నేనా అడివిలో పుట్టలేదు, అడివిలో పెరగనూ లేదు.
కానీ, 1980 ల భగభగ మండే దశాబ్దంలో రాజకీయ ఓనమాలు దిద్దుకున్న తరానికి మనసులోనే ఒక అడివి, ఒక అలజడి.
నేనా సంచార జీవిని కాదు. మూడు నాలుగు ఊళ్ళు, ఇంకో దేశానికి వలస, అనేక దేశాల తిరుగుళ్ళు వున్నా సరే, సంచారం నాలో లేనే లేదు. అయినా, ఆలోచన కుదురు లేని తరం నుంచి వచ్చిన వాణ్ని కాబట్టి, లోపలంతా భూభ్రమణ కాంక్ష.
నా మొదటి కథ శీర్షిక -అడివి. ఆ కథలో నాయకుడు పూసలోళ్ల పిల్లాడు. ఇదొక యాదృచ్ఛికత. అలాగే, ఇప్పుడు ఈ ఆదివాసీ సంచార జాతుల ప్రత్యేక సాహిత్య సంచిక కూడా ఒక యాదృచ్ఛికమైన ఆలోచన. దానికేమీ చరిత్ర లేదు. ఒక క్రమం అంతకంటే లేదు.
పోయిన నెల సారంగ ఈమెయిల్ లో రెండు కథలు అందాయి. పూర్తిగా కొత్త పేర్లు. అంతకుముందు కనీసం మాటవరసకి కూడా ఎక్కడా విన్నవి కాదు. అంతకంటే ఆశ్చర్యంగా ఆ కథలు ఆవిష్కరించిన జీవితాలు నేను దగ్గిరగా చూసినవే అయినా ఏనాడూ అవి పేజీలకి ఎక్కినవి కాదు. ఆ రెండు కథలూ ఆదివాసీ జీవితంలోని రెండు భిన్నమైన సందర్భాలు. అచ్చంగా రెండు ఆదివాసీ బతుకు పుస్తకాలు.
ఆ కథలు చదివాక మొలకెత్తిన ఆలోచన ఆదివాసీ సాహిత్య ప్రత్యేక సంచిక. మిత్రులతో మాట్లాడుతూ మాట్లాడుతూ వుండగా, ఇంకాస్త ఆలోచిస్తూ ఆలోచిస్తూ వుండగా అదివాసీలతో పాటు సంచార జీవితాల సాహిత్యం కూడా తోడయితే బాగుంటుందని అనిపించింది. అలా ఈ ప్రత్యేక సంచిక నెమ్మదిగా ఆచరణ రూపం దాల్చింది.
తెలుగు సాహిత్యంలో ఏ చిన్న పనికి సంకల్పించినా వెంటనే ఒక నిరాశా పూరితమైన మందలింపు వచ్చేస్తుంది. “ఇది అయ్యే పని కాదు, మన వాళ్ళ సంగతి మీకు తెలుసు కదా. వాళ్ళ గురించే అయితే తప్ప మాట్లాడరు , రాయరు!” అని నేరుగా చెప్పిన వాళ్ళే ఎక్కువ. అయినా ప్రయత్నం ఆగలేదు.
చాలా విషయాల్లో సారంగకి ఒక అదృష్టం వుంది. అది- సారంగ ని తమదిగా భావించి, రెండు చేతులా కాదంటే ఇంకో రెండు చేతులు అరువు కూడా తెచ్చుకొని, చేయందించే వాళ్ళు వున్నారు. ఇట్లా ఈ సంచిక వెనక మిత్రులు, రచయితలు, కవులు, చిత్రకారులు, ఛాయాచిత్రకారులు తోడుగా నిలబడ్డారు. అంతకంటే ముఖ్యంగా, ఆదివాసీలతోనో, సంచార జాతులతోనో ప్రత్యక్షంగా కలిసి పనిచేసిన వాళ్ళు “మేమున్నాం” అంటూ ముందుకొచ్చి, వాళ్ళ వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. ఈ ప్రత్యేక సంచికకి సృజన జీవులు ఎంత ముఖ్యమో, ఇలాంటి ఆచరణ జీవులు అంతే ముఖ్యం.
అయితే, ఈ ఒక్క ప్రత్యేక సంచికలోనే అందరినీ ఒక చోటికి తీసుకు రావడం కుదరదని మాకు తెలుసు. ఈ సంచిక రూపు దిద్దుకుంటున్న సమయంలోనే ఇంకా కొన్ని రచనలు వచ్చి చేరుతున్నాయి. అన్నీ ఒక సంచికలో అందించడం ఇటు మాకూ, అటు పాఠకులకూ అసౌకర్యమే కాబట్టి, వాటిని నెమ్మది మీద ప్రచురిస్తాం.
ఈ సంచికకి ఒక రూపు ఇవ్వడంలో సహకరించిన మిత్రులు ఆర్. ఎం. ఉమా మహేశ్వర రావు, కందుకూరి రమేష్ బాబు, సుమనస్పతి రెడ్డి, సాయి వంశీ, రమేష్ కార్తీక్ నాయక్, విద్యా సాగర్, పద్దం అనసూయ, శ్రీనివాస్ గౌడ్ – ఇంకా ఎందరో మిత్రులకు సారంగ థాంక్స్! అనసూయ గారి ముఖాముఖీ ఎంతో శ్రద్ధతో – అంతకంటే ఎక్కువగా ఎంతో ప్రేమతో చేసి పంపించారు సాయి వంశీ.
ఈ ప్రత్యేక సంచికలో మేం మరచిపోయిన రచయితల్ని , కవుల్ని, ఆచరణ జీవులు ఎవరైనా వుంటే వారికి క్షమాపణలు. వారి రచనలు ఏవైనా వుంటే సూచించి, ఆ రచనల సేకరణలో తోడు నిలవాల్సిందిగా మనవి.
*








Add comment