‘మధురానగర్ మెట్రోస్టేషన్’ కథ మొదలుపెట్టినప్పుడు ఒక నార్మల్ ప్రేమకథగా అనిపించింది. కానీ కథ చదువుతుంటే సూర్య, వెన్నెలల ప్రేమకంటే వాళ్ల చుట్టూ ఉన్న జీవితం ఎక్కువగా కనిపించింది. ఉద్యోగం కోసం పడే తిప్పలు, ఇంట్లో వాళ్ల నుంచి వచ్చే ఒత్తిళ్లు, ప్రేమను నిలబెట్టుకోవాలనే ప్రయత్నం, భవిష్యత్తు గురించి ఉండే అయోమయం అన్నీ మన చుట్టూ జరిగే విషయాల్లానే అనిపించాయి.
సూర్య, వెన్నెలలు కూడా కథలోని పాత్రలుగా కాకుండా మనకు తెలిసిన వాళ్లలాగా అనిపించారు. ఉద్యోగం కోసం తిరుగుతూ “ఎక్స్‌పీరియెన్స్ కావాలి” అని వినడం, ఇంటర్వ్యూలు ఇచ్చి ఫలితం కోసం ఎదురు చూడటం, మరోవైపు ఇంట్లో పెళ్లి గురించి మాట్లాడటం ఈతరం యువతలో చాలామంది ఎదుర్కొంటున్న విషయాలే. అందుకే వాళ్లిద్దరి సంభాషణలు చదువుతుంటే కథ చదువుతున్నట్టు కాకుండా, మనకు తెలిసిన ఇద్దరు వ్యక్తులు పక్కనే కూర్చొని మాట్లాడుకుంటున్నట్టుగా అనిపించింది.
వాళ్ల ప్రేమను కూడా చాలా సహజంగా అనిపించింది. కలిసి నడవడం, మెట్రోలో ప్రయాణించడం, సినిమా వెళ్లాలని అనుకోవడం, ఒకరి చేయి ఒకరు పట్టుకోవడం, గంటల తరబడి కబుర్లు చెప్పుకోవడం. అంతే. ప్రేమను చూపించడానికి పెద్ద పెద్ద సంఘటనలు అవసరం లేదనిపించేలా ఉన్నాయి ఈ సన్నివేశాలు. నిజ జీవితంలో కూడా మనకు ఎక్కువగా గుర్తుండిపోయేవి ఇలాంటి చిన్న క్షణాలే కదా.

ఈ కథలో మెట్రో కూడా నాకు ఒక పాత్రలా అనిపించింది. అది కేవలం ఒక చోటు నుంచి మరోచోటికి తీసుకెళ్లే కాదు. సూర్య, వెన్నెలల జీవితంలో జరిగిన ఎన్నో విషయాలకు అది సాక్షిగా నిలుస్తుంది. ఉద్యోగాలు వచ్చిన తర్వాత మెట్రోలోనే ఆఫీసుకు వెళ్లొచ్చని ఇద్దరూ కలలు కంటారు. అదే మెట్రోలో కలిసి తిరుగుతారు. చివరికి అదే మెట్రోస్టేషన్ సూర్య ఎదురుచూపుకు ఒక గుర్తుగా మిగిలిపోతుంది.
సారథి స్టూడియో దగ్గర వచ్చే సన్నివేశం కూడా నాకు బాగా నచ్చింది. ట్రైన్‌లో నుంచి చూస్తే పెద్ద పెద్ద భవనాలు, ఇళ్లు, పోలీస్ స్టేషన్, మార్కెట్ అన్నీ నిజంగానే ఉన్నట్టుగా కనిపిస్తాయి. కొంచెం ముందుకు వెళ్లాక వాటి వెనుక ఉన్న చెక్కలు, కట్టెలు కనిపిస్తాయి. ఆ దృశ్యాన్ని చూసి వెన్నెల మనుషుల గురించి చెప్పే పోలిక చాలా బాగుంది. ఒక వ్యక్తిని మొదటిసారి కలిసినప్పుడు వాళ్లలో మనకు నచ్చినవే ఎక్కువగా కనిపిస్తాయి. దగ్గరవుతున్న కొద్దీ వాళ్లలోని మరో వైపు కూడా తెలుస్తుంది. వెన్నెల ఆ ఆలోచనను పూర్తిగా చెప్పలేకపోయినా, ఆ సన్నివేశం మాత్రం మనుషుల్ని అర్థం చేసుకునే విధానం గురించి ఆలోచించేలా చేసింది.
కానీ కథలో నన్ను ఎక్కువగా తాకిన విషయం సూర్య ఎదురుచూపు.
“వచ్చే శనివారం వస్తా” అని వెన్నెల చెప్పి వెళ్లిపోతుంది. ఒక శనివారం గడుస్తుంది. ఇంకో శనివారం గడుస్తుంది. అలా తొమ్మిది శనివారాలు వెళ్లిపోయినా వెన్నెల రాదు. అయినా సూర్య మాత్రం ఆమె కోసం ఎదురుచూస్తూనే ఉంటాడు.
ఈ భాగం చదువుతున్నప్పుడు మన తరం గురించి కూడా ఆలోచించాను. ఇప్పుడు మనం చాలా వేగవంతమైన టెక్నాలజీ లో జీవిస్తున్నాం. ఒక మెసేజ్‌కి రిప్లై కొంచెం ఆలస్యమైనా ఎందుకు రాలేదని ఆలోచిస్తాం. ఫోన్ ఎత్తకపోతే ఏదో జరిగిందేమో అనుకుంటాం. అలాంటి సమయంలో ఒక మనిషి కోసం ఇన్ని వారాలు ఎదురుచూడటం చాలా పెద్ద విషయం. సూర్య ఎదురుచూపులో అతని ప్రేమ మాత్రమే కాదు, ఆ బంధంపై అతనికి ఉన్న నమ్మకం కూడా కనిపించింది.
సూర్య ఒంటరిగా ఉన్నప్పుడు చేసే చిన్న చిన్న పనులు కూడా నాకు బాగా గుర్తుండిపోయాయి. రాత్రంతా సినిమాలు చూడటం, ఏదో తినడం, నిద్రపోవడం, మళ్లీ ఆఫీస్ పనిలో పడిపోవడం… అతను ఎక్కడా కూర్చొని తన బాధను చెప్పుకోడు. కానీ అతను చేసే పనులన్నింటిలోనూ ఆ ఒంటరితనం కనిపిస్తుంది. మనకు బాధగా ఉన్నప్పుడు కూడా రోజువారీ పనులు ఆగవు కదా. బయటికి మనం మామూలుగానే కనిపిస్తాం. లోపల మాత్రం ఏదో ఒకటి వెంటాడుతూనే ఉంటుంది. సూర్యలో నాకు అదే కనిపించింది.
అయితే వెన్నెల ఎందుకు రాలేదనే విషయం చివరి వరకు తెలియకపోవడం మాత్రం నాకు కొంచెం అసంతృప్తిగా అనిపించింది. ఆమె పరిస్థితి గురించి కనీసం ఒక చిన్న సూచన అయినా ఉంటే బాగుండేదనిపించింది. అదే సమయంలో, రచయిత ఆ విషయాన్ని చెప్పకుండా వదిలేయడం వల్ల మనమే ఏం జరిగి ఉండొచ్చో ఆలోచించుకునే అవకాశం కూడా వచ్చింది అనిపించింది.
కథ పూర్తయ్యాక ఇది కేవలం సూర్య, వెన్నెలల ప్రేమకథగా అనిపించలేదు. ఉద్యోగం కోసం నగరాలకు వచ్చే యువత కలలు, వాళ్లపై ఉండే కుటుంబ ఒత్తిళ్లు, ప్రేమను నిలబెట్టుకోవాలనే ప్రయత్నం, ఒంటరితనం, ఎదురు చూపులు… అన్ని కలిసిన కథలా అనిపించింది. అందుకే ఈ కథ ఈ తరానికి మరింత దగ్గరగా అనిపిస్తుంది.
చివర్లో సూర్య మళ్లీ మధురానగర్ మెట్రోస్టేషన్ దగ్గర నిలబడినప్పుడు, కథ మొదలైన చోటికే తిరిగి వచ్చినట్టుగా అనిపించింది. కానీ మొదట అక్కడ నిలబడ్డ సూర్య వేరు. చివర్లో నిలబడ్డ సూర్య వేరు. మధ్యలో అతని జీవితంలో చాలా జరిగిపోయాయి. ఒక మనిషి రాకపోవడం కూడా ఇంకొక మనిషి జీవితాన్ని ఇంతగా మార్చగలదా అనిపిస్తుంది.
కథ చదివి పూర్తిచేసిన తర్వాత కూడా నా మనసులో ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోయింది?
మన జీవితంలో కొంతమంది లేకపోయినా, వాళ్లతో కలిసి గడిపిన ప్రదేశాల దగ్గర మాత్రం మనం ఎందుకు ఇంకా ఎదురుచూస్తూనే ఉంటాం?కథ అక్కడితో ముగిసినా, సూర్య ఎదురుచూపు మాత్రం మనలో ఎక్కడో మిగిలిపోతుంది.
పుస్తకం : ఒంటరితనపు కథలు
కథ : మధురానగర్ మెట్రోస్టేషన్
రచయిత : మొహమ్మద్ గౌస్
ప్రచురణ : అజు పబ్లికేషన్స్
*








Add comment