“ప్రచురించడానికి వీల్లేని దారుణమైన మంచికథ…”

The Yellow Wallpaper

ది ఎల్లో వాల్‌పేపర్ [1892]

షార్లెట్ పెర్కిన్స్ గిల్‌మన్ (Charlotte Perkins Gilman)

(అమెరికన్ రచయిత్రి; 3 జులై 1860 – 17 ఆగస్ట్ 1935)

 

నూట ముప్పై యేళ్ల క్రితం, స్త్రీ స్వాతంత్ర్యం గురించి తొలి ఆందోళనలు మొదలైన కాలం నాటి కథ ఇది. అలాంటి చారిత్రక ప్రాముఖ్యతే కాకుండా, కథగా నిర్మాణం దృష్ట్యా విశిష్టతలు కలిగివున్న కథ కాబట్టి ఇది ఈ నెల కథాంతరంగంలో.

కథని ఈ లింక్స్‌లో చదువుకోవచ్చు:

ఇంగ్లీష్:

The-Yellow-Wallpaper

తెలుగు:

ఎల్లో వాల్‌పేపర్

***

నిజానికి ఇప్పుడు ఈ కథని తొలిసారిగా చదువుతున్నవారు ఎదుర్కొనే ఒక ఇబ్బంది ఉంది. టోనీ మారిసన్, మార్గరెట్ అట్‌వుడ్, ఎలీస్ వాకర్ లాంటి రచయిత్రులని చదివాక ఈ కథని నూట యాభై ఏళ్ల క్రితం ఉన్న సాంఘిక నేపథ్యంలో చదవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇవాళ్టి స్త్రీ పాత్రలు భర్త చెప్పినవాటిని పాటిస్తూ అణిగిమణిగి ఉండటం ఊహించలేం. ఈ కథలో కథానాయిక గురయిన మతిభ్రమణాల లాంటివి ఊహించలేం. ఇవాళ్టి స్త్రీలూ, స్త్రీ పాత్రలూ స్థిరచిత్తంతో ఉండగలరు. స్వతంత్రంగా జీవించగలరు. తమ పనులు చక్కబెట్టుకోగలరు, తమ పిల్లలకి మార్గదర్శకత్వం చేయగలరు. అలా అని, అందరు కథానాయికలూ విజయాన్నే సాధిస్తున్నారనీ చెప్పలేం. కథానాయకులు సాధించే విజయాల కన్నా కథానాయికలు సాధించే విజయాలు తక్కువగా ఉంటాయని ఒక విమర్శకురాలు అంటుంది! స్త్రీల సమస్యలపట్ల అవగాహనల్లో వచ్చిన స్వల్పమైన మార్పు తప్పించి, వ్యవస్థీకృతమైన ఉన్న మౌలిక సమస్యలు ఇప్పటికీ దాదాపుగా అలానే ఉండటం బహుశా దానికి కారణం కావచ్చు.

‘ది యెల్లో వాల్‌పేపర్’ మొట్టమొదటిసారిగా న్యూ ఇంగ్లండ్ మాగజైన్, జనవరి 1892 సంచికలో షార్లెట్ పెర్కిన్స్ స్టెట్‌సన్ పేరుతో (అప్పటి వివాహం ప్రకారం రచయిత్రి పేరు అది) ప్రచురించబడింది. ప్రసవం అనంతరం కొంతమంది స్త్రీలు అనుభవించే పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ కథాంశంగా ఉండే ఈ కథ దాదాపుగా రచయిత్రి స్వంత అనుభవమే! 1884లో ఒక ఆడపిల్లని ప్రసవించాక, రచయిత్రి తీవ్రమైన డిప్రెషన్‌కి గురయ్యారు. అప్పట్లో చాలా పేరున్న న్యూరాలజిస్ట్ వెయిర్ మిచెల్ (ఈ డాక్టర్ పేరు ఈ కథలో యథాతథంగా ఉపయోగించబడింది, గమనించారా?) ని సంప్రదించారు. దాదాపు నూట ముప్పై యేళ్ల క్రితం ఉన్న వైద్యపరిజ్ఞానం ప్రకారం దీనికి ‘పూర్తి విశ్రాంతి’ (rest cure) తీసుకోవడం ఒక్కటే అప్పట్లో వైద్యులు సూచించే పరిష్కారం. బుర్ర పెట్టి చేయాల్సిన ఏ పనీ చేయకూడదనేది అదనపు నిబంధన. ఇలాంటి విపరీతమైన వైద్యం వల్ల రచయిత్రి పిచ్చితనపు అంచుల వరకూ వెళ్లిపోయారు. ఆ డాక్టర్ని వదిలేసి, తన పరిస్థితిని పునస్సమీక్షించుకొని, తన మానసిక సమస్యలకు కొంతవరకూ తన వివాహంలో ఉన్న సమస్యలు కూడా కారణమని గ్రహించి, ముందు ఆ వివాహం నుంచి బయటపడ్డారు. తర్వాత కాలిఫోర్నియా చేరుకుని ఫెమినిస్ట్ సాహిత్య ప్రచురణల్లో పాలుపంచుకుంటూ, అమెరికా ఇంగ్లండ్ దేశాలలో పర్యటిస్తూ స్త్రీల హక్కులు, కార్మిక విధానాలలో రావలసిన సంస్కరణల గురించి ఉపన్యాసాలు ఇస్తూవుండేవారు. 1900లో ద్వితీయ వివాహం, 1909లో స్వంత పత్రికని స్థాపించడం ఇవన్నీ జరిగాక 1935లో కాన్సర్ బారిన పడ్డారు. “మరణం అనివార్యమైనప్పుడు, ఆ బాధని పొడిగించడం కంటే మరణాన్ని ఆహ్వానించడమూ మానవ హక్కుల్లో భాగమే,” అని నోట్ రాసి తన జీవితాన్ని ముగించుకున్నారు.

గిల్‌మన్ 1890లో రాసిన ఈ కథని ప్రచురించుకోవడానికి చాలా అవస్థలు పడ్డారు. దీన్ని తీసుకోవడానికి ఏ పత్రికా ముందుకు రాలేదు. ‘ది అట్లాంటిక్’ పత్రిక (ఇప్పటికీ మాసపత్రికగా వస్తూనే ఉంది) ఎడిటర్ స్కడ్డర్ దీన్ని తిరస్కరిస్తూ, “ఈ కథ చదువుతున్నప్పుడు నేను ఫీలయిన ఇబ్బందికి ఇతరులని కూడా గురి చేస్తే నన్ను నేను క్షమించుకోలేను,” అని ఒక నోట్ రాసి పంపించారు. మొత్తానికి దీన్ని న్యూ ఇంగ్లండ్ మాగజైన్ ప్రచురించినప్పటికీ, కథకి మాత్రం రావాల్సినంత గుర్తింపు రాలేదు. 1920లో ‘ది గ్రేట్ మోడర్న్ అమెరికన్ స్టోరీస్’ అనే కథాసంకలనంలో విలియమ్ డీన్ హోవెల్స్ సంపాదకుడుగా (“‘ది అట్లాంటిక్’ సంపాదకుడు చెప్పినట్టు, నిజంగానే ఈ కథ ప్రచురించడానికి వీల్లేనంత దారుణమైన మంచికథ…” అని హోవెల్స్ వ్యాఖ్య) ఈ కథని ప్రచురించాక కాస్త గుర్తింపు వచ్చింది. అదీ ఎలాగ? హారర్ స్టోరీగా! 1930 ప్రాంతం నుంచి దాదాపు ముప్పై, నలభై యేళ్ల పాటు ఆవిడ రచనలు మార్కెట్లో అలభ్యంగా ఉండిపోయాయి. చివరికి 1973లో ఫెమినిస్ట్ ప్రెస్ వారు ఈ ఒక్క కథనీ ప్రచురిస్తున్నప్పుడు ఎలైన్ ఆర్. హెడ్జెస్ ఈ కథ ఒక “…. small literary masterpiece” అంటూ రాసిన సుదీర్ఘ పరిచయం ఈ కథకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ ప్రచురణ సంస్థ వారే, 1996లో ఈ కథని మరింత పరిష్కరించి మరో ఎడిషన్ ప్రచురించారు. ఈ ప్రచురణల తర్వాతే ఈ కథకి విపరీతమైన గుర్తింపు వచ్చింది. దురదృష్టవశాత్తూ, తన జీవితకాలంలో ఈ కథకి సంబంధించిన చర్చని రచయిత్రి చూడలేకపోయారు. ఈ కథకి గుర్తింపు రాకపోవడానికి కారణాల పట్ల కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అప్పట్లో ఉన్న సాంప్రదాయికమైన సాహిత్యానికి అలవాటుపడ్డవాళ్లు ఈ కథని అర్థం చేసుకోలేకపోయారని కొంతమంది అంటే; స్త్రీలు ఈ కథని సరీగ్గానే చదవగలిగారనీ, కానీ అర్థమయిందని ఒప్పుకోవడానికీ, బయటికి చెప్పడానికీ భయపడ్డారనీ మరికొంతమంది అన్నారు.

ఈ కథలో డాక్టర్లు ఉపయోగించిన బెడ్ రెస్ట్ (rest cure) బారిన మరికొంతమంది సాహిత్యకారులు పడ్డారు- వాల్ట్ విట్‌మన్, ఎడిత్ వార్టన్, వర్జీనియా వుల్ఫ్ లాంటి వాళ్లు. ఈ కథని మొదటిసారి కథాసంకలనంలో ప్రచురించిన హోవెల్స్ కూతురు వినిఫ్రెడ్ కూడా బాధితురాలే! వుల్ఫ్ తన మిసెస్ డాలోవే లో ఈ వైద్యం గురించి విమర్శిస్తుంది.

ఈ కథ మీద చాలా విమర్శా సాహిత్యం ఉంది. కేవలం ఈ ఒక్క కథ మీదనే వ్యాసాలతో ప్రచురించిన పుస్తకాలు కూడా ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన విమర్శకుల సారాన్ని మాత్రం ఈ వ్యాసంలోకి తీసుకుంటున్నాను.

 

కథాసారం

కథలో రెండే రెండు ముఖ్య పాత్రలు. అందంగా కనిపిస్తూ, పిల్లల్ని కని పెంచే వ్యక్తులుగా మాత్రమే స్త్రీలని గుర్తించే పందొమ్మిదో శతాబ్దపు భావజాలానికి ప్రతినిధి- భర్త జాన్. ప్రసవానంతరం డిప్రెషన్‌కి గురయిన కథకురాలు, తనని విశ్రాంతి కోసం ఉంచిన భవంతిలో తన రూమ్‌లో ఉన్న వాల్‌పేపర్‌ డిజైన్‌లో ఒక స్త్రీ చిక్కుకుపోయినట్టు భావిస్తుంది. స్థూలంగా, ఆ బందీ అయిన మహిళ మానసికంగానూ, బౌద్ధికంగానూ బంధింపబడిన కథకురాలికి ప్రతీక. వాల్‌పేపర్ మారుద్దామన్న కథకురాలితో జాన్, “అలా మార్చడం మొదలుపెడితే, ఆ తర్వాత ఆ భారీ మంచం, ఆ తర్వాత చువ్వలున్న కిటికీ, ఆ తర్వాత మెట్ల దగ్గరున్న గేట్ – ఇలా…” సాగుతుందంటాడు. మొదట్లో కథకురాలు తన చుట్టూ ఏం జరుగుతోందో గమనించుకోగలిగిన మానసిక స్థితిలో లేదు. తనని ఒకవిధంగా బంధించారన్న విషయం కూడా తన బాహ్య చైతన్యానికి తెలియడం లేదు. కథకురాలికి ఎలాటి విముక్తీ లేదు కాబట్టి తను దాన్ని ఎక్కడో వెతుక్కోవాలి. అది ఆ వాల్‌పేపర్‌లో వెతుక్కుంది. దాన్ని వర్ణించే తన మాటల్లో వెతుక్కుంది. “ఇంతకన్నా ఘోరమైన వాల్‌పేపర్ నేనెక్కడా చూడలేదు,” అని మొదట్లో అన్న కథకురాలు, తనమీద తనకి పట్టుజారిపోతూ ఉన్న దశలో “ఆ వాల్‌పేపర్ ఉన్నప్పటికీ ఆ రూమ్ అంటే ఇష్టం పెరిగిపోతోంది. బహుశా, వాల్‌పేపర్ ఉందనే ఏమో,” అనే స్థితికి చేరుకుంది. కానీ అంతరాంతరాల్లో ఈ ఖైదూ, వాల్‌పేపర్ కలగజేస్తున్న వత్తిడినుంచి కథకురాలు తప్పించుకోలేకపోయింది. ఈ బందీ అయిన స్థితిలోని ఊపిరాడనితనాన్ని ప్రదర్శించే వీలులేకా, తప్పించుకోలేని అశక్తత వల్లా కథకురాలు తన కోపాన్నీ నిస్పృహనీ అణచిపెట్టుకోవాల్సిన పరిస్థితుల్లో మతిభ్రమణానికి గురయింది. తనకంటూ కొంత స్పేస్ కావాలనుకున్న స్త్రీ కథ ఇది. మాతృత్వపు శరీరంలో చిక్కుకుపోయిన స్త్రీ, తన రచనల ద్వారా బయటపడాలన్న తపన గురించిన కథ ఇది.

వర్జీనియా వుల్ఫ్ రాసిన A Room of One’s Own లో స్వేచ్ఛగా రాసుకోవాలంటే స్త్రీకి డబ్బూ, తనదైన ఒక ప్రైవేట్ రూమూ కావాలంటారు. స్త్రీ అలా సృజనాత్మకంగా, స్వతంత్రంగా ఆలోచించగల వ్యక్తులుగా ఉండటమనేది అవతలి వాళ్లు అంగీకరించాలన్న సూచన అందులో ఇమిడివుందో లేదో గానీ, ఈ కథలోని కథకురాలికి మాత్రం అలా డబ్బూ, తీరికా, ఒక రూమ్ ఉండటం మాత్రం సరిపోవు. తన అభివ్యక్తీకరణనీ, సృజన చేయాలన్న ఆసక్తినీ గుర్తించి గౌరవించే ఒక కుటుంబం కావాలనుకుంది.

కథ ముగింపు గురించి సహజంగానే కొన్ని సందేహాలు వస్తాయి. అవి వ్యాసంలో చర్చించబడతాయి. స్త్రీకి సంబంధించిన కథాంశం కాబట్టి ఈ కథకి ఫెమినిస్ట్ కోణం నుంచి వచ్చిన పరిశీలనలు ఎక్కువ. స్త్రీని అశక్తురాలిని చేసి అణచివేతకి గురిచేయడం అనేది అన్ని విమర్శలలోనూ సామాన్యంగా కనిపించే పరిశీలన. ఈ కథని సైకలాజికల్ రియలిజం (సైకలాజికల్: మానసికమైన సమస్యలకి సంబంధించినది కాబట్టి; రియలిజం: ఆ స్థితుల వాస్తవిక చిత్రణ చేస్తున్నది కాబట్టి) అనే వర్గం కింద కూడా పరిశీలించారు. మరోవైపు, ఈ కథలో రచయిత్రి తన ఫెమినిస్ట్ సిద్ధాంతాల పునరుద్ఘాటన తప్ప చేసినది ఇంకేమీ లేదని కథని వ్యతిరేకంగా విమర్శించినవారు అన్నారు. రచయిత్రి దానికి నొచ్చుకోలేదు. పైగా, “అవును, నేను సందేశం ఇవ్వడానికే ఇది రాసాను. ఒకవేళ అది సాహిత్యం కావడం జరిగివుంటే, అది అలా జరిగింది- అంతే!” అన్నారు.

కథకి నేపథ్యం

ఊరికి దూరంగా ఉన్న ఒక పెద్ద ఇంట్లో కథ జరుగుతుంది. పెద్ద ఇల్లూ, పెద్ద తోటా, సర్వెంట్ క్వార్టర్స్ లాంటివి అన్నీ ఉన్నా, ఇల్లు కొంచెం శిథిలమై ఉన్నట్టు కథకురాలు చెబుతుంది. ప్రారంభంలో కథకురాలు ఇంటిగురించి ఉత్సాహంగానే ఉంటుంది. కథ గడుస్తున్న కొద్దీ, ఒక చిన్నపిల్లల బెడ్‌రూమ్‌కీ, ఆ రూమ్ గోడల మీద ఉన్న పసుపుపచ్చ వాల్‌పేపర్‌కీ కథకురాలు పరిమితమైపోతుంది. ప్రశాంతంగా కనిపించే ఆ ఇల్లు కిటికీలకి చువ్వలు, నేలకి తాటించి ఉన్న బెడ్ లాంటి వాటితో ఒక బందిఖానాగా అనిపిస్తూంటుంది. ఎక్కడో దూరంగా ఒంటరిగా ఉన్న ఇల్లు, దాని శిథిలావస్థ- ఇవన్నీ కథకురాలి మనఃస్థితిని ప్రదర్శిస్తున్నట్టుగా ఉంటాయి.

 కథాకాలం నాటి సాంఘిక నేపథ్యం

ఉత్తర, దక్షిణ అమెరికాల మధ్య నాలుగేళ్లు జరిగిన సివిల్ వార్ 1865లో ముగిసాక, దేశం పునర్నిర్మాణ కార్యక్రమాల్లోకి దిగింది. దాదాపుగా 1890 వరకూ ఆ ప్రయత్నాలు సాగాయి. ఈ కాలంలో చాలా సాంఘికమైన, సాంస్కృతికమైన మార్పులు జరిగాయి. డార్విన్ రాసిన ‘ది ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్’ 1892లో ప్రచురించబడింది. అప్పటిదాకా స్త్రీల గురించి వస్తున్న అవగాహననే ఈ సిద్ధాంతం కూడా కొనసాగించింది: జాతిని పరిరక్షించే, కొనసాగించే సామర్థ్యం స్త్రీలకే ఉందనేది ఆ ప్రతిపాదన. అలాంటి అదనపు సామర్థ్యం స్త్రీలకే ఉంది కాబట్టి వారు మాతృత్వపు విధులనే కాకుండా, వృత్తి రంగాలలో కూడా పాలుపంచుకోగలరని ఒక వాదమూ; మాతృత్వపు స్థానం చాలా ముఖ్యమైనది కాబట్టి వారు ఆ మేరకే పరిమితమై పోవాలనే ఒక వాదమూ – రెండూ సమాంతరంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి అసందిగ్ధతల మధ్య పందొమ్మిదో శతాబ్దం దాదాపూ స్త్రీలని మగవారి ఆస్తి కిందే జమకట్టడం అనే పూర్వసంప్రదాయాన్నే కొనసాగించింది. అమెరికాలో వారికి ఓటు హక్కు 1920 వరకూ కూడా ఇవ్వలేదు. అమెరికన్ సివిల్ వార్ తర్వాత స్త్రీ చైతన్యం పుంజుకొని, 1890ల నాటికి వివిధ సంస్థల్లో దాదాపు ఐదు లక్షల మంది సభ్యులు నమోదయ్యారు. ఈ కథారచయిత్రి గిల్‌మన్ కూడా ఆ చివరి దశాబ్దంలో చాలా క్రియాశీలకంగా ఉన్నారు. స్త్రీలు బలహీనులు కాబట్టి తమ అవసరాల కోసం మగవారి మీద ఆధారపడటం లేదనీ, అలాంటి బానిసత్వపు భావజాలం తరతరాలుగా సాంస్కృతికంగా వారిపై రుద్దబడుతోందనీ రచయిత్రి అనేవారు. తన రచనలు చదివి ఏ స్త్రీ అయితే ఒక శక్తిగా మారుతుందో, అలాంటి స్త్రీకోసం తను రాస్తున్నానని అన్నారు.

 కథనం

ఉత్తమ పురుషలో సాగే ఈ కథనంలో, కథకురాలి పేరు ఎక్కడా ప్రస్తావించబడదు. (కథకురాలి పేరు ఏమై ఉండవచ్చన్న ఒక ఊహ వ్యాసం చివర్లో ఉంటుంది!). ఆమె ఆలోచనలకి మాత్రమే పాఠకుడు పరిమితం కాబడతాడు. ఆమె మానసిక స్థితి సరీగ్గా లేనందువల్ల, కథకురాలు ‘అన్‌రిలైయబుల్’ కథకురాలు అవుతుంది. దాంతో, జరుగుతున్న విషయాలు మనకి యథాతథంగా అందుతున్నాయా అన్న అనుమానం కూడా రావడం సహజం. కానీ కథ కలగజేసే భౌతికమైన స్పృహ వల్ల, కథకురాలి నిస్పృహ, అనిశ్చితి, గందరగోళం వంటివి పాఠకుడికి అందుతున్నప్పుడు అవి కలగజేసే ఉద్వేగాల వల్ల పాఠకుడు కథనానికి దగ్గరవుతాడు. కథకురాలు రాసిన డైరీలోని విషయాల వల్లనే ఈ కథ మనకి ఆవిష్కారమవుతూ ఉంటుంది. మారుతూ వస్తున్న కథకురాలి భాష, శైలి గమనిస్తున్న పాఠకుడికి క్షీణిస్తున్న ఆమె మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కలుగుతూ ఉంటుంది. కథ అంతటా కథకురాలి వాక్యాలు చిన్నవిగానూ, సూటిగానూ ఉంటాయి. ఒక్కో పేరాకి ఒకటి రెండు వాక్యాలే. ఇవి తనున్న నిరాశాపూరిత స్థితినీ, సరీగ్గా ఒక పంథాలో కాసేపు ఆలోచించలేని మానసిక అశక్తతనీ, అనుకున్నది ధైర్యంగా రాయలేని పరిస్థితులనీ తెలియజేస్తాయి. అలాగే, కథలో కథకురాలి ‘టోన్’ కూడా మారుతుంది. కథ ప్రారంభంలో- తనకు జరుగుతున్న వైద్యం పట్ల తనకు నమ్మకం లేదనీ, అయినా తన భర్తకి ఇవన్నీ తెలిసే ఉంటాయిలే అని వీలైనంత మర్యాదగానే విషయాన్ని చెప్పే కథకురాలి స్వరం, కథ చివరికి చేరుకుంటున్న దశలో ఒక తిరుగుబాటు ధోరణీ, ఆరోపణ చేసే ధోరణీ సంతరించుకుంటుంది.

 ప్రతీకలు

కథలో దాదాపు ప్రతి వస్తువూ ఒక ప్రతీకగా సాగిన ఈ కథలోని అతిముఖ్యమైన ప్రతీక పసుపుపచ్చ రంగులో ఉన్న వాల్‌పేపర్. చాలామంది విమర్శకులు ఇది కథకురాలి దృష్టికోణంలో పితృస్వామ్యపు ఆంక్షలకి ప్రతీక అని అంగీకరిస్తారు. ఒక రకంగా పందొమ్మిదో శతాబ్దంలో స్త్రీల అందరి పరిస్థితినీ ఇది ప్రతిబింబిస్తుంది. “పద్ధతిలేని వక్రరేఖలు”, “అర్థం లేని వైరుధ్యాలు” లతో వాల్‌పేపర్‌ నిండివుందని కథకురాలు వర్ణిస్తుంది. 1973 పుస్తకానికి పరిచయం రాసిన ఎలైన్ హెడ్జెస్- మగవాళ్లు స్త్రీలని చూసే పద్ధతిని అంగీకరించిన స్త్రీలకి ఈ వాల్‌పేపర్ ప్రతీక అంటారు. భర్తల అభిప్రాయం మినహా స్త్రీలకి తమని తాము ఇంకోలా చూసుకోగల స్వాతంత్ర్యం లేదు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో స్త్రీలని చిన్నపిల్లలుగా చూస్తారనడటానికి చిన్నపిల్లల బెడ్‌రూమ్ ప్రతీక కాగా, స్త్రీలని మానసికంగా, సాంఘికంగా, బౌద్ధికంగా బంధించడాన్ని కిటికీలు సూచిస్తాయి. నేలకి బిగించిన బెడ్ మరి దేనికి ప్రతీక? కొంతమంది విమర్శకులు అది అణచివేతకి గురయిన స్త్రీల లైంగికతకి ప్రతీకగా భావించారు. వాల్‌పేపర్‌లో వర్ణించిన ఫంగస్, తలలు, కళ్లు, కథకురాలు తనని తాను కట్టేసుకున్న తాడు- ఇవన్నీ వేటికి ప్రతీకలు కాగలవో ఊహించి చెప్పిన ఒక విమర్శ కూడా ఈ వ్యాసంలో ఉంది.

మాతృత్వం- అందులో దాగున్న హింస

ఒక స్త్రీ నిర్వహించే రకరకాల పాత్రల్లో మాతృత్వపు పాత్ర అత్యంత క్లిష్టమైన పాత్ర. నిజానికి ఈ దశలో ఊపిరి సలపనివ్వని కొత్తబాధ్యతలతో బాటు, అసలు సొంత అస్తిత్వాన్నే కోల్పోయే పరిస్థితి కూడా స్త్రీకి కలుగుతుంది. తమ మానసిక, భౌతిక ప్రపంచాలని విస్మరించి ఇరవై నాలుగు గంటలూ ఒకే బాధ్యతని అప్రమత్తంగా నిర్వహించాల్సిన భారం మరే ఇతర మానవ పరిస్థితుల్లోనూ కనపడదు. స్త్రీలకి సంబంధించిన రకరకాల ఇతర సమస్యలపైన చాలా సాహిత్యం వచ్చినప్పటికీ, ఇలాంటి బరువైన బాధ్యత గురించి రావలసినంత సాహిత్యం రాలేదు. దానికి కారణం, మాతృత్వపు స్థానం అనేది ఒక మార్పుకి సంబంధించిన స్థితిగా పరిగణించకపోవడం; అది అత్యంత సహజమైన, చర్చకి అతీతమైన ఉత్కృష్ట స్థానం కింద పరిగణించడం; తల్లి అన్నాక ఈ అదనపు బాధ్యతలు సహజమే కదా అన్న ఉదాసీన ధోరణిలో చూడటం అయివుండాలి. ఇన్ని బాధ్యతలకి తోడు, తన అస్తిత్వాన్ని కోల్పోతున్నానన్న ఆందోళనలో ఒక స్త్రీ ఎలాంటి మానసిక ఘర్షణకి గురి అవగలదూ అన్న కోణం పరిశీలించవలసిన కోణంగా బహుశా అందరూ అనుకోకపోవడం కూడా అయివుండవచ్చు.

తమ ఇళ్లల్లోనూ, మాతృత్వం ఆవహించిన కొత్తశరీరాలలోనూ, తమ అక్షరాల్లోనూ- సమాంతరంగా, ఏకకాలంలో బందీ కాబడిన స్త్రీల మౌనవేదనని మొత్తంగా గిల్‌మన్ ఈ కథలో పట్టుకొచ్చారు. ఈ కథలోని కథకురాలికి ఉన్న వ్యాధి కంటే చేస్తున్న చికిత్స దారుణమైనది. సంఘనిర్మాణాన్ని పోలినట్టున్న పురాతన, ఆంక్షల భవనంలోకి ప్రవేశపెట్టబడిన కథకురాలికి చుట్టూ కనిపించే పసుపుపచ్చటి వాల్‌పేపర్ అర్థం కాని అక్షరాలుగా, ఉక్కిరిబిక్కిరి చేసే ఆంక్షలకి ప్రతిరూపంగా కనిపిస్తుంది. ఇక్కడే ఇక నివాసం, ఇక వాటితోటే సావాసం. మొదట్లో ఆమెకి ఆ వాల్‌పేపర్‌లోనే ఆత్మహత్యని ప్రేరేపించే సూచనలు కనిపించినా (“అవి కొంతదూరం పోయి అకస్మాత్తుగా ఆత్మహత్యలు చేసుకుంటాయి.”), తనకున్న సృజనాత్మక శక్తివల్ల ఆ సూచనలని పక్కకి తోసేసి, వాల్‌పేపర్‌లో కనిపించే చిత్రలిపిలోనికి తను పలాయనం చెందగల మార్గాల కోసం అన్వేషిస్తుంది. కాలం గడుస్తున్నకొద్దీ, ఆ వాల్‌పేపర్ డిజైన్ కటకటాల లాగా కనిపిస్తూ, అదంతా పితృస్వామ్యపు డిజైన్ అనిపించడం మొదలవుతుంది. అసలు ఆ కటకటాల వెనక స్పష్టాస్పష్టంగా ఉన్న ఒక స్త్రీ ఆకారం గోచరించడం మొదలవుతుంది. ఈ భావన పూర్తిగా అంతర్గతమయ్యాక, ఆ పసుపురంగు కేవలం వర్ణాన్నే కాకుండా ఒక వాసనని కూడా బహిర్గతం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ వాసన ఇక్కడా, అక్కడా, అన్నిచోట్లకీ పాకుతున్నట్టు కూడా అనిపిస్తుంది. వాల్‌పేపర్ లోపల ఉన్న స్త్రీ కూడా పాకటం ప్రారంభించింది- ఇంట్లోనూ, ఇంటి బయటా, బయట గార్డెన్ లోనూ, ఆ గార్డెన్ దాటి రోడ్దు మీదా. అసలు అలా చాలామంది స్త్రీలు పాకుతున్నట్టూ అనిపిస్తుంది. చివరికి, ఈ వాల్‌పేపర్‌లో ఇరుక్కున మహిళ, తన మరో రూపమే అన్నది ఇటు పాఠకులకీ, అటు కథకురాలికీ కూడా అర్థం అవుతుంది. తన ప్రతిరూపాన్ని ఖైదునుంచి విడుదల చేయడానికి తనూ ప్రయత్నిస్తుంది: “నేను లాగుతున్నాను, తను కుదుపుతోంది. నేను కుదుపుతున్నాను, తను లాగుతోంది. తెల్లారేసరికి, ఇద్దరం గజాల కొద్దీ ఆ పేపర్‌ని పీకేసాం.” తన శరీరంలో బందీ అయిపోయిన సృజనాత్మక శక్తినీ, అస్తిత్వాన్నీ బయటపడెయ్యాలనుకోవడమే ఈ పోరాటం వెనక ఉన్న ఆశయం.

అయితే, కథ అంతిమంగా సూచిస్తున్న పరిణామం మతిభ్రమణమేనా? ఎమిలీ డికెన్సన్ “infection in the sentence breeds…” (వాక్యానికి పట్టిన వ్యాధి వ్యాపిస్తుంది) అని చెప్పింది రచయిత్రి గిల్‌మన్‌కి తెలియదా?

ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. తమ అక్షరాల ద్వారా విముక్తిని సాధించడం ప్రారంభిస్తున్న ఆ శతాబ్దపు రచయిత్రులు సాధిస్తున్న ప్రగతిని “వేగంగా వీచే గాలులకి ఇంకా వేగంగా కదిలిపోయే మేఘపు నీడల్లాగా…” అన్న పోలిక ఒక సూచన కాకుండా పోదు. డిజైన్ ఉన్న గోడలనుంచి బయటపడటం అనేది వ్యాధిలోనుంచి బయటపడటమే అన్న సంగతి ఈ కథారచయిత్రి గిల్‌మన్‌కే స్వయంగా తెలుసు. గిల్‌మన్ స్వయంగా విప్లవాత్మకమైన ఫెమినిస్ట్ కావడం చేత, దీన్ని కేవలం వైద్యవిధానాల మూసలని బద్దలు కొట్టే ధోరణిలో రాయాలని భావించలేదు. స్త్రీల వేదనకి విముక్తి ఆత్మిక, భౌతిక, కళాత్మక, సామాజిక పరిస్థితులలో మార్పు వల్ల మాత్రమే సాధ్యమని ఆమెకి తెలుసు. రచయిత్రే స్వయంగా చెప్పినట్టు, ఈ కథ రాయడం వెనక ఉన్న ఉద్దేశం ఏమిటంటే- “to drive people crazy, but to save people from being driven crazy”. ఒక “పిచ్చిపట్టిన” స్త్రీ, వ్యాధి ముదిరిన తన దేహంలోనే తను బంధింపబడినా, సిల్వియా ప్లాత్ చెప్పినట్టు “.. ఒక స్వంత అస్తిత్వాన్ని – ఒక రాణిని – తిరిగి పొందాలి” అన్న స్ఫూర్తితో ఆ స్త్రీ ఆ విషయాన్ని తనకు తానే ఎరుకపరచుకుంటుందన్న విషయం కూడా రచయిత్రి చాలా గాఢంగా నమ్ముతారనిపిస్తుంది. ఈ పోరాట స్ఫూర్తిని ప్రదర్శించడానికి ఒక ధిక్కారం కావాలి. ఒక ప్రకటన కావాలి. ఆ ధిక్కార ప్రకటన చేస్తున్న స్త్రీ “మామూలు” గా ఉన్నట్టయితే దాని ప్రభావం మరింత తీవ్రంగా ఉండేదని అనుకుంటాం. దురదృష్టవశాత్తూ, ఈ కథలోని ఆమె మతిభ్రమణపు అంచుల్లో ఉంది. అది వాస్తవం. మభ్యపెట్టడానికి వీల్లేని వాస్తవం!

Escape the Sentence

ఈ కథలో ఉన్న వాల్‌పేపర్, అందులో ఉన్న స్త్రీ అసలు దేనికి ప్రతీకలు అనే విషయం మీద చాలా విమర్శా వ్యాసాలు ఉన్నాయి. సరికొత్త వ్యాఖ్యానాలు వస్తూనే ఉన్నాయి. అందుబాటులో ఉన్న విమర్శని పరిశీలిస్తే, ఎల్లో వాల్‌పేపర్ అనేది కథకురాలి మెదడుకీ, లేదా కథకురాలి అంతశ్చేతనకీ, లేదా కథకురాలి పితృస్వామ్యపు ఆంక్షలకీ ప్రతీక. వాల్‌పేపర్ లోపల కథకురాలు చూసిన స్త్రీ ఆకారం- మతిభ్రమణానికి లోనైన కథకురాలికీ, లేదా కథకురాలి అంతశ్చేతనకీ, లేదా మొత్తం స్త్రీలోకానికీ ప్రతీక. ఈ విమర్శా భాగం ఆ వాల్‌పేపర్ పితృస్వామ్యపు డిస్‌కోర్స్‌కీ, స్త్రీల డిస్‌కోర్స్‌కీ మధ్య ఉన్న ఘర్షణ అని ప్రతిపాదిస్తుంది. (Discourse: formal and orderly and usually extended expression of thought on a subject. ఒక విషయం చుట్టూ తన అభిప్రాయాల్ని తార్కికంగా విస్తరిస్తూ వ్యక్తీకరించడం.)

మంచికథలకి ఉండే ఒక లక్షణం ఏమిటంటే కథలోకి సూటిగా వెళ్లిపోవడం. ఈ కథ ప్రారంభంలోనే కథకురాలు తన అనారోగ్యం గురించి చెబుతుంది. డాక్టర్ కూడా అయిన భర్త మాత్రం దాన్ని “నరాల బలహీనత, కొంచెం హిస్టీరియా ఛాయలు మాత్రమే…” అని రోగనిర్థారణ – డయాగ్నోసిస్ – చేస్తాడు.

డయాగ్నోసిస్ వ్యాధి లక్షణాలనీ, రోగి ప్రవర్తనలనీ రికార్డ్ చేస్తుంది. వాటికి విరుగుడుగా తీసుకోవాల్సిన చికిత్సా విధానాన్ని సూచిస్తుంది. భర్తే నిర్థారించిన ఈ వ్యాధి, ఆ భర్తే సూచించిన చికిత్స మనం గమనించాల్సిన ఒక కొత్త ఆంక్షల భాషని ప్రవేశపెడుతుంది. కథకురాలు సాంఘిక జీవితానికి దూరంగా ఉండాలి. బహుశా, దానివల్ల ఆమె మేధోపరమైన చర్చలకీ, ఆలోచనలకీ దూరంగా ఉంటుంది. తన వ్యాధి గురించి ఎలాంటి ఆందోళనలూ, భయాలూ పెట్టుకోకుండా తనని తాను నిగ్రహించుకోవాలి. వీటన్నింటికీ మించి, తను ‘పని’ కి దూరంగా ఉండాలి.

Sentence అంటే వాక్యం అని అర్థం. పైదంతా మగవాడు సృష్టించిన భాష, అది మగవాడి వాక్యం. దీనిని ఎదిరించలేని కథకురాలు, తనలో తాను గొణుక్కునే మరో ‘తను’ని సృష్టించుకుంది. ఈ మరో రూపానికి తనదైన భాష ఉంది. తనవైన అభిప్రాయాలు ఉన్నాయి. జరుగుతున్న విషయాల పట్ల తనదైన డిస్‌కోర్స్ ఉంది. మగవాడి శాసనవాక్యానికీ, స్త్రీ ఆకాంక్షల డిస్‌కోర్స్‌కీ ఘర్షణ ప్రధానంగా ఈ కథలో కనిపిస్తుంది.

Sentence అంటే శిక్ష అని కూడా అర్థం. నిర్థారణలు (డయాగ్నోసిస్) చేసి స్త్రీల మీద రుద్దుతున్న పరిష్కారాలే మగవాడు విధిస్తున్న శిక్షలు!

తన డిస్‌కోర్స్‌లో భాగంగా ఎవరితోనైనా సంభాషించే వీలు ఈ కథకురాలికి లేదు. అందుకే “ప్రాణం లేని కాగితం” తనకు ఆసరా అయింది. అలాంటి ప్రాణం లేని కాగితం మీద రాయడానికి ప్రాణం లేని భాషనే ఉపయోగించాలి- అదీ పూర్తిగా సేఫ్ కాకపోయినప్పటికీ, అంతకుమించి మార్గం లేదు. కథ మొదటి సెక్షన్‌లో 39 పేరాలుంటాయి. ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగించని టాపిక్స్ మీద రాయడానికి మొదలుపెట్టినట్టు ఉంటాయి – ఇల్లు, తన రూమ్, రూమ్‌లో ఉన్న ఎల్లో వాల్‌పేపర్. కానీ, ఒక్కసారి ఆ వాల్‌పేపర్ ప్రసక్తి రాగానే కథకురాలు పట్టుతప్పి పోతుంది. “ఇంతకన్నా ఘోరమైన వాల్‌పేపర్ నేనెక్కడా చూడలేదు,” లాంటి నిజాయితీతో కూడిన అభివ్యక్తికి లోబడిన ఆమె, సరీగ్గా అక్కడ, అంతకుముందున్న భాషకి భిన్నమైన భాష మొదలుపెడుతుంది. (“అలా అన్నివైపులా పరుచుకుని ఉన్న ఆ మాసికల ఆకృతులు కళ పట్ల అన్నిరకాల అఘాయిత్యాలూ చేస్తున్నాయి.”; “ఆ పద్ధతిలేని వక్రరేఖల్ని కొంతదూరం అనుసరిస్తూ పోయినా, అవి కొంతదూరం పోయి అకస్మాత్తుగా ఆత్మహత్యలు చేసుకుంటాయి- కొత్త కోణాల్లోకి దూసుకుపోతాయి, అర్థం లేని వైరుధ్యాలలో అవి సమసిపోతాయి.”). చివరికి, దాన్ని పీకిపారేసే దశవరకూ కథకురాలు చేరుకుంటుంది. ఆ కాలం నాటి సాంఘిక స్థితిగతులను పరిశీలిస్తే, స్త్రీల భావవ్యక్తీకరణకి అడ్డంపడుతున్న మగవాళ్ల భావజాలాలూ, మనస్తత్వాలూ, పితృస్వామ్య ధోరణీ తొలగిస్తే తప్ప అసలైన వాస్తవ ప్రపంచం ఏమిటో అర్థం కాని పరిస్థితి స్త్రీలది. పితృస్వామ్యపు మొండిభాషకీ, స్త్రీల భావవ్యక్తీకరణాభిలాషకీ మధ్య ఘర్షణ ఈ కథ. ఈ పితృస్వామ్యపు భాషకి సంబంధించిన అధికారాల, అహంకారాల వాక్యం నుంచి స్త్రీ తప్పించుకోవడం ఎలా అన్నది ఈ కథ వేసే ప్రశ్న.

కథ చివర్లో ఒక కీలకమయిన మలుపు ఉంటుంది. జరుగుతున్నవన్నీ తన డైరీ ద్వారా పాఠకులకి చెబుతున్న కథకురాలు, “అన్నట్టు, నేను ఇంకోటి కూడా కనిపెట్టాను. కానీ, అదేంటో ఈసారి చెప్పను. మనుషుల్ని కూడా అతిగా నమ్మలేం.” అంటుంది. ఆ తర్వాత జరిగిన విషయాలు చెప్పినప్పటికీ, ఇక్కడ కథకురాలి మనఃస్థితిలో – పాఠకులని కూడా ఇప్పుడిక నమ్మలేనంతగా – మార్పు వచ్చిందన్న విషయాన్ని మనం గ్రహించాలి. బహుశా కథకురాలు కనిపెట్టిన విషయం ఏమిటంటే- తనూ, ఆ వాల్‌పేపర్ వెనక చిక్కుకుపోయింది ఒకరే అన్నది. “ఆ స్త్రీ బయటకి వస్తే, బయటకి వెళ్లాలనుకుంటే, ఆమెని కట్టిపారేయగలను!”, “ఇదిగో ఇక్కడ నా తాడుతో నేను కట్టేసుకొని సేఫ్‌గా ఉన్నాను-“ అన్న రెండు విరుద్ధమైన వాక్యాల మధ్య ఆ కనుక్కున్నదేదో కథకురాలు పరోక్షంగా పాఠకులకి చెబుతుంది. ఈ కీలకమైన మలుపు తర్వాత కథకురాలి భాష కూడా స్వల్పంగా మారుతుంది (“హుర్రా!”, “నేను తప్పించి ఏ మనిషీ దాన్ని తాకడానికి వీల్లేదు- బతికి ఉండదలచుకుంటే!”, “లాభం లేదు అబ్బాయ్! నువ్వు దాన్ని తెరవలేవు!”).

కథ చివర్లో తను చెబుతున్నది బహుశా స్పష్టంగా లేకపోవడం వల్లనో, లేదా ఆ “చిన్నారి” చెబుతున్నది భర్త జీర్ణించుకోలేకపోవడం వల్లనో కథకురాలు చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్పాల్సి వస్తుంది (“ఎన్నిసార్లు చెప్పానంటే, చివరికి అతను వెళ్లి చూడాల్సివచ్చింది.”).

చివరికి ఆమె ఒక విజయగర్వపు ప్రకటన చేస్తుంది: “…నేను బయటపడ్డాను! … మీరు నన్ను మళ్లీ లోపల పెట్టలేరు!”. చెప్పింది ఎవరూ, చెబుతోంది ఏమిటీ అన్నది గమనిస్తే, ఇది చాలా ముఖ్యమైన పరిణామం. తననుంచి తను విడిపోయి, ఒక కొత్త “తను” ఆవిర్భావం కావడం గురించి ప్రకటన చేసిన సందర్భం అది! “తరతరాలుగా అనువంశికంగా వస్తున్న” ఆ పురాతన భవనపు పితృస్వామ్య చరిత్ర గతిని మార్చిన క్షణం అది!

Escaping the sentence అంటే – తమ చుట్టూ ఉన్న భౌతికమైన వాసవాన్ని ధిక్కరించడమే కాకుండా, తమపై రుద్దబడిన వాక్యాన్నీ, భాషనీ, విలువల్నీ ధిక్కరించడం కూడా. ఆ ప్రక్రియలో స్త్రీకి తమ సొంత భాషా, అభివ్యక్తీ కూడా సిద్ధిస్తాయి అని సూచిస్తున్న ఈ కథ, తరువాతి తరాల కాలంలో రానున్న పరిణామాలని చాలా ముందుగానే ఊహించింది. అలాంటి ధిక్కార ప్రకటనల మీద తొలిసంతకం చేసింది!

 మరో ఆసక్తికరమైన వ్యాఖ్యానం

కథని అర్థం చేసుకోవడానికి ఆసక్తికరమైన మరో కోణం చూపించిన విమర్శ ఒకటుంది.

పితృస్వామ్యపు మురికితో, సాంప్రదాయపు రాతల డిజైన్లు ఉన్న ఒక పసుపుపచ్చటి వాల్‌పేపర్ మాతృత్వపు స్థితిలోని భయమూ, అసహ్యమూ, ఆందోళనలని ప్రేరేపించిన కథగా దీన్ని అర్థం చేసుకుంటే, ఈ ఆందోళనలన్నింటికీ మూలకారణం పోస్ట్-నేటల్ డిప్రెషనే. ఈ ఆందోళనల కారణంగా తను ప్రస్తుతం బహిరంగంగా అసహ్యించుకుంటున్న వాల్‌పేపర్ రంగూ వాసనలు నిజానికి రక్తమాంసాలలో ఇమిడిపోయి వున్న గర్భసంచీ గోడలుగా భావించవచ్చుననే ప్రతిపాదన ఈ విమర్శ చేస్తుంది. కథకురాలు వాల్‌పేపర్ విచ్ఛిన్నానికి పూనుకోవడం, ఇలాంటి పరిస్థితి దాపురించకుండా ఒక అబార్షన్ కోసం (ఇప్పుడు సరైన సమయం కాకపోవచ్చు. కానీ ఆందోళన కలగజేసిన ఉన్మాదం కథకురాలిని ఆవహించి ఉంది కాబట్టి…) చేసే ప్రయత్నం అన్నది ఈ విమర్శ సూచిస్తుంది. దీనికి తగిన ఆధారాలని ఈ విమర్శ కథలో వెతికి పట్టుకుంటుంది.

కథలో ఎక్కడా ప్రత్యక్షంగా కనిపించని చిన్నపిల్లవాడు, ఈ కోణంలోనుంచి చూసినప్పుడు ప్రముఖ పాత్రని నిర్వహించడం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మనసు అరల్లో నిక్షిప్తంగా, గుర్తు తెలీకుండా ఎన్నో భావనలు రహస్యంగా దాక్కుని ఉంటాయి. కథకురాలికి వాల్‌పేపర్‌లో “ పొడుచుకొచ్చే రెండు కళ్లు తలకిందులుగా (తనని) చూస్తున్నట్టు” కనిపిస్తుంది. ఈ వర్ణన గర్భస్థ శిశువుని జ్ఞప్తికి తెస్తుంది. ఒక్కోసారి అది “తలకిందులుగా ఎగిరి”నట్టవుతుంది- గర్భంలో ఉన్న శిశువు కదలికల్లాగా. “అస్పష్టమైన ఆకారం … తచ్చాడుతున్నట్టు”, “స్వంత సోదరుడి కంటే కూడా గట్టిగా అతుక్కుని ఉండే…” లాంటి వర్ణనలు తన శరీరపు అంతర్భాగాన్ని గురించి చెప్పడాన్ని సూచిస్తాయి. వేలాడే తలలూ, పొడుచుకొచ్చిన కళ్లూ..” భవిష్యత్తులో ధరించబోయే గర్భాలతో సహా “చిన్నచిన్న అడుగులతో నడిచే ఫంగస్” ని గుర్తుచేస్తున్నాయి. లోపల ఉన్న శిశువు జననమార్గం ద్వారా బయటకి “వాటిని దాటుకుని రావడానికి సదా ప్రయత్నిస్తూ ఉంటుంది.” దాటుకుని రావడం అంత కష్టం కాదని కథకురాలు అన్నా, వెంటనే తరువాతి వాక్యంలో “బహుశా అందుకే అన్ని తలలు ఉన్నాయి” (బహుశా, ఈ గర్భం కాకపోతే నిలిచే గర్భం మరొకటి) అన్న వాక్యంలో ఈ ప్రక్రియ జరగడం ఎలానూ ఆగదు అని సూచిస్తుంది.

ఇంకో “తను” కి కట్టేస్తానన్న తాడుని తనకే కట్టేసుకుంటుంది కథకురాలు. ఈ తాడు ఇంకో చివర దేనికీ కట్టివేయబడి ఉండదు. ఈ తాడు పిల్లవాడికి ఊపిరాడనివ్వకుండా చేయగల బొడ్డు తాడు (umbilical cord). నిజానికి ఈ మాతృత్వపు భావనతో ఊపిరాడనివ్వకుండా చేస్తున్న తాడు అది. ఈ తాడుని తనకి (లేదా, తన ప్రతిరూపానికి) కట్టేసుకోవడాన్ని ఇంకో కోణం నుంచి కూడా చూడవచ్చు. కథకురాలు ఈ తాడుని తనకి తాను కట్టేసుకుని, గర్భంలో ఉన్న శిశువులా భ్రమిస్తోంది. “… ఇక్కడ నా తాడుతో నేను కట్టేసుకొని సేఫ్‌గా ఉన్నాను.” అని కథ చివరలో అంటుంది. “మీరు నన్ను రోడ్డు మీదకి లాక్కెళ్లలేరు.” అని కూడా అంటుంది. జనన మార్గం ద్వారా బాహ్యప్రపంచంలోకి రావడాన్ని నిరాకరించే సూచన అది. తాళం చెవి పారేయడం ద్వారా భర్త తన దగ్గరకు రాకుండా అడ్డుకుంటున్న కథకురాలు, మరోసారి గర్భం దాల్చడానికి ఉన్న అవకాశాలని నిరోధించడానికి సూచనగా అనుకోవచ్చు.

అప్పటికి కథకురాలు ఉన్న స్థితి ఎంత సంక్లిష్టంగా ఉండగలదో, ఏ పాత్రలో ఉన్నదీ అన్న స్పష్టత లేకుండా అన్ని రకాల ఉద్వేగాలూ అలుక్కుపోయినట్టు ఎలా ఉండగలవో ఊహించుకోవచ్చు.

 

కథ ముగింపు

కథ ముగింపు విషయంలో పాఠకులూ, విమర్శకులూ కూడా విభిన్నమైన అభిప్రాయాలని వ్యక్తం చేసారు. కథకురాలు పసితనపు ప్రపంచంలోకి వెళ్లిపోయి ఓడిపోయిందన్నారు కొంతమంది. స్పృహతప్పి పడిపోయిన భర్త జానే నిజానికి ఓడిపోయాడనీ, కథకురాలు ఇప్పుడు వాల్‌పేపర్ వెనకాల ఉన్న స్త్రీ అయిందనీ, ఇప్పుడు తను పాక్కుంటూ అయినా సరే ఎక్కడికైనా వెళ్లిపోవచ్చనీ, అది జాన్ అధికారానికి దూరంగా వెళ్లిపోవడం అనీ మరికొంతమంది విమర్శకులు అన్నారు.

ఈ కథ ముగింపు చాలా సంక్లిష్టంగానూ, దొరికీ దొరకకుండానూ ఉంటుంది. కథకురాలికి విజయం ఉన్నట్టే కనిపించినా, ఆందోళన కలిగించే అంశం కూడా ఇమిడి వుంటుంది. మతిభ్రమణం అనేది పాజిటివ్‌గానూ, నెగటివ్‌గానూ కనిపిస్తుంది. కథకురాలు ఒక ప్రత్యామ్నాయ వాస్తవాన్ని కనుక్కొని, పితృస్వామ్యాన్ని ధైర్యంగా ఢీకొనడం అనేది ఆశావహమైన పరిణామం. దాన్ని చూసి భర్త స్పృహ తప్పడం అనేది ఆ కొత్త స్వాతంత్ర్యం అందించిన విజయం. తన మీద రాసిన వాక్యాలనీ, తనకు విధించిన శిక్షల్నీ తృణీకరిస్తూ ఆమె తన తర్కాన్నీ, తన అవగాహననీ, తన విచక్షణనీ ఉపయోగిస్తూ ఆఖరి సన్నివేశంలో ఉన్మాదం అంటే ఇలాంటి ఆంక్షలకి అతీతంగా సాధించిన స్వాతంత్ర్యం అని చూపిస్తుంది. స్త్రీలు ఎలా మాట్లాడాలో చేసే దిశానిర్దేశాలనీ, పితృస్వామ్యపు దేహాల్నీ కాలితో తన్నేసి (“ప్రతిసారీ అతని మీదగా పాకుతూ పోవాల్సి వస్తోంది!”), తనదైన స్వంతవాక్యాలు (“లాభం లేదు అబ్బాయ్!”) సమకూర్చుకుంటుంది.

కథ చివర్లో కథకురాలు మతిభ్రమణానికి గురయ్యిందని అనుకునే కంటే, అణచిపెట్టుకున్న ఆగ్రహన్ని ఆమె ప్రవర్తన ప్రదర్శించిందనుకోవడం ఉచితంగా ఉంటుంది. అలాంటి ఆవేశపు ప్రకటన తాత్కాలికమైన కుంగుబాటుని తెచ్చినప్పటికీ, తన అంతఃశక్తినీ, సృజనాత్మక శక్తినీ తిరిగి పుంజుకోవడం అనేది అనతి కాలంలోనే జరగవచ్చని ఆశించవచ్చు.

చివరి సన్నివేశంలో- మంచం మీద పడుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉండాల్సిన కథకురాలు, నేలమీద పాకుతూ కనిపిస్తుంది. పడుకుని ఉండాల్సిన “చిన్నారి” దశనుంచి, తన అవసరాలని తనే గుర్తించగలిగిన తరువాతి దశకి చేరుకుంది.

ముగింపులో వాల్‌పేపర్‌లోని స్త్రీ తనే అనుకున్న కథకురాలు సాధించిన విముక్తి అంతా, “ఇక్కడ నేలమీద స్మూత్‌గా పాకవచ్చు. గోడమీద మరక చక్కగా నా భుజాల ఎత్తువరకూ ఉంది కాబట్టి, దారి తప్పిపోవడం అనేది జరగదు,” అనుకోవడంలో ఉంది. ఇప్పుడు జాన్ కేవలం “దారికి అడ్డంగా” వచ్చే వస్తువు కన్నా ఎక్కువేమీ కాదు.

కానీ, దురదృష్టవశాత్తూ ఈ కథ ఇక్కడ ముగిసిపోదు. ఈ ఉన్మాదానికి ప్రతిగా, ట్రీట్‌మెంట్ మరింత ఎక్కువ చేస్తారు. బహుశా వెయిర్ మిచెల్ లాంటి డాక్టర్ దగ్గరకి పంపినా ఆశ్చర్యం లేదు! పితృస్వామ్యం తలవొగ్గడం అనేది తాత్కాలికమైన సర్దుబాటు కావొచ్చు. ఆ భర్త కోల్పోయింది స్పృహ మాత్రమే, ప్రాణాలు కాదు. తను లేచాక, చేయవలసినదాన్ని పునఃప్రారంభిస్తాడు. ఆమె తప్పించుకోవడం అనేది తాత్కాలిక విజయంగా మిగిలిపోతుంది. కానీ ధిక్కార ప్రకటన కలిగించిన ప్రకంపనలు మాత్రం మగవారి మనసుల్లో ఆందోళనలు కలిగిస్తూనే ఉంటాయి. ఇది కథకురాలు సాధించిన దీర్ఘకాలిక ప్రయోజనం.

 ముగింపులో ఉన్న ‘జేన్’ ఎవరు?

కథ చివర్లో ఒక వాక్యం గమనించే ఉంటారు. కథకురాలు “నువ్వూ, జేన్ ఉన్నప్పటికీ నేను బయటపడ్డాను!” అంటుంది. అప్పటివరకూ కథలో జేన్ అనే పాత్ర గురించిన ప్రసక్తే లేదు కాబట్టి, అసలు ఆ జేన్ ఎవరూ అన్న ప్రశ్న వస్తుంది. ఒక సంభావ్యత- అది ముద్రారాక్షసం అయివుండవచ్చు. లేదూ- కథకురాలి అసలు పేరు జేన్ అయివుండి, కథకురాలు తను ‘జేన్’తనం నుంచి బయటపడి మరో రూపం దాల్చానన్న భ్రమలో ఉంది కాబట్టి- సంఘం, వివాహాల చేత నిర్వచించబడిన పూర్వపు కథకురాల్ని ఉద్దేశించి ఆ పేరు చెప్పివుండవచ్చు. జేన్ అన్నది ఇంట్లో ఉన్న పనిమనిషి పేరయి వుండవచ్చనీ, జెన్నీ అని కథలో వ్యవహరించినది ‘జేన్’ కి వాడుక రూపం అనేది మరి కొంతమంది అభిప్రాయం.

చిల్లింగ్ హారర్: మగవారి లోపలి భయాలు!

1892లో ఈ కథ ప్రచురించబడిన తర్వాత, 1973లో ఫెమినిస్ట్ ప్రెస్ వారు ప్రచురించేవరకూ ఈ కథలో ఉన్న ఫెమినిస్టిక్ అంశాలు గమనింపులోకి రాలేదు. మధ్యలో హొవెల్స్ తన 1920 కథాసంకలనంలో దీన్ని ప్రచురించినా, దీని గురించి “ఒళ్లు జలదరించే హారర్ కథ” (chilling horror) అని తప్పించి మరేమీ రాయలేదు. అలా ఒళ్లు జలదరించిన వాళ్లల్లో అప్పటికి హొవెల్స్ చివరివాడైనప్పటికీ, కాలరేఖని అనుసరిస్తూ వెళితే, అలా ఒళ్లు జలదరించిన వారు అతనికి ముందు క్యూలో చాలామంది ఉన్నారు! 1892లో కథని ప్రచురించాక ఒక పేరు చెప్పని పాఠకుడు (ఎమ్.డి.) ఇలాంటి కథలని సెన్సార్ చేయాలన్నాడు. అంతకుముందు అట్లాంటిక్ పత్రిక ఎడిటర్ కథని తిరస్కరిస్తూ, కథని చదివి తను ఒక దారుణమైన ఫీలింగ్‌కి గురయ్యానన్నాడు. ఇంకా అంతకుముందు, రచయిత్రి కథ రాసిన వెంటనే దాన్ని చదివిన భర్త (వాల్టర్ స్టెట్‌సన్)- ఇది ఎడ్గార్ అలన్ పో రాసిన కథల కంటే కూడా భయానకంగా ఉందన్నాడు. అంతకుముందు, కథలో భర్త జాన్ స్పృహే తప్పి పడిపోయాడు. అలా ముందుకి వెళుతూ ఉంటే మనం చిట్టచివరికి, మొట్టమొదటి మగవాడు ఆడమ్ గురించి మిల్టన్ చెప్పినదాని దగ్గర ఆగిపోతాం (“The fatal Trespass done by Eve, amaz’d,

Astonished stood and Blank, while horror chill, Ran through his veins…)!

కొసమెరుపు

గిల్‌మన్ నిజానికి ఈ కథని తనకు అభ్యంతరకరమైన చికిత్సని సూచించిన డాక్టర్ వెయిర్ మిచెల్‌ని ఉద్దేశించే రాసారు. కథ ప్రచురించబడ్డాక దాన్ని డాక్టర్ మిచెల్‌కి పంపించారు కూడా. అయితే, దానికి ఆయన దగ్గర్నుంచి తిరుగు సమాధానమేదీ రాలేదు. చాలా సంవత్సరాల తర్వాత రచయిత్రి తన స్నేహితుల ద్వారా తెలుసుకున్న విషయం ఏమిటంటే, డాక్టర్ మిచెల్ ఈ కథని చదివాక, తన ట్రీట్‌మెంట్ పద్ధతుల్లో తగిన మార్పులు చేసుకున్నారట. “అదే నిజమైతే గనక, నేను బతికింది వృథా కాలేదు” అంటారు రచయిత్రి తన ఆత్మకథలో!

***

ఈ వ్యాసం రాయడంలో చాలామంది విమర్శకుల వ్యాసాలు సహాయపడ్డాయి. ఈ కథ గురించి చాలా సంక్లిష్టమైన విమర్శా వ్యాసాలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైన వాటి సారాంశాన్ని అవసరమైనంత వరకూ వ్యాసంలో ఇమడ్చడం జరిగింది. ఈ విమర్శకులందరికీ ధన్యవాదాలు!

Ann Heilmann * Catherine Golden * Charlotte Perkins Gilman * Conrad Shumaker * Elaine R. Hedges * Greg Johnson * Janice Haney-Peritz * Karen Ford * Linda Wagner-Martin * Paula A. Treichler * Rena Korb * Sandra Gilbert & Susan Gubar * Sharon Felton

ఎ.వి. రమణమూర్తి

ఎ.వి. రమణమూర్తి

సాహిత్యం, ముఖ్యంగా కథాసాహిత్యం అంటే అభిమానం. వాటికి సంబంధించిన విమర్శ కూడా!
ముప్ఫై యేళ్ల బాంక్ ఉద్యోగం నుంచి ఐ.టి. మేనేజర్‌గా స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత, సాహిత్యాన్ని మరింత దగ్గరనుంచి పరిశీలించే అవకాశం దొరికింది. గత ఐదారేళ్లుగా వర్తమాన కథాసాహిత్యాన్ని నిశితంగా పరిశీలిస్తూ, దానిలో భాగంగా కథాసాహితి వారి కథ-2015 కి గెస్ట్ ఎడిటర్‌‌గా వ్యవహరించారు. శ్రీకాకుళం 'కథానిలయం' కోసం సాంకేతిక సహకారం అందిస్తున్నారు. అడపాదడపా పత్రికల్లో వ్యాసాలూ, సమీక్షలూ. హైదరాబాద్‌లో నివాసం.

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • మీ చివరి ధన్యవాద సమర్పణలో ఇదంతా పూర్తిగా చదివిన వారందరనీ మినహాయించడం విచారకరం.🙂

  “ఈ కథ చదువుతున్నప్పుడు నేను ఫీలయిన ఇబ్బందికి ఇతరులని కూడా గురి చేస్తే నన్ను నేను క్షమించుకోలేను”
  అని ఒక ప్రచురణకర్త అన్నమాటలు నవ్వు తెప్పించాయి.

  ఫెమినిస్టులు ప్రచారానికి తెచ్చిన తర్వాతే కథపై చర్చ జరగడం గమనించడం ఆలోచించాల్సిన విషయం. చివరి ఆసక్తికరమైన సమీక్ష సమంజసంగా ఉంది. ఏమంటే రచయిత్రి కథనంతా గర్భ ధారణకి సంబంధించిన ఆలోచనలు, భయాలూ, ఊహలూ, ఆ సమయంలో భర్తల అతి జాగ్రత్తలూ, పొట్టని వాల్ పేపర్ గా భావించడం, దాని పసుపురంగు, వెనకగా వత్తిడితో పైకి నగడుతున్న స్పష్టత లేని ఆకారం..

  ఏదేమైనా.. కథలో మజా ఉండాలిగాని ఎనాలిసిస్ లో మజా ఉన్నంత మాత్రాన నేను కథకి గొప్పతనం రావడం అంగీకరించలేను. కథ పాఠకుల ప్రక్రియే గాని, విమర్శకుల ప్రక్రియ కాలేదు.🙂

  మీ కకషికి ధన్యవాదాలు.🙏

 • చాలా విశ్లేషణ తో రాసిన ఈ కధ పరిచయం ఆసక్తి కలిగించింది,

 • నూట ముప్పై యేళ్ల క్రితం ( 1892 లో ) స్త్రీ స్వాతంత్ర్యం గురించి తొలి ఆందోళనలు మొదలైన కాలం నాటి చారిత్రక ప్రాముఖ్యతే కాకుండా, కథగా నిర్మాణం దృష్ట్యా విశిష్టతలు కలిగివున్న అమెరికన్ రచయిత్రి షార్లెట్ పెర్కిన్స్ గిల్‌మన్ “ ది ఎల్లో వాల్‌పేపర్ “ కథ పరిచయ, విశ్లేషణలతో కూడిన సమగ్ర వ్యాసాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు రమణమూర్తి గారూ.

 • “ ది ఎల్లో వాల్‌పేపర్ “ కథ మీద మీ సమగ్ర సుదీర్ఘ వ్యాసం నుండి నాకోసం నేను రాసుకున్న క్లుపీకరించిన ముఖ్యమైన పాయింట్లు రమణమూర్తి సామీ.

  నూట ముప్పై యేళ్ల క్రితం, స్త్రీ స్వాతంత్ర్యం గురించి తొలి ఆందోళనలు మొదలైన కాలం నాటి చారిత్రక ప్రాముఖ్యతే కాకుండా, కథగా నిర్మాణం దృష్ట్యా విశిష్టతలు కలిగివున్న అమెరికన్ రచయిత్రి షార్లెట్ పెర్కిన్స్ గిల్‌మన్ “ ది ఎల్లో వాల్‌పేపర్ “ కథ.

  తమ ఇళ్లల్లోనూ, మాతృత్వం ఆవహించిన కొత్తశరీరాలలోనూ, తమ అక్షరాల్లోనూ- సమాంతరంగా, ఏకకాలంలో బందీ కాబడిన స్త్రీల మౌనవేదనని మొత్తంగా గిల్‌మన్ ఈ కథలో పట్టుకొచ్చారు. తన శరీరంలో బందీ అయిపోయిన సృజనాత్మక శక్తినీ, అస్తిత్వాన్నీ బయటపడెయ్యాలనుకోవడమే పోరాటం ఉన్న ఆశయం. పితృస్వామ్యపు భాషకి సంబంధించిన అధికారాల, అహంకారాల వాక్యం నుంచి స్త్రీ తప్పించుకోవడం ఎలా అన్నది ఈ కథ వేసే ప్రశ్న.

  స్త్రీల వేదనకి విముక్తి ఆత్మిక, భౌతిక, కళాత్మక, సామాజిక పరిస్థితులలో మార్పు వల్ల మాత్రమే సాధ్యమన్న కథ.

  కథాసారం : పిల్లల్ని కని పెంచే వ్యక్తులుగా మాత్రమే స్త్రీలని గుర్తించే పందొమ్మిదో శతాబ్దపు భావజాలానికి ప్రతినిధి- భర్త జాన్. ప్రసవానంతరం డిప్రెషన్‌కి గురయిన కథకురాలు, తనకంటూ కొంత స్పేస్ కావాలనుకున్న స్త్రీ కథ ఇది. మాతృత్వపు శరీరంలో చిక్కుకుపోయిన స్త్రీ, తన రచనల ద్వారా బయటపడాలన్న తపన గురించిన కథ ఇది .

  కథకి నేపథ్యం : పందొమ్మిదో శతాబ్దం దాదాపూ స్త్రీలని మగవారి ఆస్తి కిందే జమకట్టడం అనే పూర్వసంప్రదాయాన్నే , అమెరికన్ సివిల్ వార్ తర్వాత పుంజు కొన్న స్త్రీ చైతన్యం.

  కథనం : ఉత్తమ పురుషలో సాగే కథనం. కథ కలగజేసే భౌతికమైన స్పృహ వల్ల, కథకురాలి నిస్పృహ, అనిశ్చితి, గందరగోళం వంటివి పాఠకుడికి అందుతున్నప్పుడు అవి కలగజేసే ఉద్వేగాల వల్ల పాఠకుడు కథనానికి దగ్గరవుతాడు.

  ప్రతీకలు : కథలో దాదాపు ప్రతి వస్తువూ ఒక ప్రతీకగా సాగిన ఈ కథలోని అతిముఖ్యమైన ప్రతీక. పసుపుపచ్చ రంగులో ఉన్న వాల్‌పేపర్ అనేది కథకురాలి మెదడుకీ, లేదా కథకురాలి అంతశ్చేతనకీ, లేదా కథకురాలి పితృస్వామ్యపు ఆంక్షలకీ ప్రతీక. మాతృత్వపు స్థితిలోని భయమూ, అసహ్యమూ, ఆందోళనల ప్రతీక. స్త్రీలని మానసికంగా, సాంఘికంగా, బౌద్ధికంగా బంధించడాన్ని కిటికీలు సూచిస్తాయి, నేలకి బిగించిన బెడ్ అణచివేతకి గురయిన స్త్రీల లైంగికతకి ప్రతీకగా. ఇంకో “తను” కి కట్టేస్తానన్న తాడుని తనకే కట్టేసుకుంటుంది కథకురాలు, ఈ తాడు పిల్లవాడికి ఊపిరాడనివ్వకుండా చేయగల బొడ్డు తాడు (umbilical cord). నిజానికి ఈ మాతృత్వపు భావనతో ఊపిరాడనివ్వకుండా చేస్తున్న తాడు అది.

  కథ ముగింపు : చాలా సంక్లిష్టంగానూ, దొరికీ దొరకకుండానూ ఉంటుంది. కథకురాలికి విజయం ఉన్నట్టే కనిపించినా, ఆందోళన కలిగించే అంశం కూడా ఇమిడి వుంటుంది. కథకురాలు ఒక ప్రత్యామ్నాయ వాస్తవాన్ని కనుక్కొని, పితృస్వామ్యాన్ని ధైర్యంగా ఢీకొనడం అనేది ఆశావహమైన పరిణామం. దాన్ని చూసి భర్త స్పృహ తప్పడం అనేది ఆ కొత్త స్వాతంత్ర్యం అందించిన విజయం. తన మీద రాసిన వాక్యాలనీ, తనకు విధించిన శిక్షల్నీ తృణీకరిస్తూ ఆమె తన తర్కాన్నీ, తన అవగాహననీ, తన విచక్షణనీ ఉపయోగిస్తూ ఆఖరి సన్నివేశంలో ఉన్మాదం అంటే ఇలాంటి ఆంక్షలకి అతీతంగా సాధించిన స్వాతంత్ర్యం అని చూపిస్తుంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు