మా ఇంట్లో క‌జ్జికాయ‌లు కాల్చేప్పుడు ఉంటాది నా సామీరంగ‌!

పండ‌గ‌యిపోయినాక ప‌దిరోజుల వ‌ర‌కూ అంద‌రి జోబీల్లో, స్కూలు బ్యాగుల్లో, ప‌నికెళ్లిన చోట టిపెన్ల‌ల్లో క‌జ్జికాయ‌లుండేవి.

ఆదివారం నాగుల చ‌వితి సంద‌ర్భంగా

నాగుల చ‌వితి పండ‌గంటే నాకిష్టం. ఈ పండ‌గ‌ని మేం క‌జ్జికాయ‌ల పండ‌గ‌ని కూడా పిలుచ్చాం.  క‌జ్జికాయ‌ల పండ‌గంటే మాకు పాణం. ఓ ఎమోష‌న్  అనాల‌. నాగ‌ల‌చ‌వితి కంటే ప‌దిరోజుల‌కు ముందే హ‌డావిడి మొద‌ల‌య్యేది. షావుకార్ల‌యితే పండ‌క్కి ఇర‌వై రోజుల‌ముందే క‌జ్జికాయ‌లు, అప్ప‌లు, ల‌డ్లు, కారాలు సేచ్చాండ్రి. మ‌ధ్య‌త‌ర‌గ‌తోళ్లు, బీదాబిక్కీ పండ‌క్కి వారం ముందు ఉషారైతాండ్రి.  పండ‌గ వార‌ముంద‌న‌గా ఎవ‌రింటికాడికి పోయినా క‌జ్జికాయ‌లు, ల‌డ్లు, అప్ప‌లు, కారాల వాస‌నే.  ఆ వాస‌న చూసి త‌ట్టుకోలేక *మ‌న‌మెప్పుడు క‌జ్జికాయ‌లు కాల్చుకుందామా .. నాయినా* అని అడిగేవాణ్ణి.  మాయ‌మ్మ కూలిప‌నికి పోయి వ‌చ్చినాక *ఎంత‌సేపు.. కజ్జికాయ‌లు కాల్చ‌డం* అంటాండె.  టాక్ట‌రు ప‌నికి పోయే మానాన సాయంత్రం పూట పండ‌క్కి వారం ముందు..  సిమాప‌ల్లెకు పోయి .. మాకు పండిన శెన‌గ‌వాల్లిచ్చి బ‌దులుగా పొప్పులు తీసుకోని.. మాయ‌మ్మ సెప్పిన ప‌కారం బోసు మ‌లిగ‌లో ప‌ట్టీక‌ట్టిచ్చాండె. గోధుమ‌పిండి, శెన‌గ‌పిండి, ల‌డ్డులోకి వేసుకునే ఎండుదాచ్చ‌,  క‌జ్జికాయ‌లు, అప్ప‌ల‌కోసం బెల్లం, శెన‌క్కాయ‌నూనె తెచ్చాండె.

క‌జ్జికాయ‌ల‌కోలాహలం మా వీధంతా, ఊరంతా ఉండేది. మా ఇంటిప‌క్క‌న గొల్లోల్లు, పీర‌మ్మ‌వ్వోళ్లు, ల‌చ్చుమ్మ‌వ్వ‌, మా ఇంటి ఎదురూగా ఉండే ల‌లిత‌మ్మ‌వ్వ‌, గొల్ల రోశ‌న్న‌గారు, దాస‌ప్ప‌గారు, వ‌డ్డివాళ్లు, చాక‌లోల్లు.. అంద‌రి ఇండ్ల‌ల్లోకి క‌జ్జికాయ‌లు అల్ల‌టానికి మాయ‌మ్మ ఎల్లేది. క‌జ్జికాయ‌ల్ని అందంగా చేత్తో అల్ల‌టంలో మా అమ్మ ఎక్సుప‌ర్టు. కొంద‌రు ఆడోళ్లు గోధుమ‌పిండితో పూరీమాద్రి తిక్కితే.. ఆ పూరీలో పొప్ప‌ల‌పిండి, బెల్లం క‌లిపిన పిండిని పెట్టి మూతేసేవారు. దాన్ని మా అమ్మ బాగా అల్లేది. ఆ ఇంట్లోవాళ్లు కాల్చుకునేవాళ్లు. వాళ్ల‌ప‌ని అయిపోయాక ఇంగొగ‌రింటికి.. ఇట్లా మా వీధంగా అంద‌రి ప‌నులూ అంద‌రూ పంచుకునేవాళ్లు. కాపోళ్ల‌యితే చ‌క్కెర క‌జ్జికాయ‌లు చేసేవాళ్లు. చిల్ల‌రోళ్లు బెల్లం క‌జ్జికాయ‌లు సేచ్చాండ్రి. క‌జ్జికాయ‌లు కాల్చినాక పిల్లోల్ల‌క‌ని ఎవుర‌న్నా నాలుగు క‌జ్జికాయ‌లు పెట్టిచ్చే మురిసిపోతాంటి.

మా ఇంట్లో క‌జ్జికాయ‌లు కాల్చేప్పుడు ఉంటాది నా సామీరంగ‌. పండ‌గే పండ‌గ‌. ఎగిరి గంతేచ్చాంటి. పొప్పులు ఇసురుతాంటి. మాయ‌మ్మ ఏం ప‌ని చెప్పినా కాద‌న‌కుండా ప‌రిగిత్త సేచ్చాంటి. *ఓమా.. మ‌నం క‌జ్జికాయ‌లు చ‌క్కెర‌యి చేచ్చాం* అంటాంటి. మాయమ్మ‌నా బాధ త‌ట్టుకోలేక ఎక్కువ బెల్లం క‌జ్జికాయ‌లు, రోన్ని చ‌క్కెర‌వి సేచ్చాండె. క‌జ్జికాయ‌ల్ని గోళంలో కాల్చాంటే కాలేక‌జ్జికాయ‌లు గ‌బ‌గ‌బా నాలుగైదు తింటాంటి. మాయ‌మ్మ‌కి మా ప‌క్కింటోళ్లు, కొంద‌రు ఫ్రెండ్సు సాయం సేచ్చాండ్రి. మాయ‌మ్మ ఓపిగ్గా క‌జ్జికాయ‌లు కాల్చి టోపీగిన్నెల్లో వేసేది. వేడి త‌గ్గినాక  నీటు చేసిన బాన‌లో వేసేది. దాన్ని ఇంట్లో ఇస‌క‌వేసి దానిపై జాగ్ర‌త్త‌గా పెట్టేది. రెండోరోజు.. అప్ప‌లు పాకం ప‌ట్టేది. సూప‌ర్సిత్తి తీసుకుని దానిపై బెల్లం అప్ప‌ల్ని త‌ట్టేది. పాకం కోసం అనంత‌మ్మ‌వ్వో, మాజేజో, ప‌ద్నావ‌త‌వ్వో సాయం తీసుకుండేది. అప్ప‌లు చేసి రెండు పెద్ద త‌పేలాల్లో వేసేది. మూడో రోజు ప‌ద్ద‌న్నే బుడ్డ‌కారాలు కాల్చ‌టానికి కారాల చిట్లు కోసం వేరే వాళ్లింటికిపోయి తీస‌క‌ర‌మ్మ‌నేది.  ఆ బుడ్డ‌కారాలను పెద్ద టోపీ గిన్నెలో పోసి బాగా చేత్తో న‌లిపి… దాన్ని చ‌క్కెర‌పాకంలోకి పోసేది.  దాన్ని ల‌డ్డు ముద్ద‌లు  చేసి ఆర‌బెట్టేది.  పొద్దు మైటాల‌కే కారాలు కాలుచ్చాండే.  క‌జ్జికాయ‌లు, అప్ప‌లు, ల‌డ్లు, కారాలు.. ఏమి చేసినా మాయ‌మ్మ దండిగానే చేసేది. ఇయ్య‌న్నీ చేసినాక మానాయిన‌తో మా అవ్వోళ్ల‌కు ఇమ్మంటాండె. అన్నీ పెట్టిచ్చే క‌ట్టెల‌బ్యాగులో మానాయిన పులింద‌ల‌కు పోయి ఇచ్చొచ్చేవాడు.

నాగుల‌చ‌వితికి వారం ముందు మా ఊరంతా గ‌మాలిచ్చేది. ఆ వాస‌న అద్భుతంగా ఉండేది. ఎక్క‌డ చూసినా పిల్ల‌గాళ్లు మూతుల‌కు, ముక్క‌ల‌కు క‌జ్జికాయ‌ల పిండిని ప‌ట్టించుకుండేవాళ్లు. ఎవురింటికి పోయినా క‌జ్జికాయ‌లు, అప్ప‌లిచ్చేవాళ్లు. ల‌డ్లు, కారాలు విలువ ఎక్కువ‌ని పెట్టేవాళ్లు కాదు. పిల్లోల్లంతా బాగా తిని బాంబులు వేచ్చాండ్రి.. బ‌డిలో, బ‌య‌ట‌. నాకైతే బెల్లం అప్ప‌లు ఇష్టం ఉండేవి కావు. కారాలు బాగా తింటాంటి. చెక్క‌ర క‌జ్జికాయ‌లు తింటాంటి. రేత్రి అర్ధ‌రేత్రి కాడ చెమ్ము ప‌ట్టుకోని నిల‌బ‌డ‌తాంటి. మా.. నాయిన‌కు చెప్ప‌ని మాయమ్మ‌ను నిద్ర‌లేపుతాంటి. మాయ‌మ్మ *ఔ.. వాడికి క‌డుపు న‌చ్చాందం*ట అనేది. *అందుకేప్పా.. ఇష్ట‌మొచ్చిన‌ట్లు తింటే.. క‌డుపు న‌య్య‌క‌.. *అంటూ మెల్ల‌గా గొణుగుతాండె. గూట్లోని బ్యాట‌రీ తీసుకుంటాండ‌. అంత‌లోకే నేను అవాయి చెప్పులేసుకోని.. చెంబు ప‌ట్టుకోని కుంట‌తిక్కు ప‌రిగిత్తాంటి. మానాయిన వ‌చ్చాండా లేదా అని ఎన‌క్కి చూసుకుంటా. అట్లా.. ఇంట్లో తిండి ఉన్న‌న్నాళ్లు.. చెంబుతో రేత్రిళ్ల కాడ సావాసం సేచ్చాంటి.

నాగుల చ‌వితికి మూడు రోజులకుముందే ఊర్ల‌ల్లోకి అడుక్కుండేవాళ్లు వ‌చ్చాండ్రి. కొంద‌రు కాట‌ర్‌పిల్ల‌ర్లు ప‌ది క‌జ్జికాయ‌ల‌కు ఒక‌ట‌ని అమ్ముతాండ్రి. ప‌ది క‌జ్జికాయ‌లు ఎక్కువ‌ని.. మేం రాళ్లు పెట్టే బాణం కొంటాంటిమి. ఆ బాణాన్ని చిన్న‌టి వెదురు ద‌బ్బ‌ల‌తో చేసేవాళ్లు. బాణానికి ముంద‌ర సిగ‌రెట్టు ప్యాకీ కాగితాన్నికోన్‌మాదిరి మ‌డిచేవారు. దాంట్లో రాయి పెట్టి కొడితే దూరం ప‌డేది. పిచ్చుక‌ల్ను, కాకుల్ను కొట్ట‌చ్చ‌ని ఆ బాణాన్ని మూడు క‌జ్జికాయ‌లిచ్చి కొనేవాణ్ణి. పండ‌గ‌కి ఒక‌రోజు ముందు ఎరికిలోళ్లు ఊర్ల‌బ‌య‌ట క‌న‌ప‌డ‌తాండ్రి.  మాయ‌మ్మ ఇండ్లు క‌డిగేది. ఇంటి ముందు పేడ‌తో అలికేది. ఇంట్లో భుజాల‌కాడికి సున్నం కొట్టేది. కింద సున్నం వార్ల‌కు ఎర్ర‌రంగుతో లైన్ల‌మాదిరి అందంగా వేసేది. దేవుని గుడి తుడిచి, మా గూగుడు కుళ్లాయ‌సోమీ ప‌టం, ఆంజ‌నేయ‌సోమీ-రాముడుసీత ఉండే ప‌టం తుడుచ్చాండె. దేవుని గూటికి ఎర్ర‌రంగుతో డిజైను మాదిరి గీచ్చాండె.

పండ‌గ‌రోజు  ప‌ద్ద‌న్నే నిద్ర‌లేయ‌క‌ముందే..  ఎరికిలోళ్లు వ‌చ్చాండ్రి. ఊర్లో చానామంది వాళ్ల‌కు క‌జ్జికాయ‌లు దానం సేచ్చాండ్రి.  ప‌ద్ద‌న ఏడుగంట‌ల టైములో బూరుబూరు అని డోలు వాంచుతా… బూరుబూరోళ్లు వ‌చ్చాండ్రి. ఒక ఆడాయిమ్మ డోలు గీర‌తా *బూరు బూరు…*మ‌ని వాంచుతాంటాది. మ‌గాయిప్ప చాల‌కాలు తీసుకోని వెన‌కాల ప‌టాప‌టా అని కొట్టుకుంటాంటాడు. ఆయ‌ప్ప‌ను సూచ్చే భ‌య‌మేసేది. ఆ సౌండు ఇంటానే  మంచంకింద నేను, మా చెల్లెలు దాక్కుంటాంటిమి.  కొంద‌రు మొగోళ్లు నెమ‌లీక‌లు పెట్టుకోని గంప‌లో కుంక‌మ పెట్టుకోని ప్ర‌తి ఇంటికాడికి వ‌చ్చి ఇచ్చేవాళ్లు. అది మంచిద‌ని తీసుకోని.. క‌జ్జికాయ‌లు ఇచ్చేవాళ్లు ఇంట్లోని ఆడ‌వాళ్లు.  కొంద‌రు ఆడోళ్లు  పిల్లోల్ల‌ను సంక‌లో ఎత్తుకోని .. త‌ల‌కాయ మీద ప‌ర‌క‌లు, చిన్న వెదురుబుట్ట‌లు, ఇస‌న‌క‌ర్ర‌లు.. తీస‌క‌చ్చాండ్రి.  రెండు క‌జ్జికాయ‌లిచ్చే అంద‌మైన వెదురు బుట్ట‌లిచ్చాండ్రి.  కొంద‌రు గీరు గీర్లు తెచ్చేవారు. ఓ గ‌ట్టిపుల్ల‌కు కాగితంతో త‌యారు చేసిన బంతిలాంటి వస్తువుకి, ఈరియా సంచి దారంతో క‌ట్టి ఉంటాది. క‌ట్టెను ప‌ట్టుకోని దాన్ని తిప్పితే గీరు గీరు మ‌ని గ‌ట్టిగా సౌండు వ‌చ్చాండె.  నేను క‌జ్జికాయ‌లు రెండుజోబీల్లో పెట్టుకోని సావాస‌గాళ్ల‌తో కుంట‌తిక్కు, దేలం తిక్కుపోతాంటి. త‌క్క‌వ క‌జ్జికాయ‌ల‌కు బేర‌మాడి ఎరికిలోల్ల ద‌గ్గ‌ర గీరుగీరు, బాణాంసెట్టు కొన‌క్క‌చు్చ‌కుంటాంటి.

ప‌ద్ద‌న్నే తొమ్మిదిలోప‌ల ఎరికిలోల్లు అలివికాకుండా అంద‌రి ఇండ్ల‌కాడికి వ‌చ్చేవాళ్లు. మాయ‌మ్మ లేవ‌న‌కుండా  సేచ్చాండె. *అమ్మ‌య్య‌.. రెండు క‌జ్జికాయ‌లు దానం చేయండ‌మ్మా* అంటే… *లేవుపో* అంటాంటి నేను. మాయ‌మ్మ పంత‌కాడికి పోయి ప్లేట్లో మూడు క‌జ్జికాయ‌లు తీసుకోని వాళ్ల‌కు ఇచ్చేది. *మా .. మ‌న‌యి అయిపోతాయి. ఏంటికిమా వాళ్ల‌కు ఇచ్చానావు* అంటాంటి. *కొంద‌రికి లెక్కున్నా దానం చేయ‌రు. దానం సేచ్చే మంచిది. పాపం.. వాళ్లు సంవ‌చ్చ‌రానికి ఒక‌పారి వ‌చ్చారు. కజ్జికాయ‌లు మ‌నం తిని దొడ్డికి పోతే పోతాది. వాళ్ల‌కు ఇచ్చే సంతోష‌ప‌డ‌తారు.  ఈ పండ‌గ ఎరికిలోళ్ల‌కు పంచి పెట్ట‌డానికే వ‌చ్చాది* అంటాండె. నాక‌ర్థ‌మ‌య్యేది కాదు.. మాయ‌మ్మ మాట‌లు. బాగా చెప్పినాది.. ఇంట్లో క‌జ్జికాయ‌లు అయిప‌జేసుకుంటా అనుకుంటాంటి. కొంద‌రికి క‌జ్జికాయ‌లు కాకుండా ల‌డ్లు, అప్ప‌లు ఇచ్చేది. నేను మాయమ్మ‌తో ఇయ్యాకు అని కొట్లాడ్తాంటి. కొంద‌రు బుట్ట‌ల ఎరికిలోళ్లు సంవ‌త్స‌రాల పాటు చూసి మాయింటికాడికి వ‌చ్చేవాళ్లు. క‌జ్జికాయ‌లు దానం ఇచ్చాద‌ని. క‌జ్జికాయ‌లు ఊరిక ముందు రొండో, మూడో ఇచ్చి .. త‌ర్వాత వాళ్లేదైనా వ‌స్తువులు ఇచ్చే.. వాటికి మ‌ళ్లా ఇచ్చేది. లేకుంటే లెక్కిచ్చి కొనుక్కునేది. ఎరికిలోల్లు సంచార‌జీవులు. వాళ్లు త‌యారు చేసుకున్న నైపుణ్య వ‌స్తువులు క‌జ్జికాయ‌ల‌కు బ‌దులు ఇచ్చేవారు. ఇదంతా గొప్ప ఇష‌యం. అప్ప‌ట్లో నాకు తెలిసేది కాదు.

పండ‌గ‌యిపోయినాక కూడా ఇంగా రెండ్రోజులు ఎరికిలోళ్లు వ‌చ్చేవాళ్లు. పండ‌గ‌యిపోయినాక ప‌దిరోజుల వ‌ర‌కూ అంద‌రి జోబీల్లో, స్కూలు బ్యాగుల్లో, ప‌నికెళ్లిన చోట టిపెన్ల‌ల్లో క‌జ్జికాయ‌లుండేవి. పండ‌గ‌యిపోయినాక ప‌దిరోజుల‌కు ముందు కారాలు అయిపోయేవి మా ఇంట్లో. అది కూడా నేను బాగా న‌మ‌ల‌టం వ‌ల్ల‌. ఆ త‌ర్వాత మెల్ల‌గా లడ్లు అయిపోయేవి. పంత‌లోని క‌జ్జికాయ‌లు, అప్ప‌లు అయిపోయేవి కావు. రోజూ కూలిప‌నికి పోయి వ‌చ్చినాక మాయ‌మ్మ, మా నాయిక తెల్ల‌లో వేసుకోని క‌జ్జికాయ‌లు తింటాండ్రి. *మా కారాలు, ల‌డ్లు అయిపోయినామా. ఎప్పుడు చేసుకుందా*మ‌ని అడుగుతా ఏడుచ్చాంటి. *మీ నాయిన తెచ్చిన శెన‌గ‌పిండి రోంత ఉంది. కారాలు కాలుచ్చాలే. ఈ క‌జ్జికాయ‌లు తిను అని ఇచ్చాండె. అయి బెల్లం క‌జ్జికాయ‌లు. గ‌తిలేక ఏర్స‌లేక తింటాంటి. ఇర‌వై రోజుల‌కు ఇంట్లో తిండంతా అయిపోయేది. ఎవ‌రున్నా.. కాపోళ్ల ఇండ్ల‌ల్లో, త‌క్కువ తినేవాళ్లు ఇండ‌ల్లో మిగిలిపోయేవి. క‌జ్జికాయ‌ల‌కు పురుగులు ప‌ట్టేవి. మా ఫ్రెండు గంగిరెడ్డి క‌జ్జికాయ‌లు జోబీలో తెచ్చేవాడు. ముగ్గువాస‌న వొచ్చేవి. పిండిలో తెల్ల‌పురుగులుంటాండె. జాగ్ర‌త్త‌గా చూసుకోని.. ఒక్కోపారి అట్ల‌నే తింటాంటిమి. ఒక్క‌సారి అట్ల వ‌చ్చి.. ఇట్ల పోయే నాగుల చ‌వితి అంటే నాకెంతో ప్రేమ‌.  రంజాను పండ‌క్కు, సంకురాత్రి, దీపావ‌ళి పండ‌క్కు కూడా ఇంత తిండి చేసుకోరు.. అందుకే నాగుల చ‌వితి పండ‌గంటే నాకు పాణం లేచొచ్చాది. నా బాల్యం గుర్తొచ్చాది.  క‌జ్జికాయ‌ల పండ‌గంటే నాకు ఇప్ప‌టికీ అదే ఎమోష‌న్‌.

(చ‌దువులు అయిపోయి హైద‌రాబాద్‌కి వ‌చ్చి ఉద్యోగం చేచ్చాండెప్పుడు నాగుల‌చ‌వితి పండ‌క్కి ఇంటికిపోయ్యేవాణ్ణి. వ‌చ్చేప్పుడు బ్యాగుల్లో, పెద్ద టిపెన్ల‌ల్లో హైద‌రాబాద్‌కి తీస‌క‌చ్చుకుంటాంటిమి. ఇట్లా నేనే కాదు.. పులివెందుల, జ‌మ్మ‌ల‌మ‌డుగు ప్రాంతాల్లోని కొన్ని ప‌ల్లెల్లు ఈ నాగుల చ‌వితి పండ‌గ బాగా జ‌రుపుతారు. మా సింహాద్రిపురం తిక్కు ప‌ల్లెల్లో రోంత ఎక్కువ జ‌రుపుతారు. క‌జ్జికాయ‌ల పండ‌గ క‌ల్చ‌ర్ ఎట్ల వ‌చ్చిందో నాకు తెల్దు కానీ.. అది చాలా మంచి పండుగ‌. ఊరుమ్మ‌డి బ‌తికే ఎరికిలోల్లు వంద‌ల గ్రామాల‌ను ఇంత‌మందికి ఇన్ని ఊర్ల‌ను పంచుకోని వ‌చ్చేవాళ్లు. చాలామంది దానం చేసేవాళ్లు. ఇప్పుడు ఆ దానాలు, గీనాలు పోయినాయి. ఇంట్లో చేసుకోని తింటాండారు. ఆ  ఎరికిలోళ్లు త‌క్కువైనారు. ఇది కేవ‌లం నా అనుభూతే కాదు. మా ప‌ల్లెల్లోని ప్ర‌తి ఒక్క‌రి అనుభూతి ఇట్లాగే ఉంటాది.) 
రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లి

రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లి

31 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • శానా బాగా రాచ్చివి వలీ. కర్జికాయల పండగని అంటాటిమి. బలే మతికి సేచ్చివి.

 • పులివెందుల ప్రాంత వాసుల నాగుల చవితి పర్వదిన విశేషాలను కళ్లకు కట్టినట్లుగా చూపించినారు వల్లి గారు

 • Superb Rajvalli. Nagala chavithi pandaga prathekatha gurunchi, Mana side jarupukune vidanam chala chakkaga rasavu.

 • మన ఊరిలో కొబ్బరి పంద్యాలు, టెంకాయ పంద్యాలు గురించి రాయల.. మల్ల పిల్లప్పుడు విశేషాలతో అదరగొట్టేసారు

  • అవును సర్ . రాచ్చా రాచ్చా.. మీ స్పందనకు ధన్యవాదాలు

 • పిల్లోల్లంతా బాగా తిని బాంబులు వేచ్చాండ్రి.. — దీని అర్థం మన ప్రాంతం వాళ్ళకే తెలుసు కదా రాజవల్లి గారూ !

  చాలా బాగా రాసారు. బాల్యాన్ని గుర్తు చేసారు. శుభాకాంక్షలు ! రాస్తూనే వుండండి మన భాషలో !

  • మీ స్పందన అమూల్యం సర్. మన పులిందల బాంబుల కత ఎంత చెప్పినా తక్కవే. నక్కోని సావాల. 🤗🤗🤗

 • Thank you dear friend. You remembered me, my childhood memories. Thanks a lot. Your poetry style is extremely superb. Language is excellent. Once again thank you dear friend. I feel very proud of you.

  • Thanks abbi . Nuvvu rayachuga Naku competetion ga 😀. Okappudu essay competetion lo Pulivendula lo nannu venakki netti first prize kotnav.

 • అప్పట్లో కజ్జికాయల పండక్కు ముందు పది దినాలు, పండుగ ఐపోయినక ఇంట్లో కజ్జికాయలు ఉన్నన్నాళ్లు సందడిగా ఉండేది.మేము హిమకుంట్ల బడికి వచేటప్పుడు మధ్యానo తినటానికి అన్నం కాకుండా, కజ్జికాయలే తెచుకుంటాంటిమి…
  కజ్జికాయలు ఐపోయినాక మళ్ళా పండుగరానికి ఎన్ని నెలలు ఉందని లెక్కలేసుకుంటాంటిమి. ఇప్పుడు సుగరు, బి. పి లు అందరికీ ఎక్కువఐ కజ్జికాయల సందడి తగ్గిపోతాంది.అన్న

  • avunu .. konni maricha. appatikappudu rasa. time ledu. pandaga munduroju night raskunna, chinnavi miss ayyundochu. any way thanks for ur responce

 • వ్యవహారికంలో ప్రాణంఉట్టిపడేవిధంగా ప్రతిసంఘటన కనులకు కట్టినట్లుఉంది.భాషకుభావంఎంతఅవసరమోఅందలిపలుకులుపదికాలాలపాటునిలవాలిఅంటే మనసుకుహత్తుకొనే నాసొంతంఅనుకునే మాండలికపలుకుబడులుఅంతేఅవరం.

 • వ్యవహారికంలో ప్రాణంఉట్టిపడేవిధంగా ప్రతిసంఘటన కనులకు కట్టినట్లుఉంది.భాషకుభావంఎంతఅవసరమోఅందలిపలుకులుపదికాలాలపాటునిలవాలిఅంటే మనసుకుహత్తుకొనే నాసొంతంఅనుకునే మాండలికపలుకుబడులుఅంతేఅవసరం

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు