1.
నీ లోపలి చెట్టు
ఒక్క కిటికీనైనా తెరిచి ఉంచు
బయటినుంచైనా
ప్రపంచం చేతులూపే దృశ్యం బాగుంటుంది
సాయంత్రం అవుతున్న కొద్దీ
చల్లగా నీలోకి పాకే దిగులును
లాన్లో ఇప్పుడిప్పుడే నీ కళ్ళల్లోకి చూసే
ధైర్యం చేస్తున్న పసిమొక్కలతో పంచుకో
అనుకోవాలే గానీ
ఒకరికొకరు ఏమంత దూరమని?
నీ గదికి ఆవలివైపు నిరీక్షిస్తున్న ఉదయాల్ని
ఇంట్లోకి పిలుచుకురా
కొన్ని సముద్రాల్ని ఒంటరిగా తోడిపోయలేం
ఆకాశం ఇంకిపోతున్నప్పుడు
నెలవంక రెక్కందిస్తే
చూసీ చూడనట్టు అలా వెళ్ళిపోకు
ఎన్ని నదీగానాల్ని వినలేదు నువ్వు?
నీ లోపలంతా నీళ్ళే కదా
ఒక్కోసారి నీళ్ళ శబ్దం వినలేనంత
నిస్సవ్వడి
ఇదే ఆఖరి నిశ్శబ్దమనే తలపోతలో
నువ్వు పర్వతానివని
ఆ క్షణం గుర్తుకురాదు
ఎప్పుడైనా
నువ్వు నిశ్శబ్దంలోకి ఇంకిపోయినప్పుడు
చివరి ప్రయత్నంగా జీవితాన్ని పిలువు
నీతో కలిసి పాడడానికి
జీవితం కన్నా గొప్ప గాయని ఎవరున్నారు?
అడవిని చూడు
చదవాల్సిన పేజీలెన్నో తెలుస్తుంది
పువ్వులు రాలిన దిగులును రాస్తూ కూర్చోకు
శిశిరం పాడే
అద్భుత విషాదగీతాన్ని కోల్పోతావు
విషాదం
ఆకుపచ్చ రుతువును కలగనే
నీ లోపలి చెట్టు
ఇరుక్కుపోయి బతకడమెందుకు?
భూమిని అడుగు
పాతవన్నీ కూల్చి కొత్తగా పుట్టడమెలాగో
ఒక్క మాటలో తేల్చేస్తుంది.
2.
“This message was deleted”
దారం కట్టి
వెనక్కి లాగబడిన తూనీగ
ఇక ఉండబట్టలేక
ముఖం మీద నీళ్ళు కొట్టి నిద్రలేపే
చిన్నారి మేఘం
రాత్రి కురిసి
పైరు కళ్ళు తెరిచేలోపే
చినుకుల ఆనవాళ్లన్నీ ఆర్పేసే
పిరికివాన
తెరుద్దామా వద్దా అనే సంశయంలో
కిటికీ మీద బిగుసుకున్న వేళ్ళ ఒత్తిడి
మొహమాటం తగిలి
వెనక్కి జారిన నది
చెట్టును నరకబోతూ
గాలిలోనే ఫ్రీజ్ అయిన గొడ్డలి
”ఇప్పుడొద్డులే”
భూమికి ఐలవ్యూ చెప్పడాన్ని
వాయిదా వేసుకున్న ఆకాశం
లోపల బద్దలవుతున్న వాల్కనోని
పంటి బిగువున తొక్కిపెట్టే
చివరి రెపరెప
రంగుల్ని లోపలికి ముడుచుకుంటూ
ఇంద్రధనుస్సు
కడసారి నవ్వు
అద్దంలో
నీ బదులు తను కనబడగానే
పార్క్ బెంచీ కింద పాతిపెట్టిన
నిన్నటి నిరీక్షణ రహస్యం
‘ఎటూ సమాంతరరేఖల మీద
ప్రయాణాలమే కదా
కలిసినప్పుడు చూసుకుందాం’
మనసు స్పీడ్ బ్రేకర్
“Dad, love you!
miss you mummy,”
హాస్టల్ కంటిలో మొలిచిన
నీటిమొక్క
పొద్దున చూసేసరికి
అడ్డంగా ఒక సన్నని మరక.
This message was deleted.
*








బావున్నాయి
కొత్త పదబంధాలు, భావాలు వెరసి. ఉత్తమమైన కవిత్వం