ప్రేమలన్నీ నిష్కామకర్మలే!

1.

 ఎవరున్నారనీ 

ఎవరి నిద్రలో
ఎవరున్నారని_

మెలుకువొచ్చాకే కద
తిరిగొస్తాము!

ఎవరి చావులో మాత్రం
ఎవరుంటారని_

తిరిగొస్తే ఎటూ
మరిచిపోతాము!

 

2.

 పనులు పోగా మిగులు 

తొట్టతొలి ఎగశ్వాస నుండి
తుట్టతుది దిగశ్వాస దాకా
యిక్కడున్నవన్నీ పనులే!

‘నువ్వు’ ‘నేను’లకు
కాసింత ప్రపంచాన్ని కలిపి
వండే రకరకాల వంటకాలే!

పనులన్నింటికీ
పర్యయావసానమేదో
వూరకనే వుండి
పొందే వీలుందా?

కాదు కూడదనే మనసే
యిన్ని పనులను
వాటి పరిణామాలను
తన వునికి కోసం చేయిస్తుందా?

ఏమైనా,
మనసునీ ప్రపంచానికిచ్చి
మనం మాత్రమే మిగిలే హృదిలో
పనులన్నీ ప్రేమలే!
ప్రేమలన్నీ నిష్కామకర్మలే!

 

3.

నువ్వున్నందుకు 

ప్రేమనే భావన పుట్టిందే
నువ్వున్నందుకు
అందమే చూపుగా మారిందే
ప్రేమున్నందుకు

*

ప్రమోద్ వడ్లకొండ

తెలంగాణలోని హనుమకొండ మా స్వస్థలం. ప్రస్తుతం బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో హెలికాప్టర్ డిజైన్ డిపార్టుమెంటులో సీనియర్ మేనేజర్ గా పని చేస్తున్నాను. కవిత్వం అంటే కొంచెం పిచ్చి. బాగా చదువుతాను. అప్పుడప్పుడు రాస్తాను.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.