అడయార్ కథలు

నీ పక్కలో బాంబు వుంది పేలొచ్చు లేదా పేలక పోవచ్చు అంటే ఏలావుంటుందో నా స్థితి అలా వుంది .

నాలో ఒక సస్పెక్టెడ్ సెల్ అంటే అనుమానాస్పద కణం వుందేమోనన్న డాక్టర్ల సందేహం అడయార్ కేన్సర్ ఇన్స్టిట్యూట్ వరకు తీసుకెళ్లింది . ఆ కణం కేన్సరే అయితే కబళిస్తుంది .
అందుకే 26 ఏళ్ల వయసులో ఇద్దరు పసిబిడ్డల్ని వదిలి ట్రేట్మెంట్ కోసం మద్రాస్ లో అడుగుపెట్టినప్పుడు తారసపడిన మనుషులతో అనుబంధాలు , ఎడబాట్లు, ఎన్నో అనుభవాలు… ఇవన్నీ కలిస్తే అడయార్ కధలు

వుందో లేదో తెలియని వ్యాధికి కీమో థెరపీల వంటి వేదనాభరితమైన ట్రీట్మెంట్. జుట్టు వూడిపోయి , మొహం మాడిపోయి , చందమామను రాహువు మింగేసినట్టు విలవిలలాడే నా మనసును చందన లేపనంలా చల్లబరిచిన మనుషుల కధలే అడయార్ కధలు.

అడయార్ ప్రయాణం

” బావగారూ ! ఈ భుజం దగ్గర కదుము కట్టినట్టుంది ఎంతకీ తగ్గడం లేదు” అంటూ డాక్టర్ వీర్రాజు గారితో అన్నాను . ఆయన మా బంధువే కాక చిన్నప్పటి నా గురువు కూడా .
“ఎన్నాళ్లనుంచి వుంది , నొప్పి వుందా ” అనడిగారు .
” రెండేళ్ల నుంచి గడ్డలా వుంది . ఒక వేళ ఎప్పుడైనా ఇంజెక్షన్ చేయించినప్పుడు వాచిందేమోనని పట్టించుకోలేదు ” అన్నాను .
” గడ్డలు శరీరంలో అన్నాళ్లు వుండకూడదు ముందు గడ్డ తీసేసి బయాప్సీ చేయిద్దాం అప్పుడు సేఫ్ ” అన్నారు .
ఆపరేషన్ కి ఏర్పాట్లు అయ్యాయి . తీరా లోపల చూస్తే గడ్డ విడిగా లేదట కండరాలు గట్టిగా రాయిలా అయిపోయి వున్నాయట . ఆయనకి దాన్ని తీయడం కుదరక బయాప్సీకి చిన్న ముక్క తీసి మళ్లీ కుట్లు వేసేశారు.
ఇదిగో అసలు కధ ఇక్కడే మొదలైంది .
పట్టణంలోనే పేరుమోసిన సర్జన్ ప్రొఫెసర్ వీరభద్రయ్య చాంబర్లో కూర్చుని వున్నాం . మా తమ్ముడు కూడా నాతో వచ్చాడు .
” నీ రిపోర్ట్స్ వచ్చాయమ్మా ” అనగానే ఆతృతగా ఆయన మొహంలోకి చూశాం .
” ఈ గడ్డ చూస్తే కేన్సర్లా అనిపిస్తోంది కానీ రిపోర్టు చూస్తే ఏమీ రాలేదు , మీరు అడయార్ కేన్సర్ ఇన్స్టిట్యూట్ కి వెళ్లడం బెటర్ ” అన్నాడాయన చాలా మామూలుగా .
నీ పక్కలో బాంబు వుంది పేలొచ్చు లేదా పేలక పోవచ్చు అంటే ఏలావుంటుందో నా స్థితి అలా వుంది .
తమ్ముడు చిన్నవాడు వుడుకు రక్తం వాడు ఏం అలోచించకుండా ” పోనీ అమెరికా పంపితే ” అన్నాడు .
“ఒరేయ్ నువ్వు ఆగరా ! అది మన వల్లకాదులే ” అని నేను అంటుంటే ” ఏం పరవాలా , అంతగా డబ్బులు కావాలంటే పొలం అమ్మేద్దాం , నువ్వు ముఖ్యం ” అన్నాడు .
అంత ఆందోళనలోనూ వాడిని చూసి ” పిచ్చి వెధవకి నేనంటే ఎంతిష్టమో ” అని మురిసి పోయాను .
లేదు బాబూ ! అడయార్ కేన్సర్ ఇన్స్టిట్యూట్తో పాటు రీసర్చ్ సెంటర్ కూడా అవడం మూలాన అమెరికాకి సమానంగా ట్రీట్మెంట్ జరుగుతుందన్నాడాయన.
” సరేనండీ ! మేం ఆలోచించుకుని బయల్దేరతాం ” అని నమస్కారం చేసి బయటకొచ్చి బావగారి చాంబర్ కి వెళ్లి సర్జన్ ఏమన్నదీ చెప్పాం .
” ఆయన మా ప్రొఫెసర్ ! చాలా సీనియారిటీ వున్న డాక్టర్, ఆయన చెప్పింది చేస్తేనే మంచిది ” అన్నారు .
ఇంట్లో మా ఆయనతో చెప్తే ” సరే వెళ్లి చూపిద్దాం కానీ మద్రాస్ లో మన భాష కాదు మనకు ఎవరూ తెలియదు , హైద్రాబాద్ అంటే బాగుండేది ” అన్నారు . పిల్లల్ని ఇక్కడ వదిలేసి వెళ్లొద్దాం అన్నారు .
నేను పిల్లలిద్దరినీ దగ్గరకు తీసుకున్నాను . ఎందుకో ఏడుపొచ్చేసింది. పెద్దదానికి ఆరేళ్లు నిండాయి , చిన్నదానికి మూడేళ్లు ఇంకా రాలేదు
చిన్నదాన్ని , అమ్మ నాన్న దగ్గర పెద్ద దాన్ని మా అత్తామామగార్ల దగ్గర పెట్టి వెళ్లాలని అనుకున్నాం .
ఈలోగా తమ్ముడి ఫ్రెండ్ ప్రసాద్ వచ్చాడు . తను కూడా అక్కా అని సొంత తమ్ముడిలాగే ఇంట్లో తిరుగుతాడు .
” అక్కా! మద్రాస్ లో మా తమ్ముడు ఒక మెడికల్ కంపనీ లో పనిచేస్తున్నాడు . వాడు తమిళనాడు అంతా తిరుగుతాడు .
మద్రాస్ వచ్చినప్పుడు మైలాపూర్లో వాళ్ల ఓనర్ వాళ్ల పెద్ద బిల్డింగ్ పైన వున్న ఒక ఇంట్లో వుంటాడు . వెళ్లగానే మనకి హాస్పటల్లో ఎమి చెప్తారో చూసి అక్కడకి దగ్గరలో హోటల్ తీసుకోవచ్చు” .
అయ్యో! తనకి ఇబ్బందేమో అంటే ప్రసాద్ ” ఏం పరవాలేదు వాడు ఒక్కడే వుండేది ఇబ్బందేం వుండదన్నాడు . నేనూ వస్తాను మీతో అని ప్రసాద్ మాతో బయలుదేరాడు .
మే ముగ్గురం మద్రాసులో దిగాం . స్టేషన్ కి ప్రసాద్ తమ్ముడు చిన్న ప్రసాద్ వచ్చాడు . అక్కా అంటూ ఆప్యాయంగా పలకరించాడు .
నేను అప్పటివరకు చిన్నప్పుడు బెంగుళూరు తప్ప ఏ రాజధానీ చూడలేదు . నాకు మద్రాసులో  పెద్దరోడ్లూ రోడ్ల మధ్యన అందంగా పెంచిన మొక్కలూ విపరీతంగా వున్న ట్రాఫిక్ చూసి మహా నగరం ఎట్లా వుంటుందో అర్ధమైంది.
ఆటోలో సెంట్రల్ నుంచి మైలాపూర్ కి బయలుదేరాం  . ఆటో ఒక బిల్డింగ్ ముందు ఆగింది .
బిల్దింగ్ మేడమీదకి మెట్లు వున్నాయ్ .
ఆ మెట్లెక్కి పైకి వెళ్తే కొబ్బరాకులతో వేసిన పందిరి ఆ వెనుకే ఒక రేకులు దించిన ఇల్లు ఒకటే పెద్ద గదిలాగా పొడుగ్గా వుంది , ఆ వసారాలో ఒక పక్కగా చిన్న వంటిల్లు .
మేం పైకి వెళ్లగానే తెల్లగా పొట్టిగా వున్న ఒకాయన ఎదురొచ్చాడు . ” రాండి రాండి ! అంటూ తలుపు తీశాడు .
ఆయనే పారశివ .
మద్రాస్ కి తెలియని దిగులుతో అడుగు పెట్టిన మాకు పారశివ ఆత్మీయం నిండిన పిలుపు తెలియని బలాన్నిచ్చింది .

వచ్చే సంచికలో పారశివ కధ

షర్మిలా కోనేరు

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు