ప్రేమలో ఉండే మోహాన్నో,విరహాన్నో,వేదననో కవిత్వం చేసిన కవులు ఎందరో ఉన్నారు.భక్తిలో ఉండే మాధుర్యాన్నో,ఆధ్యాత్మిక భావాన్నో,దైవ ప్రేమనో కవిత్వం చేసిన కవులూ ఉన్నారు.కానీ లౌకిక ప్రేమని ఆ ప్రేమలోని విరహాన్ని భగవంతున్ని చేరుకోవడానికి పడే తపనగా కవిత్వం చేసిన కవులు కొందరే ఉన్నారు.
అన్నమయ్య,క్షేత్రయ్య,సారంగపాణి మున్నగు ప్రాచీన తెలుగు కవులు శృంగారం అనే లౌకిక భావనను మాధ్యమంగా చేసుకొని లౌకిక ప్రేమ ద్వారా దైవిక ప్రేమను వెతికారు.భక్తుడు భగవంతుని సాన్నిధ్యం కోసం పడే ఆధ్యాత్మిక ఆరాటాన్ని మార్మికంగా ఆవిష్కరించారు.
ఇలా ప్రంపంచంలోని అన్ని మతాల కవులు తమ దేవుళ్ళ సాన్నిధ్యం కోసం తమ దేవుళ్లను ప్రియుడు గానో,ప్రేయసిగానో భావించి కవిత్వం రాశారు.ఇది లౌకిక ప్రేమ కవిత్వంలా అనిపించినా అందులో అంతర్లీనంగా భగవంతుని పట్ల ఉన్న అమితమైన భక్తిని పొదిగారు.
ఒక mystical blending తో మతాల తేడా లేకుండా వాళ్ళ వాళ్ళ దేవుళ్ళ సాన్నిధ్యం కోసం పడే ఆరాటాన్ని,తపనను కవిత్వం చేశారు. హైందవ కవులు వాళ్ళ ప్రియ దేవుళ్ళను, మహమ్మదీయ కవులు ఖుదా ను,పాశ్చాత్యులైన ఆంగ్ల కవులు క్రీస్తు ను ప్రియుడిగానో.ప్రేయసి గానో భావిస్తూ లౌకిక ప్రేమ,దైవిక ప్రేమల మధ్య ఉండే సరిహద్దులను చెరిపివేస్తూ కవిత్వం చెప్పారు.
అయితే ఉర్దూ సాహిత్యంలోనే ఎక్కువగా అల్లాను మరియు ప్రేయసిని ఉద్దేశించి mystical blending కవిత్వం చెప్పిన కవులున్నారు. Ishq – e – Majazi అంటే లౌకికమైన ప్రేమ. Ishq – e – Haqiqi అంటే దైవికమైన ప్రేమ. Wali Deccani, Mir Taqi Mir, Miraza Galib,
Khwaja Miir Dard,Allama Iqbal మున్నగు ఉర్దూ కవులు ఇష్క్ అనే పదాన్ని కేవలం లౌకికమైన మానవ ప్రేమకే పరిమితం చేయకుండా ఖుదాను చేరుకొవడానికి, ఆత్మ న్యూనతను జయించడానికీ కవిత్వం లోకి తెచ్చారు.
ఉర్దూ సాహిత్య ప్రభావంవల్లనో,లేక ఇతర సాహిత్యాల ప్రభావం వల్లనో తెలీదు కానీ తెలుగులో కూడా కొందరు ముస్లిమ్ మైనారిటీ కవులు Mystical Blending తో కవిత్వం రాస్తున్నారు. అలాంటి కవిత ఒకటి ఈ మధ్యనే చదివాను.ఆ కవిత రాసింది అహ్మద్ వలీ అనే కవి.ఆ కవిత శీర్షిక ‘అంకురార్పణ’. “ఇక నేను కవిత్వం రాయడం మానేశాను” అని అంటూనే అద్భుతమైన కవిత్వం రాస్తూ ప్రతిదీ కవిత్వమే అనే ఊహతో కవిత్వాన్ని ఒళ్ళంతా పులుముకున్న కవి అహ్మద్ వలీ.
ప్రసిద్ధ విమర్శకులు,కవి,నిరంతర అక్షర హాలికుడు రజా హుస్సేన్ గారు ఈ కవిత చదివి “ ఈ కవిత భగవంతుడి ప్రేమలో పడిన భక్తుడి తాత్విక జీవన ప్రయాణం” అని అన్నారు.ప్రతి ఆనందాన్ని తొలకరి చినుకుల్లా గుండెలో ఒంపుకునే కవి,చీకటి పడగానే వియోగ వేదనని పంచుకోడానికీ నక్షత్రాలు మొలుస్తాయని భావించే కవి అహ్మద్ వలీ .అలాంటి భావుకత మెండుగా ఉన్న ఈ కవిలో జీవిత సారాన్ని ఒడిసిపట్టే కవితలు ఎన్నో రాశారు.పసితనపు సూఫీయతను, బాధను ప్రేమగా మార్చే రసవిద్యను అక్షరాలను అందంగా మాట్లాడించగలిగే మంత్రవిద్యను అభ్యసించిన కవి అహ్మద్ వలీ.
‘ అంకురార్పణ’ అనే ఈ కవితలో అంతఃసూత్రంగా ఒక సమర్పణ భావాన్ని కవి అహ్మద్ వలీ తాత్విక నేపథ్యంగా నిక్షిప్తం చేశారేమో?ఈ కవిత ప్రాంరంభంలో ‘ అలసిన హృదయంతో నమాజ్ చేసే కన్నీళ్లతో ముళ్ళ మధ్య పూల కోసం ఎదురు చూస్తూ’ అని కవి రాయడం వల్ల ప్రేయసి కోసం ఎదురు చూపేమో అనే భావన వెంటనే స్ఫురిస్తుంది.
ఈ కవితలో కవి మొదటి నాలుగు వాక్యాల తరువాత రాసిన వాక్యాలు చదివితే ప్రియురాలి కోసం కాదు ఈ కవి అన్వేషణ తను తనని వెదుక్కుంటూ ఆయన లేని చోటు లేదని తెలుసుకున్నాడట,ఆయన అంటే సర్వంతర్యామి అయిన ఖుదా.తనని తాను తెలుసుకోవడం కోసం అన్వేషణ చేసుకోవడం ఒక తాత్విక అంశం.రమణ మహర్షి కూడా “ నిన్ను నువ్వు తెలుసుకో” అని అన్నారు.
ఇట్లా ఈ కవితలో కవి ఒక అద్వైత వేదాంత భావనను చెబుతూ… “నీలో నన్ను చూసుకున్నాక నేను లేకుండా పోయాను” అని అంటాడు.ఈ మాటల్లో కూడా పైకి ప్రేమ భావనే స్ఫురిస్తుంది కాని ఇది కూడా లోతైన తాత్విక భావనే. ఇలా ఖుదా అంతరంగ ఉనికిని తేలికపాటి పాటి వాక్యాల్లో అహ్మద్ వలి చెబుతాడు. “ నీ నుంచి వీచే పరిమళం లో కరగిపోయాను” – అనే వాక్యాల్లో ప్రియురాలులో కరగిపోవాలనుకున్నాడేమో అనే భావన పైకి కనిపిస్తుంది.కానీ అంతర్గతంగా ఆలోచిస్తే ఈ వాక్యాల్లో ఖుదా లో తను మమేకం కావాలనే తపనను విరబూసినట్లు విప్పి చెప్పినట్లు అర్థం చేసుకోవచ్చును ఈ కవితను లోతుగా పరికిస్తే.
“నీ మౌనం నాకు ఆయత్ అయింది” అని అనటం కూడా ప్రేమ ప్రకటనలా అనిపిస్తుంది. ‘ఆయత్’ అంటే అరబిక్ భాషలో గుర్తు లేదా సూచన అర్థం. ఆమె మౌనం అల్లాహ్ ఉనికిని సూచించే అద్భుతం అని అర్థం కావొచ్చు.లేదా పవిత్ర ఖురాన్ లోని ప్రతి వాక్యాన్ని ఒక ‘ఆయత్’ అంటారు కాబట్టి జవదాటని ఖుదా వాక్యం ఈ మౌనం అనే ఊహగా కూడా ఆలోచన చేయవచ్చు,
“ నీ చూపు నాకు ఖురాన్ అయ్యింది” అనే వాక్యం ద్వారా తన ఆలోచన,దృష్టి,ప్రవర్తన మున్నగు
అన్ని ఖురాన్ మార్గదర్శకాలకు అద్దంలా పూర్తిగా మారిపోయిందని కవి భావిస్తున్నాడేమో? చూపు ఖురాన్ కావడం ‘సీరత్’ నుండి వచ్చిన ఒక లోతైన భావన.ఇట్లా లౌకిక ప్రేమను,దైవిక ప్రేమతో Blend చేసి మార్మికంగా ఒక అద్భుత కవితను అహ్మద్ వలీ రాశారు.ఆయనకు అభినందనలు.
లోతైన లోయలోకి వదిన సున్నితపు గులాబీ రేకుల నిశ్శబ్దం లాంటి కవిత్వం అహ్మద్ వలీ గారిది. నిశ్శబ్దంలో పాడుతున్న హృదయపు మార్మిక సంగీతం ఈతని కవిత్వం. మంచి కవిత్వం రాసే అహ్మద్ వలీ కవితా సంపుటి తీసుకరాకపోవడం తెలుగు పాఠకులకు తీరనిలోటే.
అంకురార్పణ ( కవిత )
~
అలసిన హృదయంతో
నమాజ్ చేసే కన్నీళ్ళతో
ముళ్ళ మధ్య
పూల కోసం ఎదురు చూస్తూ…
నేను నన్ను వెదుక్కుంటూ
నీ దగ్గరకు వచ్చాను.
నీ శ్వాస తాకిన చోటే
నా ప్రార్థన పుడుతోంది.
నీలో నన్ను చూసుకున్నాక
నేను లేకుండా పోయాను.
నీవు లేని చోటు లేదని తెలిశాక
వెతకడం ఆపేశాను.
నీ నుంచే వీచే పరిమళంలో
కరగిపోయాను.
నీ మౌనం
నాకు ఆయత్ అయింది.
నీ చూపు
నాకు ఖురాన్ అయింది.
*








Add comment