పురోగామి

గతిలేని పరిస్థితిలో అందరు ట్రాన్స్‌లానే ఆమె తన కడుపును నింపుకోవడానికి బెగ్గింగ్‌ను ఆశ్రయించక తప్పలేదు.

నందిత ఒళ్ళు విరుచుకుంటూ నిద్రలేచి చుట్టూ పరికించి చూసింది. ఎదురుగా సాహితి, వనజ, జయ, భాగ్యలక్ష్మితో పాటు సోనియా బాత్రూమ్ నుంచి టవల్ చుట్టుకుని బయటకు వస్తూ కనబడింది. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు. ఈ రోజు తమ గురూమా పుట్టినరోజున జరిగే పాదపూజ వేడుకలకు వెళ్లాలని నిన్ననే డిసైడ్ చేసుకుని ఉండడం వల్ల అందరూ మెరుపు మెరుపు చీరలు కట్టుకుని, ధగధగమంటున్న గిల్టు నగలతో మెరిసిపోతున్నారు. అందరినీ గమనిస్తూ మంచంపై అలాగే కూర్చొని ఉన్న నందితను చూస్తూ “రాత్రి తాగిన మైకం ఇంకా దిగనట్లుంది అక్కకు” అని కిసుక్కున నవ్వింది వనజ.

“తాగిన మైకమా..లేక రాత్రి తిరిగిన రంగులరాట్నమా?” అని ఇంకా బిగ్గరగా నవ్వింది సాహితి ద్వంద్వార్థంతో.

“ఏ..ఏందే? మీరెప్పుడూ నాతోనే పరాచికాలు ఆడుతూ ఉంటారు” అంటూ గారాలుపోతూ పిక్కల మీద వరకు వెళ్ళిన నైటీని సర్దుకుని బాత్రూంలోకి వెళ్లింది నందిత. ఇరవై నిమిషాల తర్వాత స్నానం చేసి బయటకు వచ్చిన నందితకు సోనమ్ అందరిలా చీర కట్టుకోకుండా లాంగ్ ఫ్రాక్ వేసుకుని కనబడింది. సోనమ్ అక్కడున్న అందరిలో చిన్నది. ముద్దుగా తెల్లగా, గుండ్రంగా, కాస్త లావుగా ఉంటుంది. ముఖం ఎప్పుడూ సంతోషంతో వెలిగిపోతూ ఉంటుంది. నిజంగా ఆమెను చూసిన వారెవరూ ఆమె చెప్పేదాకా ట్రాన్స్ వుమెన్ అని అస్సలు అనుకోరు. పుట్టుకతోనే అమ్మాయిలా సీదాసాదాగా ఉండే సోనియా అందుకు తగ్గట్టుగానే చాలా నాజూకుగా ఉంటుంది.

గదిలో అందరూ ఒకరితో ఒకరు పోటీపడుతున్నట్లుగా ముద్దుగా తయారై ఉన్నారు. గోడకు తగిలించిన పెద్ద అద్దంలో ఎవరి అందాన్ని వారే చూసుకుంటూ ఒకరినొకరు నెట్టుకుంటున్నారు.

“అబ్బా! ఎంతసేపు చూసుకుంటారే మీ ముఖాలని? నేను ఏ చీర కట్టుకోవాలో కాస్త చెప్పండే ప్లీజ్!” సూట్కేసులో ఉన్న చీరలను చూపిస్తూ ఒక చీరను ఓరగా ఎడంభుజంపై వేసుకుని మరింత గారంగా అడిగింది నందిత.

మూడు బెడ్ రూములు ఉన్న ఆ ఫ్లాట్లో ఆరుగురు ట్రాన్స్ మహిళలు కొన్ని రోజులుగా కలిసి ఉంటున్నారు. అక్కడున్న వాళ్లందరిలో ఒక్కొక్కరికి ఒక్కో చరిత్ర ఉంది. ఆ చరిత్రను తిరగేస్తే ప్రతివారి చరిత్రలో అనేక చాప్టర్లు ఉన్నాయి. ప్రతి చాప్టరులో అనేక రకాలైన మలుపులున్నాయి. జీవితమనే సంద్రాన్ని ఈదడానికి వాళ్ళకు ఉన్నవన్నీ చేదు అనుభవాల అనుభూతులే. వారి కథలన్నీ ఒక మాలగా గుచ్చితే ఈ భూమి వైశాల్యం కూడా సరిపోదు.

వయ్యారంగా చీర కట్టుకున్న నందిత చీర కుచ్చిళ్లను సర్దుతూ “ఈ రోజు గురుపూజ అయిపోయినాక ఏదైనా సినిమాకు పోదామా?” సోనియా వైపు చూస్తూ అడిగింది జయ.

“లేదక్కా! నా కోసం ఫిరోజ్ వస్తానన్నాడు. ఇవ్వాళ ఏదో పెద్ద పార్టీ ఉందట. నన్ను వాళ్ళ గెస్ట్‌హౌస్‌కు తీసుకుని వెళ్తున్నాడు. ఈసారికి మీరందరూ వెళ్ళి ఎంజాయ్ చేయండక్కా” అంది సిగ్గుపడుతూ.

“ఓ అదా సంగతీ! నిన్న అందుకేనా బ్యూటీ పార్లర్‌కు వెళ్ళింది. క్యారియాన్! క్యారియాన్” అంది సాహితి చప్పట్లు చరుస్తూ.

“ఇంతకూ పెండ్లి విషయం ఏమంటున్నాడు?” అడిగింది భాగ్యలక్ష్మి. వీళ్ళందరికీ ఆమే గ్రూప్ లీడర్. ఆమె అందరికన్నా పెద్దది. వాళ్ళున్న ఆ ఇల్లు కూడా ఆమెదే. గురూమా చెప్పగా వాళ్ళందరికీ ఆశ్రయం ఇస్తోంది. భాగ్యలక్ష్మి తన గత చరిత్రలో ఉన్న దుఃఖం ఇంకొకరికి ఉండకూడదని కనబడని ప్రతి దేవుడ్ని కోరుకుంటూ ఉంటుంది.

భాగ్యలక్ష్మి బీటెక్ చేసింది. చిన్నప్పటి నుండి అణుచుకున్న తన లోపలి కలలను నెరవేర్చుకోవడానికి చదువు అనంతరం హైదరాబాదులో వచ్చిన ఐటి ఉద్యోగమే ఆమెకు జీవిత ఆదరువు అయ్యింది. ఇంట్లో ఆమె ప్రవర్తన వలన కుటుంబ సభ్యులు విసిగివేసారిపోయి ఉన్నారు. ఫలితంగా ఆమె ఎన్నో ఆంక్షలకు, వివక్షలకు లోనైంది. శరీరానికి దెబ్బలు, మనసుకు తగిలిన బూతు పురాణాల తిట్లు అనుభవిస్తూనే పెద్దదయింది. ఒకసారి ఆమె తన అక్కా బ్రా వేసుకుని అద్దంలో చూసుకుంటూ మురిసిపోతున్న సమయంలో తండ్రి చూసిన చీదరచూపులు, ఆయన అమానుష పనిష్మెంట్స్ గుర్తొచ్చినప్పుడల్లా భయంతో ఇప్పటికీ ఆమె శరీరం వణికిపోతుంది. ఒకసారి తన తండ్రి ఇనుప అట్లకాడను కాల్చి వీపు మీద పెట్టిన ఆనాటి వాతలు మాయమైనా, వాటి తాలూకు మంట నిత్యం ఆమెను ఇప్పటికీ సలుపుతూనే ఉంటుంది. ఉద్యోగంలో భువనేశ్వర్ అన్న పేరుతో ఆమె జాయిన్ అయినప్పటికీ కొత్తగా వచ్చిన స్వతంత్రంతో మెల్లమెల్లగా తన రూపును మార్చుకుంటూ వచ్చింది. తన హావభావాలలో, డ్రస్‌కోడ్‌లో వస్తున్న మార్పును కనిపెట్టిన కొలీగ్స్ బిహేవియర్ ఆమెను చావు చివరి అంచుల వరకు తీసుకుని వెళ్ళింది.

చిన్నప్పటి వ్యథల కన్నా వెయ్యి రెట్ల వ్యథల్లోకి ఉద్యోగ జీవితం ఆమెను తోసేసి ఉక్కిరిబిక్కిరి చేసింది. తన జెండర్‌ను హేళన చేస్తూ కొలీగ్స్ చేసిన అరాచకాలు, హింసలను భరించలేకపోయింది. తన జీవితం తనకిష్టమైన రీతుల్లో జీవించడానికి హక్కులేవీ లేనట్లుగా ఈ సమాజం పెడుతున్న ఆంక్షలు, ఒత్తిడులు, విధ్వంసాలు ఆమెను మూడేళ్లకే ఉద్యోగ జీవితాన్ని ముగించుకునేలా చేశాయి. ఫలితంగా తాను కోరుకునే సమూహాన్ని వెతుక్కుంటూ పిచ్చిదానిలా తిరగని ఊరంటూ లేకుండా

గతిలేని పరిస్థితిలో అందరు ట్రాన్స్‌లానే ఆమె తన కడుపును నింపుకోవడానికి బెగ్గింగ్‌ను ఆశ్రయించక తప్పలేదు. గత సంపాదన ఆమెకు ఒక ఇల్లును ఇవ్వగలగడం వల్ల పగలంతా ఎక్కడ తిరిగినా రాత్రివేళల ఆ ఇల్లే ఆమెకు ఆశ్రయంగా నిలబడింది.

“భాగ్యమ్మా! ఏం మాట్లాడవేంటి? ఏం ఆలోచిస్తున్నావు?” నందిత గద్దించి అరవడంతో గతం నుండి తేరుకుంది భాగ్యలక్ష్మి.

“మన సోనియా చాలా అదృష్టవంతురాలు కదూ నందితా! అందుకే దాన్ని పెండ్లి చేసుకోవడానికి సిద్ధమైన ఫిరోజ్ అంటే కూడా నాకు ఎనలేని గౌరవం. మనల్ని పెండ్లి చేసుకుని జీవితాంతం కలిసి జీవించేందుకు ఒక తోడు ఉంటే ఎంత బాగుండు?” అంది.

“ఫిరోజ్ నిజంగానే దీన్ని పెండ్లి చేసుకుంటాడంటావా? నాకు అనుమానమే” అంది నిరాశగా జయ.

“నీవెప్పుడూ అపశకునం మాటలే మాట్లాడతావు. అస్సలు మంచి మాటలే రావు. ఎందుకే సోనియా అంటే నీకెప్పుడూ కుళ్లు?” మూతి విరిచింది సాహితి.

“అన్నదాంట్ల తప్పేంటి? ఈ రోజుల్లో మామూలు ఆడోళ్ళనే ప్రేమించామని చెప్పి వాళ్లెంట తిప్పుకుని, కడుపులు చేసి వొదిలేస్తుంటే, మనలాంటి వాళ్లనీ ఎవరే పెండ్లి చేసుకునేది? మీకసలు బుద్ధే లేదు. వాడి మీద మీకెందుకే అంత నమ్మకం? ఎందుకైనా మంచిది, జాగ్రత్త” అంది వనజ. ఆమె అనుభవాలు ఆమెకున్నాయి మరి!

“ఆ ఫిరోజ్ గాడసలే నాగరాజు మనిషి. వాడివన్నీ విషపు చూపులే. ఏమైనా తేడాలొస్తే తలలు లేపడం వాడికి వెన్నతో పెట్టిన విద్య. అదే వాడి వృత్తి కూడా. సోనీ! పదిలం” అంటూ మరొకసారి జాగ్రత్త చెప్పింది భాగ్యలక్ష్మి.

నాగరాజు ఆ బస్తీని ఏలుతున్న రౌడీషీటర్. అక్కడ చిన్న చిన్న వ్యాపారస్తుల నుండి ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల వరకు ఎవరినీ వదలకుండా పీడించి డబ్బులు వసూలు చేసే పెద్ద గూండా. అవసరమైతే దౌర్జన్యం చేసైనా, వాళ్ల దగ్గర పూచికపుల్ల లేకుండా ఇంటిని ఒక్క చేత్తో ఖాళీ చేసి నచ్చని వాళ్ళ ఎముకలు విరిచి అవతల పారేసే కర్కోటకుడు. నాగరాజు సంగతి తెలిసిన సాహితికి అతన్ని చూడాలంటే కూడా భయం.

“అమ్మా! ఇది ఎళ్ళేటప్పుడు నేను తోడు పోనా?” అడిగింది నందిత.

“పానకంలో పుడకలా నువ్వేం పీకుతావే వెళ్ళి?” జయ బిగ్గరగా నవ్వింది.

“చాల్లే! ఇక పదండి! అక్కడ ‘గురుమా’ ఆలస్యంగా వెళ్తే తిడతది. పాండీ!”అని భాగ్య వాళ్ళను తొందర పెడుతూ అన్నది. పోలోమంటూ అందరూ బయటకు వచ్చాక ఇంటికి తాళం వేసి, బొడ్లో తాళం చెవుల గుత్తిని దోపుకుంటూ “నందితా నువ్వు ‘గురుమా’ ప్రోగ్రామ్ అయిపోయాక సోనియాను దింపిరా! మరచిపోకుండా లైవ్ లొకేషను తీసుకునిరా!” అంది.

* * *

శివరాంపల్లి మెయిన్ రోడ్డు. సమయం తెల్లవారుఝాము 3.35 నిమిషాలు అవుతోంది. చీకటిలో నిర్మానుష్యంగా ఉన్న రోడ్లన్నీ నల్లని త్రాచుపాముల్లా మెలికలు తిరుగుతూ భయంకరమైన ఒంటరి నిశ్శబ్దాన్ని పులుముకుని ఉన్నాయి. అతివేగంగా వచ్చిన మారుతీ కారు సర్రుమని భీకర శబ్దం చేస్తూ బ్రేకు వేసి ఆగింది. ఆ వేగానికి రోడ్డుపై ఉన్న దుమ్మూ, ధూళి ఒక్కసారిగా ఎగిసి గాలిలో కలిసి నేలకురాలి సద్దుమణిగింది. కారులో నుంచి అందంగా అప్సరసలా ఉన్న అమ్మాయి సన్నని తన మునివేళ్ళతో కారు డోరు తెరుచుకుని కిందకు దిగింది. వెనకగా తెల్లని లాల్చీ, నల్లని కుర్తాలో వెలిగిపోతూ అంతకన్నా అందంగా, నిగనిగలాడుతున్న వ్యక్తి తన నల్లని గడ్డాన్ని సరిచేసుకుంటూ కారు దిగాడు. ఆ అమ్మాయిని సమీపించి “అమ్మూ! తూ రుక్ జానా థా! సుబే నికల్ కే ఘర్కూ జా సక్తి థీ!” అన్నాడు.

సోనియా అతని వైపు కోపంగా చూస్తూ “అబ్ తక్ తుమ్ కో మొహబత్ అవుర్ బహుత్ ఇజ్జత్ కర్తీ థీ! షాదీ కా బాత్ బైట్ కే హమ్ బాత్ కరెంగే! బోల్కే మేరేకు బులాయ్. ఆప్ కే ఊపర్ భరోసా కర్కేమై గెస్ట్‌హౌస్ ఆయి. మేరా పరివార్ సక్కో బోలేతో భీ నయ్ సున్కె ఉన్ లోగోంకో చోడ్కే ఆయి. నాకు బాగా బుద్ది చెప్పావు” రొప్పుతూ అంది సోనియా.

“అబ్ క్యా హోగయా అమ్మూ! ఏక్ బార్ కే లియే మేరా దోస్త్ ఆప్ సే సెక్స్ పూచ్ లియే. దూసరా బాద్ నై కర్తే. చోడ్ దేవోనో ఓ బాతోం కూ. మై హూనా! జో హోగయా హోగయా! ఉస్ బాతోంకో యాద్ క్యోం కర్తీ? మేరా పాస్ అబీ బీ వక్త్ హైనా! హమ్ ఇదరీ ఎంజాయ్ కరెంగే” ఆమెను బతిమిలాడుతున్న ధోరణిలో సోనియాను గట్టిగా తన చేతులతో పట్టుకొని ఆపబోయాడు ఫిరోజ్.

“ఆప్కో శరమ్ నై ఆయి. క్యా బాత్ కర్ రే ఫిరోజ్! ఓ దోనో లోగ్, మేరా ఇజ్జత్ లుటాతే వక్త్ మే తూ ఉదర్ సే గయబ్ హోకే తమాషా దేఖ్ లియేనా? సబ్ మాలుం హోగయా అప్కే బారే మే మేరేకూ..అబ్ హమారా బీచ్ ప్యార్ కా నాటక్, దోస్తీ కా నాటక్ కతమ్ హెూగయా! అబ్ ఆప్‌కే బాత్ సున్‌నే మే మేరా పాస్ వక్త్ భీ నహీ! మేరా అవుర్ మేరా ఘర్ వాలోంకె సాత్ సోచ్ నా హై!” అతని చేతిని విడిపించుకుని మెయిన్ రోడ్డును ఆనుకుని ఉన్న మట్టిరోడ్డు మీదకు కోపంగా నడిచింది సోనియా.

“టీక్ హై అమ్మూ! తుమ్హారా మర్జీ! మైతో జారహా హూ! మై తుమ్‌కో షాదీ నయ్ కర్ సక్తా! తుమారా కో అవుర్ ఏక్ మౌకా దేవుంగా. పయిలే కా జైసా హమ్ కా రిలేషన్ రక్తేంగే!” పెద్ద గొంతుతో గర్జించాడు.

ఫిరోజ్ ఆమెకు పరిచయం అయి రెండు సంవత్సరాలు అవుతోంది. అప్పటి నుంచి సోనియాతో రిలేషనులో ఉన్నాడు. బాగా డబ్బున్నవాడు. ఆమెను బాగా ఇష్టపడ్డాడని నమ్మింది. వేరే వాళ్ళతో శారీరక సంబంధాలు పెట్టుకోకుండా ఉంటే పర్మనెంటుగా సోనియాతో ఉంటానని మాట ఆమెకు ఇచ్చాడు. అలాంటప్పుడు పెండ్లి చేసుకుందామని అడిగింది సోనియా. అతను సోనియాకు ఏ విషయం చెప్పకుండా తన ఎంజాయ్‌మెంట్ కోసం వాడుకోడాన్ని సహించలేకపోతోంది. ఏ విషయాన్ని చెప్పకుండా అతని చుట్టూ తనను తిప్పుకోవడం సోనియా భరించలేకపోతోంది. ఏదో ఒక నిర్ణయం చెప్పాలని గత కొన్ని రోజులుగా ఒత్తిడి చేస్తోంది. సరే, ఈ రోజు గెస్ట్‌హౌస్‌లో మాట్లాడుకుందాం రమ్మని ఫిరోజ్ పిలవడంతో, ఎన్నో ఆశలతో వెళ్ళిన సోనియాతో చాలాసేపు మాట్లాడి, “మా ఫ్రెండ్స్ వస్తారు నువ్వు ఇక్కడే ఉండు. నేను మళ్ళీ వస్తాను” అని నమ్మకంగా చెప్పడంతో అక్కడే ఉండిపోయింది.

ఫిరోజ్ మిత్రులు ఇద్దరూ వచ్చీరావడంతో సోనియా మీద పడిపోయారు. ఆమె ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఆమెకు నానారకాలుగా హింసిస్తూ శారీరకంగా ఆమెను లొంగదీసుకుని నరకం చూపించారు. అంత రాత్రివేళ, ఒక ప్లాను ప్రకారం పిలిపించి, తనపైకి స్నేహితులను ఉసిగొల్పిన ఫిరోజ్ మోసం ఆమెను విభ్రాంతికి లోను చేసింది. వాళ్ళను తప్పించుకుని బయటపడిన సోనియాను అక్కడే పొంచి ఉన్న ఫిరోజ్ మళ్ళీ మభ్యపెట్టి లాంగ్ డ్రైవ్‌కని ఇక్కడకు తీసుకుని వచ్చాడు.

ఇద్దరి మధ్య కారులో జరిగిన వాదులాటలో ఫిరోజ్ తన చివరి అస్త్రం ఉపయోగించాడు. ఇంకోసారి పెండ్లి పేరెత్తితే సోనియాను చంపేస్తానని బెదిరించాడు. దాంతో సోనియా బలవంతంగా కారును ఆపి ఇక్కడ దిగిపోయింది. ‘ఛీ! నిన్ను నమ్మి మళ్ళీ ఇక్కడికి రావడం నాదే తప్పు. అయినా నీతో నాకేం పని?’ అనుకుంటూ వెనక్కు తిరిగి చూసింది.

ఫిరోజ్ కారులోకి ఒంగి కూర్చోబోతూ కనబడ్డాడు. సోనియా వేగంగా నడుస్తూనే తన బ్యాగులో ఉన్న సెల్‌ఫోన్ తీసి భాగ్యలక్ష్మి నంబర్‌కు డయల్ చేయబోతోంది.

వెనక నుంచి విసురుగా వచ్చిన ఫిరోజ్ ఆమెను బూతులు తిడుతూ చేతిలో ఉన్న వాటల్ బాటిల్ మూత తీసి ఆమె ముఖంపై సీసాలోని ద్రవపదార్థాన్ని విసిరి పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి పారిపోయాడు.

కారు స్టార్ట్ చేసిన శబ్దం ఆమె భీకర నినాదాల్లో కలిసిపోయింది. ముఖం నుంచి కారుతున్న యాసిడ్ ఆమె ఎడమ పక్క భాగం నుంచి శరీరం అంతా వ్యాపిస్తుండగా హాహాకారాలు చేసింది. దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తున్న సోనియా అరుపులకు నిశ్శబ్దం కూడా భయపడినట్లుంది. ఫిరోజ్ ప్రవర్తనకు నిశ్చేష్టురాలైన ఆమెకు ఏం చేయాలో తెలియక మండుతున్న శరీరాన్ని నేల మీదకు విసిరేసి కిందపడి పొర్లాడింది. ఒళ్ళంతా పాకుతున్న వేడిసెగలు ఆమె గొంతులోకి జారుతుండగా కళ్ళ ముందు తన వాళ్ళందరూ ఒక్కొక్కరుగా నీడగా కదిలిపోతున్నారు. ఏదో గుర్తుకు వచ్చినట్లుగా తన చేతిలో ఉండాల్సిన ఫోను కోసం చూసుకుంది. యాసిడ్ అటాక్‌లో ఫోను జారిపోయి చీకటిలో ఎక్కడ పడిందో తెలియదు. వెతికినా దొరకడం కష్టమే.

లాభం లేదనుకుని మెల్లగా ఓపిక తెచ్చుకుని పాక్కుంటూ రోడ్డు మీదకు వచ్చింది. దూరం నుంచి వస్తున్న వాహనాల హెడ్ లైట్స్ వెలుగులో అక్కడున్న మైలురాయి మీద కళ్ళు మూసుకుని కూర్చుంది.

దూరం నుంచి వచ్చిన ఒక ఆటో సయ్యిమంటూ ఆమె ముందు ఆగింది. “మేడమ్ ఆటో కావాలా?” డ్రైవర్ అడుగుతున్నాడు. ఏమీ మాట్లాడకుండా సోనియా ఆటో ఎక్కి కూర్చుని “భాయ్! ప్లీజ్ జర ఉస్మానియా దవఖానామే మేరోకూ చోడ్ దేవోనా?” బతిమిలాడుకుంది. అతను ఏమనుకున్నాడో ఏమో ఆమె వాలకం చూసి అతను ఆటో స్టార్ట్ చేశాడు. “ప్లీజ్ అన్నా..నీ ఫోనులో ఒక నెంబరు చెబుతా. కాల్ చెయ్యవా? మా అక్క వచ్చి అక్కడ నీకు పైసలిస్తది” అంది కళ్ళు మూసుకపోతుండగా. అతను ఏమీ మాట్లాడకుండా ఆమె కూడబలుకుతున్న నెంబర్లను ఫీడ్ చేసి కాల్ చేసాడు. అవతల ఫోను ఎత్తిన శబ్దానికి ఫోనును సోనియా చేతుల్లో పెట్టాడు డ్రైవర్.

“భాగ్యామ్మా! మేరా ఊపర్ ఫిరోజ్ యాసిడ్ డాలా! మే ఆటో పకడ్ కే ఉస్మానియా జారే! ప్లీజ్ కిసీకో బతాకే బీజావు అమ్మా! ఎమర్జెన్సీ వార్డ్‌మే. బోల్నా మత్!” అంది ఏడుస్తూ లోగొంతుకతో. ఫోన్ కట్ కాకముందే బేపూష్ అయిపోయిన ఆమెను జాగ్రత్తగా ఆటోడ్రైవర్ ఉస్మానియాకు చేర్చాడు. లోపలికి వెళ్ళి వచ్చేటప్పటికే ఆటో దగ్గర ఉన్న జయ, నందితలకు సోనియా తనకు ఎక్కడ, ఎలాంటి పరిస్థితిలో కనబడిందో చెప్పాడు డ్రైవర్. దిగులుగా ఉన్న వాళ్ళవైపే చూస్తూ “అగో! ఆయమ్మ వస్తోంది. మంచి ట్రీట్మెంట్ ఇప్పించడమ్మా!” అన్నాడు. నందితకు ఎమర్జెన్సీ వార్డులో ఉండే తెలిసిన ఆయమ్మే రావడంతో, ఆమె సాయంతో సోనియాను స్ట్రెచ్చర్ పై పడుకోబెట్టి, హడావిడిగా లాక్కోని వార్డులోకి తీసుకుపోయింది నందిత.

జయ ఆటో అతనికి డబ్బులిచ్చి కృతజ్ఞతలు చెప్పి, ఎమర్జెన్సీ వార్డ్‌లోకి నడిచింది. ముఖం నుంచి ఎడమభాగం, తొడల వరకు కాలిపోయి బొబ్బలెక్కిన సోనియా శరీరం దాదాపు డెబ్భై శాతం కాలిపోయింది. సోనియా స్పృహ లేకుండా స్ట్రెచ్చర్‌పై పడుకుని ఉంది. అప్పటికే తెల్లవారిపోయింది. జూనియర్ డాక్టర్లు కేస్‌షీట్‌లో వివరాలు రాసుకుంటున్నారు. అన్నీ రాసుకుని జెండర్ దగ్గర మేల్ అని రాయడం చూసిన నందిత “అదేంటి సర్? తను మేల్ కాదు. ట్రాన్స్” అంది.

“ఆ అయితే ఏంటీ? మీ పుట్టుక మేలే కదా! ఇక్కడ మీకోసం సీఎం గారు స్పెషల్‌గా ఒక వార్డు కట్టిచ్చినాక అట్లాగే రాస్తామ్. అక్కడి వార్డుల్లోనే పడుకోబెడతాంలే! ఇప్పటికి ఇంతే” అన్నాడు కఠినంగా.

“మాకేం స్పెషల్ వార్డు అక్కరలేదు డాక్టర్. లేడీస్ వార్డు ఉందిగా, అందులోనే పెట్టండి చాలు” అంది సందిత.

“మాకు ఎక్కడ ఉంచాలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు” అంటూ బూతులు తిడుతున్న మేల్ డాక్టర్‌ను అంతే భీకరంగా తిట్టింది జయ.

అంతలోనే అక్కడకు వచ్చిన భాగ్యలక్ష్మి డాక్టరుతో ఇంగ్లీషులో మాట్లాడడం గమనించిన చుట్టుపక్కల ఉన్న పేషెంట్లు, వాళ్ళ తాలూకు మనుషులు వింతగా వీళ్ళనే చూస్తూ గుమిగూడారు ఆ ప్రాంతం అంతా.

“మీకు ట్రాన్స్‌లంటే ఎంత చులకన భావం ఉంటుందో మాకు తెలుసు సర్. మీరలా ఎలా మాట్లాడుతారు? మేము మీలా మనుషులమే. మీలాగే పుట్టాం. మా ఇష్టానికి అనుకూలంగా పెరిగి మేం బతుకుతున్నాం. మీకెందుకు అంత కోపం మా మీద? మాక్కూడా కొన్ని హక్కులు ఉన్నాయని మీరు ముందు తెలుసుకోండి సర్” భాగ్యలక్ష్మి వాగ్ధాటికి ఆశ్చర్యపోయి చూస్తున్న వారినందర్నీ అక్కడ నుంచి తరిమికొట్టింది మరో జూనియర్ లేడీ డాక్టర్. వాతావరణం సద్దుమణిగాక “సారీ మేడం, ఏమీ అనుకోకండి. ముందు పేషంట్‌కు ట్రీట్‌మెంట్ అవసరం కదా! నేను చూస్తాను. పదండీ” అంటూ అందరినీ అక్కడి నుంచి సోనియా పడుకున్న స్ట్రెచ్చర్ దగ్గరకు తీసుకుని పోయి పరీక్షించింది.

జయ, సందితలిద్దరూ ఏడుస్తూ సోనియాను పట్టుకుని ఉన్నారు. డాక్టర్ పరిశీలించాక “మేడం, ఎడమ పక్క అంతా బాగా కాలిపోయింది. క్యూర్ కావాలంటే చాలా సమయం పడుతుంది. ముందు ఎమర్జెన్సీ ట్రీట్ చేసినాక వార్డు గురించి అలోచించవచ్చు. కూల్‌గా ఉండండి. చాలామందికి మీరెవరో అర్థం కాక, ఏవేవో మాటలు అన్నంత మాత్రాన మీకు పొయ్యేదేమీ లేదు. సమాజంలో మిమ్మల్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా వారికి సంస్కారం కావాలి. మీ గురించి వారికి తెలిసి కూడా ఉండాలి కదా! గొడవ పడకండి ఇక్కడ. వేరే పేషెంట్స్ డిస్ట్రబ్ అవుతారు” అంది జయ వైపు చూస్తూ డాక్టర్. “అయినా ఇది పోలీస్ కేస్. వాళ్ళకు ఇన్ఫార్మ్ చేసినాకనే ట్రీట్‌మెంట్ చేస్తారు, ఏ డాక్టరు అయినా” అంది మెత్తగా.

* * *

పోలీసులు వచ్చి ఎఫ్ఐఆర్ రాసుకుని వెళ్లారు. ఫిరోజ్‌కు వెనుకగా ఉండి అన్నీ రాచకార్యాలు నడిపిస్తున్న నాగరాజును కూడా నిందితుడిగా నమోదు చేసుకుని వెళ్లారు పోలీసులు. అప్పటి నుంచి దాదాపు మూడు నెలలుగా సోనియా హాస్పిటల్లోనే ఉండిపోయింది. రోజు డ్యూటీ వేసుకుంటూ ఆమెకు సపర్యలు చేసారు ఆమె సన్నిహితులు. పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన కొన్ని రోజులకు కోర్టులో కేసును ప్రొడ్యూస్ చేశారు. కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. ఈలోగా సోనియా కొంత శాతం కోలుకోవడంతో ఆమెను డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకుని వెళ్లారు నందిత, జయ. ఇంట్లోనే డాక్టర్ చెప్పిన మందులు, వైద్యం చేసుకుంటూ సోనియాను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు అందరు. కొన్నాళ్ళకు కోర్టు నుంచి వారికి పిలుపు వచ్చింది.

ఒక రోజు ఫైనల్ హియరింగ్ ఉందని అందరూ కలిసి సోనియాను కోర్టుకు తీసుకుని వెళ్లారు. సోనియా కన్నా ముందు, ఆ తర్వాత కూడా ఈ దేశంలో ట్రాన్స్‌‌జెండర్స్‌పై జరుగుతున్న దాడులను, యాసిడ్ అటాక్‌లను దృష్టిలో పెట్టుకుని ప్రతి యాసిడ్ అటాక్ సర్వైవర్‌కు వెంటనే ఆయా ప్రాంత రాష్ట్ర ప్రభుత్వాలు రెండు లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ‘లక్ష్మీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసును ఉదాహరణగా చూపుతూ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. ఆ కోర్టు ఆర్డరు ప్రకారం సోనియా అందుకు సంబంధిత అధికారుల ఆఫీసులకు వెళ్ళి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఈనాటి వరకు సోనియాకు దక్కాల్సిన నష్టపరిహారం అందకపోవడం రాష్ట్ర ప్రభుత్వాల చిత్తశుద్ధికి నిదర్శనం. ఇప్పటి వరకు ఆ నష్టపరిహారం సోనియాకు అందకపోగా, కోర్టు ఆర్డరు ప్రకారం సోనియా ట్రాన్స్ వుమెన్ అవునో కాదో నిర్ధారణ చేయడానికి ఆమె రహస్యాంగాలతోపాటు ఇతర శరీర అవయవాలను వైద్యులతో క్షుణ్ణంగా పరిశీలన చేయించాలని, ఆ డాక్టర్లు ఇచ్చిన రిపోర్టులను కోర్టులో సబ్మిట్ చేయాలని హైకోర్టు పోలీసులకు ఆదేశాలను ఇచ్చింది. దేవుడు వరమిచ్చినా, పూజారి వరమియ్యనట్లుగా హైకోర్టు ఆదేశాలను వెంటనే అమలు చేయవలసిన ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్లు పది రోజులు తిప్పుకున్న తర్వాత కానీ, సోనియాను జెండర్ టెస్టింగ్ టెస్ట్‌కు పిలువలేదు. తీరా వాళ్ళు పిలిచిన టైంకు సోనియాను తీసుకుని వెళ్ళిన మిత్రులందరికీ అక్కడ చేదు అనుభవాలు ఎదురయ్యాయి. వెకిలి మాటలతో, వెకిలి చేష్టలతో తమ జెండర్లను పరిశీలన పేరుతో అపహాస్యం చేస్తూ హాస్పిటల్ సిబ్బంది చేసిన పద్ధతులకు, వారు వేసిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పలేక సిగ్గుతో చచ్చిపోయినట్లుగా బాధపడ్డారు. ఫిరోజ్, అతని మిత్రులు చేసిన రేప్ కన్నా దారుణంగా వాళ్ళ ప్రవర్తనకు అక్కడే బిగ్గరగా ఏడ్చేసారు.

పవిత్రమైన వైద్యవృత్తిని చదువుకుని, ప్రతి పేషెంట్ పట్ల, అంకిత, గౌరవభావంతో ట్రీట్‌మెంట్ ఇస్తామని తమ వృత్తిమీద ప్రమాణాలు చేసి వచ్చిన వైద్యులు అనాగరీకంగా, జుగుప్సాకరంగా ట్రాన్స్‌జెండర్ మహిళల పట్ల ప్రవర్తించిన తీరుకు సందిత, జయలతోపాటు సోనియా మనసు కూడా పూర్తిగా అక్కడే చచ్చిపోయింది. దుఃఖ సముద్రాన్ని ఈదుతూ వాళ్ళు ఎలా ఇంటికి చేరుకున్నారో కూడా మర్చిపోయారు.

ఫిరోజ్‌కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష పడింది. అతన్ని వెనకుండి నడిపిస్తున్నది నాగరాజే అన్నది రుజువు కావడంతో నాగరాజుకు కూడా రెండు సంవత్సరాల శిక్ష పడడంతో తాత్కాలికంగానైనా వాళ్ళ పీడ విరగడ అయినందులకు ట్రాన్స్ పరివారం అంతా సంతోషించారు.

ఈ సమాజంలో తమలాంటి ట్రాన్స్ మహిళల పట్ల సామాన్య ప్రజలు, తమకు దగ్గరగా ఉన్న వ్యక్తులు చూస్తున్న, ప్రవర్తిస్తున్న తీరుకు ఎవరికివారు కుమిలిపోతూ కోర్టు నుండి ఇల్లు చేరారు.

వాళ్ళను గమనించిన భాగ్యలక్ష్మి ఓదార్పుగా వాళ్ల తలలను నిమురుతూ “మనం ఎప్పటికీ ఓడిపోకూడదు. గెలుపు ఎప్పుడు మనదే కావాలనుకుంటే, మనం అందరం కలిసి ఒక సంఘంగా ఏర్పడాలి. అప్పుడే మన తరఫున వేరెవరో కాదు, మనమే పోరాటం చేసుకుంటూ మన హక్కులు మనం సాధించుకోగల్గుతాం. మనతో కలిసి వచ్చేవాళ్ళను కలుపుకుని మన హక్కుల కోసం పోరాడుదాం. మన యుద్ధం మనమే చేసుకుందాం” ఆ రోజే గురూమా హోదా తీసుకున్న సంతోషంతోనూ, బాధ్యతతోనూ అంది భాగ్యలక్ష్మి.

(స్వయంసిద్ధ కథా సంకలనం, మే 2023, అదే ప్రేమ, 2025)

చిత్రం: సృజన్ రాజ్

రచన ముద్రబోయిన

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.