మౌనానికి సాక్షి కుందేరు నది

“కుందేరు సాక్షిగా” ఒక సాధారణ కథను అసాధారణ అనుభూతిగా మార్చిన నవల. ఇది గ్రామీణ భారత సమాజంపై ఒక గంభీర వ్యాఖ్య. ఆలోచన కోసం చదవాల్సిన రచన.

సాహిత్యమంటే కేవలం కథ చెప్పడం మాత్రమే కాదు అది కాలాన్ని ప్రశ్నించాలి, సమాజాన్ని నిలదీయాలి, పాఠకులను అసౌకర్యానికి గురి చేయగలగాలి. ఆ కోణంలో చూస్తే “కుందేరు సాక్షిగా” నవల ఒక లోతైన ప్రశ్నను మన ముందుంచుతుంది. కొన్ని రచనలు శబ్దంతో ముందుకు వస్తాయి, మరికొన్ని రచనలు మౌనంతో మనసులోకి ప్రవేశిస్తాయి. ఆ రెండవ కోవకు చెందినదే ఈ నవల. ఇది మౌనంగా నిలబడి సాక్ష్యంగా మిగిలిపోయిన జీవితాల కథ.

నవల ఆరంభమే ఒక అశాంతికర వాతావరణాన్ని సృష్టిస్తుంది. బాలయ్య–సింహాద్రి పాత్రల ద్వారా దిగువ తరగతి జీవితంలోని అస్థిరత, మద్యం, పేదరికం, అనిశ్చిత భవిష్యత్తు స్పష్టంగా ఆవిష్కృతమవుతాయి. ఈ వ్యక్తిగత కథ క్రమంగా సామూహిక కథగా విస్తరిస్తూ, పాఠకులను మెల్లగా రాయలసీమ గ్రామీణ రాజకీయ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.

క్రిష్టిపాడు గ్రామంలో నరసింహస్వామి దేవాలయంలో జరిగే దొంగతనం, విగ్రహ భగ్నం కథకు కీలక మలుపు. దేవాదాయ భూముల వేలం, రాజకీయ నాయకుల కుట్రలు, అధికారుల మౌనం… ఇవన్నీ కలసి గ్రామీణ రాజకీయాల అసలైన ముఖాన్ని బయటపెడతాయి. ఇవన్నీ సమాజంలో సహజంగా జరిగే ఘర్షణల తాలూకూ ప్రతిబింబాలు. గ్రామంలో పెద్దలమనే పేరుతో చలామణి అవుతున్న పాత్రలు కేవలం వ్యక్తులు కాదు, గ్రామ రాజకీయాల స్వభావాన్ని సూచించే ప్రతీకలు. దేవాలయంలో విగ్రహం విరిగిన సంఘటన కంటే, ఆ సంఘటనను చుట్టుముట్టిన రాజకీయ లెక్కలే భయంకరంగా అనిపిస్తాయి. దేవుడు పడిపోతే భక్తి కదలాలి కానీ ఇక్కడ పడిపోతుంది మాత్రం ప్రజల భద్రత, నమ్మకం. దేవదాయ భూముల వేలం, అధికారుల మౌనం, పోలీసుల జేబులు… ఇవన్నీ కలసి ఒక వ్యవస్థాగత నేరాన్ని నిర్మిస్తారు ఆ ఊరి పెద్దలు. దొంగతనాన్ని కూడా ఒక రాజకీయ సాధనంగా మార్చుకున్న వ్యవస్థ ఇందులో కనిపిస్తుంది.

ఇందులోని గ్రామ పెద్దల మధ్య ఉన్న రాజకీయ వైరం వ్యక్తిగత శత్రుత్వం కాదు,  అధికారామనే ఆకలికి ప్రతిరూపం. గ్రామ పెద్దల్లో ఎవరు గెలిచినా ఓడేది మాత్రం ఆ గ్రామంలోని సాధారణ మనుషులే. పనులు పోయిన కూలీలు, భయంతో మౌనంగా ఉండే రైతులు, నిస్సహాయ స్థితిలో ఆ ఊరి జనాలు… ఇలా ఇద్దరి మధ్య అహంకార పోరులో ఆ గ్రామం మొత్తం శిక్ష అనుభవించేలా చేస్తారు. అధికారమంటే సేవ కాదు, అది భూమి, భయం, భక్తిని కలిపిన వ్యాపారం అనే చేదు నిజాన్ని రచయిత నేరుగా కాకుండా సంఘటనల ద్వారా చూపిస్తారు.

గ్రామాల్లో ఏ సంబరాలు జరిగినా కచ్చితంగా ఉండేది రికార్డింగ్ డాన్స్ ప్రోగ్రాం. ఆ కళాకారుల జీవితాలు ఎంత సున్నితంగా ఉంటాయో, వాళ్ళు ఏ ఊరెళ్తే ఆ ఊరి పెద్దల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడతారో అందరికీ తెలిసిందే. రికార్డింగ్ డాన్స్ కళాకారులంటే చిన్నచూపు చూసే జనాల మధ్య, ఆ కళాకారులకూ ఒక గౌరవం ఉంటుందని గట్టిగా చెప్పగలిగినవాడు ప్రభాకర్. అటువంటి రికార్డింగ్ డాన్స్ కళాకారిణి శ్రావణి జీవితం క్రిష్టిపాడులోని ప్రభాకర్తో ముడిపడటం, అది ప్రేమగా మారటం, ఆ తరువాత అది ఎంత తీవ్రం రూపం దాల్చుతుందో చదివే పాఠకులకు బాధ కలగక మానదు.

ప్రభాకర్ పాత్ర ఈ నవలలో అత్యంత బలమైన మానసిక చిత్రణ. ఆ పాత్ర చివరి దాకా ఒక రహస్యంలా ఉంటుంది. పన్నెండేళ్ల జైలు జీవితం అతనిలో సృష్టించిన నిశ్శబ్దం, అపరాధభావం లేకపోయినా శిక్షను స్వీకరించిన ధైర్యం, అతను మాట్లాడకపోవడం కూడా ఒక రకమైన ప్రతిఘటనేనని అనిపిస్తుంది. జైలు జీవితం తరువాత బయటకు వచ్చినా, అతని మౌనం, అతడు మోస్తున్న అంతర్గత భారం ఇవన్నీ రచయిత చాలా ప్రభావవంతంగా చిత్రించారు. అతడు చేసిన నేరం కంటే, అతడు మౌనంగా భరిస్తున్న శిక్షే పాఠకులను కుదిపేస్తుంది. “తప్పు చేశానని ఒప్పుకోను, కానీ శిక్ష అనుభవిస్తాను” అన్న అతని వైఖరి న్యాయం, నైతికతలపై ప్రశ్నలు వేస్తుంది.

నవలలోని భాష గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాయలసీమ మాండలికాన్ని రచయిత ఒడిసి పట్టుకున్నాడు. ముఖ్యంగా కర్నూలు – నంద్యాల మాండలికాన్ని ఇందులో వాడారు. రాయలసీమ యాసే నవలకి ప్రాణం. ఆ యాస లేకపోతే ఈ కథ సగం బరువు కోల్పోయేదే. నవల ఆసాంతం మాండలికం లేకున్నా అవసరం మేరకు పాత్రలతో యాసని పలికించారు. సీమ యాస అలవాటులేని పాఠకులకు ఇదేమి ఇబ్బంది కలిగించక పోగా, యాసలో చదవటం మూలానా ఆ ప్రాంతపు వాతావరణాన్ని సజీవంగా చూస్తున్న అనుభవం కలుగుతుంది.

ఇది అందరినీ మెప్పించాలనే ఆత్రుతతో రాసిన రచన కాదు. తన అనుభవాన్ని, తన దృక్పథాన్ని నిజాయితీగా ఉంచిన రచన. కథనంలో ఉత్కంఠ కంటే లోతు ఉంది. సంఘటనల కంటే పరిస్థితుల బరువు ఎక్కువ. నవల చదువుతున్నంతసేపూ రచయిత తన పరిసరాలను గమనించి, అనుభవించిన జీవితాన్ని అక్షరాలుగా మలిచాడన్న భావన కలుగుతుంది. భావానికి అవసరమైనంత మాత్రామే భాష ఉంటుంది. పాత్రలు మాట్లాడేటప్పుడు కన్నా, మాట్లాడని సందర్భాల్లోనే ఎక్కువగా తమ అంతరంగాన్ని బయటపెడతాయి. ఈ మౌనం ఈ నవలకి ఒక ప్రత్యేకమైన బలం.

ఒక ఊరు, ఒక దేవాలయం, ఒక నది, కొన్ని నేరాలు వీటన్నింటికీ నిశ్శబ్ద సాక్షిగా నిలిచే “కుందేరు” ఈ నవలకి కేవలం భౌగోళిక నేపథ్యం మాత్రమే కాదు, అది సమాజపు అంతఃసాక్షి. కుందేరు నది ఈ కథలో ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది .వరదలోనూ, ప్రశాంతతలోనూ. మనుషుల జీవితాల్లో జరిగే పాపాలు, కుట్రలు, ద్రోహాలు చూసినా అది స్పందించదు. అదే ఈ నవల తాత్పర్యం. ప్రకృతి నిష్పాక్షికం, తీర్పు చెప్పేది కాలం మాత్రమే. కుందేరు ప్రవాహం లాగానే సమాజం కూడా ముందుకు సాగిపోతుంది, బాధితులను వెనుక వదిలేసి. న్యాయం పూర్తిగా జరగదు, నిజం పూర్తిగా బయటపడదు. నది మాత్రం ప్రవహిస్తూనే ఉంటుంది.

“కుందేరు సాక్షిగా” ఒక సాధారణ కథను అసాధారణ అనుభూతిగా మార్చిన నవల. ఇది గ్రామీణ భారత సమాజంపై ఒక గంభీర వ్యాఖ్య. ఆలోచన కోసం చదవాల్సిన రచన. ఇప్పటి కాలంలో వేగంగా చదివి, వేగంగా మర్చిపోయే కథలూ, నవలల మధ్య “కుందేరు సాక్షిగా” గట్టిగా నిలబడ గల సామర్థ్యం ఉన్న నవల. చదివిన తరువాత వెంటనే మరిచిపోలేం. కొన్ని దృశ్యాలు, కొన్ని పాత్రలు, కొన్ని వాక్యాలు, కొన్ని మౌనాలు మన వెంట నడుస్తూనే ఉంటాయి. తెలుగు సాహిత్యంలో సామాజిక స్పృహ కలిగిన నవలల జాబితాలో ఈ పుస్తకం తప్పకుండా నిలుస్తుంది.

మనుషులు చేసిన పాపాలకు, మోసాలకు, రాజకీయాలకు నిశ్శబ్దంగా సాక్షిగా నిలిచిన ప్రకృతి కథ ఇది.

కుందేరు సాక్షిగా (నవల) – సురేంద్ర శీలం

ఆన్వీక్షికి ప్రచురణ

162 పేజీలు

₹ 180

అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాల్లో లభ్యం

అమెజాన్ లింక్ – https://amzn.in/d/itR5xe8

అజహర్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు