మనిషికీ కీటకానికీ మధ్య…..

 కాఫ్కా రాసిన ‘ద మెటమార్ఫోసిస్’ చదవడం పూర్తి చేసానీ రోజు. ఇది కనీసం ఒక చిన్న నవలిక కూడా కాదు; పద్దెనిమిది పేజీల సుదీర్ఘమైన కథ మాత్రమే!

కాఫ్కా రచనల్లో సర్వసాధారణంగా కనిపించే సంక్లిష్టతను (complexity) దృష్టిలో పెట్టుకొని… కాస్తంత భయభక్తులతో కథను చదవడం ప్రారంభించాను. కానీ ఈ కథ ఎలాంటి జటిలత లేకుండా చివరి వరకూ ఎంతో  సరళంగానూ   స్పష్టంగానూ సాగడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది.

ఈ కథకు నాయకుడు ‘గ్రెగర్’. ఇతను ఒకరోజు ఉదయం నిద్రలేచేసరికి ఒక ‘భయంకరమైన కీటకం’గా… కాఫ్కా మాటల్లో  ‘monstrous verminous bug’గా మారిపోతాడు. అయితే అలా రూపాంతరం చెందినప్పటికీ, ఆశ్చర్యకరంగా అతను తన మానవతాశక్తులను, ఆలోచనా విధానాన్నీ   కోల్పోవడం మాత్రం జరగలేదు. ఇతరుల మాటలను అతను వినగలడు; వాటిని అర్థం చేసుకోగలడు.   మాట్లాడగలడు… కనీసం మాట్లాడగలనని అతను అనుకుంటాడు.

కాకపోతే ఈ భయంకరమైన మార్పు కారణంగా గ్రెగర్ శారీరక చలనశీలత (mobility) మాత్రం  తీవ్రంగా కుంటుపడుతుంది.

వృద్ధులైన తల్లిదండ్రులు, ఒక చెల్లెలు ఉన్న ఆ కుటుంబానికి గ్రెగరే ఏకైక పోషకుడు (sole bread winner) కావడంతో, ఈ అనూహ్యమైన సంఘటన వారినందరినీ తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తుంది. తండ్రి అనంతమైన దుఃఖసాగరంలోనూ, తల్లి ఓదార్చశక్యంగాని శోకసముద్రంలోనూ మునిగిపోతారు. చెల్లెలు తీవ్రమైన  మనోవేదనకు గురవుతుంది.

గ్రెగర్ తనకు సంభవించిన విపత్తును గురించిన బాధతో పాటు, తన ప్రియమైన వారిని పోషించ లేకపోతున్న అశక్తతకు  అపరాధభావనతో కుంగిపోతుంటాడు. తన గదికి మాత్రమే పరిమితమైపోతాడు; అటూ ఇటూ నెమ్మదిగా, కష్టంగా అశాంతితో పచార్లు చేయడం తప్ప మరేమీ చేయలేని అశక్తునిగా మిగిలిపోతాడు. తను బందీ అయిపోయిన గది  గోడలు నెమ్మదిగా ఎగబాకి  పైకప్పు నుండి తలకిందులుగా వేలాడటం అతనికి కాస్తంత ఎక్కువ ఉపశమనాన్ని కలిగిస్తున్నట్టు తెలుసుకొని,  అలా చేయడం అలవాటుగా మార్చుకుంటాడు. దానితో పాటు స్వల్పంగా తెరచి ఉన్న తలుపు  సందులోంచి బయటి ప్రపంచాన్ని చూస్తూ కాలం వెళ్ళబుచ్చే ప్రయత్నం కూడా చేస్తుంటాడు.

గ్రెగర్ కు సంభవించిన ఈ విపత్తు అతని కుటుంబంలో కొన్ని తీవ్రమైన మార్పులు సంభవించడానికి కారణమౌతుంది. అంతవరకూ ఎటువంటి వ్యాపకమూ లేకుండా ఖాళీగా కూర్చోవడమే జీవితాన్ని ఆస్వాదించడం అన్న బలమైన విశ్వాసంతో దానికి  తగ్గట్టు జీవితాన్ని గడుపుతున్న గ్రెగర్ తండ్రికి బతకడానికి  పని చేయక తప్పని ‘విషమ’పరిస్ఠితి ఏర్పడుతుంది. దానితో అతను పనిచేయడం ప్రారంభిస్తాడు; తల్లి, చెల్లెలు కూడా, తమవంతు సాయంగా లోదుస్తులు (undergarments) కుట్టే పనిని చేపట్టి ఆదాయం పెంచుకునే ప్రయత్నంలో తమ వంతు సహకారం అందించనికి సంసిద్ధులౌతారు.

రోజులు గడిచేకొద్దీ మారిన పరిస్థితులకు వారు ముగ్గురూ  అలవాటు పడడంతో గ్రెగర్ పట్ల అంతవరకూ వారు చూపిస్తున్న శ్రద్ధాసక్తులూ, ప్రేమాభిమానాలూ నెమ్మదిగా సన్నగిల్లడం మొదలౌతుంది.

కొద్ది కాలంలోనే అతని గురించి పట్టించుకోవడం పూర్తిగా మానేస్తారు. అతను తిన్నాడో లేదోనని పట్టించుకోనంత కఠినంగా మారిపోతారు. అంతే కాదు, మరిన్ని రోజులు గడిచేసరికి   గ్రెగర్ ఆ కుటుంబానికి ఒక పెనుభారంగానూ, అవమానకరమైన వ్యక్తి (embarrassment) గానూ తయారౌతాడు. కాలం గడిచేకొద్దీ ఈ అనాసక్తత మరింత పెరుగుతూ పోతుందే తప్ప తగ్గుముఖం పట్టదు.

రోజులలా భారంగా గడిచి, ఒక శుభదినాన, తన మానవరూపు తిరిగి పొందకుండానే,  గ్రెగర్ మరణించినప్పుడు, ‘అయ్యో’ అని బాధపడడానికి బదులు ‘హమ్మయ్య’ అని నిశ్చింతగా ఊపిరి పీల్చుకుంటారు కుటుంబసభ్యులు ముగ్గురూ! ఆ సాయంత్రం… వేడుక చేసుకునే ఉద్దేశంతో  కాకపోయినా  కాస్తంత చల్లగాలి పీల్చుకొని, వెచ్చని ఎండను ఆస్వాదించాలన్న సదుద్దేశంతో తల్లీ తండ్రీ చెల్లెలూ బయటకు వెళతారు కూడా!

కాఫ్కా రాసిన ఈ కథ మానవసంబంధాలలోని కపటత్వాన్ని, పెళుసుదనాన్నీ, ఒక వ్యక్తి వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదనుకున్నప్పుడు రక్తసంబంధీకుల మధ్య కూడా  ప్రేమానురాగాలు  ఎలా ఆవిరైపోతాయో,  ఎంత సులువుగా ముక్కలైపోతాయోనన్న వాస్తవాన్ని  బలంగా ఆవిష్కరిస్తుంది. పాఠకుల హృదయాలను బలంగా తాకే ఈ కథ వారిని తీవ్రమైన ఆందోళనకూ అలజడికీ  గురిచేస్తుందనడంలో నాకెటువంటి సందేహమూ లేదు.

 *

కృపాకర్ పోతుల

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.