అడవి ఓ అనంత నిధి. అక్కడ అన్నీ అద్భుతాలే. అవే ఆదివాసీల ఆయువు. వాళ్ల సంస్కృతి వైవిధ్యమైనది. అది ఎవరో నేర్పింది కాదు.. ప్రకృతి వాళ్లకు పంచి ఇచ్చింది. ఆ ఆదివాసీ(కోయ) సమూహం నుంచి వచ్చి, ఆదివాసీల అస్తిత్వాన్ని కథల ద్వారా పాఠకుల ముందు పెట్టారు రచయిత్రి పద్దం అనసూయ. నాలుగు కథలతో ‘చప్పుడు’ అనే పుస్తకం తీసుకొచ్చి తెలుగు సాహిత్యంలో ఆదివాసీల సాహిత్యానికి స్థానాన్ని, తగ్గ గౌరవాన్ని అందించారు. ఆదివాసీల కోసం టీచర్‌గా పనిచేస్తూ వారి భవితకు దారులు వేస్తున్నారు. ఆదివాసీల సంస్కృతి, అస్తిత్వ పరిరక్షణ కోసం మరెన్నో చేయాలని, మరెంతో రాయాలని తపన పడుతున్నారు. ఆమెతో సారంగ చేసిన ఇంటర్వ్యూ ఇది.
- నమస్తే మేడమ్! మీ బాల్యం గురించి చెప్పండి.
ఖమ్మం (ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం) జిల్లా పాల్వంచ దగ్గర్లో ఉంది మా ఊరు. ఆ రోజుల్లో మా పల్లెలో పరిస్థితులు వేరు. అప్పటికి మాకు స్కూళ్లు అందుబాటులో లేవు. ఉన్నా ఒకటి, రెండు తరగతుల వరకే. ఆ తర్వాత హాస్టల్‌కి వెళ్లాలి. చదువుకోవాలంటే ఉన్న చోటు విడిచి బయటకు రావాల్సిందే. మా ఇంట్లో సాహిత్య వాతావరణం ఉంది. మా నాన్న కవితలు రాసేవారు. అవి మా ఆదివాసీ జీవితానికి సంబంధించినవి. అయితే నా మీద మా అమ్మానాన్న ప్రభావం కంటే మా అమ్మమ్మ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. మా అమ్మమ్మ గురించి మాట్లాడుతూ ఉంటే ఆమె నా మీద పూనుతుంది అనిపిస్తుంది. తెలియకుండానే ఆమె జ్ఞాపకాల్లో లీనమైపోతాను.
- చదువు వైపు సాగిన మీ ప్రయాణం గురించి..
మా ఇంట్లో నా చదువుకు మా అమ్మమ్మే గట్టి మద్దతు. మా అమ్మమ్మ చదువుకోకపోయినా చాలా దూరదృష్టి కలిగిన మనిషి. ఆడపిల్లలు తప్పకుండా చదువుకోవాలని చెప్పేది. మాది మాతృస్వామ్య వ్యవస్థ. ఆడవాళ్లు చదువుకుంటే ఇల్లు సరిదిద్దుకుంటారనేది ఆమె ఆలోచన. మా పిన్ని, మా బాబాయి చదువుకోవాలని అప్పట్లోనే చక్రపాణి అనే మాస్టార్ని ఏర్పాటు చేసింది. వాళ్లు చదువుకునేటప్పుడు నేను చాలా చిన్నదాన్ని. వెళ్లి వాళ్ల పక్కన కూర్చునేదాన్ని. ఆ తర్వాత బడి అందుబాటులోకి వచ్చింది. పిన్ని, మావయ్య చదువుకుంటున్నారు కాబట్టి, నన్ను కూడా చదువు కోసం బయటకు తీసుకొచ్చారు. అలా హాస్టల్లో చేరాను.
- హాస్టల్లో మీకెదురైన అనుభవాలు ఎలాంటివి?
అక్కడ చాలామంది మాలాంటి ఊళ్ల నుంచి వచ్చినవాళ్లే ఉండేవాళ్లు. హాస్టల్‌కు వెళ్లిన తర్వాత తెలుగు మాట్లాడాల్సి వచ్చేది. తెలుగు చదవడం, రాయడం కష్టంగా ఉండేది. హిందీ, ఇంగ్లీషు ఎంత కష్టంగా ఉండేదో తెలుగు కూడా అంతే కష్టంగా ఉండేది. తెలుగు నేర్చుకోవడం చాలా పెద్ద విషయంలా ఉండేది నాకు. నేను తెలుగు రాయగలుగుతున్నా, చదువుతున్నా అంటే చాలా గొప్ప అనే భ్రమలోనే ఉండిపోయాను.
నేను హాస్టల్లో ఉన్నప్పుడు పురుగులు కలిసిన బియ్యంతో వండిన అన్నం తినబుద్ధయ్యేది కాదు. అది తినకుండా కళ్లు తిరిగి పడిపోయాను. అక్కడున్న టీచర్లు వాచ్‌మెన్‌ను తోడిచ్చి నన్ను ఇంటికి పంపించారు. ఆ తర్వాత రోజే మా అమ్మమ్మ నన్ను హాస్టల్‌కి తీసుకొచ్చింది. ‘మనూళ్లో బడి లేదు. నువ్వు బాగా చదువుకోవాలంటే హాస్టల్లో ఉండాలి’ అని చెప్పింది. ఆ తర్వాత హాస్టల్లో ఉండే విద్యాదేవి మేడమ్ దగ్గరికి వెళ్లింది. ‘అమ్మా! నేను మీతో ఒక మాట మాట్లాడొచ్చా?’ అడిగింది. మేడమ్ సరే అన్నాక, మా అమ్మమ్మ మాట్లాడింది.
‘ఇక్కడుండే పిల్లలంతా కోయ పిల్లలే కదా! బస్సులు లేని ఊరు నుంచి నడుచుకుంటూ వచ్చినవాళ్లే కదా! వీళ్లందరికీ ఇంతో అంతో పని తెలుసు. బియ్యంలో రాళ్లు, పురుగులు ఏరడం తెలుసు, అంట్లు తోమడం తెలుసు. ఒక్క ఆదివారం పూట వాళ్ల చేత బియ్యంలో పురుగులన్నీ ఏరేయిస్తే, ఆ పురుగులన్నీ పోతాయి కదా! ఆదివారం పూట ఆ పని చేయిస్తే అందరూ మంచి అన్నం తింటారు కదా’ అని చెప్పింది. మేడమ్‌కి ఆ సలహా బాగా నచ్చింది. 40-50 మంది పిల్లలం కలిసి క్వింటా బియ్యంలో రాళ్లు, పురుగులు ఏరి పెట్టేవాళ్లం.
- టీచర్‌గా మీరు పొందిన అనుభవాలేంటి?
నేను టీచర్ అయ్యాక స్కూల్లో పాఠాలు చెప్తున్నప్పుడు ఒక విషయం గమనించాను. ఒకప్పుడు విద్యార్థిగా ఉండి నేను పడ్డ ఇబ్బందే పిల్లలు ఇంకా పడుతున్నారు. వాళ్లు కూడా తెలుగు నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందితో కొందరు బడి మానేస్తున్నారు. దాన్నెలా ఆపాలా అని ఆలోచించి తెలుగు పాఠాన్ని మొత్తం మా భాషలోకి అనువదించి వాళ్లకు చెప్పాను. వాళ్లు అర్థం చేసుకున్నారు. ఇట్లా కూడా మా భాషను బతికించుకోవచ్చని అర్థమైంది. అయితే అప్పటికే చదువు, ఉద్యోగం వల్ల నా భాష చాలావరకూ పోయింది. దాంతో మళ్లీ ఆ బడి పిల్లల నుంచి నా భాషను నేర్చుకున్నాను.
- మీరు పుట్టి, పెరిగిన భాషను మళ్లీ నేర్చుకున్నారా?
అవును! తెలుగు పాఠాలను మా భాషలోకి అనువదించి చెప్పడం మొదలుపెట్టాను. ఆ తర్వాత పదాల వేట మొదలైంది. మా భాషలో ఈ పదాన్ని ఏమంటారు, ఆ పదాన్ని ఏమంటారు అని అడిగి తెలుసుకోవాలనిపించేది. అప్పట్లో ఫోన్ సౌకర్యం లేదు. శనివారం సాయంత్రం కాగానే ఊరికి వెళ్లిపోయి అమ్మమ్మ, తాతయ్యలను అడిగేదాన్ని. ఒక్కో పదాన్ని ఏమంటారు? అదెలా వచ్చింది అని తెలుసుకునేదాన్ని. చిన్నప్పుడు తెలుగు నేర్చుకోవడం కోసం పడ్డ శ్రమను మళ్లీ నా భాష గురించి తెలుసుకోవడం కోసం పడ్డాను. అయితే అదంతా కష్టంగా అనిపించలేదు. మా భాష గురించి తెలుసుకుంటున్నకొద్దీ కొత్త కొత్త విషయాలు తెలిశాయి. ప్రకృతితో ముడిపడిన భాష మాది. మా భాషకు పుట్టిల్లు ప్రకృతి అనే విషయం బోధపడింది.
- ఆదివాసీ భాషల్లో ఉండే సౌందర్యం ఎలాంటిది?
ఇప్పుడు తెలుగే తీసుకోండి. సంస్కృతం వల్ల తెలుగు భాషకు అందం వచ్చింది. ఆదివాసీల భాషకు ప్రకృతే అందం. మేం ప్రకృతి నుంచే మా భాషను తీసుకున్నాం. దీనికి చాలా ఉదాహరణలున్నాయి. ‘గర్భసంచి’ అనే పదాన్ని మా భాషలో ఏమనాలని అనుకుంటూ ఉన్నప్పుడు మా తాత ‘పిల్లమడి అంటారు’ అని చెప్పాడు. ‘అదేంటి తాతయ్యా’ అని అడిగితే, ‘పిచ్చిదానా! మడి కట్టి నారు వేశాం కాబట్టి అది నారుమడి. పిల్లలు ఈ మడిలోనే పెరుగుతారు కాబట్టి ఇది పిల్లమడి’ అని పొట్ట మీద చెయ్యేసి చెప్పాడు. అంతకుమించిన పదం మరొకటి ఉంటుందా?
‘ఇంద్రధనుస్సు’ను మేం ‘సింగరివిల్లి’ అంటాం. రంగులతో అందంగా ఉంటుందని దానికా పేరు. అలాగే మైదాన ప్రాంతంవాళ్లు ‘ఊసరవెల్లి’ అంటే, అది రంగులు సింగారించుకునేది కాబట్టి ‘సింగరిబిల్లి’ అని మేం అంటాం. కోడి తన పిల్లల్ని ఆనందంతో దగ్గరకు తీసుకుని, కేరింతలు కొడుతుందని అంటారు కదా! మేం దాన్ని ‘క్యార్కడిక్’ అంటాం. మా పదాలు ఇంత అర్థవంతంగా ఉంటాయి.
గోండి-కోయ డిక్షనరీ సమావేశం జరిగినప్పుడు తొమ్మిది రాష్ట్రాల నుంచి ఆదివాసీలు వచ్చారు. ఆ మాటలన్నీ వింటుంటే అన్నీ ఒకేలా ఉన్నాయని అనిపించింది. ఒక భాష మీద మరొక భాష ప్రభావం ఉంటుంది. అయితే ప్రతి భాషకూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. దాన్ని ఆ భాషలో వ్యక్తం చేసినప్పుడు అది ఎనలేని ఆనందం కలుగుతుంది. మా భాష ఎక్కడి నుంచో వచ్చింది కాదు. ప్రకృతి నుంచి వచ్చిందే. మా కథలు కూడా అంతే! పిల్లలకు అడవి గురించి చెప్పడం, దాని మంచిచెడులు చెప్పడం, అడవిని ఎలా కాపాడుకోవాలి, చెరువునెలా కాపాడుకోవాలని చెప్పడం.. ఇవే మా కథల్లో ఉంటాయి.
- రచయిత్రిగా మీ ప్రయాణం ఎలా మొదలైంది?
ముందే చెప్పినట్టు, నా మీద మా నానమ్మ, అమ్మమ్మల ప్రభావం చాలా ఉంది. నా కథలు కూడా వాళ్ల నుంచే పుట్టాయి. మా అమ్మమ్మ చనిపోయేవరకూ తన పనులు తనే చేసుకుంది. మేం చేస్తామన్నా చేయనిచ్చేది కాదు. తను పోయాక పద్ధతుల్ని సరిగ్గా పాటిస్తారో లేదో అన్న ఆలోచన ఉండేది. నాకు ఉద్యోగం వచ్చాక ‘నీకేం కావాలి?’ అని అడిగితే తెల్లచీర కొనివ్వమంది. ‘ఇప్పుడెందుకు?’ అని అడిగినా వినకుండా కొనిపించుకుంది. రెండు చీరలు కొనిస్తే పెట్టెలో దాచిపెట్టుకుంది. చేట కొనిపించుకుంది. చిల్లర డబ్బులు దాచిపెట్టుకుంది. అవన్నీ పెట్టెలో పెట్టింది. చనిపోయేముందు తన చేతిని ఆ పెట్టె వైపే చూపించింది. పెట్టె తీసి చూస్తే ఆ వస్తువులన్నీ ఉన్నాయి. ‘నాకు అన్నీ సంప్రదాయంగా చేయండి. మన పద్ధతి ప్రకారం నా కర్మలు చేయించండి’ అని నోటితో చెప్పకుండానే అలా చెప్పింది. ఇంట్లో వాళ్లు చేస్తారో, చేయరో అని భయంతో అన్నీ ముందే సిద్ధం చేసింది. కానీ ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. డోలోళ్ల కోసం ఇప్పపువ్వు సారా కూడా కాయించి, దగ్గర పెట్టుకుంది. అప్పట్లో పెద్దవాళ్లంతా తమ సంస్కృతి, పద్ధతుల విషయంలో అంత కచ్చితంగా ఉండేవాళ్లు.
అమ్మమ్మ చివరిదశలో ఉక్కిరిబిక్కిరవుతుంటే ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె డాక్టర్‌తో ఒకే మాట చెప్పింది. ‘నాకొక్కడే కొడుకు. వాడి చేత డబ్బులెక్కువ ఖర్చు పెట్టించలేను. నా జీవి ఇక్కడ పోకూడదు. నా ఇంట్లోనే పోవాలి. మా పెద్దలంతా సంక్రాంతి పండగకే పోయారు. నేను అప్పుడే పోవాలి. నన్ను మా ఇంటికి తీసుకెళ్లమని మా వాళ్లకు చెప్పు’ అంది. ఆమెను సాయంత్రం ఇంటికి తీసుకొచ్చారు. అందర్నీ పిల్చుకొని తృప్తిగా పోయింది. ఇదంతా మా ఆయన (కవి విద్యాసాగర్ పొల్లా) విని ‘ఇన్ని చెప్తున్నావ్ కదా! నువ్వు చెప్పేదే వ్రాయి. అదే కథవుతుంది’ అన్నారు. ఎవరి జీవితాలను వాళ్లే అక్షరాల్లో చెప్పాలనేది ఆయన మాట. అలా రాసిందే నా తొలి కథ ‘కాకమ్మ’.
ఆ తర్వాత రాసిన కథలో అడవిలో ఉండే ఇబ్బందుల గురించి రాశాను. ఒకావిడ అడవిలోకి వెళ్లి ఎలుగుబంటి దాడిలో చనిపోయింది. మా నానమ్మ కూడా తునికాకు కోసం అడవికి వెళ్లి ఎలుగుబంటి వల్ల చాలా ఇబ్బంది పడింది. ఈ అంశాన్ని ‘ముసిలి’ కథగా రాశాను. మా కోయ సమాజంలో మతం లేదు. కొత్తగా మాలోకి మతం వస్తే, అది మా మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంతో ‘మూగబోయిన శబ్దం’ కథ రాశాను. ఆదివాసీలు పట్టణానికి వచ్చాక, వాళ్ల సంస్కృతిని కాపాడుకోవడానికి చేసే పోరాటం గురించి ‘చప్పుడు’ కథ రాశాను. మరో రెండు కథలు కూడా రాశాను.
- ఆ కథల తర్వాత చాలా విరామం తీసుకున్నారు. కారణమేంటి?
ఆ కథలు రాశాక డోలీవాళ్ల (డోలు వాయించేవాళ్లు) కథలు రాయాలని అనుకున్నాను. మా చరిత్ర మొత్తం వాళ్లు చెప్పే కథల్లో ఉంటుంది. మా ‘పద్దం’ వాళ్లకు తాబేలు దేవుడు. దానికొక కథ ఉంది. మాకు ఇంటిపేరటతను పెరంబొయిరాజు వాళ్లమ్మ చిమిలి ముద్దలు చేసిచ్చి, పోడు దున్నడానికి పంపింది. ఆయన వెళ్లి, గాలివాటానికి కూర్చొని చిమిలి ముద్దలు తింటూ ఉన్నాడు. చుట్టూ ఉన్నవాళ్లు చూసి ‘మాక్కొంచెం పెట్టు’ అని అడిగారు. తన దగ్గర ఉన్నది కొంచెం. దాన్ని అందరికీ పెట్టడానికి చాలదు. ‘లేదు.. అయిపోయింది’ అంటూ ఆయన చెరువు దగ్గరికి వెళ్తాడు. వాళ్లు వదలకుండా ఆయన వెంటపడ్డారు. ఆయన్ని చెరువులోని తాబేలు దాచిపెడుతుంది. ఆయన కనిపించకపోవడంతో వాళ్లు వెళ్లిపోతారు. ఆయనను దాచిన ‘తాబేలు’ అప్పటినుంచి మాకు దేవుడయ్యాడు. ఈ కథంతా డోలువాళ్లు చెప్తారు. ఇలాంటి కథలెన్నో ఉన్నాయి. వాటిని రాయాలని అనుకున్నాను.
అయితే కరోనా టైంలో అనారోగ్యానికి గురయ్యాను. ఆ టైంలో నా కుటుంబం గుర్తురాలేదు. ‘డోలీవాళ్ల కథలు ఆగిపోతాయే’ అనిపించింది. ఆ తర్వాత రకరకాల కారణాలతో ఆ పని వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు మళ్లీ వాటిని మొదలుపెట్టాను. తప్పకుండా పూర్తి చేస్తాను.
- ఆదివాసీల్లో ప్రస్తుతం వస్తున్న మార్పులు చూస్తుంటే ఏమనిపిస్తుంది?
ఇప్పుడు అందరి ఇళ్లల్లోకి టీవీలు వచ్చాయి. మా పండగలు మారిపోయాయి. మా వేలుపులు మారిపోయాయి. మా వస్త్రధారణ మారిపోయింది. మార్పు రావాలి. నేను కాదనను. కానీ మన ఉనికిని, మన అస్తిత్వాన్ని మనం కోల్పోకూడదు. దాన్ని పోగొట్టుకోకూడదు. పిల్లలకు మన సంస్కృతి గురించి చెప్పాలి. మా సంస్కృతి వైవిధ్యమైనది. మాకు పుట్టుక, చావు, పెళ్లి, పంట, కోత.. అన్నీ పండగలే. చినుకు పడితే పండగ, చిగురు వేస్తే పండగ, మొక్క వస్తే పండగ, అది చెట్టైతే పండగ, పంట వేస్తే, అది కోస్తే.. అన్నీ పండగలే.
మా ఇళ్లల్లో ఎవరైనా చనిపోతే పూర్బం చెప్తారు. రెండు రాత్రులు కథ చెప్తారు. ఇప్పుడు అదంతా వినే ఓపిక ఎవరికీ ఉండటం లేదు. చెప్పేవాళ్లు కూడా తగ్గిపోయారు. డోలు లేకుండా మా ఇళ్లల్లో ఏ పనీ జరగదు. డోలు వాయించేవాళ్లు కూడా తగ్గిపోతున్నారు. మెల్లగా అంతా మారిపోతోంది.
చావు తర్వాత చేసే మా కార్యక్రమాల్లో ఎంతో అర్థం దాగి ఉంటుంది. ప్రకృతిని భాగం చేస్తూ, పశుపక్షులకు గ్రాసం పెడుతూ జరిగే తంతు అది. ఇంట్లోవాళ్లను, బంధువుల్ని అందర్నీ ఆ పనుల్లో భాగం చేయడం మా సంస్కృతి. వచ్చేటప్పుడు కూడా అందరూ తమకు చేతనైనంత తీసుకొచ్చి ఆ ఇంటివాళ్లకు ఇస్తారు. ఇవన్నీ ఇప్పటి తరానికి చెప్పాలి.
- తెలుగులో ఆదివాసీ సాహిత్యం తక్కువగా ఉంది. దీనికి కారణమేంటి?
ఒకప్పుడు నా భాష నేను మాట్లాడాలంటే భయంగా ఉండేది. మా భాష మాట్లాడితే తెలుగు సరిగ్గా రాదని చెప్పేవారు. అలా చెప్తూ చెప్తూ మా భాషనే మాకు దూరం చేశారు. ఇంటర్లో ఒక లెక్చరర్ నాతో ‘మీకు డిగ్రీ అయిపోగానే జాబ్ వచ్చేసుందిలే’ అన్నారు. నేను రిజర్వేషన్ క్యాండేట్నని ఆ మాట. ఇలాంటివి చాలా ఎదుర్కొన్నాను. అలాంటి వాళ్లు ఎంతమంది ఉన్నారో, నన్ను ప్రోత్సహించినవాళ్లు కూడా ఉన్నారు. మంచి, చెడు.. రెండు రకాల అనుభవాలనూ చూశాను.
నా భాష గొప్పతనం నాకు ముందుగా తెలియదు. నేను టీచర్ అయ్యాక పిల్లల కోసం నా భాషలోకి అనువాదాలు చేయడం మొదలుపెట్టాకే భాషను మరింతగా అర్థం చేసుకున్నాను. ఆ తర్వాత నా భాషను మళ్లీ నేర్చుకున్నాను. మా ఇంట్లో సాహిత్య వాతావరణం ఉండటం, మా నాన్న ఆదివాసీల గురించి కవిత్వం రాయడం.. అవన్నీ ఉండటం వల్లనే నేను మళ్లీ నా మూలాలకు వెళ్లగలిగాను అనిపిస్తుంది. లేకపోతే నేను కూడా పూర్తిగా మారిపోయేదాన్నేమో! ఇతర గిరిజన సమూహాలతో పోలిస్తే కోయ వర్గం నుంచి ఇంకా చాలా సాహిత్యం రావాల్సి ఉంది. చదువుకున్నవాళ్లు ఉన్నా సాహిత్యంలోకి రావడం లేదు. కల్యాణి కుంజ లాంటి రచయిత్రులు మరింత మంది రావాలి.
- మోడ్రన్ సమాజంలో ఆదివాసీల సంస్కృతి దూరమైపోతూ ఉంది. ఇలాంటి పరిస్థితిని చూస్తే ఏమనిపిస్తుంది?
ఆదివాసీలది వైవిధ్యమైన సంస్కృతి. అడవిలో ఒక చెట్టు, పుట్టతో వాళ్లకు చాలా అనుబంధం ఉంటుంది. అది పోతే వాళ్ల కుటుంబసభ్యుడు పోయినంత బాధపడతారు. ఎన్నో ఆదివాసీ గ్రామాలు ఇప్పుడు కనిపించకుండా పోయాయి. మరి మా పూర్వీకుల సమాధులు ఎక్కడున్నాయి? వాళ్లను ఎలా గుర్తుచేసుకోవాలి? సామల పండగ, కుర్మీన్ పండగ.. ఈ పండగలన్నీ ఎక్కడికి పోయాయి? డప్పులు కొడుతూ రాత్రంతా ఆనందంగా గడిపే సంబరాలేవీ?
మాకు తిండినిచ్చే పంట మాకు దేవుడు. నీడనిచ్చే దేవుడు. నీళ్లిచ్చే వాగు దేవుడు. ఇవన్నీ మాకు బతుకునిస్తాయి. ఇవి మాకు కంటి ముందు కనిపించే దేవుళ్లు. చనిపోయిన మా పెద్దలు మా దేవుళ్లు. మా మాట ప్రకారం నడుచుకుంటాం. మా పండగలన్నీ ప్రకృతికి సంబంధించినవే. నాట్లేసేటప్పుడు, పంట చేతికొచ్చినప్పుడు, చెట్టు చిగురించినప్పుడు చేసుకునే పండగలొదిలేసి ఇంకేవో పండగలెలా చేసుకుంటాం? మనది గొప్ప సంస్కృతి అయినప్పుడు దాన్నెందుకు వదులుకోవాలి? మార్పు రావాలి, అభివృద్ధి చెందాలి. అయితే మన అస్తిత్వాన్ని మనం కోల్పోకూడదు.
*








Add comment