queer దుఃఖంలోంచి ఒక శకలం

గత సంచికలో ప్రారంభమైన “కొత్త కథలూ- కథనాలూ” శీర్షికలో ఈ పక్షం హాథీరామ్ సభావట్ రాసిన కథా విశ్లేషణ చదవండి.

మాజం కొన్ని తరాల నుండి బైనరీ జెండర్ వరకే గిరిగిసుకుని ఉంది. నాన్-బైనరీ జెండర్ కనిపిస్తే అంగీకరించే స్థాయిలో లేదు. సరి కదా హేళన చేస్తూ, వివక్ష చూపిస్తూ, ఆ వర్గాల పట్ల భయాన్ని పెంచుకుంటూ ఇన్‌క్లూజన్‌ను పూర్తిగా మర్చిపోయింది.
దీనికి ప్రధాన కారణం మెయిన్‌స్ట్రీమ్‌లో LGBTQ వర్గాల గురించి సరైన లోతైన చర్చ లేకపోవడమే. ఇప్పుడిప్పుడే గత కొన్ని సంవత్సరాల నుండి LGBTQ వర్గాల గురించిన డిస్కషన్ నడుస్తోంది. అది ఇప్పుడు సాహిత్యంలో కూడా విస్తరించింది. అందులో భాగంగానే అపర్ణ తోట సంపాదకత్వంలోని ‘అదే ప్రేమ’ queer కథల సంకలనం. ఈ సంకలనంలో సిస్ వ్యక్తులు queer జీవితాలను బయటి నుండి చూసి తమదైన దృక్పథంతో రాసిన కథలు ఉన్నాయి. అలాగే ఆ జీవితాల్లోని దుఃఖాన్ని, లోతుగా చూసిన అనుభవించిన queer వ్యక్తుల రచనలు కూడా ఉన్నాయి. అటువంటి కథే ‘పురోగామి’ కథ. దీన్ని నిత్యం LGBTQ వర్గాల హక్కుల గురించి పోరాడుతున్న రచన ముద్రబోయిన రాశారు.
సహజంగానే ఈ సమాజంలో తమ తమ అస్తిత్వాన్ని ప్రకటించుకోవడానికి వెనుకాడరు కొందరైతే అది గౌరవంగా భావిస్తారు. కానీ queer వ్యక్తులకు అలా ఉండదు. ఎప్పుడైతే వాళ్ళు తమ అస్తిత్వాన్ని ప్రకటించుకుంటారో, అప్పటి నుండి వాళ్ళపై వివక్ష, ఆంక్షలు మొదలవుతాయి. చదువుకున్న చదువు, చేస్తున్న ఉద్యోగం అన్నిటినీ వదులుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. చివరికి కన్న తల్లిదండ్రులు కూడా దూరం పెడితే బతకడానికి భిక్షాటనలోకి లేదా సెక్స్ వర్క్‌లోకి తప్పక దిగాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలాంటి వ్యథే ఈ కథలోని భాగ్యలక్ష్మి ది. తనకు గత ఉద్యోగ జీవితంలో తను స్వంతంగా సంపాదించిన ఫ్లాట్‌లో గురుమా చెప్పగా సోనియా, జయ, సందిత, వనజలతో ఉంటుంది.
వీళ్ళందరూ ఒకరోజు గురుపూజకు వెళ్లడానికి రెడీ అవుతుంటారు. పూజ తర్వాత సినిమాకు వెళ్దామని నిర్ణయించుకుంటారు. కానీ సోనియా రానని, తాను ప్రేమిస్తున్న ఫిరోజ్‌ను కలవడానికి వెళ్తున్నానని చెబుతుంది. ఆడ-మగ ప్రేమలకు కులం, మతం, ప్రాంతం, వర్గం వంటి ఎన్ని అడ్డంకులు వచ్చినా చివరికి కలిసి బతకడానికి అవకాశం ఉంటుంది. కానీ queer వ్యక్తులకు అలా కాదు. ఎవరైనా ప్రేమ అని ముందుకు వస్తే, వారికి ప్రేమ కంటే ముందు వాళ్ళ మనసులో అనుమానమే పుడుతుంది. కథలో చెప్పినట్టు ‘ఈ రోజుల్లో మామూలు ఆడోళ్ళనే ప్రేమించామని చెప్పి వాళ్లెంటా తిప్పుకుని, కడుపులు చేసి వదిలేస్తుంటే, మనలాంటి వాళ్ళని ఎవరే పెళ్లి చేసుకునేది.’ అయితే సోనియా ఆ భయాలన్నింటినీ అధిగమించేసింది. ఫిరోజ్ ప్రవర్తన, అతని ప్రేమ ఆ అనుమానాలను, భయాలను దాటేలా చేసింది. అతని నమ్మేలా చేసింది. అలా గురుపూజ అయిపోయిన తర్వాత ఫిరోజ్‌తో వెళ్లిన సోనియాకు ఏమైంది అనేది కథ.
    ఈ కథలో మనకు చాలా చిన్నగా కనిపించే అంశాలే వీళ్ళ అస్తిత్వానికి సవాలుగా నిలుస్తాయి. టాయిలెట్లు, బస్సుల్లో సీట్లు వంటి మనకు తెలిసిన ప్రధాన సమస్యలు ఇవే కాకుండా, హాస్పిటల్‌లో వార్డుల విషయంలో వీళ్ళ ఇబ్బందులను కూడా చాలా సూక్ష్మంగా రాశారు.
  ఈ కథ చివర్లో ఎలాంటి పక్షపాతం లేకుండా, విధులు నిర్వహించాల్సిన డాక్టర్లు, పోలీసులు వీళ్ళ పట్ల చూపించే చిన్నతనం, హేయమైన చూపులు, వివక్ష, వెకిలి మాటలు ఇవన్నీ మనల్ని కుదిపేస్తాయి.
ఈ సందర్భంగా మనం చర్చించాల్సిన ప్రధాన అంశం గత మేలో అమల్లోకి 2026 ట్రాన్స్‌జెండర్ బిల్లు. దీనిలో Self-identification of gender రద్దు, మెడికల్ బోర్డు ఏర్పాటు వంటి అంశాలు ఉన్నాయి. మెడికల్ బోర్డు వాళ్ళ లింగాన్ని నిర్ధారించి సర్టిఫికెట్ జారీ చేస్తుంది. అలాగే లింగ మార్పిడి సర్జరీని ఉచితంగా చేస్తుంది. కానీ వాస్తవాలు పరిశీలిస్తే పూర్తి భిన్నంగా ఉంది. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ సమాజం వీళ్ళను మనుషులుగా గుర్తించని పరిస్థితిలో వైద్యులు వీళ్ళతో ఎలా ప్రవర్తిస్తారనేది ప్రశ్నార్థకం. వైద్యులు వీళ్ళ పట్ల ప్రవర్తించే తీరుని ఈ కథలో వివరించారు.
ఇంకో విషయం వాళ్ళ అస్తిత్వ ప్రకటనే వాళ్ళకు ప్రమాదం అయినప్పుడు మెడికల్ బోర్డు జారీ చేసే సర్టిఫికెట్ వల్ల వివక్షకు ఎదురు వెళ్లడమే అవుతుంది.
ఈ కథలో సూక్ష్మంగా ఇమిడిపోయిన మరో అంశం ఏమిటంటే, ఈ మధ్యకాలంలో సంఘాలుగా, వ్యక్తులుగా కులం, మతం వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఆ పోరాటం అక్కడి వరకే ఆగిపోతుంది. ట్రాన్స్‌జెండర్ హక్కుల గురించి, వారిపై జరుగుతున్న వివక్ష గురించి చర్చకు వచ్చేసరికి మనమంతా మౌనం వహిస్తున్నారు. దీని వల్ల మనం కోరుకునే సమానత్వం ఎప్పటికీ సమాజానికి ఆమడ దూరంలోనే ఉండిపోతుంది. ఈ సందర్భంగా LGBTQ వర్గాల తరుపున ప్రతి ఒక్కరు సంఘటితంగా ముందుకు రావాల్సిన అవసరాన్ని రచయిత్రి తెలిపారు.
ఇందులో గురుమా ప్రస్తావన ఉంది. ట్రాన్స్జెండర్ వ్యక్తుల గురించే సరి అయినా అవగాహన లేని వారికి ఈ గురుమా వ్యవస్థ గురించి అసలే తెలియదు. కాబట్టి దాన్ని ఇంకా కొంత వివరంగా చెప్పి ఉంటే సామాన్య పాఠకులకు ఆ వ్యవస్థ గురించి మంచి అవగాహన ఏర్పడేది.
పోలీసుల తీరు కూడా ఈ కథలో తీవ్రంగా విమర్శించబడింది. ఆసిడ్ అటాక్ లాంటి హింసాత్మక సంఘటనల్లో న్యాయం అందించడంలో వారి నిర్లక్ష్యం, వివక్షాత్మక వైఖరి స్పష్టంగా కనిపిస్తుంది. కోర్టు తీర్పుల తీరు కూడా అంతకంటే భిన్నంగా లేదు. కోర్టులు ఆదేశాలు ఇచ్చినప్పటికీ అమలు జరగడం లేదు. లింగ గుర్తింపు, న్యాయం అందించడం వంటి విషయాల్లో కోర్టులు కూడా బైనరీ దృక్పథంతోనే వ్యవహరిస్తున్నట్లు కథ సూచిస్తుంది.
తల్లిదండ్రుల ప్రవర్తన ట్రాన్స్ వ్యక్తుల జీవితాల్లో అతి పెద్ద గాయం. కన్న పిల్లల అస్తిత్వాన్ని అంగీకరించకపోవడం, దూరం పెట్టడం వారిని ఒంటరివారిని చేస్తుంది. సిస్ వ్యక్తులు వాళ్ళ పట్ల వ్యవహరించాల్సిన తీరు గురించి కూడా రచయిత్రి స్పష్టంగా చెబుతారు. సిస్ వ్యక్తులు వారిని హేళన చేయకుండా, సమానంగా చూడాలి. వారి హక్కుల కోసం నిలబడాలి. వివక్ష చూపకుండా, సానుభూతితో మెలగాలి.
కథ ముగింపులో సమాజం చూపే వివక్ష గురించి మాత్రమే కాకుండా, నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాల్సిన డాక్టర్లు, పోలీసులు చూపే వివక్షను ఎండగట్టి, వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ ఉనికిని చాటాల్సిన అవసరాన్ని చెప్పి ముగుస్తుంది. నిజానికి ఇది కథ కాదు. ఇది మన చుట్టూ జరిగే జీవితాలు. ఇందులోని పాత్రలు మనం విస్మరించిన మనుషులు… ఆ మనుషుల జీవితాల్లోని దుఃఖాన్ని, వాళ్ళ వ్యథల్ని లోతుగా అర్థం చేసుకోవాలంటే ఈ కథను చదవాల్సిందే.
ఈ కథ ద్వారా రచయిత్రి సమాజం, వ్యవస్థలు, కుటుంబాలు, సామాన్య ప్రజలు అందరూ ట్రాన్స్ వ్యక్తుల పట్ల మారాల్సిన తీరును స్పష్టంగా చెబుతారు. రచయిత్రి ట్రాన్స్ జెండర్ అవ్వడం మూలాన వాళ్లు సమాజంలో ఎదుర్కొంటున్న వివక్షతను అసమానతలను హింసను చాలా లోతుగా వివరించారు.
కథ : పురోగామి
పుస్తకం: అదే ప్రేమ క్వీయర్ కథలు
సంపాదకత్వం: అపర్ణ తోట
కథ రచయిత్రి: రచన ముద్రబోయిన

హాథిరామ్ సభావట్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.