మూడు తరాల తండ్లాట!

మూడు తరాలకు చెందిన అనుభవాన్ని, రెండు తరాలకు సరిపోయిన జీవిత మూల్యాలను, ఒక తరానికి అవసరమైన జీవితపు చూపును అందించిన కథ ఇది.

నిజాం కాలం నాటి వెట్టిచాకిరీ రక్తపునదిలో ముంచి తీసిన ఒక బలహీనపు వెన్నుపూస, దిగువ మధ్య తరగతి చేనేత కుటుంబంలోని ఒక బీస్ నంబర్ నూలుపోగు జీవితపు తన్లాట,  ఈ కాలపు అమ్మాయి ఆత్మ గౌరవపు ముందడుగు ఈ మూడు తరాల జీవిత వైశాల్యం అంతా ఒక మోచేతి దెబ్బ తాలూకు నరం నొప్పి లాంటి నొప్పితో ఒళ్ళు గగుర్పొడిచేలా సాగిన కథ రామా చంద్రమౌళి రాసిన ‘ఒక నది… రెండు తీరాలు’. ఈ కథ ఆంధ్ర జ్యోతి నవ్య వీక్లీ – రచయిత బి. వి. రమణారావు సంక్రాంతి కథల పోటీలో ఐదు వేల రూపాయల బహుమతిని పొంది అదే వీక్లీలో 14 ఫిబ్రవరి 2018న ప్రచురింపబడింది. నిజానికి ఒక నవలంతటి పెద్ద కాన్వాస్ మీద రాయాల్సిన కథను రచయిత కొన్ని పేజీలకే కుదించి చాలా గాఢంగా రాశారు.

శతాబ్దాల పూర్వం నుండి 1970ల దాకా తెలంగాణ అంతటా ‘బాంచెన్ నీ కాల్మొక్కుతా’ అనే బానిస జీవితమే పర్చుకొని ఉంది. నిజాం పాలకుల కాలంలో ఈ పరిస్థితి తారా స్థాయికి చేరింది. గ్రామాల్లో అన్నీ కులాలు నిర్భందపు వెట్టిచాకిరీ కింద నలిగి పోయినవే. అయితే ఒక చేనేత కుటుంబ కోణం నుండి ఈ కథ నడుస్తుంది. కథా కాలం ఏడు దశాబ్దాలు. దొరలు, పటేండ్లు, దేశముఖ్ లు, దేశాయిలు, రజాకార్లు, భారత యూనియన్ సైన్యం అమాయక ప్రజలపై సాగించిన చిత్రహింసలు, దోపిడిని వర్ణించడం ఏ భాషకూ సాధ్యం కాదు. అంతటి నిర్భంధాన్ని సవాలు చేసి నిజాం ప్రభుత్వాన్ని, రజాకార్లను ఎదిరించి నిలబడ్డ సంస్థ ‘ఆంధ్రమహాసభ’ (సంగం – 1921) దీని ఆధ్వర్యంలోనే రైతులు సాయుధ పోరాటానికి తెర లేపారు.

ఈ పోరాటంలో సుమారు 4500 మంది వీరులు మరణిచడం ఒక మరచిపోని విషాధచరిత్ర. సంగంలో చేరినా, సంగంకు లోలోపల సహకరించినా వాళ్ళకు  అమానవీయమైన శిక్షలు విధించి రాక్షసానందాన్ని పొందేవారు. భర్తల ముందే భార్యలను చెరచడం, భార్యల ముందే భర్తలను చిత్రహింసలకు గురి చేసి చంపడం పులి కుందేలును చంపినంత సులభం వారికి. అయినా ప్రజలు ఉద్యమకారులను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నారు. (ఈ కోణంలో చాలా కథలు వచ్చాయి. అలా వచ్చిన వాటిలో పి. వి. నరసింహారావు రాసిన ‘గొల్ల రామవ్వ’ కథ చాలా ప్రసిద్ధి పొందింది.) రజాకారులు, జమీందార్లు, దొరలు పైశాచికత్వంతో పెట్టిన హింసలను ఈ  రచయిత ఒళ్ళు గగుర్పొడిచేలా వర్ణించారు ఈ కథలో. మల్లయ్య అనే ఒక సంగం సభ్యునికి ఎలాంటి శిక్ష విధించారో చదివితే దేహంలో రక్తం వేల మైళ్ళ వేగంతో పోటెత్తుతుంది. సూది దారంతో నాలుకను, కొండ నాలుకను  కలిపి కుట్టేసిన తరువాత నోరంతా, నెత్తురు, చొంగా కారుతుంటే నడవలేని, మాట్లాడలేని పరిస్థితిలో అతని భార్య (రాజవ్వ), భర్తతో పాటు  ఊళ్లోని ఇల్లిళ్లూ తిరిగి “నా మొగని చావుకు ఒక కట్టే ఇవ్వుండ్లయ్యా” అని అడిగి ఊరి చావడి మధ్య తన భర్త చితిని తానే పేర్వడం ఎంత నరకం? అట్లా ఆ రాత్రంతా చిత్రవధ అనుభవించిన తరువాత తెల్లవారి ఆ మల్లయ్యను తుపాకితో కాల్చి పారేస్తారు. గాలిలో అంతెత్తు ఎగిరి దబ్బున కింద పడతాడు మల్లయ్య. ఇంకా చావక పోతే కొన ప్రాణం ఉండగానే చెత్త బస్తాను విసిరేసినట్టు అతడిని ఆ చితిపైకి విసిరేసి కిరోసిన్ పోసి తగులబెడుతారు. ఇది తెలంగాణ పల్లెల్లో ఆనాడు ఏ గ్రామంలోనైనా కనిపించే అతి సాధారణ దృశ్యాలకు ఒక మచ్చు తునక.

రెండవ తరంలో మల్లయ్య కొడుకు శివయ్య తండ్రి వద్ద నేర్చుకున్న కుల వృత్తిని చేసుకుంటూ బతుకు వెళ్లదీస్తాడు. నడుము లోతు మగ్గం గుంటలో, మెడలోతు బీదరికంలో మునిగిపోయి అతి బలవంతంగా కూతురు రేవతిని పై చదువులు చదివిస్తాడు. మూడవ తరంలో ఆమె ఉన్నత చదువులు చదివి అందరిలా జీవిస్తూ, అందరిలా మరణించడం కాకుండా అందరి కంటే భిన్నంగా ఏదో సాధించాలని కలలు కంటుంది. ఈ క్రమంలో రేవతి నానమ్మ రాజవ్వ మనుమరాలుకు ఒక విలువైన జీవిత సూత్రం చెబుతుంది. “బిడ్డా! జీవితంలో ఏ పని చేసినా, ఆ పనిని నీ కంటే ఉత్తమంగా, నీ కంటే గొప్పగా ఇంకెవరూ చేయలేనట్లుగా చేయి. గంతే, జీవితంలో దేన్నైనా నువ్వు సాధించుకుంటూ ముందుకు వెళ్తావు.” అంటుంది.

అనుకున్నట్టుగానే రేవతి ‘ధైర్యంతో కూడిన సాహసం, అలసట ఎరగని నిజాయితీతో కూడిన కృషి, గెలుపుపైన విశ్వాసం’ ఉన్న కొంత మందితో కలసి ‘సమూహం’ అనే సంస్థను స్థాపిస్తుంది. ఈ సంస్థ ‘మన మూలాలను పునరన్వేషిస్తూ ఇప్పటి తరం విస్మరించిన మన మహోన్నత గతం నుంచే ఈ లోక కళ్యాణం కోసం మరో కొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తుంది. అలా హార్ట్ ఎటాక్ ను ముందే గుర్తించే యంత్రాన్ని, తుఫాన్లు, హరికేన్లను ముందే గుర్తించే విధానాలను, సేంద్రీయ ఎరువుల ద్వారా పంటలు పండించే పద్ధతులను కనుగొంటారు. ఒకానొక సమయంలో ‘సమూహం’ కు సి. ఇ. ఓ హోదాలో ఇటీవల హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ లో పాల్గొని ప్రసంగిస్తుంది. విజయ పథంలో దూసుకు పోతుంది. ‘ఒక వ్యక్తిగా తన సంపదను పెంచే ఆవిష్కరణలు ఒట్టి ఆనందాన్ని మాత్రమే ఇస్తాయి. కానీ మానవ కళ్యాణానికి ఉపకరించే ఏ సాధనమైనా మనిషికి సార్థకతను కూర్చి అమరత్వాన్నిస్తుంది.’ అని కథ ముగిసిపోతుంది.

ఈ మొత్తం కథలో ప్రధాన పాత్రలు నాలుగే. అయినా మూడు తరాలకు చెందిన అనుభవాన్ని, రెండు తరాలకు సరిపోయిన జీవిత మూల్యాలను, ఒక తరానికి అవసరమైన జీవితపు చూపును అందించిన కథ ఇది. తెలంగాణ సాయుధ పోరాట ఘోరకలితో మొదలైన కథ చివరకు ఒక తెలంగాణ చేనేత కుటుంబ యువతి ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సభలో పాల్గొనడంతో ముగుస్తుంది. తెలంగాణ ప్రజల జీవితం పొడుగూతా ఎంత సంక్షోభం ఉంటుందో ఈ కథ చదివితే అర్థం అవుతుంది. కత్తుల వంతెనలాంటి సంక్లిష్టతల్ని తోసిరాజని జీవితాన్ని ఎలా గెల్చుకోవాలో కూడా ఈ కథ చెబుతుంది. కథలో శిల్ప పరంగా పెద్దగా ప్రయోగాలు లేకున్నా కథా వస్తువు మన దృష్టిని ఆ వైపు పోనీయదు. అయితే కథా వాతావరణాన్ని కల్పించే నెపంతో కథ పాతిక  భాగం  ఉపన్యాస ధోరణిలో సాగుతుంది. చారిత్రక నేపథ్యం ఉన్న కథ కావడం మూలాన అది తప్పలేదేమో! దీనికి బదులుగా మరి కొన్ని సన్నివేశాల కల్పన ద్వారా ఆ వాతావరణాన్ని రాబడితే బావుండేది.

కానీ కథకుని విజయమంతా జీవితాన్ని ఉన్నదున్నట్టు కథీకరించడంలో దాగి ఉందనిపిస్తుంది. రచయిత సీనియర్ కథా రచయిత కావడం వలన ఆయనకున్న అపారమైన జీవితానుభవం, రచనానుభవం నుంచి ఎన్నో జీవిత సత్యాలను చాలా అలవోకగా చెప్తాడు. కొన్ని కథలు భూమికి రెండు అడుగుల ఎత్తు మీద నడుస్తాయి. కొన్ని ఒకడుగు ఎత్తు మీద నడుస్తూ పాఠకునికి ఆందీ అందకుండా తప్పించుకుంటాయి. కానీ ఈ కథ నేల మీద నడిచే కథ. ఒక సౌకర్యవంతమైన ప్రపంచాన్ని కలగనే కథ. ఈ కథ చదవడమంటే తెలంగాణ భూత, వర్తమాన, భవిష్యత్ లను అనుభూతించడమే. అవడానికి ఇదొక్క కుటుంబానికి చెందిన కథే అయినా ఇది తెలంగాణ సమాజం మొత్తాన్ని ప్రతిబింబించే కథ. చివరాఖరికి ఇదొక చరిత్ర శకలం. జీవితపు గాజు పలక. తెలంగాణ పోరాట వారసత్వాన్ని, ఆ అగ్నిగోళపు సెగను మన హృదయాలకు రుచి చూపించే ఒక నిప్పుల కుంపటి.

బొమ్మలు: బాలి

*

శ్రీధర్ వెల్దండి

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

17 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • మంచి కథపై మంచి విశ్లేషణ. ‘ నవ్య ‘ లో బహుమతి పొందిన కథగా వెలువడినప్పుడే చాలామంది పాఠకుల ఆదరణను పొందిన కథ ఇది. ఇప్పటి తరానికి తెలియని చారిత్రాత్మక ‘ తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం ‘ నాటి హింసాత్మక స్థితిగతులను కళ్ళకు కట్టినట్టు ఈ తరానికి తెలియజేసిన రచయితా రామా చంద్రమౌళి గారికి ధన్యవాదాలు.
  పునః ప్రయాణం ప్రారంభించిన మా ‘ సారంగ ‘ కు స్వాగతం.
  కథపై చక్కని విశ్లేషణ నందించిన వెల్డండి శ్రీధర్ గారికి అభినందనలు.

  – సి. నరసింహారావు , హనుమకొండ

 • సర్ నాకు ఒక సందేహం అప్పుడు తెలంగణ రైతాంగ పోరాటం మొత్తం తెలంగాణలోనే కదా మరి దానికి ఆంధ్రమహా సభ అని ఎందుకు పేరు పెట్టారు సర్

 • జీవితంలో ఏ పని చేసినా, ఆ పనిని నీ కంటే ఉత్తమంగా, నీ కంటే గొప్పగా ఇంకెవరూ చేయలేనట్లుగా చేయి. గంతే, జీవితంలో దేన్నైనా నువ్వు సాధించుకుంటూ ముందుకు వెళ్తావు.బాగుంది శ్రీధర్ బాయ్

 • మంచి సమీక్ష శ్రీధర్ వెల్దండి సార్. కథ, నేపథ్యం రజాకర్ల కాలంలో తెలంగాణ జీవితం ఉన్నది ఉన్నట్లు సమీక్షించారు.

 • కథా విశ్లేషణావిధానం
  బాగుంది
  రచయిత హృదయాన్ని ఆవిష్కరించిన విమర్శనా ధోరణి బాగుంది

 • తర తరాలుగా తెలంగాణ సమాజం అణచబడుతున్నప్పటికీ తిరిగి ఉత్తుంగ తరంగమై ఎగిసి పడుతుందనడానికి నిదర్శనం కథలోని మూడు తరాల మార్పులు . .విశ్లేషణావిధానం
  బాగుంది
  రచయిత హృదయాన్ని ఆవిష్కరించిన విమర్శనా ధోరణి తో సాగిన సమీక్ష అందించిన వెల్దండి శ్రీధర్ అభినందనియుడు

 • తర తరాలుగా తెలంగాణ సమాజం అణచబడుతున్నప్పటికీ తిరిగి ఉత్తుంగ తరంగమై ఎగిసి పడుతుందనడానికి నిదర్శనం కథలోని మూడు తరాల మార్పులు .

  రచయిత హృదయాన్ని ఆవిష్కరించిన విమర్శనా ధోరణి తో సాగిన సమీక్ష అందించిన వెల్దండి శ్రీధర్ అభినందనియుడు

 • తెలంగాణసాహితీ వనమున విరిసిన సుమమై
  కథారచనలో చేయితిరిగిన కథకుడిగా సంకలనకర్తగా,కథాసమీక్షలో సుస్థిరస్తానాన్ని పదిలపరుచుకుటున్న డా;వెల్దడి శ్రీధర్ గారికి అభినదనలు

 • తెలంగాణా సాయుధ పోరాటపు నేపధ్యాన్ని ఉపోద్ఘాతంలా చెప్పినా తరువాతి హింస సంఘటనల చిత్రీకరణ సహజంగా ఉండి చదివించింది, వళ్ళు జలదరించేలా చేసింది. రచయితకు అభినందనలు. “ఇది తెలంగాణ పల్లెల్లో ఆనాడు ఏ గ్రామంలోనైనా కనిపించే అతి సాధారణ దృశ్యాలకు ఒక మచ్చు తునక.” అన్నారు శ్రీధర్.

  దానితో పోలిస్తే రేవతి ఉపన్యాసం తేలిపోయింది. మధ్యలో మగ్గంమీద నెయ్యడం గూర్చి కొంచెం వివరాలున్నాయి గానీ, రేవతి వరకూ వచ్చేసరికి ఆమెని పూర్తిగా సందేశాత్మక పాత్రగా చిత్రీకరించడంవల్ల కథ కృతకతని బాగా సంతరించుకుంది. దానికి పరాకాష్ఠ, ఆమె గుండెపోటుని ముందుగా కనుక్కోగలిగిన ప్రతిభాశాలి మాత్రమే గాక సునామీలనీ, టోర్నడోలనీ గూడా మళ్లించగల శక్తిని కూడా చేతిలో పెట్టుకోగలగడం.

  సందేశాత్మకతకు తోడు, “మాకు ఒక స్పృహ ఉంది. ఈ ప్రపంచానికితెలియని ఎన్నో ఎన్నో సృష్టి రహస్యాలనూ తమ అపూర్వ మేధోసంపత్తితో, సాధనతో జ్ఞానంరూపంలో అందించిన పుణ్యభూమి భారతదేశానికి చెందిన వాళ్ళం మేము. అన్న స్పృహ అది.” అని ఉటంకించిన దేశభక్తి ఈ కథకి బహుమతి అర్హతని చేకూర్చి ఉంటుంది.

  కృతకత లేని చోట మొదలయిన కథనం అక్కడితోనే ఆగిపోయిఉంటే బావుండే దనిపించింది. లేదా, శ్రీధర్ గారన్నట్లు నవలగా మార్చి ఉంటే రేవతి పాత్ర ఎదుగుదలని రచయిత చెప్పడంలా కాక చూపించేలా చెయ్యడానికి ఆస్కారం ఉండేది.

 • కచ్చీరు అన్న పదం నిఘంటువులో దొరకలేదు. అర్థం తెలుపగలరా?

  • It’s nothing but a place where official decision are taken.
   Kacheree
   Munasabu gaari kacheree,
   Graama kacheree,
   Colecter gaari kacheree
   Etc

   • ధన్యవాదాలు. కచేరీ – విన్నాను “పాట కచేరీ” వాడుకలో. కచ్చీరు – దానికి సంబంధించినదే అనుకున్నాను.

 • చాల గొప్ప కథను పరిచయం చేసినందుకు శ్రీధర్ గారికి ధన్యవాదాలు ,సారంగకు కృతఙ్ఞతలు . శ్రీధర్ గారు మునుముందు ఇంకా మంచి మంచి కథలను పరిచయం చేస్తారని ఆశిస్తున్నాం .
  దయచేసి కథ లింక్ గాని లేదా కథను ను కూడా పెడితే చాలా మంది చదివుకొనే అవకాశం కల్పించిన వారవుతారు
  .
  సారంగకు మనవి …..దయచేసి ఏ కథ గురించి రాసిన ఆ ఒరిజినల్ కథను కూడా పెడితే మాలాంటి వారికి గొప్ప మేలు చేసినవారవుతారు . దయచేసి ఆలోచించండి .

  మన్నె ఏలియా
  ఆదిలాబాద్

 • మంచి కథా పరిచయం..
  శ్రీధర్ కంగ్రాట్స్…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు