బిగ్ బాడ్ షో!

టీవీలు, సినిమాల ద్వారా తమకు ఏదో ఓ మేరకు పరిచయమున్న సెలబ్రిటీలు అంత సిల్లీ కోపతాపాలతో, అచ్చం తమలాగే ప్రవర్తించటం ప్రేక్షకులకి వినోదంగా వుంది. 

నం ఇప్పటి వరకు ఇల్లంటే కుటుంబం అనుకుంటుండే వాళ్ళం.  “ఇంటికి వెళుతున్నా” అంటే “నా కుటుంబం దగ్గరకి వెళుతున్నా” అని అర్ధం.  “ఇంటికి వచ్చావా?” అని అడిగితేనో అది నీ కుటుంబాన్ని చేరావో లేదా అనే అర్ధం.  “మా ఇంటికి రండి” అంటే మా కుటుంబంతో గడపండి అని అర్ధం.  ఇంట్లోఅందరూ బాగున్నారా? అంటే నీ కుటుంబ సభ్యులందరూ సౌఖ్యమే కదా అని అర్ధం.  ఎన్ని ఘర్షణలున్నా సాధారణ అర్ధంలో ప్రపంచవ్యాప్తంగా ఇల్లు అనుకుంటే అదో ఆత్మీయత.  ఇల్లంటే మన రక్తంలో ఇంకి పోయిన ప్రేమానురాగాలు, ఆనందాలు, బాధ్యతలకు పర్యాయ పదం.  ఇల్లంటే కష్టం, సుఖం, త్యాగాలని పంచుకునే బాధ్యత.  ఇల్లంటే మౌలికంగా జననం నుండి మరణం వరకు కలసి సాగే అనివార్య సామాజిక, తాత్విక నిర్మాణం.  ఇల్లంటే కొంతమంది వ్యక్తులు సంచరించే ఒక నాలుగ్గోడలు, పైకప్పు నిర్మాణం కాదు.   ఇంటి గోడలకు వేలాడతీసిన ఫోటోలకి తెలుసు మన  సంతోషమేమిటో, దుఃఖమేమిటో! గది పైకప్పులకు తెలుసు మన సరస సల్లాప ఆనందానుభూతులు!    ఇల్లంటే కొంతమంది వ్యక్తుల జీవితకాలాల సామూహిక భావోద్వేగ ప్రయాణం.

ఇంటి నుండి కుటుంబాన్ని వేరు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఒక వాణిజ్యపరమైన ఆలోచన ముందుకు దూసుకొస్తున్నది.  విదేశాల్లో ‘బిగ్ బ్రదర్” పేరుతో, భారతదేశంలో “బిగ్ బాస్” పేరుతో ఇప్పుడు ఇంటికి అర్ధం మారి పోతున్నది.  ఇంటి నుండి కుటుంబం వేరై పోతున్నది.  “కుటుంబ సభ్యులు” స్థానంలో “ఇంటి సభ్యులు” వస్తున్నారు.  వసతి గృహాల్లో అయినా ఆత్మీయత కొంతైనా కనబడుతుందేమో కానీ బిగ్ బాస్ ఇంట్లో మాత్రం కాదు.  ఎందుకంటే బిగ్ బాస్ ఇంటి సభ్యుల మధ్యన ఆత్మబంధాలు, ఆత్మీయతలూ వుండవు.  ఆ ఇంటి జీవితకాలం ఒక వంద రోజులు మాత్రమే.  ఇంటి సభ్యులు తమ ‘సభ్యత్వా’న్ని ఆ వంద రోజుల వరకు మాత్రమే కలిగి వుంటారు.

“బిగ్ బాస్” కాన్సెప్ట్ ఇంటిని ఒక రియాల్టీ షో గా మార్చేసింది.  ఇంటిని ఒక గేం షోకి వేదికగా చేసేసింది.  ఏదోపాటి గుర్తింపు కలిగివుండి, ఏదో ఒక రంగంలో (ప్రధానంగా టీవీ/సినిమా) ఎంతోకొంత టాలెంటుంది, అవకాశాల కోసం ఎదురుచూసే కొంతమంది చిన్నా చితక “ప్రముఖులు”ని ఏరుకొచ్చి గంప కింద కోడిపెట్టల్ని దాచిపెట్టినట్లు ఉంచితే అన్నివైపులా మూసేసిన ఆ గంప కింద స్థలంలో వాళ్ళింక ఆటాడుతుంటారన్న మాట.  ఒకసారి లోపలికెళ్ళాక వారికి ఇంక బైట ప్రపంచంతో సంబంధముండదు.  కొంచెం గ్లామరస్ గా వుండి, మరికొంత హుషారుగా వుండే వీళ్ళకి సమాజం గురించి, మానవ మనస్తత్వం గురించి పెద్దగా అవగాహన వుండదు.  వీళ్ళు పక్కా కెరీరిస్టులు లేదా కెరీర్ గురించి అభద్రతాభావంతో వుండేవారు.  మరుగున పడిపోతున్న తమ ప్రఖ్యాతిని పునరుజ్జీవింప చేయటం ద్వారా తమ రంగాల్లో ఏదో నాలుగు అవకాశాలు సంపాదించుకునే లక్ష్యంతో వున్న వాళ్ళే.

ఏమిటి ఆ ఆట?  ఇంటి సభ్యులందరూ క్రీడాకారులైన ఆ ఆటకి నిర్దిష్టమైన రూపం ఏమీ వుండదు.  ఎప్పటికప్పుడు ఇచ్చే టాస్కుల్ని పరిపూర్తి చేస్తూ ఆ ఇంట్లో కొనసాగగలగటమే ఆట.  అంటే ఎప్పుడూ ఇంట్లో నుండి ఎప్పుడు బైటకి నెట్టి వేయబడతామో అన్న అబధ్రతే సభ్యుల ముఖాల మీద తాండవిస్తుంటుంది.  వారి అభద్రతా భావమే ప్రేక్షకులకి ఆసక్తికర అంశం.  96 కెమెరాలు వారి ప్రతి కదలికని, ముఖ కవళికనీ నిశితంగా పట్టుకొని మనకు చూపిస్తుంది.  వాళ్ళకి గుసగుసగా కూడా రహస్య సంభాషణ చేసే స్వేఛ్ఛ కూడా వుండదు.  నా చిన్నప్పుడు మాలీష్ చేసేవాళ్ళు పార్కులు, రోడ్ల మీదనూ గళ్ళ లుంగీ కట్టుకొని భుజానికి మాలీష్ సామాను నిండి వున్న ఒక తోలుసంచీ వేలాడేసుకొని కనిపించేవారు.  ఈ సెలబ్రిటీలు కూడా మైకు సెట్టున్న అలాంటి బాగు ని వేలాడేసుకొని అటూ ఇటూ తచ్చాడుతుంటారు.  ఒక నిఘా నీడలో వారి దైనందినం బట్టబయలౌతుంటుంది.  ఆ జైలు వంటి ఇంటి లోపలున్న వారికి బైట ప్రపంచం ఎలా వుందో, ఏమౌతున్నదో తెలియదు.  సుమారు ఓ వేయి గజాల స్థలంలో అసూర్యంపశ్యల్లై ఓ పదిహేను మంది బతుకుని కుదించుకొని వాళ్ళల్లో వాళ్ళు ప్రతి వారం వెలి వేయబడకుండా వుండటం కోసం ఆ ఇంట్లో హత్తుకుంటూ, తన్నుకుంటూ, తోసుకుంటూ, ఘర్షణ పడుతూ వుంటారు.   స్టార్ట్-పేకప్ ల మధ్య తప్పితే ఒక నటుడికి, “గెట్-సెట్-రెడీ’ నుండి గేం అయిపోయేంత వరకు తప్పితే ఒక క్రీడాకారుడికి తనదైన ఏకాంతం వుంటుంది.  ఆ తరువాత వాడు నవ్వుతాడో లేదా ఏడుస్తాడో లేదా మౌనంగా వుంటాడో, ముభావంగా వుంటాడో లేక  అభావంగా వుంటాడో మనకు తెలియదు.  కానీ బిగ్ బాస్ ఆ ఛాన్స్ మాత్రం వీళ్ళకు ఇవ్వడు.  వాళ్ళకు పగలు నిద్రపోయే అవకాశం ఇవ్వడు.  ఇచ్చిన ప్రతి టాస్క్ కీ హాజరవ్వాల్సిందే.

నిజానికి బిగ్ బాస్ జరిగే వంద రోజుల పాటు ఎటువంటి పర్సనల్ స్పేస్ లేకపోవటం ఒక అమానవీయత.  కేవలం ఒక పది, పదిహేను మందిలో తన కుటుంబాన్ని, తను పుట్టి పెరిగిన సంఘాన్ని వెతుక్కోమనటం క్రూరమైన ఆట.  బిగ్ బాస్ పేరుతో ఒక డబ్బా నుండి మాట్లాడుతున్నట్లున్న కంప్యూటర్ స్వరం  అప్పుడప్పుడూ వీరితో యజమాని తన బానిసల్తో మాట్లాడుతున్నట్లు సంభాషిస్తుంటుంది.  “ఇంటి సభ్యులు”కి శిక్షలు కూడా వుంటాయి.

మనిషికి సమూహమూ అవసరమే.  ఆ సమూహంలో ఏకాంతమూ అవసరమే.   తనతో తాను వుండే అవకాశం లేని ఏకాంతరాహిత్యం, ప్రతి క్షణం నిర్బంధంగా మరొకరితో కాలాన్ని, స్థలాన్ని పంచుకోవాల్సి రావటం ఒక భయంకర ఉక్కపోతతనం.  దాన్నుండి బైటపడలేని ఒక చిన్న గుంపు నిర్బంధం నుండి వాళ్ళేం ప్రవర్తిస్తారో వాళ్ళకే తెలియని పరిస్తితి.  తమని తాము కోల్పోయి, మానసిక సమతౌల్యం నష్టపోయిన క్షణాల్లో పిచ్చ పిచ్చగా మాట్లాడి, ప్రవర్తించి, అతిగా వాదులాడి, అతిగా కౌగిళ్ళు ఇచ్చుకుంటూ వాళ్ళు మనకు వినోదం ఇస్తున్నారు.  చిత్రంగా ఇందులో మేధావులు కూడా ఇరుక్కుంటున్నారు.  మొదటి సీజన్లో కత్తి మహేష్ వుంటే, రెండో సీజన్లో బాబు గోగినేని వున్నారు.  పోనీ వినోదరంగానికి చెందినవాడు కాబట్టి, ఈ షో లో పాల్గొనటాన్ని  బతుకుతెరువులో భాగంగా చూసి కత్తి మహేష్ ని క్షమించేద్దాం.  బాబు గోగినేనికి ఏమైంది?  మిగతా కేతిగాళ్ళందరితో కలిసి, పిచ్చ పిచ్చ డాన్సులు, నెత్తి మీద కోడిగుడ్లు పగలగొట్టించుకునే వెర్రిమొర్రి పనులు చేస్తూ బాబుగారెందుకు వీళ్ళ ట్రాప్ లో పడ్డాడా అనిపించింది.  తన ఆశయం కోసం బిగ్ బాస్ ద్వారా  వచ్చే ‘ప్రఖ్యాతి ‘ని ఎంతవరకు ఆయన వాడుకుంటాడో కానీ ఇప్పుడు మాత్రం తనకున్న ప్రతిష్ఠని పోగొట్టుకునేట్లున్నారాయన.  చివరకి ఆయన పోగొట్టుకున్న తన వ్యక్తిత్వం గుర్తుకొచ్చిందేమో “నేనో ఇంటర్నేషనల్ పర్సనాలిటీ” అని చెప్పుకునే దుస్థితిలో పడి, అలా చెప్పుకున్నందుకు యాంకర్ నానీ చేతిలో దొబ్బులు తినాల్సిన పరిస్తితికి వచ్చాడా “అంతర్జాతీయ” మానవవాది.   అడ్డడ్డే!  నిజంగా జాలేసింది ఆయన్ని చూస్తే.  ఆయనకి ఇదో బాడ్ ఛాయిస్.

అసలు బిగ్ బాస్ షో ని ప్రేక్షకులు ఎందుకు చూస్తున్నారు ప్రేక్షకులు?  టీవీలు, సినిమాల ద్వారా తమకు ఏదో ఓ మేరకు పరిచయమున్న సెలబ్రిటీలు అంత సిల్లీ కోపతాపాలతో, అచ్చం తమలాగే ప్రవర్తించటం ప్రేక్షకులకి వినోదంగా వుంది.  కొంతమంది విశ్లేషకులు అంటున్నట్లు పక్కింట్లోకి తొంగి చూస్తున్న అనుభూతి కూడా కలుగుతుందేమో.   చెవులు, ముక్కులు, నోళ్ళు కొరుక్కునేంత గాసిపింగ్ కి అవకాశం వుంది కదా మరి!  తమ కూతురు తన క్లాస్మేట్ కుర్రాళ్ళతో ఎక్కడ చనువుగా వుంటుందో అన్న టెన్షన్ తో చచ్చే తల్లిదండ్రులు సామ్రాట్-తేజస్వి, తనీష్-దీప్తి సునయనల వేడి వేడి హగ్గుల్ని మాత్రం కప్పులో వేడివేడి కాఫీ ని సిప్ చేసినంత ఆహ్లాదంగా చూస్తుంటారు.

వీటన్నింటికంటే అసలు మోసం వున్న విషయం ఏమిటంటే ఎవరుండాలి, ఎవరు బైటకి దయచేయాలి అని నిర్ణయించేది ప్రేక్షకులేనట.  ప్రజలే న్యాయ నిర్ణేతలు అన్న పేరుతో ఒక ఆర్ధిక దోపిడీ జరుగుతున్నది.  ఈ అమాయక గొర్రె జనం ఒక్కో ఎస్సెమ్మెస్ కి మూడు రూపాయిలు ఖర్చుపెట్టి మరీ వోటింగ్ ద్వారా తమ తీర్పునిస్తారన్నమాట.  ఆ రకంగా ఆరు కోట్ల ఎస్సెమ్మెస్ లు వస్తున్నాయట ఒక్క పిలుపుకి!  ఈ భయంకరమైన చిలక్కొట్టుడు గురించి ఆలోచించే పరిస్తితిలో జనం లేరు.  కాసింత వినోదాన్ని జనం ముఖం మీద పడేయండి. అన్నింటినీ భరిస్తారు.  అందరినీ క్షమించస్తారు.  పాలకులకే కాదు వినోదరంగ వ్యాపారస్తులకి కూడా ఈ విషయం బాగా తెలుసన్న దానికి బిగ్ బాస్ ఒక సజీవ సాక్ష్యం.

****

వార్తా పత్రికలు కూడా రెగ్యులర్ గా చూడని నేను ఈ వ్యాసం రాయటం కోసం ఒక పది రోజుల పాటు వరుసగా బిగ్ బాస్ “చూడాల్సిబడ్డాను” (కరెక్టేలెండి సార్! సర్దుకోండి).   ఇడియట్ బాక్స్ మీద నా అభిప్రాయాన్ని మరింత బలంగా, సజీవంగానే వుంచుకుంటున్నాను.

*

అరణ్య కృష్ణ

అరణ్య కృష్ణ

23 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • నేను బిగ్బాస్ కి బధ్ధవ్యతిరేకిని.
  బాబుగోనికి బయటకు వస్తే దండవేసి సంతాపం తెలియ జేయాలి..
  వ్యాసం బాగా రాసారు..
  కాని దీనికోసం బిగ్బాస్ని చూసినందుకు
  అభినందనలు..

  • చూడక తప్పలేదు సార్! ఆఫీసుల్లో లంచ్ టైముల్లో ఒకటే చర్చలు. “పాపం వీడు. పాపం ఆ పిల్ల. వీడు మహా ముదురు. ఆ పిల్ల మహా గడుసుది. వాడ్ని చూస్తే జాలేస్తుంది. ఆ పిల్లని చూస్తే అరికాలి మంట నెత్తికెక్కుతుంది. వాడో గుంటనక్క. వీడికసలు నోరు వాయీ లేదు.” ఇలాంటి వ్యాఖ్యలతో, విశ్లేషణలతో జనాల భావోద్వేగాలు తట్టుకోలేక, అసలు సంగతేంటో చూద్దామని అనేక సంవత్సరాల తరువాత ఓ పది రోజుల పాటు టీవీ “చూడాల్సిబడ్డాను”

 • పదిరోజులు చూసి తేరుకుని ఇలా రాయగలిగినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు….మమ్మల్ని పొరపాటున కూడా చూడకుండా తప్పించినందుకు కూడా.
  SMS ల ద్వారా ఎలా లూటీ చేయబడుతున్నారో అర్థం కాని గొర్రెలే ఎక్కువ .బాగా విశ్లేషించారు.

 • Big boos conceptవిషసంస్క్రతి లో బాగమే.కుటుంబconceptకుబిగ్బిస్ concept కు పోలికే ఉండదు.మనకుటుంబం సంతోషాన్ని కలిగించేది.స్వేచ్ఛ, ప్రేమ కలపోత.అవిబిగ్బాస్ లో కనిపించవు.అంతాబాషిజం పాశ్చత్య సంస్కృతి

 • బాబు గోగినేనికి ఏమైంది? మిగతా కేతిగాళ్ళందరితో కలిసి, పిచ్చ పిచ్చ డాన్సులు, నెత్తి మీద కోడిగుడ్లు పగలగొట్టించుకునే వెర్రిమొర్రి పనులు చేస్తూ బాబుగారెందుకు వీళ్ళ ట్రాప్ లో పడ్డాడా అనిపించింది. తన ఆశయం కోసం బిగ్ బాస్ ద్వారా వచ్చే ‘ప్రఖ్యాతి ‘ని ఎంతవరకు ఆయన వాడుకుంటాడో కానీ ఇప్పుడు మాత్రం తనకున్న ప్రతిష్ఠని పోగొట్టుకునేట్లున్నారాయన. చివరకి ఆయన పోగొట్టుకున్న తన వ్యక్తిత్వం గుర్తుకొచ్చిందేమో “నేనో ఇంటర్నేషనల్ పర్సనాలిటీ” అని చెప్పుకునే దుస్థితిలో పడి, అలా చెప్పుకున్నందుకు యాంకర్ నానీ చేతిలో దొబ్బులు తినాల్సిన పరిస్తితికి వచ్చాడా “అంతర్జాతీయ” మానవవాది. అడ్డడ్డే! నిజంగా జాలేసింది ఆయన్ని చూస్తే. ఆయనకి ఇదో బాడ్ ఛాయిస్.///
  చాలా బాగుంది డబ్బు కోసమే కదా ఈ ఆట అందులో నమ్మకాలూ విలువలకి స్థానం ఎక్కడ ? బాబు గోగినేని కుడా అంతేనేమో ?

 • Good morning. . my personal feeling on this Big Boss is nothing but 100% stupidity. I watched for about 20days then stopped watching it. It is really waste of time . Tha show ,I feel not suitable for our mind set. Even so called intellectual are behaving like idiots and talking bull shit. Intimacy between two genders is crossing it’s limitations some times. Not worth watching and better no more shows of such kind ,..

 • Kudos for your patience and congratulate you for remaining sane after watching for two days. I never saw it nor will see it.

 • వ్యక్తీకరణ, విశ్లేషణ బాగుంది… కానీ ఒక ఎస్సెమ్మెస్ కు మూడు రూపాయలు అనే ప్రస్తావన దగ్గర సరిచూసుకొండి… మిస్డ్ కాల్స్, ఆన్ లైన్ వోటింగే కదా…

 • బిగ్ బాస్ రియాలిటి ప్రదర్శన లో ఎస్ ఎం ఎస్ అవసరం లేదు. మిస్సిడ్ కాల్స్, గూగుల్ ఆన్ లైన్ వోటింగ్ మాత్రమే. వీటివలన కార్యక్రమ నిర్వాహకులకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనం లేదు.

 • బాగా రాసేరు.ఏ మాత్రం ఉపయోగం లేని ఇలాటి కార్యక్రమాలు ఎందుకు కనిపెడతారో పాపం.

  • చూసే వాళ్ళు కొల్లలు సార్. అభిమాన సైన్యాలు కూడానట.

 • ఎలా చూసారు పది రోజులు ఆ షో. దీన్ని నేను ఖండిస్తున్నాను. మళ్ళీ చూడనని మాట ఇవ్వండి.

  • పది రోజులూ మొత్తం చూడలేదు మాష్టారూ! రోజూ కొద్ది కొద్దిగా అన్నామాట. నేను చూసిందే మీ కోసమే అయినప్పుడు మీరు ఖండించటం సబబా? అయినప్పటికీ మీ కోసం కూడా ఇంక ముందెప్పుడూ చూడనని మాటిస్తున్నాను.

 • బాగా చెప్పేరు. నా అభిప్రాయాన్ని మీరాత ప్రతిఫలించింది

 • అరణ్య క్రిష్ణ గారు !
  మీ విశ్లేషణ చాలా బాగుంది. ఇదొక బుల్లితెర నాటకం. మనుషుల బలహీనతలను పరీక్షీంచే పేరుతో ప్రేక్షకుల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్న వ్యాపారం. ఏమాత్రం సామాజిక స్పర్శ అంటని అల్లిక. ఒక కార్పొరేట్ విలువల నమూనా. ఒక మనిషిగా వ్యవస్థ పట్ల నిబద్ధత లేని కృత్రిమ పాత్రలు. గెలుపే ద్యేయమైన ఒక నిరర్థక భావ దారిద్రియం.

 • అవును.

  కానీ, రష్యన్లు సైబిరియా లో ఏర్పాటు చేసిన ‘గులాగ్ ‘ కాంపుల కంటే నయమే.

 • vivarangaa cheppinanduku thanks Aranya. naaku ippativarakoo big boss ante vivarangaa teliyadu, nenu adrushtavashattu choodavalasi raledu… ippudu chadivina tarvata idi enta stupidity yo arthamavutunnadi – idi spashtanga mana jeevitala meeda, privacy meeda technology dvara dadi cheyyadame – ippatike aa pani alexa samarthavantanga chesestondi

 • reality shows are new age shows .. cant stop ..

  in this show, there is no sms, cost of 3 rs .. only online voting or missed call kadaa ..(one can try even voting for check)..

  now a days people using jio.

 • నేను ఒకేఒక ఎపిసోడ్ చూసా. సేమ్ ఫీలింగ్ కలిగింది. పదిరోజులు చూసిన మీ ఓపికకు చేతులెత్తి దండం పెట్టొచ్చు. మీ కష్టానికి తగ్గట్టే మంచి విశ్లేషణ ఇవ్వగలిగారు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు