తల నిండా ఆకులు

ఇప్పుడేముంది
కనపడని ఉమ్మెత్తకాయల ముళ్లు
ఒళ్లంతా గుచ్చుకుంటే -
ఎక్కడో ఏదో కదిలి, పగిలి...

1

తల నిండా ఆకులు

తల నిండా ఆకులు
నేను ఏ చెట్టు కింద నడిచి రాలేదు,
కానీ తల నిండా ఆకులు
తల ఆకుల పింఛంలా –

మూసీనది ఒడ్డున రకరకాల
రంగుల బుట్టలు తయారు చేసినట్టు
నా తల ఆకులతో చేసిన బుట్ట అయినట్టు –
పచ్చపచ్చని వాసన గదంతా అల్లుకుని ;
మనిషిలో ఒక చెట్టుందేమో
అదిలా చిగురించిందేమో
విరబూసిందేమో –

ఆకుల గలగలలు వినిపిస్తున్నాయి
మబ్బులన్నీ నా తలని తాకి వెళుతున్నట్టు
లోలోపలెక్కడో
వేళ్లు కదిలిన జాడ
నీళ్లు పారిన జాడ –

గుంపులు గుంపులుగా
పిట్టలొస్తున్నట్టుంది
గూళ్లు కట్టుకుంటాయేమో
నేను నడుస్తుంటే
మనిషి నడిచినట్టులేదు
చెట్లు నడిచివచ్చినట్టుంది

మనుషులు చెట్లయితే
చెట్లు మనుషులయితే
ఎంత బాగుండు
లోకమెంత పచ్చగా వుంటుందో
ప్రపంచమెంత మిసిమిలీనుతుందో

తల నిండా ఆకులు
ఆకుల నిండా నేను –

*

2

ఉమ్మెత్తకాయ పద్యం

చిన్నప్పుడు
ఉమ్మెత్తకాయలెగరేసి, గుప్పిట మూసి
తలకిందులుగా దాని కిందపెడితే –
మళ్లగదలా వున్న కాయ దూకినప్పుడు
గుప్పిట వెనకాల చేతినిండా
చిన్న చిన్న రక్తం మొలకలు
విదిలిస్తే ఒకదాన్నొకటి రాసుకుని
చేతి వెనకాల రక్తం అలికినట్టు –
నొప్పి వున్నా బాల్యంలో అదొక ఆనందం

ఇప్పుడేముంది
కనపడని ఉమ్మెత్తకాయల ముళ్లు
ఒళ్లంతా గుచ్చుకుంటే –
ఎక్కడో ఏదో కదిలి, పగిలి
సన్నని ధారగా లోలోపల అల్లుకుని
ఒక్కసారిగా కాకులు గుంపుగా
చెట్లమీంచి లేస్తాయి,
ఏదో పాడుకుంటూ
నలుదిక్కులకేసి ఎగిరిపోతాయి

కాలు విరిగిన కుక్కపిల్ల పద్యం, కదల్లేదు –

కళ్లు రెండూ
ఎర్రబారిన రెండు ఉమ్మెత్తకాయలు –

ఉమ్మెత్తకాయ, పిడికిలి,
కాకి, కుక్కపిల్లా, నేను –

*

చిత్రం: సత్యా సూఫీ 

శివారెడ్డి

కవిత్వంలో సామూహిక స్వర మేళా శివారెడ్డి. మన ముందు నిలిచిన అక్షర జ్వాలాకేతనం. కవిత్వానికి తానే "భారమితి"గా మారిన అరుదైన సన్నివేశం.

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • గురువుగారికి నమస్సులు…
    మంచి కవితనిచ్చినందుకు
    ధన్యవాదాలు…..

  • మనుషులు చెట్లయితే
    చెట్లు మనుషులయితే
    ఎంత బాగుఃడు
    లోకమెంత పచ్చగా ఉంటుందో..

    గురువు గారి కవిత అధ్భుతం..

  • ‘కవిత్వం చేయటానికి పెద్ద పెద్ద వస్తువులేం అక్కర్లేదు.. చిన్న కదలిక చాలు – కళాత్మకతంగా మలచొచ్చు’ అంటారు శివారెడ్డి గారు. నిజమే.

    ఈ రెండు కవితల్లో ఏకసూత్రత వుంది. తల నిండా ఆకులను వూహించిన కవి – మనుషుల్లో ఆకుపచ్చని తనాన్ని ఆహ్వానించిన కవి – ఉమ్మెత్తకాయ పద్యం కవితలో సాధారణ నిత్య జీవితంలో కనిపించని ముల్లును గురించి మాట్లాడతాడు. కవి కరుడుగట్టిన ఆశాజీవి కనుక ఎక్కడా తొణకలేదు. కవే అంటారు – నేను రాయిలాంటివాణ్ణి.. ఎన్ని అలలొచ్చి మోదినా కదలను అని. యేబ్భైయేళ్ల తర్వాత శివారెడ్డి గారి జీవితపు ఆలోచనా శకాలాలీ పద్యాలు.

    అవును.

  • శివారెడ్డి గారి రెండు కవితలూ ఎంత బావున్నాయో, మిత్రుడు మౌళి విశ్లేషణ కూడా అంతే బావుంది.

  • మీ కవిత్వం యెప్పుడూ కొత్తగానే వుంటుంది సర్❤️

  • బాగున్నాయి రెండు కవితలూ -గురువు గారికి అభినందనలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు