేం పేదవాళ్లం. డెసెర్ట్ (స్వీట్) ఏర్పాటు చేసే స్థోమత లేకపోయింది” అని చేతులు నలుపుకున్నట్లు ఉంది.
పై కథ అంతా పశ్చాత్తాపం, విచారం, ఎడబాటు, కుటుంబ బంధాల గురించిన ఒక గంభీరమైన భావోద్వేగభరితమైన కథనం ఉంటుంది. కథనమంతా ఒక అంతర్ముఖీయమై, కాస్త విషాదభరితమైన శైలిలో సాగుతుంది. కానీ ఆ చివరి పారాగ్రాఫ్‌లు మాత్రం ఉన్నట్లుండి సంతోషంలోకి, సంబరాల్లోకి జారిపోతుంది. దాదాపు ఒక చందమామ కథలాంటి ముగింపు అది. అప్పటిదాకా పాఠకులు ఆ కథతో చేసిన సుదీర్ఘమైన ప్రయాణంలో వాళ్లు అనుభవించిన భావోద్వేగాన్ని వెనక్కి తిరిగి చూసుకుని “నేను అనుభూతి చెందిన ఆ భావోద్వేగం నిజమైనదేనా?” అని ప్రశ్నించేలా చేస్తుంది. “ఇప్పటిదాకా ఈ కథ చదువుతూ చాలా బాధపడ్డాను. వీళ్లు ఇంత సులభంగా కలుస్తారని తెలిస్తే అనవసరంగా అంత బాధపడేదాన్ని కాదే” అని పాఠకులు అనుకోవచ్చు.
ఈ వాక్యాన్ని గమనించండి: “ఆ రోజు నుంచి, ఎప్పుడూ ఆ అన్నదమ్ములు గొడవ పడలేదు.”
ఈ వాక్యం మరేదో వేరే రకమైన కథకు సంబంధించినది. పొరపాటున ఇక్కడ వచ్చిపడ్డట్లుంది. అప్పటి దాకా కథలో నిర్మించిన వాస్తవికతను ఈ వాక్యం పక్కనపెట్టి ఈ కథంతా కల్పిత జానపదగాధ అని అరిచి చెప్తున్నట్లు ఉంది. పాత్రలు అనుభవించిన జీవితం వల్ల వాళ్లిద్దరి మనస్సులపై పడే మానసిక ప్రభావాలను ఇది పూర్తిగా విస్మరిస్తోంది. ఈ రకంగా శైలిలో వచ్చే మార్పులు ముగింపు విశ్వసనీయతను బలహీనపరుస్తాయి.
ముగింపు అనేది కథ అంతటా నిర్మించబడిన భావోద్వేగ వాతావరణాన్ని ప్రతిధ్వనించాలి. దీని అర్థం ప్రతి విషాద కథా విషాదంతోనే ముగియాలని లేదా ప్రతి ఆశాజనకమైన కథా సంతోషంతోనే ముగియాలని కాదు. ముగింపులో ఉపయోగించే భావోద్వేగ సంబంధమైన భాష గురించి చెప్తున్నాను. అంతకుముందు జరిగిన ప్రతి విషయానికి ఒక సహజమైన కొనసాగింపులా అనిపించాలి.
ఒక హాస్యభరితమైన కథ సరైన ముందస్తు పునాది లేకుండా అకస్మాత్తుగా తాత్విక కథగా మారిపోకూడదు. ఒక గంభీరమైన కథ ఆశతో ముగియవచ్చు, కానీ ఆ ఆశ.. పాత జ్ఞాపకాలు, త్యాగం లేదా ఒక చిన్న అనిశ్చితితో కూడుకుని ఉండాలి. శైలి అనేది రచయితకూ, పాఠకుడికీ మధ్య ఉండే ఒక ఒప్పందం. చివరి పేజీలలో ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే తాము పూర్తిగా మరేదో కొత్త కథలోకి అడుగుపెట్టామనే వింత భావన పాఠకులలో కలుగుతుంది. అది రానివ్వకుండా చెయ్యాల్సిన బాధ్యత రచయితదే.
- నీతులు చెప్పడం
ముగింపు బలంగా ఉండాలి అని వ్యాసం రాస్తూ, ఈ సమస్యని చివర్లో ప్రస్తావిస్తున్నాను అంటే దీని ప్రాముఖ్యత మీరే అర్థం చేసుకోండి. నాకు పూర్తిగా బీపీ తెప్పించి, కోపంతో పుస్తకాన్ని విసిరికొట్టేలా చేసే పాత్రలు కొన్ని తారసపడుతుంటాయి. “ఇంటికి వెళ్లే రైలు” కథలో కూడా ఒక పాత్ర ఉంది – మీకు గుర్తుందా? రైల్వే కూలీ. అసలు కథతో ఏ మాత్రం సంబంధం లేకుండా, బలవంతంగా తల దూర్చి, “కాబట్టి ప్రియమైన పాఠకులారా, గుర్తుంచుకోండి – అత్యాశ ఎల్లప్పుడూ నాశనానికే దారితీస్తుంది.” అని పాత్రలకూ, తద్వారా పాఠకులకు లెక్చర్ ఇచ్చి, తన జీవన సాఫల్యం ఈ ముక్క చెప్పడంలోనే ఉందని, మళ్లీ కథలో కనపడకుండా పోయే పాత్రలు. ఈ పాత్రలు మిగిలిన పాత్రలతో మాట్లాడుతున్న నెపంతో పాఠకులతో మాట్లాడతాయి. అంతే కాదు. మాట్లాడేది కూడా ఆ పాత్ర కాదు. రచయిత. మనం ఉదాహరణగా తీసుకున్న కథలో ఆ కూలీ పాత్ర రచయిత ప్రతినిధిగా మారి రైల్వే అనౌన్స్మెంట్ లాంటి ప్రకటన చేశాడు.
నిజంలా అనిపించాల్సిన కాల్పనిక కథను చదవాలనుకున్న పాఠకులకి దాన్ని ఒక ఉపన్యాసంలా మార్చేసే ఈ పాత్రలు, ఆ పాఠకులను ఆ కథా ప్రపంచంలో లీనమవ్వకుండా చేస్తాయి.
“అహంకారం కంటే ప్రేమే అత్యంత విలువైనదనే నిజాన్ని మర్చిపోతారు. సంపదను మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ బంధాలు ఒక్కసారి విరిగిపోతే.. వాటిని మళ్ళీ అతుకు పెట్టడం చాలా కష్టం.”
ఎప్పుడైతే కూలీ వచ్చి ఈ డైలాగ్ చెప్పాడో, ఆ క్షణమే, ఆ కూలీ ఒక పాత్రగా మిగలడం ఆపేసి, రచయిత ప్రతినిధిగా మారిపోయాడు. అలాంటప్పుడు ఆ పాట్రలు కథలో తనదైన పాత్రను పోషించకుండా, ఆ కథలోని సందేశాన్ని పాఠకుల కోసం ఒక సారాంశంలా వివరించడమే తమ ఆశయం అన్నట్లు ప్రవర్తిసాయి.
కథలంటే నీతి సూత్రాల వల్లిపులు, భావజాల వ్యాప్తి కోసం చేసే ప్రసంగాలు కాదు. పాఠకులు పాత్రల ద్వారా జీవితాన్ని అనుభవించడానికి కథల్లోకి వస్తారు తప్ప, నీతి సూత్రాలపై లెక్చర్లు వినడానికి కాదు. వాళ్లకు కావాల్సింది వాస్తవికత అనే భ్రమ (Illusion of reality), ఆ భ్రమలో జరుగుతున్న కథ అంతా నిజమే అన్న భావన, అలా లీనమైన కథలో ఉండే భావోద్వేగం, ఆ భావోద్వేగం నుంచి మనసులో ఒక చిన్న కదలిక. ఒక అవగాహన. మెదడులో మరో చిన్న ఆలోచన. మంచి కథ చదివామన్న తృప్తి.
ఎప్పుడైతే ఒక పాత్ర రచయిత తరఫున మాట్లాడటం మొదలుపెడుతుందో, ఆ మరుక్షణమే ఆ వాస్తవికత అనే భ్రమ ముక్కలైపోతుంది. తెర వెనుక ఎవరో ఒకరు నిలబడి ఈ కథకు అర్థం వివరించడానికి ప్రయత్నిస్తున్నారనే నిజాన్ని పాఠకులు అకస్మాత్తుగా గమనించేస్తారు. అంతే! వాస్తవికత అనే మంచు కరిగిపోయి, అది కట్టు కథ అని తెలిసిపోయి అందులో ఉన్న భావోద్వేగాన్ని గుర్తించక, మనసులో, మెదడులో ఏ కదలిక లేక, మంచి కథ చదివామన్న తృప్తి లేక – “ఏదో రాసాడు కానీ, చప్పగా ఉంది” అని చప్పరిస్తూ వెళ్లిపోతారు.
పైన ఉదహరించిన కథలో ఆ కూలీ పాత్ర అవసరమే లేదు. అతను చెప్పిన ప్రతి విషయమూ ఆనంద్ చేసిన సుదీర్ఘ ప్రయాణం ద్వారా అప్పటికే నిరూపించబడింది. అతని ప్రసంగం వల్ల కథకు ఎలాంటి కొత్త సమాచారమూ అందలేదు, కొత్త సంఘర్షణ రాలేదు, ఏ భావోద్వేగమూ తోడవలేదు. అంత గొప్ప సందేశాన్ని పాఠకులు తెలుసుకోకుండా వెళ్లిపోతారేమో అన్న అనుమానంతో, అత్యుత్సాహంతో వాళ్లకు అంతర్లీనంగా కలగాల్సిన ఆలోచనను, స్పష్టమైన మాటల్లో చెప్పే ప్రయత్నం మాత్రమే.
గొప్ప రచయితలు రాసిన మహాద్భుతమైన కథలు గమనిస్తే వాళ్లు ముగింపును పాఠకుల వ్యక్తిగత అవగాహనకే వదిలేశారని గమనిస్తారు. వేర్వేరు పాఠకులు ఒకే కథనంలో వేర్వేరు అంతరార్థాలను కనుగొన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ బహుళత్వమే (Multiplicity) సాహిత్యానికి ఉన్న అతిపెద్ద శక్తులలో ఒకటి. అలాంటి బహుళార్థ కథకి చివర్లో ఫలశృతి చెప్పడం ఒకే ఒక్క వివరణ / అర్థం మాత్రమే సరైనదని పట్టుబట్టడం లాంటిది. అది ఆ సాహిత్య శక్తిని హరించివేస్తుంది.
ఇలా నీతిని ప్రత్యేకంగా వివరించాలనే తాపత్రయాన్ని రచయితలు నియంత్రించుకోవాలి. కథను గనుక సరిగ్గా రాసి ఉంటే, ఆ నీతి సందేశం, చింతన అప్పటికే అందులో సజీవంగా ఉన్నాయని గుర్తించాలి.
ముగింపుకి ముగింపు
గత భాగంలో చెప్పినట్లు చాలామంది రచయితలు తాము కథ ఎక్కడ ఆపితే అదే ముగింపు అని అనుకుంటారు. కథ ఎక్కడ ఆగిపోతుందో అదే ముగింపు అని గుర్తించరు. కథని ఆ ముగింపు దగ్గరకి తీసుకెళ్లాల్సిన బాధ్యత రచయితదే. వాస్తవానికి, ముగింపు దగ్గరే ఒక కథ తన సంపూర్ణమైన విలువ సాధించుకోగలుగుతుంది. పాఠకులు కథారంభంలో రోడ్డు ఎగుడు దిగుడుగా ఉన్నా క్షమిస్తారేమో, మధ్యలో ప్రయాణం మందకొడిగా సాగినా ఒప్పుకుంటారేమో, కానీ తొందరపాటుగా, నీతులు చెప్తూ, బలవంతపు మలుపులతో, భావోద్వేగపరంగా అసంతృప్తి కలిగించే ముగింపును మాత్రం ఒక్కనాటికీ క్షమించరు.
మళ్లీ చెప్తున్నాను. పరిపూర్ణమైన ముగింపు అంటే ప్రతి విషయానికీ సమాధానం ఇచ్చేసేది లేదా ప్రతి చిక్కుముడినీ విప్పేసేది అని కాదు. కథ మొదటి నుండి నిశ్శబ్దంగా ఏ దిశ వైపు అయితే ప్రయాణించిందో, ఎక్కడికి చేరుస్తాను అని పాఠకులకి మాట ఇస్తూ వచ్చిందో కచ్చితంగా ఆ స్థానానికే చేరుకున్నట్లు పాఠకులకి అనిపించడమే నిజమైన ముగింపు. అది సాధించాలంటే కథ అంతరార్థాన్ని గ్రహించే శక్తి, పాఠకులకి తెలివితేటలు ఉన్నాయని రచయిత నమ్మాలి. సన్నివేశం రాసినప్పుడు అందులో ఉన్న భావోద్వేగం తూకం ప్రకారం సరిగ్గా ఉందని, అది పాఠకులకి చేరుతుందని నమ్మకం ఉండాలి. కథ మొదటి నుంచి చివరి వరకు ఒకే శైలికి కట్టుబడి ఉంది రచయితకి అనిపించాలి. ముఖ్యంగా ఆ చివరి వాక్యం తర్వాత కూడా పాఠకుల మనసులో నిరంతరం ప్రతిధ్వనించేలా ఒక దృశ్యాన్ని, ఒక అనుభూతిని లేదా ఒక ప్రశ్నను పాఠకుల అంతరంగాన వదిలి వెళ్తున్నాను అని రచయితకి అనిపించాలి. అదే ముగింపు.
ఇది ఎలా సాధించాలి?
పాఠకులని నమ్మండి – దృశ్యాల ద్వారా మీరు ప్రదర్శించిన కథలో అంతర్లీనంగా ఉన్న చింతనను, భావోద్వేగాన్ని పాఠకులు అర్థం చేసుకోగలరని నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉంటే కథ సారాంశాన్ని వాచ్యంగా చెప్పరు. పాఠకుల తెలివితేటల్ని గుర్తించండి. ఆ గుర్తింపు ఉంటే బలవంతపు ట్విస్ట్ ఒకటి పడేసి ఇదే ముగింపు అనరు. పాఠకులను గౌరవించండి. మంచి కథ అనే ఒక వాగ్దానాన్ని మీరు సజావుగా పూర్తిచేస్తారు అని నమ్మి మీతో అక్షరాల దారిలో నడిచిన పాఠకులకు, ఆ వాగ్దానం నిలబెట్టుకోవడం ద్వారా వారి శ్రమకి, వాళ్లు వెచ్చించిన కాలానికి గౌరవం ఇచ్చినవాళ్లౌతారు.
తిరిగి తిరిగి అక్కడికే వచ్చాం. 29 భాగాలుగా నడుస్తున్న ఈ శీర్షిక ముగింపుకి వచ్చాం. మూడో భాగంలో రాసిన కింది మాటలతో ఈ భాగాన్ని ముగిస్తాను –
ఈ వ్యాసాలన్నీ ఈ ఒక సూత్రం మీదే ఆధారపడి ఉన్నాయి. ఈ వ్యాసాలన్నింటికీ ఏక వాక్య సంక్షిప్త రూపం ఇది –
పాఠకులని గౌరవించండి. రచయితగా పాఠకుల గౌరవం పొందండి.
(వచ్చే సంచికలో చివరి వ్యాసం)








పాఠకులను ఎలా గౌరవించాలో మీ కథాలజీ తో చాలా బాగా అర్థమైంది అరిపిరాలగారూ. ధన్యవాదాలు.