పెద్దరికాల బూచోళ్ళు!

కుర్రాళ్ళ సంగతి కాసేపు పక్కన పెడదాం.  ఈ మావయ్యలకి, బాబాయిలకి, తాతయ్యలకి ఏం మాయరోగమొచ్చింది? 

పులి జింకను వేటాడి, చంపి తింటుంది. ఎందుకంటే పులికి జింకే ఆహారం.  మనిషికి మనిషి ఆహారం కాదు.  కానీ మనిషిని మనిషి చంపుతాడు.    తన పంజాకి బలయ్యే జింక నొప్పి పులికి తెలీదు.  కేవలం ఆహారం కోసమే తప్ప తన ఆనందం కోసం జింక మీద దాడి చేయదు.  కానీ మనిషికి సాటి మనిషి నొప్పి బాగా తెలుసు.  తెలిసే ఒక్కోసారి ఆ ఆనందం కోసమే దాడి చేస్తాడు.  ఆ ఆనందం బలహీనుల మీదనైతే ఎక్కువవుతుంది.  దాడి  పసిపిల్లల మీదనైతే ఇంకా ఆ ఆనందం రెట్టింపు అవుతుంది.  ఎందుకంటే పిల్లలు అత్యంత నిస్సహాయులు కదా.  తమ మీద లైంగిక దాడి నొప్పిని కలిగిస్తున్నా చెప్పుకోలేనంత బలహీనులు పిల్లలు.

శరీరానికి నొప్పి కలిగించినా, కలిగించక పోయినా ప్రతి లైంగిక దాడి హృదయానికి మాత్రం చాలా నొప్పిని కలగచేస్తుంది.  ఆ నొప్పి దుఃఖంతో ఖచ్చితంగా ఆగదు.  శరీరం మీద గాయాలు మచ్చల్లేకుండా కూడా తుడిచిపెట్టుకు పోవచ్చు.  కానీ జుగుప్సాకరమైన అనుభవాల నుండి మనసుకి తగిలే గాయాలు కలిగించే నొప్పిని జీవితాంతం మోయాల్సి రావొచ్చు.    మంచిని కూడా అనుమానించేంత భయపడి పోతారు.  దేన్నీ, ఎవరినీ విశ్వసించలేక ఒక జీవిత కాలపు ఏకాకితనాన్ని మిగుల్చుకుంటారు.   పీడకలలు, స్లీప్ పెరాలిసిస్, స్కిజో ఫ్రెనియా, బై పోలార్ వంటి అనేక మానసిక సంక్షోభాలకు గురవుతారు.  మన దేశంలో ఎంతమంది స్త్రీలు తమ బాల్యంలో కామపిశాచ గణాల బారిన పడకుండా, మనసు నెత్తుటి గడ్డ కాకుండా, ఒక్క పీడకలనైనా వెంటేసుకొని రాకుండా, ఒక్క నిస్సహాయపు వెర్రికేకని గొంతులోనే మింగేయకుండా పెద్దవాళ్ళై వుంటారు?  వారి జీవితమే కాదు, వారితో జీవైంచే వారు కూడా కల్లోలానికి గురవుతారు.   అందుకే చైల్డ్ అబ్యూజ్ అతి భయంకరమైన మానవసంబంధాలకు సంబంధించిన సాంఘీక సంక్షోభం.   ఇలాగే బాల్యంలోనే లైంగిక వేధింపులకు గురైన నా మిత్రురాలు ఒకామె తనక్నిఇప్పటికీ వెంటాడే,  పదే పదే దాడి చేసే పీడకలల గురించి చెబుతున్నప్పుడు ఆమె ఎండిపోయిన కళ్ళని చూస్తుంటే ఎప్పుడూ దుఃఖానికి గురి కాని నా కళ్ళు తడిసిపోయాయి.

****

శ్రీశ్రీ రాసినట్లు మెరుపు మెరిస్తే, హరివిల్లు విరిస్తే ఆనందించే ఓ పసికూన మైండ్ సెట్ ఎలా వుంటుంది?  వాళ్ళకి స్త్రీ-పురుష విభజన గురించి లోతుగా తెలిసే అవకాశమే వుండదు.  ఆ సమయంలో వారి ఆలోచనలు, మాటలు చాలా అమాయకంగానూ, అందంగానూ వుంటాయి.  మొండిగా పెట్టే పేచీల్లో కూడా అమాయకత్వమే వుంటుంది.  గారాబం, అల్లరి, అమయకత్వం తప్ప స్వార్ధం, హింస, పెత్తనం, అహంకారం తెలియని ఆ వయసులో అమ్మా, నాన్న ఏ మాత్రం ఘర్షణ పడినా వాళ్ళల్లో తెలియని కల్లోలం చెలరేగుతుంది.  వాళ్ళ అనుభవంలోకి వచ్చే మొట్టమొదటి హింసా రూపం తల్లిదండ్రులే.  వారి మధ్య ఘర్షణలోనే పిల్లలు అభద్రతతో బలహీనులవుతారు.  మంచికి చెడుకి సంబంధించిన వాళ్ళ ‘సెన్స్ ఆఫ్ జడ్జిమెంట్’ దెబ్బ తింటుంది.  ఇంక తల్లిదండ్రులు తమ ఘర్షణలో భాగంగా, తమ పార్ట్నర్ మీద కోపాన్ని పిల్లల మీద చూపిస్తుంటారు. ఇందువల్ల పిల్లలు ఆత్మ విశ్వాసం కోల్పోతారు.  తామున్నది హింస అనుభవించటానికే అని నమ్మేయొచ్చు.  పెద్దలింతే మనల్ని హింసిస్తారు.  వాళ్ళేం చేసినా కరెక్టే.  మనం భరిస్తూ వుండాలి అనుకుంటారు.  తనని సంహరించటానికి వచ్చిన సింహం ముందు సిద్ధంగా కూలబడే ఆవుకుండే నిస్సహాయ ఆమోదాన్ని అలవాటు చేసుకుంటారు.  ఏమీ చేయలేక హింసని  ఆమోదించే స్థితి ఆత్మన్యూనత ప్రవర్తన కంటే ప్రమాదకరమైనది.

పెద్దరికం ఎంత క్రూరమైనది?  “పెద్దలను గౌరవించుట మన సాంప్రదాయము”, “తల్లిదండ్రులు దైవాలతో సమానం.  వారు ప్రత్యక్ష పార్వతీ పరమేశ్వరులు”, “గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు…”  మన ఛాతీ ఉప్పొంగే ఈ విలువలన్నీ నిజానికి ఆధిపత్య సంకేతాలు.  పిల్లల పెంపకం అంటే వారి పట్ల మన ఆధిపత్యం చూపించటం అనుకుంటుంటాం.  అందరూ ఏదో మేరకి ఈ విలువలు మంజూరు చేసే ఆధిపత్య, అహంకార ట్రాప్ లో పడిపోయే వారే.  రియలైజ్ అయి, దాన్నుండి బైటపడటం చాలా కష్టం.  పసి పిల్లల మీద లైంగిక దాడికి పాల్పడే వారిలో అధిక భాగం ఆ పిల్లలకి “పెద్దలే” బంధుత్వంలో.  వాళ్ళు మావయ్యలు, బాబాయిలు, తాతయ్యల్లో ఎవరైనా కావొచ్చు.  లేదా అంతే గౌరవనీయమైన స్థానంలో వున్న పక్కింటి అంకుల్స్ కావొచ్చు.  పెద్దలకున్న గౌరవనీయమైన స్థానం, వారి నీచ కార్యాల మధ్యనున్న వైరుధ్యం పిల్లల్ని చాలా కన్ ఫ్యూజ్ చేస్తుంది.

సెక్సుని భయంకరమైన సిగ్గు పడాల్సిన విషయంగా చేయటం మూలంగా, దాని గురించి మాట్లాడటమే సిగ్గు పోయినతనం అవుతున్న  కారణంగా, ఒక లైంగిక అత్యాచారం “మాన భంగం”(గౌరవం పోవటం)గా ప్రచారమైనందున సాధారణంగా బాధితులు ఎవరూ బైటకి చెప్పుకోరు.  ఇంక పిల్లల విషయంలో అయితే వారికి పెద్దల పెద్దరికాల పట్ల భయం, లొంగుబాటు వుంటాయి.  అసలుకే చెప్పుకోలేరు.  చెప్పాలనుకున్నా అసలు ఎలా చెప్పుకోవాలో తెలియదు వారికి.  తల్లిదండ్రులు ఆడ పిల్లల గురించి ఆందోళన పడతారే కానీ తెలివిగా, బాధ్యతగా వుండరు.  వాళ్ళతో ఏదీ ముందుగా మాట్లాడరు. హెచ్చరించరు.  బాధ్యతాయితమైన పేరెంటింగ్ లో పిల్లల్ని ఆపదలో పడకుండా ముందస్తు జాగ్రత్త తీసుకోవటం ఓ ముఖ్య భాగం.

****

శృంగారాన్ని పాప పంకిలపు పాడు వ్యవహారం చేసేసారు.  శరీరానికి శీలానికి ముడిపెట్టి నైతిక తీర్పులిస్తారు.  పెళ్ళైతే తప్ప శృంగారానికి అర్హత వుండదు.  శృంగారం ఒక నిషిద్ధ ఫలంగా, దాని గురించి చర్చించటం ఒక అసభ్య విషయంగా మార్చిన మన సమాజంలో ఏ మగపిల్లవాడికీ ఆ విషయంలో తనని తాను ఎలా నియంత్రించుకోవాలో అవగాహన ఇవ్వరు.  ఏదైనా విపత్తు జరిగినప్పుడు మాత్రం పతనమవుతున్న సమాజం గురించే బాధ పడతాం కానీ మనిషిని దిగజార్చే వాంఛా వత్తిడి, అసహజ, అనౌచిత్య నైతిక విలువల గురించి పట్టించుకోం.  ఆడపిల్ల మీద పెట్టే దృష్టిలో పదో వంతు కూడా మగపిల్లవాడి మీద పెట్టరు.  వాడి చేతిలో మొబైల్ పెడతారు సరే ఆ మొబైల్ని వాడెలా ఉపయోగిస్తున్నాడనేది పట్టించుకోరు. వాడు అన్నా అంటూ దగ్గరకు వచ్చే ఓ అయిదేళ్ళ పాపలో ఆడతనాన్నే చూడొచ్చు.  ఒక స్కూల్ బస్ క్లీనర్, ఒక ఆటో డ్రైవర్, పక్కింటి అన్న…ఎవరైనా కావొచ్చు – వాడు ఓ పసి పిల్ల పాలిటి బూచాడు కావొచ్చు.

కుర్రాళ్ళ సంగతి కాసేపు పక్కన పెడదాం.  ఈ మావయ్యలకి, బాబాయిలకి, తాతయ్యలకి ఏం మాయరోగమొచ్చింది?  ఒక చిట్టి చేతుల, బుడి బుడి పాదాల, అల్లరి కళ్ళ, చిన్నారి పొన్నారి నవ్వుల పసి పాపలో కూడా వావి వరసలు మరిచిపోయేంతగా శృంగార వాంఛ తీర్చుకోవాలనే ఆ పైశాచికత్వం ఏమిటసలు?  వాడో ఉపాధ్యాయుడు కావొచ్చు. పురోహితుడు కావొచ్చు. రాజకీయుడు కావొచ్చు.  బాంక్ అధికారి కావొచ్చు.  వాడెవడైనా సరే ఆ క్షణంలో వాడో కామ పిశాచి.  పసి పిల్లలు ఇంత లోకువా?  ప్రతి లైంగిక దురాచారం వెనుక కేవలం కోరికే కాదు దట్టించిన పురుషాహంకారపు తాలుక్కు హింసానందం  వుంటుంది.  నిజానికి ఒక ఇద్దరు యుక్తులైన స్త్రీ పురుషుల మధ్య  సెక్స్ అసలు ప్రయోజనం పరస్పర తృప్తి మాత్రమే.  కానీ లైంగిక అత్యాచారంలో సెక్స్ ప్రయోజనం పురుషాహంకార పైశాచిక ఆనందం.  ఇది ఏక పక్షం.  నిర్భయ విషయంలో కూడా ఆమె హంతకులు చెప్పిందిదే!  తమని ప్రతిఘటించి నిర్భయ తమ ఆగ్రహానికి గురైందని ఆ హంతకులలో ఒకడన్నాడు.  లైంగిక దాడుల మూలాలు పురుషాధిపత్య వ్యవస్థలోనే వున్నాయి.  వైవాహిక లైంగిక దాడులకి నిర్వచనాలుండవు.  అక్కడ బలహీనురాలైన స్త్రీ మీద ఆధిపత్యం చూపించగలిగిన పురుషుడు మరింత బలహీనులైన పిల్లల విషయంలో చూపించడా?  స్త్రీ పురుషుల మధ్య లైంగిక కార్యక్రమంలో ప్రజాస్వామికత కొరవైన సంస్కృతిలో ఆధిపత్యానికి అలవాటు పడ్డ పురుషుడి కామానికి అదుపు వుండే అవకాశం తక్కువ.  అందుకే పెళ్ళాం వున్నప్పటికీ అవకాశం వున్న చోట అదనపు ఆధిపత్యపు ఆనందాల కోసం వెంపర్లాడుతూనే వుంటాడు. ఇదే కారణంతో తన వయసున్న కూతుర్ల పట్ల కూడా అంకుల్స్ లైంగిక దాడులకి తెగబడుతుంటారు.

****

పిల్లల మీద లైంగిక దాడి జరిగిన అనేక సందర్భాల్లో నేరస్తుల మీద మద్యం ప్రభావం కనబడుతున్నది.  మద్యం మత్తులో లేనివారు కూడా ఆ నీచానికి పాల్పడొచ్చు.  కానీ మద్యం కూడా తన వంతు పాత్రని పోషిస్తున్నది.  మొన్న వరంగల్లో తొమ్మిది నెలల పసిపాపలో నేరస్తుడు ఒక స్త్రీని చూసేంతగా తనని తాను మర్చిపోవటంలో మద్యం ప్రభావం కాదనలేనిది.  రాజ్యమే తన వాణిజ్య ప్రయోజనాల కోసం మద్యం వ్యాపారి వేషం వేసుకొని పరోక్షంగా నేరాన్ని ప్రోద్భల పరుస్తుంది, మళ్ళీ అదే రాజ్యం పోలీసు వేషం, కోర్టులో న్యాయమూర్తి వేషంలో నేరస్తుడిని శిక్షిస్తుంది.  ఇది అనైతికం.  మళ్ళీ అదే రాజ్యం సమాచార విప్లవం పేరుతో వెల్లువెత్తుతున్న పోర్నోగ్రఫీ విషయంలో చేతులెత్తేస్తున్నది.  ఆదాయం కోసం బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నందుకు, సాంస్కృతిక కాలుష్య వెల్లువని నిలువరించలేని  అసమర్ధతకూ మనం రాజ్యాన్ని కూడా బొనెక్కించాల్సి వుంటుంది.

****

పిల్లలు శారీరకంగా బలహీనులే కావొచ్చేమో కానీ నిస్సహాయులు కాకూడదు.   వారిలో కేవలం అమాయకత్వం వుండటమే సహజం.  ఆ అమాయకత్వం కనబడక పోతే, దిగులుగా కనబడితే ఏదో పెద్దరికపు పెద్దపులి వారి మీద దాడి చేసిందనే అనుమానించాలి.

దిగులు ముఖాల పిల్లలు పెద్దల అమానవీయతకి సంకేతాలు.

*

 

 

అరణ్య కృష్ణ

అరణ్య కృష్ణ

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Last word.
    👌👌👌no, morewords, ji💐ఇలాంటి వి,చదివి అయిన, మారితే బాగుండును, కొంతమంది..!

  • హిపోక్రసీ, చాల విషయాల్లో మనం అలాగే ఉన్నాము..అన్ని గుప్పెట మూసిపెట్టిన చందం ..ఇలాదాడులకు..పాల్పడుతున్న వాళ్ళు ..వాళ్ళనుప్రేరేపిస్తున్న అంశాలు కొన్ని తెలిసి కొన్ని తెలియక …అయినా..అందరూ..ఆప్రభావాలకు లోనవడం లేదుకదా …ప్రత్యేకించి…ఆలా లోనవుతున్న వారి మానసిక స్థితి ఏమిటీ ,?,..శృంగారం తప్ప …ఇంకాదేనిలోనూ ఆనందం వెతుక్కోలేని కుసంస్కారమా ?లేక …చట్టాల డొల్లతనమా …రాజ్యం..వై ఫల్యమా …పెంపకంలో లోపమా ….చాల..ఇంటర్ లింక్డ్ ప్రోబ్లమ్స్…ఉన్నాయి..మీవ్యాసం అద్భుతమైన…విశ్లేషణాత్మక..సందేశం…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు