శీర్షిక

చిగురుటాకులను కలగనాలో
శిశిరాలను లెక్కించాలో
తెలియని  అమాయక అడవిలా
అయోమయంగా ఉంది గమనం
నీరుగారిపోతున్న కాలాన్ని
లెక్కలేసుకుంటూ కుచ్చుంటే
రేపటి బతుకు గుమ్మానికి
ఆశల ఉరికంబమొకటి
చావుటుయ్యాల్లా ఊగుతుంది
ప్రవహిస్తున్న చీకటినదులు
వెలుతుర్ని ఓదార్చడం
పొంగుతున్న కన్నీటి సంద్రాలు
తీరాల్ని ఆశించడం పాత కథే
దోసిలినిండని మట్టితో
మన సమాధి గోతిని
మనమే నింపుకోవడం
గుప్పెడు పుల్లలతో
ఊరంత చితిని పేర్చి
మన శవాన్ని మనమే
కడదాకా తగలెట్టుకోవడం
ఇప్పటి కొత్త కథ
లెక్కలేని మెటాఫర్లతో
ఎంత దీర్ఘ కవిత రాసినా
సరికొత్తగా రాసుకోవడానికి
మరో ఖాళీ సంపుటికి
చోటు మిగుల్చుకుని
వాలు కుర్చీలో
జోగుతూ ఉంది జీవితం
శీర్షిక నీదో నాదో ?
రాయబడని
ముందు మాటలు తేల్చాలి.
రక్త సంబంధి
చెట్టు కింద చీకటికి
సోయలేని దేహాలు కొన్ని అడ్డు
ఊరిలోని వెలుతురుకి
వాటి కాలికింది చీకటి అడ్డు
ఏ అడ్డు తొలగించాలో తెలియక
రాత్రి బండిలో
నిదరతాడుకి కట్టేసిన కుక్కపిల్లలా
పొద్దుటి సూరీడు
గట్టు కింద పాకలో
కాలుతున్న పొయ్యోర
మత్తుగా జోగుతున్నాడు
చాలా రోజుల తర్వాత
రాజుకున్న పొయ్యిమీద
ఉడుకుతున్న కుండతోపాటు
ఇంటివారి ఆకలి కూడా తీరింది
పొయ్యిలోని నిప్పుకే
కడుపులో కాలుతుంది
ఆకలి వాళ్ళ రక్త సంబంధి అనుకుంటా
చివరి గాయాన్ని కలగంటున్నప్పుడల్లా
కొత్తగాయం వెక్కిరిస్తున్నట్టు
ఎవరిదో గొంతు నుండి
కన్నీటి రాగమొకటి
గాలినదిలో నావైపే
వేగంగా కొట్టుకొస్తుంటే
ఆకలిని బదలాయించడం
దుఃఖాన్ని అనువదించడం చేతగాక
నిదుర జాడీలో కళ్ళు దాచేసుకున్నాను.
*

మిరప మహేష్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.