1
ఆ సాయంత్రం
రోజంతా అలసిపోయిన సాయంత్రంలో
ఎవరో ఒకరు
“ఎలా ఉన్నావు?” అని అడిగితే చాలని
ఆ ఒక్క పలకరింపుతోనే
తునాతునకలైన ఆశలు
నెమ్మదిగా అతుక్కుపోతాయని నమ్ముతావు
నిన్ను ఎప్పటికీ వినిపించుకోని మాయావి ఈ కాలం
వసంతం నీ గడప ముందే
చాన్నాళ్ళ నుంచీ తచ్చాడుతున్నా
లోపలినుంచే గడియ గట్టిగా బిగించుకుని ఉంటావు
చిత్ర విచిత్రమైనది కదూ జీవితం
బయట నుంచి చూస్తే
పూల తోటలా కనిపిస్తుంది
లోపలికి అడుగుపెడితే
ముళ్లకే బోలెడన్ని పేర్లుంటాయి
మనిషి మృత్యువుని
ఆలింగనం చేసుకుంటాడు కానీ
తనను నిజంగా అర్థం చేసుకునే
ఒక్క హృదయం దొరకదేమోననే
ఒంటరితనానికే భయపడతాడు
గాయాలనుంచి ఇప్పుడు రక్తమేమీ కారటం లేదు
వాటిని గుర్తు పెట్టుకున్న జ్ఞాపకాలు
ప్రతి రాత్రీ కొంచెం కొంచెంగా చర్మాన్ని తొలుస్తూనే ఉన్నాయి
మరుసటి ఉదయం మళ్ళీ
కిటికీ తెరుస్తావు
ఒక చిన్న పక్షి కూతలో
ఒక ఆకుపై మెరిసే మంచుబొట్టులో
ఒక అపరిచితుడి చిరునవ్వులో
జీవించడానికి
ఇంకా ఏదో కారణం మిగిలి ఉంటుందేమోనని..
శ్వాసను భయపెట్టని రోజు ఒకటి
ప్రేమను అనుమానించని మనసు ఒకటి
ఏడవాల్సిన అవసరం లేని రాత్రి ఒకటి
అంతే బహుశా…
అన్నిటికన్నా కష్టమైన కోరికలు
ఇవేనేమో ?!
2
మొహమాటపు పిలుపు
ఏదో తెలియని సందిగ్ధత
తడి పొడి ఆలోచనల్లో ముంచేస్తుంటుంది
సరిగ్గా అప్పుడే
నువ్వు గుర్తుకొస్తావు
మూలమూలల్లో దాగిన
జ్నాపకాల తుట్టెను కుదిపేస్తావు
మకరందాల విందుని ఎంతకనీ ఆరగించనూ!
వెన్నెల వాకిట్లో నిలబడి
సైగలెన్నో చేస్తుంటావు
మొహమాటపు పిలుపులు కావు కదా అవి
నిద్రపట్టని రాత్రులను ఎంతకనీ
వెలిగిస్తావు నేస్తం
పగలూ రాత్రీ కళ్ళార్పని
నక్షత్రాలు ఫక్కున నవ్వి పోవూ!
ముళ్ళని నాటడం
నీకు బాగా తెలిసిన విద్య
గులాబీని కదా
భూమ్యాకాశాలను గుండెన
ఎలా మోయ్యాలో నాకూ తెలుసులే
నువ్వు మూసేసిన
అనుబంధాల తలుపులు
మన వలపు వాకిళ్ళకు
ఎప్పుడో శాశ్వత తాళాలు వేశాయి
ఇప్పుడు ఏ సందిగ్ధతకూ చోటు లేదిక
అక్షరాల కూర్పులో
తలమునకలవుతున్నాను
బాహ్యాంతరాళాలను
పుస్తకాల పరిమళాలతో నింపుకుంటూ!!
*








బావున్నాయి కవితలు రెండూ
ధన్యవాదాలు సర్ 🙏
శుభాకాంక్షలు 🌺 అక్క… కవితలు రెండూ చాలా బాగున్నాయి..
ధన్యవాదాలు తమ్ముడు 🙏
రెండు కవితలూ బావున్నాయి
ధన్యవాదాలు సర్ 🙏