ఉద్యమాల సెగ నుంచి ఆదివాసీ తెగ దాకా…

నన్ను నేను చెరిపేసుకుని, మళ్ళీ నన్ను నేనే సరిదిద్దుకున్నాను. పునర్నిర్మించుకున్నాను. మారాల్సినవి, మార్చుకోవలసినవి చాలా ఉన్నాయి. ఆదివాసుల నుండి నేర్చుకోవలసినవి కూడా ఇంకా ఉన్నాయి.

చుట్టూ అడవులు, ఆదివాసీ ఆవాసాలు, మధ్యలో అభివృద్ధితో పోత పోసినట్టుండే మా పాల్వంచ !

నా బాల్యం, యవ్వనం, ఉద్యోగం అన్నీ ఇక్కడే. అబ్బుర పరిచే పచ్చటి గొలుసు కట్టు కొండలు ఒకవైపు, ఆకాశంతో పోటీపడే పెద్ద పెద్ద పొగ గొట్టాలు, కూలింగ్ టవర్లు ఇంకోవైపు. పదో తరగతి నాటికి కొత్త కొత్త ఆలోచనలు, ప్రశ్నలు మొదలయ్యాయి. పుస్తక పఠనం అలవడింది. ఉద్యమాల సెగ తగిలింది.

అప్పట్లో పి.డి.యస్.యులో తిరిగే వాడ్ని. విలేజ్ క్యాంపులు ఎప్పుడూ చూడని కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాయి. పాల్వంచ నుండి ఎటు ఐదు కిలో మీటర్లు వెళ్ళినా ఒక ఆదివాసీ గుంపు స్వాగతం పలుకుతుంది.ఆ దగ్గరితనం నా సంచారాన్ని మరింత విస్తృతం చేసింది. ఎప్పుడు పడితే అప్పుడు ఆ గ్రామాలకు వెళ్ళే వాడ్ని. వాళ్ళ పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే బయటకు తీసే ఎర్ర రంగు త్రికోణాకారపు పడగెలు, వాటిపై రంగుల్లో మెరిసే మనుషుల, జీవరాశుల బొమ్మలు కొత్త లోకంలోకి తీసుకెళ్ళేవి. ఇక ఆట,పాట గురించి చెప్పనక్కర లేదు.

ముఖ్యంగా డోలి కళాకారుల మహాగానం నన్ను చిన్నపాటి పరిశోధకుడ్ని చేసింది. చనిపోయిన వ్యక్తి ‘కర్మ’కు ముందు రోజు రాత్రి డోలి కళాకారులు చెప్పే ‘పూర్బం’నన్ను కట్టిపడేసింది. వాళ్ళు వాడే ‘డోలు’ను ఆదివాసులు పసుపు, కుంకుమలతో పూజించడం, ఆ డోలు శబ్ధాన్ని పూర్వీకుల ఆత్మగా కొలవటం, నా ఆలోచనలకు కొత్త చూపును ఇచ్చాయి. శబ్ధాన్ని పూజించడం కొత్తగా అనిపించింది.

బతుకుదెరువు కోసం పవర్ ప్లాంట్ లో కార్మికుడిగా చేరే నాటికే, కవిత్వం- ఆదివాసులు నా ప్రపంచంగా మారిపోయారు. శనివారం సాయంత్రం డ్యూటీ దిగి ఏదో ఒక ఆదివాసి గుంపులో మకాం వేసే వాడ్ని. ఆదివారం అంతా అక్కడే. మళ్ళీ సోమవారం ఉదయానికి డ్యూటీకి అందుకునే వాడ్ని. 90 ప్రాంతంలో అనుకోకుండా ఒక దినపత్రికలో విలేకరిగా చేరాల్సి వచ్చింది. అది నన్ను ఆదివాసులకు మరింత దగ్గర చేసింది. సంచార క్షేత్రాన్ని మరింత విస్తృతం చేసింది.

కేవలం ఆదివాసుల అభివృద్ధి కోసమే పాల్వంచలో ఒక ఐ. టి డి ఏ ఉండేది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని తెగల ఆదివాసులు, సంఘాలు, నాయకులు దాని చుట్టూ తిరుగుతుండే వాళ్ళు. నిరసనలు, ధర్నాలు, ఏజెన్సీ బందులు, ప్రెస్ మీట్లు-రకరకాల సమస్యలతో వచ్చే ఆదివాసులతో ఏర్పడ్డ అనుబంధం అంతా ఇంతా కాదు. ఎక్కువ వార్తలు వాళ్ళ సమస్యల గురించే రాసే వాడ్ని. తిరగని గ్రామం లేదు.అక్కడి పరిస్థితులు నన్ను ఉక్కిరి బిక్కిరి చేశాయి. అభివృద్ధి పేరుతో జరిగే విధ్వంసాన్ని కళ్ళారా చూశాను. ముఖ్యంగా ఆదివాసి సంఘాలతో ఎడతెగని సంభాషణలు, మైదానంతో బలపడే కొద్దీ ఆదివాసుల్లో వస్తున్న మార్పులు కలవర పెట్టాయి. వస్తు మార్పిడి కేంద్రాలుగా ఉండాల్సిన సంతలు, వస్తు వ్యామోహ కేంద్రాలుగా మారటం చూశాను.

ఉద్యోగం పర్మనెంట్ అయ్యాక కవిత్వం_ఆదివాసులు, ఈ రెంటికే పరిమితం అయ్యాను. దిష్టిబొమ్మ దీర్ఘ కవితను మినహాయిస్తే గాలికట్ట, ముంపు_ ఈ రెండు ఆదివాసీల గురించి రాసిన సంఘీభావ కవిత్వమే. పోలవరం ప్రాజెక్టు ఆదివాసుల్ని ఎట్లా విస్థాపితుల్ని చేసిందో, మండలాలకు మండలాల్ని ఎట్లా జల సమాధి చేసిందో ప్రత్యక్షంగా చూశాను.

మనం ఎవరి గురించి రాస్తున్నామో, అది వాళ్ళకు చేరాలంటే వాళ్ళ భాషలోనే రాయాలి.అందుకే ముంపు దీర్ఘ కవితను నా సహచరి పద్దం అనసూయ కోయ (గోండి) భాషలోకి అనువదించింది. దాన్ని తెలుగు, కోయ భాషల్లో ప్రచురించాం.ఈ అనువాద అనుభవాలు చాలా పాఠాలు నేర్పించాయి. మాట్లాడేటప్పుడు కోయ, తెలుగు భాషలు చాలా దగ్గరగా అనిపిస్తాయి. కవిత్వ భాష, పదాల్ని కోయ భాషలోకి అనువదించేటపుడు కొన్నిటికి సమానర్థ పదాలు దొరికేవి కావు. అందుకోసం మళ్ళీ నా కవిత్వాన్ని అనువాదానికి అనుకూలంగా ఉండేలా తిరగ రాయాల్సి వచ్చేది. అనువాదాన్ని మరింత సులభం చేయడం కోసం, నా కవిత్వ భాషను సరళీకరించుకున్నాను.

వాస్తవానికి తెలుగులో వచ్చిన ఆదివాసీ కవిత్వం చాలా తక్కువే.

కవిత్వం కంటే కథలే ఎక్కువగా వచ్చాయి. నేను ఆదివాసీల గురించి రాస్తున్నప్పటికీ, ఒక ప్రశ్న నన్ను వెంటాడేది. నేను రాస్తున్న కవిత్వం లో ఆదివాసీయత ఉందా? ఆదివాసీలు కూడా ఇలానే రాస్తారా? అసలు వాళ్ళు ఏం రాస్తున్నారు? వాళ్ళ శైలి, శిల్పం, రూపం, నిర్మాణ పద్ధతి ఎలా ఉంటుంది? ఏ ఏ తెగలు, ఏ భాషల్లో రాస్తున్నారు? అందాజాగా ఎంతమంది కవులు, కవయిత్రులు ఉన్నారు? వాళ్ళ తాత్వికత ఏంటి? ఈ ప్రశ్నలు అధ్యయనానికి పురికొలిపాయి. అవి నాతో చాలా పనులు చేయించాయి.

2007లో ప్రచురించిన ముంపు తర్వాత నా స్వీయ కవిత్వాన్ని బంద్ పెట్టాను. ఎక్కడెక్కడి నుండో ఆదివాసీ కవుల వివరాలు, వాళ్ళ కవితా సంపుటాలు, సంకలనాలు సేకరించే వాడ్ని . అవి ఎక్కువగా హిందీ, ఇంగ్లీష్ లో ఉన్నాయి. ఆ రెండు భాషల్ని కొద్ది కొద్దిగా మెరుగుపరుచుకున్నాను. కవిత్వ సేకరణ, అధ్యయనంలో బిజీ అయ్యాను.ఆ కవిత్వం చదువుతుంటే అది విస్థాపితుల వాంగ్మూలంగా అనిపించేది. ఆ కవిత్వంలో ఎంతగా కూరుకుపోయానంటే, నేను కవిత్వం రాయడం మరిచిపోయాను. రాయాల్సిన అవసరం కూడా లేదు అనిపించింది. వాళ్ళను అనుకరించడం కూడా అసాధ్యం. ఏదో ఒక విధంగా ఆ కవిత్వాన్ని తెలుగులోకి అనువదించడం అత్యవసరం అయ్యింది. ఆదివాసీ కవిత్వం పేరుతో ఫేస్ బుక్ లో పోస్ట్ చేసే వాడ్ని.

మొదట్లో కవితా సంపుటాలు, సంకలనాల్ని పరిచయం చేసే వాడ్ని. దానికంటే ఒక్కోక్క కవితను అనువదించటమే బాగుంది. ఈ నాలుగేళ్ళలో సుమారు 300 కవితల్ని హిందీ, ఇంగ్లీష్ నుండి అనువదించాను. ఇంకా చాలా చేయాల్సి ఉంది.ఈశాన్య రాష్ట్రాలతో సహా మిగతా ఆదివాసీ ప్రాంతాల్ని కలుపుకుంటే సుమారు 250 పైగా కవులు, కవయిత్రులు ఉన్నారు. సంకలనాలు, సంపుటాలకు లెక్కలేదు. సంభాషణాత్మక కవిత్వం వాళ్ళది. నలుగురు కూర్చోని మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది.

మళ్ళీ చాలాకాలం తర్వాత స్వీయ కవిత్వం పై దృష్టి పెట్టాను. ఈ నాలుగేళ్ళలో రాసిన కవిత్వం ఇది. ఆదివాసులు మాట్లాడే తీరు భలే అందంగా ఉంటుంది. పదాలకు నగిషీలు చెక్కుతున్నట్టుగా ఆగి ఆగి మాట్లాడుతారు. మాట్లాడుతూ మాట్లాడుతూనే మన ముఖ కవళికల్ని పరిశీలిస్తుంటారు. అచ్చం వాళ్ళలానే ఆగి ఆగి మాట్లాడడం నాకు తెలియకుండానే అలవాటైంది. క్రమంగా అదే నా కవిత్వ శైలిగా మారింది.

చిన్న చిన్న పదాల్నే వాడటం వెనుక ఇంకొ కారణం ఉంది. నేను ఏమి రాసినా కోయ భాషలోకి అనువదించాలనే నిబంధన పెట్టుకున్నాను. ఆ అనువాద బాధ్యత నా సహచరి పద్దం అనసూయది. అనువాదానికి అనుకూలంగా కోయ భాషకు దగ్గరగా ఉండే తెలుగు పదాల్ని ఏరుకునే వాడ్ని. ఇతర భాషల్లోని ఆదివాసీ కవిత్వాన్ని తెలుగులోకి అనువదిస్తున్న క్రమంలో చాలా నేర్చుకున్నాను.

నన్ను నేను చెరిపేసుకుని, మళ్ళీ నన్ను నేనే సరిదిద్దుకున్నాను. పునర్నిర్మించుకున్నాను. మారాల్సినవి, మార్చుకోవలసినవి చాలా ఉన్నాయి. ఆదివాసుల నుండి నేర్చుకోవలసినవి కూడా ఇంకా ఉన్నాయి.

*

విద్యా సాగర్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.