రెడ్ వైన్

ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు నేనెక్కడున్నానో మర్చిపోతాను, మొద్దుబారిపోతాను, చుట్టూ అంతా ఒక స్టిల్ లైఫ్ పెయింటింగ్ లాగా ఐపోతుంది.

To start with…

Where do I start?

మనుషులం కాబట్టి ప్రేమించడాన్నుంచి తప్పించుకోలేని వాళ్లమని, ఈ జీవనోత్సాహ సంరంభం వల్లనే, ఈ ప్రేమపద సోపానాల మీదుగానే, ఆనందసౌధానికి చేరుకునేదారిలోనే పాదాచారులమై కలిశామనీ, అసలు ప్రేమని వెతుక్కుంటూనే పక్షులు ఆకాశంవైపు ఎగరడం నేర్చుకున్నాయనీ, హఫీజ్ తోటలోంచి తేలివచ్చిన ప్రాణగంధపు గాలుల చలవతో నిద్రలేచి…

కుంగిపోయిన కోటల్నీ, ఒరిగిపోయిన కిరీటాల్నీ ఖాతరుచెయ్యక, అప్పుడూ, ఇప్పుడూ అదేలాగ రక్తవర్ణమధువుని స్రవిస్తున్న ఒకేఒక ద్రాక్షతీగలాగా, శీతాకాలపు పశ్చాత్తప్త పవనాల్ని దహించే వసంతాగ్నిలాగా, చలాన్ని ఆవహించుకున్న రుబాయీల విలాసస్వరంలో మొదలుపెట్టి…

“ఆలోచనలకి, భౌతిక స్పృహకి అతీతంగా, నిరాసక్తంగా, తటస్థంగా, ఏ ఉద్వేగాలూ లేని నిశ్చలస్థితిలో కూడా నా నరనరాల్లోంచి నీ అణువణువునీ పూర్తిగా, మరింతగా కోరుకుంటున్నాను” అన్న కాఫ్కా కలవరింత దగ్గర ఒక కామా పెట్టి…

ఏ ఉదాత్తతనీ ఆపాదించలేని, ఏ ఉన్నత విలువనీ అందించలేని, ఏ సందేశాన్నీ మిగల్చలేని, సహజాతి సహజమైన సహజాతాల కలయికలాంటి మన కథని-  నేపథ్య సంగీతం లేని  గాలిపాటలోని లల్లాయి పదాల్లాగా, ఏ చారిత్రక ప్రత్యేకతా లేని మన రోజూవారీ మాటల మామూలుతనంతో, గుప్పెడు గుప్పెడు పదాలుగా చల్లుకుంటూ…

*

జీవితం చిన్నదని నువ్వెందుకో తరచుగా అంటావు. జీవించగలిగే కాలం మరీ చిన్నది బతుకంతటిలోనూ. అసలు బ్రతకడం అంటే ఒక ప్రాణం మరొక ప్రాణంతో కనెక్ట్ అయి ఉండటం అనిపిస్తుంది. తోకూపుతూ చుట్టూ తిరిగే కుక్కపిల్ల కూడా బతుకు మీద ఇష్టాన్ని పుట్టిస్తుంది ఒక్కోసారి.

అవును. చిన్నదే మనిషి జీవితం. ఇవ్వాళెందుకో నిజం అనిపించింది. ఊరెళ్ళేముందు వాకిట్లో నిలబడ్ద లేత జామచెట్టు,  నేను లేనప్పుడొచ్చిన గట్టివానకి వాలిపోయాక, పాత వూర్లో వెతుక్కుంటూ వెళ్ళిన సొంత ఇల్లు పూర్తిగా పరాయిదయ్యి కనిపించాక, బస్ లో పక్క సీట్లో నడివయసు మనిషొకాయన చాతీ మీద రుద్దుకుంటూ బరువుగా బస్ దిగి వెళ్ళిపోయాక, ఇందాకట్నుంచి ఒక హాంగ్ కాంగ్ సినిమాలో ‘ఉమెబయాషి’  బీజీఎం పదే పదే విన్నాక, ఉన్నట్టుండి నువ్వన్నట్టు జీవితం చిన్నదే అని గట్టిగా అనిపించింది.

అలా అనిపించగానే, తొందర తొందరగా సొరుగులు, అలమరలు అన్నీ లాగిలాగి వెతికితే దొరికింది, మనమిద్దరం మొహమాటంగా టీ గ్లాసులవైపు  చూస్తుంటే ఎవరో తీసిన మొదటి ఫొటో. ఆ ఫోటోని దులిపితే ఇదిగో ఇప్పుడు కూడా సిగ్గు పొడిపొడిగా, పుప్పొడిగా రాలిపడుతుంది. ముఖపరిచయం కూడా లేకముందే మొదటి ఫోన్ కాల్ లో, ఈవెనింగ్ సిక్నెస్ నుండి తప్పించుకోడానికి నీతో మాట్లాడుతున్నానని చెప్తే “అచ్చం నాలాగే, సాయంత్రాలు నాకూ అంతే, ఆ దిగులు నాకు బాగా తెలుసు.” అనడం గుర్తొచ్చింది.

పార్క్ లో ఒక చివర్న ఊగిపోతున్న సిమెంట్ బెంచ్ ని కావాలనే ఎంచుకునేవాళ్ళం. కళ్లనీళ్ళు వచ్చేదాకా ఎందుకెందుకో నవ్వుకునేవాళ్ళం. ఒకళ్ళు చెప్పేది ఒకళ్లం వినకుండా బోర్డం గురించీ, బ్రతికే పద్ధతుల గురించి, ప్రయోగాల గురించి ఎవరి స్క్రిప్ట్ వాళ్లం చెప్పుకుంటూ ఒక్కోసారి క్రాస్ టాక్ తో, నిజంగానే కాస్త బోర్ గా గడిపేవాళ్ళం కదా. అవి కొన్ని డిఫైనింగ్ మోమెంట్స్. చుట్టూ నెమళ్ళు, జంటలుగా, గుంపులుగా మాయమయ్యే జనం, మసక మసగ్గా సాయంత్రం. అదంతా ఒక ప్రతీకలా అనిపించేది. సాయంత్రమౌతుంది, వెలుగు తగ్గుతుంది, అందరూ వెళ్ళిపోయాక ఇద్దరమే మిగుల్తాం పార్కులో, జీవితంలో.

నీకు తెలిసి కొన్నిసార్లు, తెలీకుండా చాలాసార్లు నీవైపు చుస్తుంటాను. నడిచేప్పుడు నీ షూస్ వైపు చూస్తాను. షర్ట్ మీద ఏదైనా ఆకు పడితే నువ్వు దులుపుకోవడం చూస్తాను. ఆ చూసినవి ఎన్నిసార్లో గుర్తు చేసుకుంటాను. నా పేరు ఎప్పుడు పలికావు, ఎలా పలికావు, అప్పుడు నీ గొంతెలా ఉంది, కళ్లలో ఏముంది. అన్నిటినీ.

ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు నేనెక్కడున్నానో మర్చిపోతాను, మొద్దుబారిపోతాను, చుట్టూ అంతా ఒక స్టిల్ లైఫ్ పెయింటింగ్ లాగా ఐపోతుంది. నేనిక్కడెందుకున్నాను, నీ దగ్గరకి ఎప్పుడెళ్ళిపోతాను, నాకసలు ఏం పని ఇక్కడ? ఏం అర్థం కాదు.

*

నీకు సంబంధించిన అన్నిటినీ హత్తుకోవాలనిపిస్తుంది. నీ పాతజీవితం, అందులోని మనుషులు అన్నిటినీ దగ్గరగా, మరింత దగ్గరగా చూడాలని, నిన్ను గతం లోను, లోకంలోను ఇంకెక్కడా మిగల్చకుండా నాలో కలిపేసుకోవాలని, లోలోపలి తీగలు వివశత్వంతో కదిలిపోతుంటాయి. వెయ్యి కోరల జీవితం అన్ని వైపుల నుంచి మీదకొస్తున్న స్పృహ. ఇన్ని చికాకుల మధ్య కూడా  నువ్వు, నీ గొంతు, మన పొద్దుపోని కబుర్లు, దగ్గరితనం, దూరం ఇవే వాస్తవంలాగా, మిగతావన్నీ తెల్లవారుఝామున వచ్చిపోయే కలల్లాగా తోస్తాయి. అప్పటికప్పుడు ‘ఇట్లా దా’ అని దగ్గరకి పిలిచి మొహమంతా ముద్దులు పెట్టి, ‘ఇప్పుడు పో’ అని నెట్టెయ్యాలనిపిస్తుంది.

పడమటి కనుమల్లో సెల్ కవరేజ్ లేని సూర్యాస్తమయ సమయాల్లో ఒకసారి, నీలాంటి మనిషొకళ్ళు కనపడి అదేపనిగా  వెంటపడి వెళ్ళిన సంగతి అక్కడి గ్రానైట్ శిలలు ఇంకా మర్చిపోలేదు. ఉత్తరదేశపు కొండల్లో తిరుగుతున్నప్పుడు కనపడ్ద ప్రతీపపువ్వుకి ఒక తెలుగు పేరు పెట్టాలనిపించి ఏ పేరుమీదా మనకి ఏకాభిప్రాయం కుదరకపోవడం, ఎమోషన్స్ ని రంగులుగా మార్చుకుని హోలీ ఆడుకుందామని లేతరంగులన్నిట్నీ చెరిసగం పంపకం చేసుకోడం; ఏమో, మనకు తెలియంది కాదుగా- కలలన్నీ యౌవనానివి. కాలం మాత్రమే మనుషులదని.

*

ఆ సాయంత్రం వానకి నాని నాచుపట్టిన కొండరాయి మీద అరికాళ్ళు పట్టుబిగించి నిల్చున్నాం. ఆసరాకోసం కాస్త ఎత్తులో ఉన్న చెట్టుకొమ్మని పట్టుకున్నాను. నామోచేతి మడతలో మొహం రాసుకుంటూ మగత గొంతుతో ఏదో మాట్లాడావు. ఏదో చాలా మాములుగానే “ఇంకాసేపుందామా? అనో “కొమ్మ జారుతుందేమో జాగ్రత్త” అనో. అకారణంగా కదిలిపోయింది మనసు. శరీరంలో, మేధలో, అనుభవంలో పుట్టిన శక్తంతా చిక్కబడి చిక్కబడి ఒక ప్రేమాశృవుగా దొర్లింది. అవును, కావలసింది నువ్వే. నువ్వు కావల్సే ఇన్నాళ్ళూ ఇన్నిచోట్ల తిరిగింది. గుల్లచేసిన మట్టిపొరల్లాంటి చర్మకణాల్లోంచి మొలకలెత్తుతూ ఆవేశం. మాటమాటలో మోసులెత్తుతూ కొత్తగా ఒక మార్ధవపు గొంతుక నాలోపలేనా? నాదేనా? సంధ్యలన్నీ సందర్భోచితాలే కానీ, రాత్రులన్నీ సఫల మనోరధాలేనా?

*

స్వాతికుమారి పేజీ ఇక్కడ

స్వాతి కుమారి

స్వాతి కుమారి

నా పేరు స్వాతి, రిషివాలీ స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్నాను. మనుషులంటే ఆసక్తి. మనుషుల ఆలోచనలు, మాటతీరు, రకరకాల వ్యక్తిత్వాలు ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తాయి. వాటిని గమనించడం ఒక వ్యాపకం. చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని గమనించడం, పదాల్లో పెట్టడం ఒక ఇష్టమైన ఆట. అరుదుగానే రాసినా కథలు రాయడం వెనకున్న కారణాలు ఇవే. రాసే వాక్యం చదవడానికి అందంగా ఉండాలనేది ఒక పట్టుదల. కథ చెప్పే పద్ధతి రొటీన్ గా ఉండకూడదని ప్రయత్నం.

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • స్వాతీ, ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియట్లేదు ఇది చదివాక కలిగిన అనుభూతుల గురించి.
  మొదటి వాక్యాలతోనే మమ్మల్నీ ఆ స్టిల్ లైఫ్ పెయింటింగ్ లా మార్చేశావుగా.
  ఇంకా ఇంకా ఇటువంటివి చిత్రించు.

 • గొప్పగా వుంది.
  కథలాటి కవిత్వం.

  ప్రారంభం నుంచీ ఐపోయేదాకా
  గుక్కపట్టకుండా చదివించే ఒక సెన్సిబిలిటీ ఆసాంతమూ నడిచింది
  మంచులో తడిసి నవ్వుతున్న బీరపువ్వు లాగా.

 • జీవితమూ. సఫలమూ.రాగసుధా భరితమూ
  ..నిజం బంధూ..
  చాలాకాలం తర్వాత.
  ఓ చక్కనిజీవిత దర్శనం ఐంది..పదాలు కావవి.
  .తీయ తీయని పంచదార చిలుకలు.
  .ఆస్వాదిస్తూ..ఆస్సలు ఆపలేనంత
  ఉత్సుకతన ఏకబిగిన చదూకున్నా….
  లోకాన ఉన్నాయింకా మీ వంటి మనసులు..ధన్యవాదాలు మీకు..చక్కని మనసుమాటలకు..
  మీ బాటన..
  అమృతాక్షరాలకోసం.
  ఇటుకేసి వస్తూనే వుంటానిక….ధన్యోశ్మి..

 • ఫొటోలో ఉన్న బొమ్మ సూర్యుడు, చంద్రుడు కాదనుకుంటా.

  వాక్యం అందంగా రాయాలనే పట్టుదల బావుంది – అచ్చుతప్పులు లేకుండా ఉంటే ఇంకా బావుండేది.

 • అప్పటికప్పుడు ‘ఇట్లా దా’ అని దగ్గరకి పిలిచి మొహమంతా ముద్దులు పెట్టి, ‘ఇప్పుడు పో’ అని నెట్టెయ్యాలనిపిస్తుంది

  ********
  ఎంత తీవ్రత! భావమెంత గాఢం! అద్భుతమైన ఊహాచిత్రం!

 • ఏ ఉదాత్తతనీ ఆపాదించలేని, ఏ ఉన్నత విలువనీ అందించలేని, ఏ సందేశాన్నీ మిగల్చలేని, సహజాతి సహజమైన సహజాతాల కలయికలాంటి మన కథని- నేపథ్య సంగీతం లేని గాలిపాటలోని లల్లాయి పదాల్లాగా, ఏ చారిత్రక ప్రత్యేకతా లేని మన రోజూవారీ మాటల మామూలుతనంతో, గుప్పెడు గుప్పెడు పదాలుగా చల్లుకుంటూ…

  🙏🏻 అదేగా జీవితం. Suffocation లేని జీవితం.

 • మనసంతా కకావికలం అయింది.ఎన్నో సార్లయింది కానీ ఈసారి జ్దోఈవితమంతా టైం machine లో సర్కస్ బైక్ ఇన్ గ్లోబ్ లాగా, గుండ్రంగా తిరిగి తిరిగి, సంతోషం తో కలిసిన కకావికాలంలో పడేసింది. అదే ఊబిలో ఇంకాసేపు అలాగే ఉండాలన్పించేంత. క్లైమాక్స్ తో కకావికలం నుండి మనసు బయటికి రావడం అస్సలు ఇష్టంలేకుంది. అక్కడే ఉంటే బాగుండేదనిపించింది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు