ఫలసిద్ధి

“మనవి ఆలకించరాదటే” అని జే.కే అందుకోగానే ఆడిటోరియమ్ అంతా ఒక్క సారిగా గట్టి చెప్పట్లతో నిండి పోయింది. “మనవి ఆలకించరాదటే …. మర్మమెల్ల తెల్పెదనే మనసా” అంటూ ఎంతో తాదాత్మికంతో జే.కే పాడుతోంటే అతనితో పాటు సమీర్ గిటార్ తోను , గిరి డ్రమ్స్ తోను జుగల్బందీ చేసారు. అదొక్కటేనా! “ఎందరో మహానుభావులు” , నాకెంతో ఇష్టమైన “నగుమోము” కీర్తనలు కూడా పెరఫార్మ్ చేశారు. కర్ణాటక సంగీతంవైపు ఇలా యువతరానికి ఉన్న ఇంటరెస్ట్ చూస్తుంటే ఎంతో ముచ్చటగా అనిపించింది. ఇంటరెస్ట్ మాత్రమే కాదు, జే.కే పాడుతున్నంతసేపూ ఎక్కడైనా అచ్ఛు తప్పులో లేదో గమకాలు మిస్ అవుతాయేమో అని చూసాను. అబ్బే నాకు ఆ ఛాన్స్ మాత్రం ఇవ్వలేదు. ఎంత ప్రాక్టీస్ చేస్తే ఇంత మంది ముందు యే బెరుకు, భయం లేకుండా ఇంత బాగా పాడగలడు ? ఆబ్సల్యూట్లీ ఫ్లాలెస్ !!

నా పేరు విహారి. పన్నెండేళ్ళు ఒక పత్రిక లో సాహిత్య విభాగంలో జర్నలిస్ట్ గా పనిచేసి, రిజైన్ చేసి ఒక రెండేళ్లు కష్టపడి నా సొంత మ్యాగజైన్ ప్రారంభించాను. ప్రస్తుత తరానికి సంగీతంలోను, సాహిత్యంలోను ఇంటరెస్ట్ వచ్చేలా నా వంతు కృషి చేద్దామని ఈ మ్యాగజైన్ ప్లాన్ మొదలు పెట్టాను. యువ రచయితల గురించి, యువ మ్యూజిషియన్స్ గురించి ఎన్నో వివరాలు సేకరించి ఆర్టికల్స్ రాసాను. ఒక్క కవర్ స్టోరీ తప్ప దాదాపు మొత్తం రెడీ గా ఉన్నపుడు ఏదైనా ఇన్స్పిరేషనల్ గా ఉంటే రాద్దామని అనుకుంటుండగా నా ఫేస్బుక్ ఫ్రెండ్ ఒకడు జే.కే బ్యాండ్ గురించి చెప్పాడు. వాళ్ళు ఆ వేళ ఒక ఇంజనీరింగ్ కాలేజీ లో ప్రోగ్రాం ఇస్తున్నారని తెలిసి చూద్దామని వెళ్లాను . ఈ యువత టాలెంట్ ఎంత బాగుంది! నాకు కావాల్సిన స్టోరీ దొరికింది. మ్యాగజైన్ పూర్తి చేసి రిలీజ్ చేసాను. వంద కాపీలు అమ్ముడుపోయాయి. పెద్ద పెద్ద రచయితలు, పత్రికా ఎడిటర్లు కాల్ చేసి మెచ్చుకున్నారు. నేను పని చేసిన పత్రిక ఎడిటర్ మూర్తి గారు కూడా ఇంటికి వచ్చి మరీ అభినందనలు చెప్పారు.

కానీ రీడర్స్ కి నా మ్యాగజైన్ తరువాత సంచికలు అంత ఎక్కలేదనుకుంటా, నేను అనుకున్నంత ఆదరణ దొరకలేదు. కేవలం మ్యూజిక్, లిటరేచర్ అనేసరికి బోర్ కొట్టిందో ఏమో. వేరే నెల పత్రికల్లాగా సినిమా కబుర్లు, కార్టూన్లు ప్రచురించలేదు. మూడో సంచిక కి పూర్తిగా లాస్ వచ్చేసింది. దానికి తోడు మ్యాగజైన్ కోసం తీసుకున్న బ్యాంక్ లోన్ ఇంటరెస్ట్ కట్టడానికి చాలా కష్టమయ్యేది. ఒక రోజు లోన్ రికవరీ ఏజెంట్ ఇంటికి వచ్చి నెలరోజుల్లో డబ్బు మొత్తం కట్టేయాలని లేదంటే నా అవయవాలు అమ్మేసి డబ్బు తీసుకుంటారని బెదిరించి వెళ్ళిపోయాడు. కాలనీ వాళ్ల ముందు నా పరువు పోయింది. ఒక వారం రోజుల్లో ఉన్న సేవింగ్స్ మొత్తం వాళ్ళకి కట్టేశాను.   ఇంక వేరే ఆధారం లేక మ్యాగజైన్ మూసి వేయాల్సి వచ్చింది. ఆ బాధ తట్టుకోలేకపోయాను. డబ్బుల్లేవు, మ్యాగజైన్ లేదు. కొంతకాలం అదే దిగులుతో , డిప్రెషన్ తో ఉండిపోయాను. తర్వాత మూర్తిగారి సలహా మీద మ్యాగజైన్ గురించి ఇంక మర్చిపోయి మళ్ళీ ఆయన దగ్గర జాబ్ లో చేరిపోయాను. కానీ ఈ సారి క్రైం విభాగంలో. ఎందుకో లోలోపల బాధ, కోపం – ఇంక సాహిత్యానికి , సంగీతానికి దూరమైపోయాను.

అయిదేళ్ల గడిచాయి. ఒక స్టోరీ కోసమై పదిరోజుల క్రితం త్రిస్సూర్ వచ్చాను. అప్పుడొక హోర్డింగ్ చూసాను “మనం బ్యాండ్ హోమ్ కాలింగ్” కాన్సెర్ట్ అని. హోర్డింగ్ పైన ఫోటోలు అంత క్లియర్ గా లేవు. కానీ వాటి కింద ఉన్న ఎనిమిది పేర్లలో నాకు మూడు తెలిసిన పేర్లు – జే .కే , సమీర్, గిరి. ఎన్నో జ్ఞాపకాలు కళ్ళ ముందు మెదిలాయి. సడెన్ గా ఎందుకనో వాళ్ళ పెరఫార్మన్స్ చూడాలనిపించింది. తేదీ నోట్ చేసుకొని, పనైపోయాక హోటల్ కి వెళ్ళాక ప్రోగ్రాం టికెట్ ఆన్లైన్ కొన్నాను. వారమంతా పని ముగించుకొని శనివారం సాయంత్రానికి కాన్సెర్ట్ వెన్యూ కి వెళ్లాను.

“బంటురీతి కొలువియ్యవయ్య రామ” అని మొదటి పెరఫార్మన్స్ మొదలయింది. ఆడియన్స్ ఒకటే అరుపులు, చెప్పట్లు, కేకలు. పొడుగ్గా గిరజాల జుట్టు తో ఉన్న జే .కే ని గుర్తుపట్టడానికి నాకు కొంచెం టైం పట్టింది. కానీ పాడుతున్నపుడు అదే ఎక్స్టెసి ! ఎప్పటిలాగానే వోకల్స్ జే .కే పాడగా గిరి , ఇంకో ఇద్దరు డ్రమ్స్ , సమీర్, ఇంకో అమ్మాయి గిటార్ , ఒక అమ్మాయి కీబోర్డు పై ఉన్నారు . క్రిందటి సారి కంటే ఈ హాల్ పెద్దగా, అందంగా లేసర్ లైట్లతో మెరిసిపోతూ ఉంది. ఇంకో అయిదు కీర్తనలు, రెండు ఒరిజినల్ కంపోజిషన్స్ , మూడు సినిమా పాటలు పెరఫార్మ్ చేసారు. చాలా కాలం తరువాత సంగీతం వినేసరికి భలే అనిపించింది. చాన్నాళ్లు నిద్రలో ఉండి ఒక్కసారిగా మెళుకువ వచ్చినట్లుగా ఉంది. ఎంతో కష్టమైన గమకాలని జే .కే ఎంతో అవలీలగా పడేసాడు. ప్రోగ్రాం ఎండ్ కి స్పాన్సర్స్ మాట్లాడి ఫైనల్ గా జే.కే ని మాట్లాడమన్నారు.

జే .కే మైక్ అందుకొని మాట్లాడటం మొదలెట్టాడు “అమెరికా టూర్ విజయవంతంగా పూర్తి చేసుకొని మళ్ళీ నా సొంత ఊరు కి వచ్చి కాన్సర్ట్ చేయటం మా బ్యాండ్ కి, నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. థాంక్ యు వెరీ మచ్. మీ అందరూ ఇలా క్లాసికల్ మ్యూజిక్ మీద ఇంటరెస్ట్ చూపటం నాకెంతో తృప్తి నిస్తోంది. ఇలాగే మన తరువాత తరాలు కూడా మన సంగీతాన్ని వినాలని, పాడాలని కోరుకుంటున్నాను. ఇంక లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ మా బ్యాండ్ కి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చిన విహారి గారికి సర్వదా కృతజ్ఞుడిని . ఎక్కడో చిన్నా చితకా ప్రోగ్రామ్స్ ఇచ్చుకునే మా బాండ్ కు ఒక సక్సెస్ ఫుల్ కెరీర్ కి పునాది వేశారు. థాంక్ యు సర్” అని ముగించాడు. నేను ఆఖరి రో లో కూర్చున్నా, జే .కే నా వైపు చూస్తూ థాంక్స్ చెప్పినట్లు అనిపించింది. ఎదో ఇబ్బందిగా అనిపించింది. అక్కడనుండి గబగబా లేచి వచ్చేస్తున్నాను. “విహారి సర్” అని వెనకాల నుండి పిలుపు వినిపించింది. తిరిగి చూస్తే జే .కే.

“ఏంటండీ, ఇప్పుడు కూడా తప్పించుకుంటారా” అని అడిగాడు.

మూర్తిగారు ఎన్నోసార్లు నాకు చెప్పారు జే .కే నాతో మాట్లాడటానికి ఎన్నోసార్లు ప్రయత్నించాడని. నేను నా మ్యాగజైన్ మూసేసాక దాని తాలూకు సంఘటనలు కానీ, సంగతులు కానీ గుర్తుచేసుకోవటానికైనా, మాట్లాడటానికైనా ఇష్టపడలేదు. అందుకే ఈ అయిదేళ్లలో జే .కే కి రెస్పాండ్ అవలేదు. వాళ్ళ బ్యాండ్ గురించి కూడా పెద్దగా ఆలోచించలేదు. కానీ స్టేజి పైన నా పేరు ప్రస్తావించేసరికి ఎదో గిల్టీగా అనిపించింది. నోట్లో మాట రాలేదు.

నా పరిస్థితి అర్ధమయ్యినట్లుగా “సరే నాతో రండి” అని నా చెయ్యి పట్టుకొని బ్యాక్స్టేజి కి తీసుకెళ్లాడు.

“నేను, గిరి, సమీర్ ఐ.ఐ.టి లో చదువుతుండగా అక్కడే ఒక చిన్న బ్యాండ్ స్టార్ట్ చేసాము. చిన్నప్పటినుండి ముగ్గురికి కర్ణాటక సంగీతం ఇష్టం. ఆ పై కూడా బ్యాండ్ లో ఉంటూ, కర్ణాటక సంగీతం ప్రాక్టీస్ చేస్తూ వచ్చాము. ఎన్నో కీర్తనలని ఫ్యూషన్ మ్యూజిక్ లో పాడి మా కాలేజీ లో ప్రోగ్రాములు ఇచ్చేవాళ్ళము. చాలా కష్టపడ్డాము. తరువాత రెండే రెండు బయట కాలేజీలో పెర్ఫార్మ్ చేసాము. అవి కూడా ఎన్నో అడ్డంకులు ఎదుర్కున్నాక దొరికాయి. అలాంటి ఒక ప్రోగ్రాంలోనే కదా మీరు మమ్మల్ని చూసి మీ మ్యాగజైన్ లో మాకు చోటును ఇచ్చారు. మా స్టోరీని , మా స్ట్రగుల్ ని, మా పట్టుదలని అంతెందుకు నా పూర్తిపేరు జోసెఫ్ కార్తీక్ అని, మా బ్యాండ్ మతాలకి అతీతంగా కలిసిమెలిసి ఉంటుందని ఇలా ఎన్నో విషయాలు మీ మ్యాగజైన్ లో మీరే చెప్పారు కదా? ఆ స్టోరీ ఎంత హిట్ అయిందంటే మమ్మల్ని ఒక టీవీ షో లో పిలిచారు. ఆ తరువాత మేము ముగ్గురం ‘మ్యుజిషియన్స్ ఆఫ్ సౌత్ ఇండియా’ లో పాల్గొని గెలిచాము. ఇంక ఆ పై మా బ్యాండ్ లో చాలా మంది జాయిన్ అయ్యారు. అలా మనం బ్యాండ్ స్థాపించాం. ఇప్పుడు నెల కి పదికి పైగా ప్రోగ్రాములు . రీసెంట్ గా అమెరికా టూర్ కూడా చేసొచ్చాము. ఈ సక్సెస్ కి మేమెంత కారణమో మీరు కూడా అంతే కారణం. మీ ఋణం ఎలాగో తీర్చుకోలేము. కనీసం ఒక్కసారి థాంక్స్ కూడా చెప్పే అవకాశం ఇవ్వలేదు మీరు. ఏమైపోయారు ఇన్నాళ్లు? మీ మ్యాగజైన్ గురించి తెలిసింది. మాట్లాడాలనిపించింది. ఎన్నిసార్లు మిమ్మల్ని కాంటాక్ట్ చేసాను! ప్రతి నెలా మొదటి సండే మీ పత్రికా ఆఫీసు కి కాల్ చెయ్యడానికి నా ఫోన్ లో రిమైండర్ కూడా పెట్టుకున్నాను” అని తన ఫోన్ చూపెట్టాడు నాకు.

నాకు నోటెంబడ మాటరాలేదు. అవును ఏమైపోయాను ఇన్నాళ్లు? నాకెంతో ఇష్టమైన మ్యూజిక్, లిటరేచర్ ను దూరంగా ఉంచాను. ఒక చిన్న ఓటమిని ఎదురుకోలేకపోయానా? కొద్దిగా ఓపిక పట్టుంటే నా మ్యాగజైన్ వల్ల ఇంత మందికి మేలు జరిగిందన్న విషయం తెలిసేది కదా ! నేను నా మ్యాగజైన్ ద్వారా చేయాలనుకున్నది జే .కే బ్యాండ్ వాళ్ళు చేసి చూపించారు. అదే కదా నాకు కావాల్సింది? మ్యాగజైన్ కోసం మళ్ళీ డబ్బు సంపాదించడం అసాధ్యం అని ఎందుకు అనుకున్నాను? ఇలా ఎన్నో ఆలోచనలు ఒక్కసారిగా న తలలో తిరిగాయి. అతనికి మనసువిప్పి నా ఫీలింగ్స్ చెప్పాలనిపించింది.

“నేను మాట్లాడకపోవడానికి ఒక కారణం ఉండేది జోసెఫ్! రెండేళ్లు కష్టపడి తయారు చేసిన నా మ్యాగజైన్ నా ఫెయిల్యూర్ ని గుర్తు చేసేది. అందుకే దానికి సంబంధించినవి ఏవీ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అది చాలా సిల్లీ గా అనిపిస్తోంది. ఐ యాం సారీ! ఇన్నాళ్లు ఐ వాస్ లాస్ట్. ఇపుడు నువ్వు నాతో చెప్పిన మాటలు నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసాయి. మీ స్టోరీ ని అప్పుడు రాసినా, ఇప్పుడు అర్ధంచేసుకుంటున్నాను. మీ జీవితంలో మీరు ఎన్నో హర్డిల్స్ ఎదురుకొని పైకొచ్చారు. అది మోటివేషన్ గా తీసుకుంటున్నాను. ఓడిపోయాను అని అనుకున్నాను, కానీ అదే నా సక్సెస్ , దానికి ప్రతిరూపం మీరే! థాంక్ యూ! ఇవాళ నుండి ఒక మీనింగుఫుల్ జీవితాన్ని గడుపుతాను. ఐ ప్రామిస్”

“దాట్ ఈస్ ది స్పిరిట్ సర్. లకీ గా మూర్తిగారు మీరు ఇక్కడే ఉన్నారు అని చెప్పారు నాకు. మీరు తప్పకుండా వస్తారనిపించింది. కొన్నిసార్లు ఇంట్యూషన్ భలే పనిచేస్తుంది కదా” అని నవ్వుతూ అన్నాడు.

తన బ్యాండ్ మొత్తాన్నిపిలిచి అందరు కలిపి డ్రమాటిక్ గా వంగి దణ్ణం పెట్టారు. ఇంతమంది లైఫ్ లో నేనొక స్పెషల్ పార్ట్ అని అంటోంటే చాలా గర్వంగా ఉంది. ఇది నా జీవితంలో ఒక మరిచిపోలేని మొమెంట్ . అందరికి హగ్ ఇచ్చి బాయ్ చెప్పేసి అక్కడ నుండి బయలుదేరాను. మూర్తి గారికి కాల్ చేసి బయలుదేరి వస్తున్నానని , ఇదే నా లాస్ట్ అసైన్మెంట్ అని , రిజైన్ చేస్తున్నాని చెప్పాను.

నెల తరువాత

మనం బ్యాండ్ సక్సెస్ స్టోరీ……” అంటూ ఆపేసిన నా మ్యాగజైన్ కి మళ్ళీ ప్రాణం పోసాను.

*

 

ప్రజ్ఞ వడ్లమాని

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా బాగా రాశావు ప్రజ్ఞా.all the best.inka ilantivi enno rayalani korukuntunnanu

  • Dear Prajna,
    Very nice story-telling; writing style is so simple yet the message is so powerful.
    Keep the creative ideas flow from your heart to pen to keyboard.
    Mama

  • Very nice story Peggilu..
    I am very happy that you have a talent which motivates your readers. Narration is gripping. Keep up the good work doll.

    Daddy

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు