క్షణమాగని నదివలె ప్రవహించే నిత్య చలనశీలి మానవ మస్తిష్కం
అలల యోచనల, ప్రశ్నల భీభత్స తుఫానుల,
కలల వెన్నెలల
కల్లోల అలలమై, సజీవ సముద్రాలమై, మనం ఎగసిపడేవాళ్ళం
అనంత విశ్వాన్వేషణలో, తుది తెలియని నక్షత్ర గమనాలలో
వేనవేల సంఘర్షణల రాపిడులలో
రాజుకున్న భావాగ్ని జ్వాలల
ధగధగల నడుమ లోకం వెలిగి వికసించేది
స్వీయ ఆలోచనా రహితమనే, ఈ మందులేని జబ్బు బారినపడి
జిజ్ఞాస నశించి, చూపులు దాచిన దృశ్యాలన్నీ పొగ మేఘాలై అదృశ్యమై
జ్ఞాన దాహం, అన్వేషణలన్నీ ఆవిరైన
గింజ మొలవని సైకత ఎడారులయ్యాం మనం
మన ఊహలన్నీ ఉరిపోసుకున్నాక
మన అద్భుత సృజనాత్మకత సృష్టి అంతా అదృశ్యమయ్యాక
మరెవరో సిద్ధం చేసిన
కృత్రిమ పలుకులతో పొగడ్తలతో
మనల్ని మనం నింపుకుని మురుస్తాం
ఎవరో మనలోకి ఊదిన గంధక ధూప శ్వాసలతో
జీవిస్తాం
ఆగని గడియారపు ముళ్ళ కన్నీటి చుక్కల టిక్ టిక్ ధ్వనిలా
మన హృదయాలు లయబద్ధంగా మనవి కానివేవో ధ్వనిస్తాయి
కాల యంత్రపు తాళం చెవిని
ఎవరో మన నుండి దొంగిలించుకు పోయారు
ఏ చౌరస్తాలు లేవు, దారులున్నీ
మూసుకుపోయాయి
దుఃఖపు ఉమ్మనీటిలో లుంగలు చుట్టుకున్న,
మాయపొరల మధ్య చిక్కిన మన ఆత్మలు
గిజగిజా కొట్టుకు విలపిస్తాయి
అద్దం ముందు నిలిచినప్పుడు కనపడే ఏ ముఖాలూ మనవి కావు
లోన అంతా ఖాళీ, ఖాళీగా మన రూపంలోనే నిలిచిన మరెవరో
అలమారా నుండి రోజుకో ముఖాన్ని,
మన సిగ్గుమాలిన ముఖాలకి తొడుక్కుని బహు రంజుగా నటిస్తాం
మన అజ్ఞానాంధకార రూపాల కెలోడో స్కోప్ లలో
అతి వేగంగా తిరిగే ఊసరవెల్లుల కోలాహలం
రంగులు కలిసి పోయిన, వెలిసిపోయిన దొరకని దొంగలే చుట్టూ
మేధోమధన రహిత హాలాహలం మింగిన బానిసల గుంపులు
మానవ దేహాలన్నీ ఓటి కుండల్లా ఒకే చప్పుడు పలుకుతాయి
దృష్య రహిత, మరణ శూన్యపు చూపులు గుచ్చుకుంటాయి
ఏ సహజ భావోద్వేగాలూ మిగలని లౌక్యపు మర మనుషులు
వాళ్ళది కాని యుద్ధాల్లో కత్తులు దూసే
మహా భీరువుల తొడతొక్కిళ్లే మన చుట్టూ
కోపము, దుఃఖము, ప్రేమ,ముద్దు, మైధునం,ఆగ్రహం అన్నీ
ఎవరో ప్రాం టింగ్ చేసి వదిలారు
మరెవరో ట్యూన్ చేసిన, కలగలసిపోయిన శబ్ద తరంగాలలో తేలే
అర్థరహిత అపస్వరాలమై, శూన్యంలో మనం మోగుతాము
మన కన్నా ముందు మరణించిన వాళ్ళ వీలునామాల్లోని
అంచులు అరిగిపోయిన మాటల్నే మనం మళ్ళీ మాట్లాడతాము
ఎవరి మురికి దుఃఖాన్నో పీల్చుకున్న మేఘాలు
మన కన్నీళ్ళయి వర్షిస్తాయి
ఎవరిదో పగిలిన విషాదపు నవ్వు మన పెదవుల చివర వేలాడుతుంది
అగ్నిలా జ్వలించిన మానవుడి ఆలోచనలన్నీ చల్లార్చి
ఆ భస్మం తో చేసిన కృత్రిమ జ్ఞాన మాయా సర్పాభరణాలను ధరించి
ఎవడి శ్లేషంలో వాడే పడి ఈదుతూ, సంతసిస్తూ,రమిస్తూ
అజ్ఞాన పోటీల బరిల్లోకి నగ్నంగా దూకుతాం
అచ్చు పోసిన ఒకే రకపు ఉద్విగ్నరహిత మనుషులం మనం
కాలపు ముళ్ళు విరిగిపోయిన ఖాళీ హృదయాలం
ఆలోచనరహిత్యం సృష్టించిన శవ సంచారులం
థాట్ లెస్ నెస్, థాట్ లెస్ నెస్..
విపణి వీధుల్లో కృత్రిమ జ్ఞాన యంత్రాల ఊరేగింపులు
పరిగెత్తు, పరిగెత్తు ఆలోచనా రాహిత్యాల్లోకి
జ్ఞాన బేర సారాల్లోకి, కొనుగోళ్లలోకి ,అమ్మకాలలోకి
నీడలు, నీడలు.. చూపు లేని, కలలు లేని కళ్ళు
బందీలైన మాటలు, పదాలు, అర్థం లేని శబ్దాలు
రాతి మొహాల , వట్టి శరీరాల రాపిడుల మోహాల నిట్టూర్పులు
జ్ఞానాన్ని మింగి అమ్ముకునే కృత్రిమ బకాసురులు
ఆడ అచ్చు యంత్రాల నుండి ఉద్భవిస్తున్న
పిల్లల వరుసల మూసలు
పురిటి వాసనల ఎండిపోయిన ఎరుపు రంగు చారికల మధ్య
థాట్ లెస్ నెస్ ఊబిలో లుకలాడుతున్న మానవులు..
మానవులు జీవన్మృతులు, జీవన్మృతులు…
*








ఆద్యంత్గం ఎన్నెన్నో మనసుని తాకే అక్షర ఝరులు
వచన ప్రవాహం గొప్ప కవితగా అయిన తీరు అద్భుతం. మీ కవిత్వం చదువుతూ పెరిగినందుకు. మీరు చల్రాఆ లోతుగా రాస్తున్న కాలం లో ఉన్నందుకు కొంచం గర్వం గా ఉంది.
Love you VIMALA🌺no words