నువ్వూ, రాజ్యమూ ఒక్కటే

నా పెదవుల మీద
విషాదపు నవ్వొకటి పూస్తుంది
అది వెక్కిరింపు అనుకుంటావు

నీ కోపం మరింత పెరుగుతుంది
ఏం చేయను?

చెప్పి చెప్పి అలసిపోయాను
అభియోగాలు నీవే, వాదనా నీదే
చివరికి తీర్పు కూడా నీదే

విశాలమనుకుంటావు, నీది ఇరుకు కలుగు
దాన్నీ, నీ కొంచెం బుద్ధిని దాటి బయటకొస్తాం

ఆమెలో అగ్ని జ్వాల రగులుతుంది
మౌనంగానే నా వైపు కోపంగా చూస్తుంది
వద్దమ్మా, నువ్వు తల్లివి కదా అంటాను
నన్ను దాటి ఆమె ముందుకు నడుస్తుంది

వెనక గుండె బరువుతో నేను అడుగు వేస్తుంటా
నాకు అనిపిస్తూ వుంటుంది
నువ్వైనా రాజ్యమైనా ఒక్కటే

అలసిన జీవిత ప్రయాణం నాది
ఆరని తడి గుండె కూడా నాది

తప్పులు చాలానే చేశాను
కుట్రలు మాత్రం చేయలేదు

నాకు తెలుసు, మనిషి నీకొక పనిముట్టు
తెలిసీ నీకు పనిముట్టు అయ్యాను

నేను చేసిన అతి పెద్ద తప్పులో అదొకటి
కరుడు గట్టిన భౌతిక ప్రపంచం నీది

నువ్వు మనిషి వాసనను పసిగట్టలేవు
గుండె గుడి నెత్తురోడడం చూడలేవు

చాలా సార్లు పిచ్చుకను బుజ్జగించాను
అది ఇప్పుడు సాధ్యం కావడం లేదు

నీకు తెలిసీ నన్ను దోషిని చేశావు

నీ లోలోపలి ఆత్మను ఒకసారి నిద్ర లేపు
మనిషి అన్న తర్వాత మానుషత్వం ఉండాలి
దోషిగా నిలబెట్టే ముందు కాస్తా ఆలోచించాలి

*

 

 

కాసుల ప్రతాప్ రెడ్డి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.