ఎన్నటికీ వదలని ఇష్టాలు రెండు!

 ఏ పనికయినా మనసుతో భావించడం ఎంత ముఖ్యమో, మంచయినా చెడయినా మనసు ఎలా నమ్మితే అలాగే జరుగుతుందని ఇంతకన్నా సోదాహరణంగా ఎవరు చెప్పగలరు?

”ఇవి ఏనున్ సతతంబు నా ఎడ కరంబిష్టంబులై యుండు” అంటాడు చాళుక్య చక్రవర్తి రాజరాజనరేంద్రుడు నన్నయ భట్టారకుడితో. మొన్నటిదాకా ముఖపుస్తకంలో సాగిన సాహిత్యక్రీడ ఏడు అట్టలాటలాగ. లేదా ఇప్పుడు నడుస్తున్న ఇష్టమైన అయిదుగురు స్త్రీ రచయితల గురించి చెప్పమనడం లాగ.
ఆయన చెప్పిన నిరంతరమూ అంటిపెట్టుకుని ఉండే అయిదు ఇష్టాలలోనూ భారతకథ వినాలనే కోరిక ఒకటి. మంచి మైత్రి మరోటి. మిగతావాటి మాటేమోగాని నాకు కూడా ఈ రెండూ ”కరంబిష్టంబులై యుండు. పాయవు”. ఎన్నటికీ వదలవు.
మైత్రి సరే భారతకథ మీద ఎందుకంత ఇష్టం అంటే దానికి సమాధానం చెప్పడానికే ఇది ఎత్తుకోవడం.
భారత కథ దాకా వెళ్ళడానికి అసలు ‘కథ’ ఇష్టం కావడం కారణం. కవిత్వమూ ఇష్టమే. కథ ఇంకా ఇష్టం. అయితే ఏ కథ? ఎలాంటి కథ?
ఉగ్రశ్రవసుడనే పేరుగల సూతుడు శౌనకుడు మొదలుగాగల మునులను ఇలాగే అడిగాడట. మీకు ఏ కథ ఎలాంటి కథ కావాలి అని. అప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు పద్యరూపంలో చదివితే భలే సొగసుగా ఉంటాయి.
”ఏయది హృద్యమపూర్వంబేయది యెద్దాని వినిన ఎరుక సమగ్రంబైయుండు యఘ నిబర్హణ  మేయది అక్కథ వినగనిష్టము మాకున్”
ఆ సొగసు చూపడానికే పద్యం రాసాను. ఇందులో అఘనిబర్హణం అన్న మాట ఓపక్కన పెట్టేస్తే, మిగతా మాటలన్నీ ఇవాళ మనం రాయవలసిన కథలకు సరిపోతాయి.
హృద్యంగా, అపూర్వంగా ఉండాలి. ఉంటూనే, కథ చదవగానే మనకున్న అసంపూర్ణ జ్ఞానం సమగ్రమవ్వాలి – అది ఏ విషయం కానివ్వండి.
 తోలేటి జగన్మోహనరావుగారి కప్పడాలు కథ చదవగానే ముప్ఫయిఏళ్ళ కిందటే మల్టీనేషనల్ కంపెనీల గురించి మన ఎరుక సమగ్రమయినట్టు. లేదా సురేష్ రాసిన టైటానిక్ చదవగానే ప్రైవేటీకరణలో ప్రభుత్వ విధానం తెలిసినట్టు. ఊరికే మరీ పరిచయంలో ఉన్న కథలు చెప్పేనుగానీ నా ఉద్దేశం ఈ కథల గురించి చెప్పడం కాదు.
తెలుగులో మొదటి కథగా ఆచంట సాంఖ్యాయనశర్మగారి ‘లలిత’ అన్నా, కాదు కాదు గురజాడవారి దిద్దుబాటు అన్నా, అదీ కాదు భండారు అచ్చమాంబగారి స్త్రీవిద్య అన్నా నాకు వాటితో పేచీ లేదు. ఎందుకంటే నా దృష్టిలో మొదటి కథారచయిత లేదా కథాకవి నన్నయగారు. ప్రసన్నకథాకలితార్థయుక్తి అన్నమాటను బట్టి చెప్పడం లేదు. తెలుగు కథకు ప్రధాన లక్షణాలుగా మనం ఏవయితే చెప్పుకుంటున్నామో అవి ఆయన కథలలో చూసేను కాబట్టి.
సంఘటనలు, సన్నివేశాలు, మలుపులు, పాత్రలు, సంభాషణలు అన్నిటా ఔచిత్యం, క్లుప్తతలే కాకుండా కథలో కొంత దాచి ఆలోచింపచేసి ఆనక, దాచినది అందేక ఆనందింపజేస్తూ ఎరుకను సమగ్రం చెయ్యడం రెండున్నర పర్వాల భారత కథలనినంటిలోనూ చూశాను. వాటినే ఉపాఖ్యానాలన్నారు. మనం చిన్న కథలంటున్నాం.
ఇలా ఉత్తుత్తి మాటల్లో కాకుండా, నేరుగా కథలోకి తీసికెళ్ళి చూపించడమే బావుంటుంది కదా! మరి మొదటి కథే ఉదంకుడి కథ. ఆ కథే చెప్పుకుందాం. ఎలా కథ అయిందో.
పైలుడనే ఒక సాధువయిన మహాముని శిష్యుడు ఉదంకుడు. ఉదంకుడి గురించి చెప్తూ కవి వేసిన విశేషణాలలో ఒక చిత్రమైన విశేషణం ఉంది. అది ”అఘపంకక్షాళన తపస్సలిలుడు” అని. దీనికి అర్థం పాపమనే బురదను కడుక్కోడానికి తపస్సును నీళ్ళలాగ ఖర్చుపెట్టేవాడు అని.ఇప్పటివాళ్లు డబ్బు ఖర్చుపెట్టినట్టు.
గురుకులంలో గురువుగారికి పరిచర్యలు చేసి నిష్టాగరిష్టుడై జ్ఞానం సంపాదించి గురువును సంతోషపెట్టాలని చూసాడు. అప్పుడు గురుపత్నిని సంతోషపెట్టాలని అర్థమయింది.
ఆమెకు పౌష్యుడనే రాజు భార్య కుండలాలు కావాలి. అవి. అవి ధరించి ఆమె ఏదో వ్రతం చేసుకోవాలి. తెచ్చిపెట్టమని గురువుగారి ఆజ్ఞ. ఉదంకుడు కాస్త దూరం అడవిలోంచి నడిచి పౌష్యుడి నగరానికి వెళ్ళి కుండలాలు తేవాలి. చిన్నపని.
బయలుదేరాడు. దార్లో అడవిలో ఒక దివ్యమయిన వర్చస్సుతో ఉన్నవాడు పెద్ద ఎద్దునెక్కి ఎదురయ్యాడు. చూడగానే నమస్కారం చెయ్యాలనిపించేలా ఉన్నాడు. ఏది ఆదేశిస్తే అది చెయ్యాలనిపించేలా కూడా ఉన్నాడు.
ఈ మాటలు నన్నయ చెప్పడు. ఏం చెప్తాడంటే ఆయనకు ఉదంకుడు నమస్కరించాడు. ఆయన దీవించి ఆ వృషభగోమయం (ఎద్దుపేడ) ప్రసాదంగా ఇచ్చాడు. మారుమాట్లాడకుండా స్వీకరించి భక్షించాడు. ఇక్కడ ఇచ్చిన అనకుండా ‘పన్నిన’ అనే క్రియాపదం వాడతాడు రచయిత. దివ్యుడు అనుగ్రహించాడు.
సరే తొందరగా ఉదంకుడు పౌష్యుడి దగ్గరకు వెళ్ళి కుండలాలు అడిగాడు. పౌష్యుడు ఉదంకుడిలాంటి మహాత్ముడిని చూసానని సంతోషించి – మహారాణి అంతఃపురంలో ఉంది, ఆవిడని అడిగి కుండలాలు పట్టుకెళ్ళమన్నాడు.
ఉదంకుడు అంతఃపురానికి వెళ్ళి అంతటా వెదకేడు. కానీ ఆమె కనపడలేదు. తిరిగివచ్చి పౌష్యుడిని అడిగాడు.
రాజు సంశయిస్తూనే నువు మూడులోకాలు పావనం చెయ్యగలవాడివి, నిన్ను ‘అశుచి’ అని ఎలా అనగలను – కానీ నా భార్య శుచిలేనివారికి కనపడదు – ఆమె అటువంటి పవిత్రత కల స్త్రీ అన్నాడు.
వెంటనే ఉదంకుడు ఆలోచించుకున్నాడు. ఎక్కడ తనకు అశుచిత్వం కలిగిందీ అని. బహుశా ఆ అడవిలో తిన్న వృషభగోమయమే కారణం అని నిర్ణయించుకుని చేతులూ కాళ్ళూ కడుక్కుని నీళ్ళు పుక్కిలించి శుభ్రపడ్డానని నమ్మకం కలిగాక మళ్ళీ అంతఃపురానికి వెళ్తే ఆమె కనిపించింది.
నమస్కరించింది. కుండలాలు ఇచ్చింది. తక్షకుడు అనే సర్పరాజు వీటిమీద కన్నేసి ఉన్నాడు జాగ్రత్తగా తీసికెళ్ళు అంది.
ఈ కథ ఇలా ముగియలేదు.
పౌష్యుడు భోజనం చేసి వెళ్ళమన్నాడు. ఉదంకుడు సరేనన్నాడు. భోజనంలో తలవెంట్రుక కనిపించింది. వెంటనే ఇలాంటి భోజనం పెడతావా? అంధుడివి కా! అని శపించాడు. అంత చిన్న తప్పుకి అంత శాపమా?
తిరిగి పౌష్యుడు శపించాడు. కానీ బ్రాహ్మణశాపం వెనక్కి రాగలిగింది. నృపశాపం వెనక్కి వెళ్ళలేకపోయింది. కుండలాలతోపాటు అనపత్యత అంటే పిల్లలు కలగకపోవడం అనే శాపంతో వెనక్కి వచ్చాడు ఉదంకుడు.
దార్లో నది ఒడ్డున కుండలాలు ఉంచి నీళ్ళలోకి దిగి సంధ్యావిధులు చెయ్యబోయేటంతలో తక్షకుడు కుండలాలు తస్కరించి పాతాళానికి పట్టుకుపోయాడు.
ఉదంకుడు తక్షకుడిని తరుముతూ పాతాళానికి ప్రయాణమయ్యాడు. నాలుగు పద్యాలలో అద్భుతంగా నాగేంద్ర స్తుతి చేయిస్తాడు నన్నయ. అదంతా వేరే కథ. నేను ఆ రెండో కథలోకి వెళ్ళను.
మొత్తానికి ఎలాగైతేనేం కుండలాలు పట్టుకొచ్చి తక్షకుడే తిరిగి ఇచ్చేశాడు. తీసికెళ్ళి గురువుగారికిచ్చాడు ఉదంకుడు. గురుపత్ని అవి ధరించి తాను అనుకున్న వ్రతమేదో చేసుకుంది. ఇక్కడ కుండలాల మహత్యం గురించి ఒక్కమాట కూడా చెప్పకుండా తోపించడం గుర్తించాలి
అప్పుడు గురువుగారు ఈ పక్క ఊరు వెళ్ళిరావడానికి(ఈ యున్న పాలికిన్ పోయి) నీకు ఇన్నాళ్ళు ఎందుకు పట్టిందని అడిగితే ఉదంకుడు కథంతా చెప్పాడు. అందులో దివ్యుడు, వృషభగోమయమూ చెప్పేడు తప్ప పౌష్యుడి భార్య కనపడకపోవడమూ, పౌష్యుడి శాపమూ ఇవేవీ చెప్పలేదు.
పైలుడు సాధుపురుషుడు. అవన్నీ తెలిసినా, అతని ద్వారా తెలుసుకునే ఉద్దేశం లేదు. కానీ నీకు ఎదురయిన దివ్యుడు ఇంద్రుడని, ఆ ఎద్దు ఐరావతమనీ, ఆ గోమయం అమృతమనీ చెప్పి అందువల్లనే నీకు పని జరిగింది అంటాడు. ఇంత చిన్నపనికి వారంతా అవసరమా?
అంటే పైలుడికి శిష్యుడి గురించి అంత బాగా తెలుసనమాట.
ఇదొక చిత్రమయిన కథ. చిత్రంగా అల్లిన కథ. ఉదంకుడు జరిగిన సంఘటన ద్వారా మనకు రకరకాలుగా కనిపిస్తాడు. అహంభావి, కోపిష్టి, తపస్సును మంచినీళ్ళలా ఖర్చుపెట్టేవాడని కవి ముందే చెప్పివుంచాడుగా.
పౌష్యుడి భార్య వల్ల అతని అహం దెబ్బతింది. వెంటనే చిన్న కారణానికే పౌష్యుడిని శపించాడు. ఆమె మాటలమీద లక్ష్యం లేదు. కుండలాలు తక్షకుడినించి రక్షించుకోలేకపోయాడు. ఇంత జరిగినా తక్షకుడే కుండలాలు తెచ్చి ఇచ్చినా చాలా ఏళ్ళ తర్వాత ఆ కోపం మనసులో పెట్టుకుని జనమేజయుడి చేత సర్పయాగం చేయించాడు.
 అంటే తపస్సు వేరు – సాధుత్వం, సజ్జనత్వం వేరు. తపస్సు చేసినా, దానం చేసినా, మానినా చివరకు రావలసినది సజ్జనత్వం అన్న ఎరుకను సమగ్రం చేసే అంశం ఈ కథంతా నిండి వుంది.
అది సరే. అసలు ఇంతకన్న గొప్ప విషయం ఈ కథలో దాగి వుంది. అది మనోవిజ్ఞానానికి సంబంధించినది.
ఉదంకుడు తిన్న వృషభగోమయం నిజానికి అమృతమని గురువు పైలుడు విశదీకరించాడు. ఇక ఉదంకుడు అశుచి ఎట్లా అయ్యాడు? అశుచి కానప్పుడు మరి పవిత్రతకు మారుపేరైన మహారాణి పౌష్యుడి భార్య అతనికి మొదటిసారి ఎందుకు కనపడలేదు? ఇదొక ప్రశ్న.
అశుచిగా ఉన్నవాడికి నా భార్య కనపడదు అనగానే ఉదంకుడికి మొదట గుర్తుకు వచ్చినది తాను ఎద్దు పేడ తిన్నానన్న విషయం. వెంటనే తనకు అలవాటయిన శుభ్రపరచుకునే విధానం ద్వారా శుభ్రపడ్డానని భావించుకుని వెళ్ళగానే ఆమె దృశ్యమానం అయింది.
అంటే ఉదంకుడు తనకు ఎదురయినవాడు దివ్యుడని తెలిసినా, అది మహోక్షమని అంటే అసామాన్యమయిన ఎద్దు అని తట్టినా, దాని గోమయాన్ని అపవిత్రంగానే అనుకున్నాడు. దాని పవిత్రతత అతని మనసుకి తట్టలేదు. ఎక్కలేదు కూడా.  కాబట్టి మనసులో తాను అపవిత్రం అయ్యాననే భావం గట్టిగా ఉంది. ఆమె అందువల్ల కనపడలేదు. కాసిని నీళ్ళు పుక్కిలించి, కాళ్ళూ చేతులూ కడుక్కోగానే శుచినయ్యానని నమ్మాడు. వెంటనే కనిపించింది.
వేదవ్యాసుడుగానీ, నన్నయగానీ ఇక్కడ మనసు తాలూకు నమ్మిక మీద బయటి విషయాలు ఎంత ఆధారపడి ఉంటాయో చెప్పకనే చెప్పారు. నన్నయ మరీ దాచిపెట్టి చిన్న ప్రశ్న ద్వారా వెతికి తెలుసుకునే కథా కలితార్థయుక్తితో చెప్పాడు. ఏ పనికయినా మనసుతో భావించడం ఎంత ముఖ్యమో, మంచయినా చెడయినా మనసు ఎలా నమ్మితే అలాగే జరుగుతుందని ఇంతకన్నా సోదాహరణంగా ఎవరు చెప్పగలరు?
ఇవాళ మనం పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ అని ధారాళంగా పిడుక్కీ బియ్యానికీ ఒకేలా వాడే ఇంగ్లీషు మంత్రాల అంతరార్థం ఈ కథలోంచి ఎంత చక్కగా నిరూపించి చూపించారు.
అమృతాన్ని కూడా మనం బుల్ షిట్ అనుకుంటే బుల్ షిట్టే అవుతుందని, మనం భావించడం అన్నదాన్నిబట్టే అంతా ఉంది కాబట్టి భావించే శక్తిని అనుకూల దృక్పధం వేపు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఏ కళ అయినా అలాంటి తపస్సునే నేర్పాలని ఎంత ఉంది ఇందులో.
ఇదంతా ఎరుకని సమగ్రం చెయ్యడం కదూ!
మొత్తానికి కుండలాలు దొరికాక “వెళ్ళాల్సిన చోటు చాలాదూరం, ఇవ్వాళే గురుపత్ని కుండలాలు ధరించి వ్రతం చేసుకోవాలి ఎలాగా” అని ఆలోచిస్తుంటే పాతాళలోకంలో కనిపించిన ఒక దివ్యుడు ఈ గుర్రం మీద వెళ్ళు, ఇది మనసు కంటే గాడ్పు కంటే వేగంగా వెడుతుంది అంటాడు.
మామూలుగా వాయువేగ మనోవేగాలంటాం కదా? మరి ఇదేమిటి?
కానీ నన్నయ ప్రతీచోటా ఇలాగే రాసాడు.
మనోవేగం కంటే వాయువేగం ఎక్కువ అని. దీనిమీద ఒక సాహిత్యపరిశోధకుడు పెద్ద వ్యాసం రాశాడు.
 అదంతా మళ్ళీ మరో శేఫాలికల్లో చెప్పుకుందాం.
*

వాడ్రేవు వీరలక్ష్మీ దేవి

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అద్భుతం Veeralakshmi Devi గారు ! తాయిలం దాచి దాచి పెట్టారు … క్లాసిక్స్ హృద్యంగా వ్రాయడమంటే మిరే … మీ దగ్గర తెలుగు భాష చదువుకోలేక పోయిన లోటు తెలుస్తుంది …. తీరుతోంది కూడాను ! అక్షరాలతో సమ్మోహన పరిచే విద్య ఎదో ఉంది మిలో … ధన్యవాదములు …

  • ఎంత అద్భుతంగా వివరించారూ ! మనసు ఎలా నమ్మితే అలానే జరుగుతుందన్న దాన్ని positive attitudeతో చూడగలిగితే లభించనిది ఏది.
    మంచి కథను మరింత మంచి వాక్యాలతో చెప్పిన మీకు ప్రణామాలు.

  • కథ బాగుంది Psychology ఉంది ఇందులో అయితే కథనం అన్నిటికన్నా బాగుంది మీప్రత్యేకత అదేకదా మీకు మాప్రత్యేకాభినంనలు

  • నెరేటింగ్ స్కిల్ అద్భుతం మేడం గారూ.

  • లక్ష్మీ గారు! ????????????
    మీ శైలికి, మీరు చెప్పదలుచుకొన్న విషయాన్ని ఎంత తీరుగా ఒక్కొక్క బొట్టు తేనె చవిచూస్తున్నట్లు ఆస్వాదించేట్లు చేశారు! పూర్తి చదివిన తరువాత మనసు ఏదో తృప్తి,ఎంతో ఆనందం! ఇంకా ఎన్నో! నిజం ! మీ తరగతిలో కూర్చొని పాటాలు విన్నవారు ఎంత అదృష్టవంతులు. నాకిప్పటికి కోరిక అలా మీ ముందు కూర్చుని వినాలని! ఇవన్నీ చదివే అదృష్టం, ఆస్వాదించే అవకాశం!! Simply super మీ శేఫాలికలు! సువాసనను వెదజల్లుతున్నాయి!!,????????????!

  • అమ్మా.. మీకు నిజంగా ఎంత ఓపికో… చాలా బాగా వివరించారు.. చక్కగా అర్థంచేసుకోగలిగా.. అయితే నాదో సందేహం.. అన్నీ పాజిటివ్ గానే ఆలోచిస్తే తప్పొప్పులు తెలుసుకోవడం ఎలా? పాజిటివ్ థింకింగ్ అనేది కూడా పెట్టుబడిదారీ వాదం అని నా బలమైన భావన. అలా కావాలనే మనమీద రుద్దబడుతున్న భావజాలం కాదంటారా?

  • అద్భుతంగా వున్నది వీరలక్ష్మి గారు మీ కధనం ..మీరుచెప్పిన psycological points చాలా ఆలోచింప తగినవి .యద్భావం తద్భవతి .

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు