ఈ రోజు బోర్డు గదిలోకి అడుగు పెడుతున్నప్పుడు నా చేతులు వణకలేదు. కానీ నా మనసులో మాత్రం చాలా ఏళ్ల క్రితం చనిపోయిందనుకున్న ఒక దడ మళ్లీ కదిలింది. అదే ‘ ఇంగ్లీష్’. నా ముందు సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు కూర్చున్నారు. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు పనిచేసే ఆ సంస్థకు తదుపరి సీఈఓ ఎవరు అన్నది ఈ సమావేశం నిర్ణయించబోతోంది. చివరి దశలో డేనియల్, ఫ్రాంక్ , నేనూ – మేము ముగ్గురం ఉన్నాం. డేనియల్, ఫ్రాంక్‌లకు ఇంగ్లీష్ మాతృభాష, కానీ నాకు కాదు.
ఒకప్పుడు ఇంగ్లీష్ పుస్తకం తెరిస్తేనే నాకు భయానకంగా ఉండేది. టీచర్ ప్రశ్న అడిగితే నా గుండె వేగంగా కొట్టుకునేది. ఇతర పిల్లలు చదువుతుంటే నేను తలదించుకుని కూర్చునేవాడిని. ఆ రోజుల్లో నేను ఒక విషయం నమ్మేవాడిని.
“నాకు ఇంగ్లీష్ రాదు.” ఆ మాట క్రమంగా… “నాకు ఏదీ సరిగ్గా రాదు.” అనే నమ్మకంగా మారింది. కానీ ఆ రోజు బోర్డు గదిలో కూర్చున్నప్పుడు నాకు మరో మాట గుర్తొచ్చింది. చాలా సంవత్సరాల క్రితం నా మాస్టర్ నాతో చెప్పిన మాట. “నీకు ఇంగ్లీష్ సమస్య కాదు. ‘నాకు రాదు’ అనే భయమే నీ సమస్య.” ఆ మాట చెప్పింది సుందరం మాస్టర్. నా జీవితాన్ని మార్చిన మనిషి.
***
సమావేశం మొదలైంది. మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పాను. తర్వాత రెండో ప్రశ్న. సంస్థ ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగారు. నేను సమాధానాలు చెప్పాను. నా భాష గురించి ఆలోచించలేదు. నా ముందు ఉన్న సమస్య గురించి మాత్రమే ఆలోచించాను. కొన్ని ప్రశ్నలకు సమాధానం వెంటనే తెలియలేదు. “ఈ విషయంపై పూర్తి సమాచారం లేకుండా ఊహించి సమాధానం చెప్పడం సరైంది కాదు. కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు నేను ఈ మూడు అంశాలను పరిశీలిస్తాను.” అన్నాను.
బోర్డు సభ్యుల్లో ఒకరు అడిగారు. “మిస్టర్ కృష్ణమూర్తి, మీరు ఇప్పటివరకూ తీసుకున్న నిర్ణయాల్లో మీకు అత్యంత కష్టమైనది ఏది?”
ఆ ప్రశ్న సాధారణంగానే అనిపించింది. కానీ నా మనసు వెంటనే ఒక తలుపు తట్టింది. చాలా సంవత్సరాల క్రితం మూసేసిన తలుపు. నా మనసులో మాత్రం మాస్టర్ నిలబడి ఉన్నారు. నేను కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాను. బోర్డు సభ్యుడు మళ్లీ అడిగాడు. “మిస్టర్ కృష్ణమూర్తి?”
నేను తేరుకుని చెప్పాను. “ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు తీసుకునే నిర్ణయాలు కష్టం కాదు. ఆ వ్యక్తి ఇంకా మారగలడని నమ్మడం అదే అసలైన కష్టమైన నిర్ణయం.” గదిలో కొద్దిపాటి మౌనం. బోర్డు సభ్యుడు కళ్లు చిట్లించి చూశాడు. “మీ అనుభవం నుంచేనా ఇది చెబుతున్నారా?”
నేను ఒక్క క్షణం ఆగాను. “నా అనుభవం నుంచి కాదు. నన్ను నమ్మిన ఒక మనిషి అనుభవం నుంచి.” అంతకు మించి ఏమీ చెప్పలేదు. కానీ ఆ మాట చెప్పేటప్పుడు నా గొంతులో ఏదో వణుకు అతనికి తెలిసిందేమో, ఆయన మరో ప్రశ్న అడగలేదు. కొద్దిసేపు గదిలో నిశ్శబ్దం తరువాత మరికొన్ని ప్రశ్నలు… సమాధానాల తరువాత సమావేశం ముగిసింది. బయటకు వచ్చినప్పుడు నా చేతులు ప్రశాంతంగా ఉన్నాయి. కానీ నా మనసు మాత్రం ఎన్నో సంవత్సరాల వెనక్కి పరుగెత్తింది.
***
నా పేరు కృష్ణమూర్తి. కానీ ఆ పాఠశాలలో నన్ను అందరూ కిట్టూ అని పిలిచేవారు. ఒక పేద కుటుంబంలో పుట్టాను. మా అమ్మ నాన్న వ్యవసాయ కూలీలుగా పని చేసేవారు. మా ఇంట్లో పెద్దగా ఏమీ లేదు. కానీ ఒక ఆశ మాత్రం ఉండేది. “బాగా చదువుకుంటే నీ జీవితం మారుతుంది.” అని మా నాన్న చెప్పేవాడు. నాకూ కూడా చదువుకోవాలనే కోరిక ఉండేది. కానీ చదువులో నేను గొప్పవాడిని కాదు. ప్రత్యేకంగా ఇంగ్లీష్ అంటే నాకు వణుకు. పుస్తకం తెరిచినప్పుడు పదాలు కనిపించేవి. అర్థం మాత్రం కనిపించేది కాదు. క్లాస్‌లో ఎవరైనా ఇంగ్లీష్ చదివితే నేను వాళ్లను చూస్తూ ఉండేవాడిని.
“ఇది వాళ్లకు ఎలా వస్తుంది?” అనుకునేవాడిని. ఒక రోజు టీచర్ నన్ను నిలబెట్టి ఒక పేరా చదవమంటే నేను మొదటి పదం దగ్గరే ఆగిపోయాను. ఎవరో నవ్వారు. ఆ నవ్వు నాకు చిన్న విషయం కాదు. అది నా లోపలికి వెళ్లిపోయింది. ఆ రోజు ఇంటికి వెళ్లి పుస్తకం తెరిచాను. చదవడానికి ప్రయత్నించాను. మళ్లీ అదే. అప్పుడు మొదటిసారి నాకు అనిపించింది. నేను ఇతర పిల్లలకంటే తక్కువ.
***
సుందరం మాస్టర్ మా పాఠశాలలో ఇంగ్లీష్, లెక్కలు చెప్పేవారు. పాఠాలు బాగా చెబుతారు. ఆయనకు క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఆయన ముందు ఎవరూ అబద్ధం చెప్పడానికి ప్రయత్నించేవారు కాదు. ఆయనంటే అందరికి గౌరవం.
ఒక నెల తర్వాత యూనిట్ పరీక్షలు. ఆ రోజు ఇంగ్లీష్ పరీక్ష. ఉదయం నుంచే నాకు దిగులు. మా నాన్న ముందురోజు చెప్పిన మాట గుర్తుంది. “ఈసారి మంచి మార్కులు రావాలి.”
నేను చదివాను. కానీ నాకు తెలిసినదానికంటే తెలియనిదే ఎక్కువగా అనిపించింది. పరీక్ష మొదలైంది. మొదటి ప్రశ్నకు సమాధానం వచ్చింది. రెండో ప్రశ్న కూడా రాశాను. మూడో ప్రశ్న దగ్గర ఆగిపోయాను. చుట్టూ చూశాను. అందరూ రాస్తున్నారు. నా చేతులు చెమటపట్టాయి. అప్పుడే నా జేబులో ఉన్న చిన్న స్లిప్ గుర్తొచ్చింది. ముందురోజు బెదురు తో కొన్ని సమాధానాలు రాసుకున్నాను. అది తప్పని నాకు తెలుసు. అయినా జేబులోంచి తీశాను. కాగితం తెరిచాను.
అప్పుడే నా ముందు ఒక నీడ పడింది. తలెత్తి చూశాను. సుందరం మాస్టర్. ఆయన నా చేతిలోని కాగితాన్ని చూశారు. తర్వాత నా ముఖాన్ని చూశారు. ఆ చూపును నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఆయన కోపంగా లేరు. అదే నాకు ఇంకా బాధ కలిగించింది. నా చేతిలోని స్లిప్ తీసుకున్నారు. నా ఆన్సర్ పేపర్ తీసుకున్నారు. “బయటకు వెళ్లు.” అన్నారు.
నేను లేచాను. క్లాస్‌లోని ప్రతి పిల్లవాడి చూపు నా మీదే ఉన్నట్లు అనిపించింది. ఆ క్షణంలో నా తప్పు కనిపించలేదు. నాకు అవమానం మాత్రమే కనిపించింది.
***
ఆ రోజు సాయంత్రం నేను స్కూల్ నుంచి ఇంటికి వెళ్లలేదు. ఇంటికి వెళితే నాన్న ఏమంటాడు? రేపటి నుండి నా తోటి పిల్లలు నవ్వుతారు, గేలి చేస్తారు. మిగిలిన టీచర్లు నన్ను తక్కువగా చూస్తారు. అవమానం … కోపం… “ఎందుకు అందరి ముందు అవమానించారు?” “నన్నే ఎందుకు పట్టుకున్నారు?” నేను తప్పు చేశానని తెలుసు. కానీ ఇంత అవమానం ఎందుకు? అని నాలోనే మాట్లాడుకుంటున్నాను. రోడ్డు పక్కన నిలబడ్డాను. దూరంగా మాస్టర్ వస్తున్నారు.
ఆయనను చూసినప్పుడు నా కోపం మళ్లీ పెరిగింది. రోడ్డు పక్కన ఒక చిన్న రాయి కనిపించింది. నేను దాన్ని చేతిలోకి తీసుకున్నాను. ఆ తర్వాత నేను చేసిన పని గురించి ఇప్పటికీ ఆలోచిస్తే నా గుండె బరువెక్కుతుంది. నేను రాయిని విసిరాను.
రాయి ఆయన తలకు తగిలింది. “అమ్మా…” అని ఆయన ఒక్కసారి కిందికి వాలిపోయారు.
రాయి చేతిలోంచి బయటకు వెళ్లిన క్షణం వరకు నేను కోపంతో ఉన్నాను. అది మాస్టర్ తలకు తగిలిన క్షణంలో మాత్రం నా కోపం చనిపోయింది. నా ముందున్నది శత్రువు కాదు, నన్ను చదివించాల్సిన నా మాస్టర్. నేను ఏం చేశానో అర్థమైంది. పరుగెత్తాను. చాలా దూరం పరుగెత్తాను. కానీ నా నుంచి నేను మాత్రం తప్పించుకోలేకపోయాను.
***
ఆ రాత్రి నాకు నిద్ర రాలేదు. మాస్టర్ ముఖం పదేపదే కనిపించింది. నేను విసిరిన రాయి. ఆయన నేలపై పడటం.
ఆ ఒక్క అరుపు. నా చేతులు వణికాయి. “ఎవరైనా చూసారా?” “ఆయన నన్ను గుర్తుపట్టారా?” “పోలీసులకు చెబుతారా?”
“నాన్నకు తెలిస్తే?” ప్రతి ప్రశ్న నా తలలో తిరుగుతోంది. మరుసటి రోజు పాఠశాలలో అందరూ ఒకటే విషయం మాట్లాడుతున్నారు. మాష్టర్‌ను ఎవరో రాయితో కొట్టారు. పోలీసులు వచ్చారు. హెడ్మాష్టర్ విచారణ చేశారు. నేను మూలన కూర్చున్నాను. ఎవరూ నన్ను అడగలేదు. అప్పుడు నాకు మొదటిసారి ఆశ్చర్యం ఎక్కువైంది.
***
మూడు వారాల తర్వాత సుందరం మాస్టర్ తిరిగి పాఠశాలకు వచ్చారు. తలపై గాయం మిగిలింది. నేను ఆయనను దూరం నుంచి చూస్తున్నాను. ఆయన నన్ను చూసేవారు. కానీ ఏమీ అనేవారు కాదు. అదే నన్ను మరింత కంగారుపెట్టేది. ఒక రోజు మా నాన్న స్కూల్‌కు వచ్చారు. “బాబు ఈ మధ్య మా కిట్టూ సరిగ్గా తినడం లేదు. నిద్రపోవడం లేదు. చదువుపై కూడా దృష్టి లేదు. మీరు కాస్త మాట్లాడండి.” అని సుందరం మాస్టర్ తో అన్నారు. నా గుండె ఒక్కసారిగా ఆగినట్టైంది. “ఇప్పుడు మాస్టర్ మా నాన్నకు చెబుతారు.” అనుకున్నాను. కానీ మాస్టర్ నా వైపు చూసి “సరే… నేను చూసుకుంటాను.” అన్నారు. అంతే. ఆ రోజు నేను మొదటిసారి సిగ్గు పడ్డాను.
***
మరుసటి రోజు క్లాస్ అయిపోయిన తర్వాత మాస్టర్ నన్ను పిలిచారు. “కిట్టూ… నువ్వు ఉండు.” అందరూ వెళ్లిపోయారు.
నేను తలదించుకుని కూర్చున్నాను. ఆయన నా దగ్గరకు వచ్చారు. “ఈ రోజు చెప్పిన పాఠం అర్థమైందా?” నేను తల అడ్డంగా ఊపాను. “లేదు.” “పర్లేదు. మళ్లీ చెబుతాను” అని పాఠం విడమరచి చెప్పారు. అంతకు మించి ఆయన నన్ను ఏమీ అడగలేదు. ఆ రాయి గురించి కాదు. పరీక్ష గురించి కాదు. స్లిప్ గురించి కాదు. ఆ రోజు ఇంటికి వెళ్తూ నాకు ఒక ప్రశ్న మాత్రమే వెంటాడింది. “మాష్టారికి నిజంగా ఏమీ తెలియదా?”
***
మరుసటి రోజు… “కిట్టూ, ఎందుకు భయపడుతున్నావు?”
నాకు“ఇంగ్లీష్ రాదు మాష్టారూ.” అన్నాను.
ఆయన కొద్దిసేపు నన్ను చూశారు.
“అది నీ సమస్య కాదు.”
నాకు అర్థం కాలేదు.
“మరి?”
“నీకే నువ్వు ‘నాకు రాదు’ అని చెప్పుకుంటున్నావు. అదే నీ అసలు సమస్య.”
అక్కడి నుంచి నా జీవితంలో చిన్న మార్పు మొదలైంది. ఆయన నాకు పెద్ద పెద్ద పాఠాలు చెప్పలేదు.
ఒక పదం నేర్పారు. తర్వాత ఒక వాక్యం. నేను చదివితే విన్నారు. తప్పు చేస్తే సరిచేశారు. మళ్లీ చదివించారు.
మొదటిసారి ఒక వాక్యాన్ని తప్పు లేకుండా చదివినప్పుడు ఆయన నవ్వారు. ఆ నవ్వు నాకు ఇప్పటికీ గుర్తుంది.
అది నా మీద వెటకారపు నవ్వు కాదు. నన్ను నమ్మిన నవ్వు. మరుసటి రోజు కూడా అదే. తర్వాతి రోజు కూడా అదే.
ప్రతిరోజూ అరగంట. ఒక పదం. ఒక వాక్యం. ఒక ప్రశ్న. ఒక సమాధానం. క్రమంగా నా శంక తగ్గింది. ఒక రోజు నేను మాష్టర్‌ను అడిగాను. “మాష్టారూ… నేను కూడా ఇంగ్లీష్ బాగా మాట్లాడగలనా?”
ఆయన నవ్వారు.
“ఎందుకు కాదు?”
“నాకు రాదు కదా.”
“అదే మళ్లీ చెబుతున్నావు.”
నేను మౌనంగా ఉన్నాను.
“నువ్వు చేయలేవని ఎవరు చెప్పారు?”
“నేనే.”
ఆయన నా భుజంపై చేయి వేశారు.
“అయితే ఆ మాట మార్చు.”
ఆ రోజు నుంచి నేను నాతో మాట్లాడే విధానం మారింది.
“నాకు రాదు” అనుకోవడం మానేశాను.
“నేర్చుకుంటాను” అనడం మొదలుపెట్టాను.
***
తర్వాత పరీక్ష వచ్చింది. ఈసారి నా జేబులో ఎలాంటి స్లిప్ లేదు. పరీక్ష రాయగలనా లేదా అనే అభద్రత మాత్రం ఉంది. కానీ పారిపోలేదు. నాకు తెలిసినవి రాశాను. తెలియనివి వదిలేశాను. ఫలితాలు వచ్చిన రోజు నా పేరు మంచి మార్కులతో కనిపించింది. నేను పరుగెత్తుకుంటూ మాస్టర్ దగ్గరకు వెళ్లాను. ఆయన కాళ్లకు నమస్కరించబోయాను. ఆయన నన్ను లేపేశారు. “నేను నీకు దారి చూపాను కిట్టూ. నడిచింది నువ్వే.” ఆ మాట నా జీవితంలో ఒక మలుపు. ఆ రోజు నేను పరీక్షలో మాత్రమే గెలవలేదు.
నా మీద నేనే గెలిచాను.
***
తర్వాతి సంవత్సరాలు గడిచిపోయాయి. పాఠశాల పూర్తయింది. కిట్టూ నుండి కృష్ణమూర్తిగా మారాను. ఇంజినీరింగ్‌లో చేరాను. అక్కడ కూడా ఎన్నోసార్లు ఓడిపోయాను. కొన్ని పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయి. మొదటి ఉద్యోగంలో ప్రెజెంటేషన్ ఇవ్వాల్సిన రోజు ఇంగ్లీష్‌లో మాట్లాడాల్సి వచ్చింది. పాత కిట్టూ మళ్లీ భయపడ్డాడు. తడబడ్డాను. ఆ రోజు నేను రాజీనామా చేయాలని అనుకున్నాను. అప్పుడు మాస్టర్ మాట గుర్తొచ్చింది. కానీ “నాకు రాదు” అనుకోకుండా “నేర్చుకుంటాను” అని మనసులో అనుకున్నాను. “వెనక్కి వెళ్లడం అంటే ఒకసారి ఓడిపోవడం కాదు. ప్రయత్నం ఆపేయడం.”
తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకున్నాను. మళ్లీ ప్రయత్నించాను. ఈసారి నేను ఓడిపోలేదు.” మెల్లగా బాధ్యతలు పెరిగాయి.
ఒక సంస్థ నుంచి మరో సంస్థకు వెళ్లాను. దేశాలు మారాను. పదవులు మారాను. కానీ నా లోపల ఎక్కడో ఆ చిన్న కిట్టూ అలాగే ఉన్నాడు.
***
ఫోన్ వచ్చింది. “అభినందనలు, మిస్టర్ కృష్ణమూర్తి. తదుపరి సీఈఓగా మిమ్మల్ని బోర్డు ఎంపిక చేసింది.”
కొన్ని క్షణాలు నేను ఏమీ మాట్లాడలేదు. ఫోన్ పెట్టేశాను. సీఈఓగా ఎంపికైన ఈ రోజు నాకు ఒక విషయం స్పష్టంగా తెలిసింది. నా విజయానికి కారణం నేను ఒక్కణ్ణి కాదు. నా జీవితంలో ఒక సమయంలో నేను తప్పిపోయాను.
ఆ సమయంలో నన్ను పట్టుకుని నిలబెట్టిన ఒక మనిషి ఉన్నాడు. సుందరం మాస్టర్. ఆయనను కలవాలని నిర్ణయించుకున్నాను.
***
ఎన్నో సంవత్సరాల తర్వాత నా పాత ఊరికి వెళ్లాను. పాఠశాల మారిపోయింది. రోడ్లు మారిపోయాయి. కానీ కొన్ని దారులు మాత్రం మారలేదు. మాస్టర్ రిటైర్ అయ్యి ఒక చిన్న ఇంట్లో ఉంటున్నారని తెలిసింది. ఆ ఇంటి ముందు నిలబడినప్పుడు నా గుండె మళ్లీ వేగంగా కొట్టుకుంది. నేను సీఈఓగా వేలాది మంది ముందు మాట్లాడాను. ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో సమావేశాలు నడిపాను. కానీ ఆ చిన్న తలుపు తట్టడానికి మాత్రం నా చేతులు వణికాయి.
“టక్… టక్…” తలుపు తెరుచుకుంది.
ఒక వృద్ధురాలు. “ఎవరు బాబు?” “సుందరం మాస్టరుని కలవడానికి వచ్చాను.”
కొద్దిసేపటి తర్వాత ఆయన బయటకు వచ్చారు.
జుట్టంతా తెల్లబడింది. చేతిలో కర్ర. ఆయన నన్ను చూశారు. గుర్తుపట్టలేదు. “ఎవరు బాబు?” “మాష్టారూ… నేను కృష్ణమూర్తిని.” ఆయన ఆలోచించారు. “ఏ కృష్ణమూర్తి?” గొంతు కొద్దిగా వణికింది.
“మాష్టారూ… కిట్టూని.” ఆయన కళ్లలో ఒక్కసారిగా వెలుగు వచ్చింది.
“అరే… కిట్టూ!” ఆయన నా భుజంపై చేయి వేశారు. “ఎలా ఉన్నావురా?”
ఆ ప్రశ్న విన్నప్పుడు నేను సీఈఓ కాదు. నేను మళ్లీ అదే చిన్న కిట్టూనయ్యాను.
***
మేము చాలాసేపు మాట్లాడుకున్నాం. నా ఉద్యోగం గురించి అడిగారు. నా తల్లిదండ్రుల గురించి అడిగారు. నా కుటుంబం గురించి అడిగారు. కానీ నా మనసులో మాత్రం ఎన్నో సంవత్సరాలుగా దాచుకున్న ఒక మాట ఉంది. చెప్పాలా? వద్దా?
చివరకు దాచుకోలేకపోయాను. నేను ఆయన ముందు మోకాళ్లపై కూర్చున్నాను.
“మాష్టారూ…”
ఆయన నా వైపు చూశారు. “ఏమైంది?”
నా గొంతు వణికింది. “ఆ రోజు… మిమ్మల్ని రాయితో కొట్టింది నేనే.”
ఆయన ఏమీ మాట్లాడలేదు. నా కళ్ల నుంచి కన్నీళ్లు వచ్చాయి. “నన్ను క్షమించండి మాష్టారూ.”
కొన్ని క్షణాలు గడిచాయి. ఆయన నా భుజంపై చేయి వేశారు. “తెలుసు” అని నెమ్మదిగా అన్నారు
నేను తలెత్తి చూశాను. “తెలుసా?”
ఆయన చిరునవ్వు నవ్వారు. “ఆ రోజే తెలుసు.”
నా దగ్గర మాట లేదు. “మరి… ఎందుకు ఎవరికీ చెప్పలేదు?”
ఆయన కాసేపు మౌనంగా ఉన్నారు. “ఆ రోజు నాకు కూడా కోపం వచ్చింది కిట్టూ. నిన్ను పోలీసులకు అప్పగించాలని అనిపించింది. నీ తండ్రికి చెప్పాలని కూడా అనిపించింది. కానీ మరుసటి రోజు నిన్ను క్లాస్‌లో చూసినప్పుడు… నాలోని కోపం కంటే, నీ అమాయకత్వం పెద్దగా కనిపించింది.”
ఆ మాట విని నేను ఆయన వైపు చూశాను.
“నిన్ను శిక్షించాలని అనిపించింది.” కొద్దిసేపు ఆగారు. “కానీ తర్వాత నిన్ను చూశాను. నువ్వు చెడ్డ పిల్లవాడిలా కనిపించలేదు. భయపడిపోయిన పిల్లవాడిలా కనిపించావు.”
నా తల వాలిపోయింది.
“నిన్ను శిక్షిస్తే ఆ రోజు నా కోపం తగ్గేది. కానీ నువ్వు మారేవాడివో లేదో నాకు తెలియదు.”
ఆయన నా వైపు చూశారు. “అందుకే మరో మార్గం ఎంచుకున్నాను.” “నిన్ను మార్చాలని.”
నేను ఇక ఆపుకోలేకపోయాను. ఆయన పాదాలపై తల వాల్చాను. ఆ రోజు నా జీవితంలో మొదటిసారి నాకు తెలిసింది…
నేను చేసిన తప్పును క్షమించిన మనిషి కంటే గొప్పవాడు, ఆ తప్పు చేసిన తర్వాత కూడా నన్ను నమ్మిన మనిషి.
***
కొన్ని రోజుల తర్వాత మా కంపెనీ వార్షిక సమావేశం జరిగింది. వేలాది మంది ఉద్యోగులు ఉన్నారు. డైరెక్టర్లు ఉన్నారు.
నన్ను సీఈఓగా పరిచయం చేశారు. అభినందనలు. ప్రసంగాలు. నేను వింటున్నాను. కానీ నా కళ్ల ముందు మాత్రం ఒక వృద్ధుడు కూర్చున్నాడు.
సుందరం మాస్టర్.
నేను మైక్ దగ్గరకు వెళ్లాను. చేతులు వణుకుతున్నాయని అప్పుడే గుర్తించాను. ఎన్నో బోర్డు రూమ్‌లలో, ఎన్నో వేదికల మీద వణకని చేతులు. “ఈ రోజు నేను పొందుతున్న గౌరవం నా ఒక్కరిది కాదు.” సభ నిశ్శబ్దమైంది.
“ఎందుకంటే ఈ స్థాయికి రాకముందు, ఒకసారి నేను పూర్తిగా తప్పిపోయాను.” మాస్టర్ వైపు చూశాను. ఆయన కళ్లు నా మీదే ఉన్నాయి. “అప్పట్లో నాకు ఒకటే భయం నాకు ఏదీ రాదని. దాంతోనే ఒక తప్పు చేశాను. చాలా పెద్ద తప్పు.” కొద్దిసేపు ఆగాను. మాటలు రావడం లేదు “ఆ తప్పుకి నన్ను శిక్షించి ఉండవచ్చు. కానీ నా గురువు వేరే దారి ఎంచుకున్నారు. ఆ ఎంపికే నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది.”
నేను మాస్టర్ దగ్గరకు వెళ్ళాను. “మాష్టారూ… వేదికపైకి రండి.” ఆయన నెమ్మదిగా లేచారు, కర్ర ఆధారంగా. ఆయన నడుస్తుండగా ఒక ఆలోచన నన్ను తాకింది. ఏళ్ల క్రితం ఈ చేతులే ఆయన మీదకు రాయి విసిరాయి. ఈ రోజు అవే చేతులు ఆయనను వేదికపైకి నడిపిస్తున్నాయి. నేను వంగి ఆయన పాదాలకు నమస్కరించాను. ఆయన నన్ను లేపారు.
“ఇదంతా ఎందుకయ్యా?”
నా గొంతు పూర్తిగా రాలేదు. “మీరు నాకు ఉద్యోగం ఇవ్వలేదు మాష్టారూ. సీఈఓని చేయలేదు.” ఆగాను. “నేను మనిషిగా మిగలడానికి కారణం మీరు.” సభలో చప్పట్లు కాదు, మౌనం. ఆ మౌనమే ఎక్కువ మాట్లాడింది.
మాస్టర్ మైక్ దగ్గరకు వెళ్లారు. “నేను పెద్దగా ఏమీ చేయలేదు…ఒక్క క్షణం ఆగారు… “ఒక పిల్లవాడు తప్పు చేశాడు. అతను మారగలడని నమ్మాను. అంతే…” మైక్ పక్కన పెట్టేసి, తన సీటు వైపు నడిచారు.
***
ఆ రాత్రి ఇంటికి వెళ్లిన తర్వాత నేను ఒంటరిగా కూర్చున్నాను. ప్రపంచం నన్ను కృష్ణమూర్తి అనే సీఈఓగా గుర్తించవచ్చు.
నా విజయాలను లెక్కించవచ్చు. నా నాయకత్వాన్ని ప్రశంసించవచ్చు. కానీ నా హృదయంలో మాత్రం నేను ఎప్పటికీ…
సుందరం మాస్టర్ కిట్టూనే. “ఆ రోజు మాస్టర్ నాకు ఇంగ్లీష్ నేర్పలేదు. ముందుగా నాకు నన్ను నేను నమ్ముకోవడం నేర్పారు.” ఆయన శిక్ష నా తప్పును ఆపేది. కానీ నా గురువు చూపిన క్షమ… నన్ను మార్చింది.
ఉపాధ్యాయ వృత్తి ధర్మాన్ని నిష్ఠతో పాటిస్తున్న ఉపాధ్యాయులందరికీ ఈ కథ అంకితం.








Add comment