తుడుం డప్పుల వెతుకులాట నా కథ

  నేను కథలు రాయడం మొదలుపెట్టే నాటికి నా వయసు ఇరవై. నా తొలి కథ అచ్చయిన నాటికి నా వయసు ఇరవై యేడు.

ఈ ఏడేళ్ళలో మా వూరు కొత్త కొత్తగా మారుతూ వుండడం నాకింకా గుర్తుంది. అది మిలీనియం చివరి దశాబ్దపు కాలం(1993-2000). మా ఇంటి వెనకున్న సంక్షేమ హాష్టల్ ఆశ్రమ పాఠశాలగా మారడానికి సిద్ధమవుతున్న కాలం. మా వూళ్ళోకి కొత్త షావుకార్లు బడ్డీ వ్యాపారాలు మొదలు పెడుతున్న సమయం.

మా గడపల్లో కరెంట్ దీపాలు వెలిగినా మా వీధుల్లోకి ఇంకా చీకట్లోనే వున్న కాలం. వెన్నల రాలడం స్పష్టంగా కనపడుతున్న కాలం. డిసెంబర్ చివరి వారంలో కందికొత్తల పండుగకు ముందు తుడుం డప్పులు ఇంకా పలుకుతున్న రాతిరి వేళలు… థింసా నృత్యాలు కోసం కోకలు ఎగగట్టిన ఆడపడుచులు ఇంకా కాలు కదుపుతున్న కాలం. అప్పటికింకా మా వూర్లోకి చర్చి పాటలు రాలేదు. గణపతి బొప్పా మోరియా నినాదాలు చొరబడలేదు. సాయి సందేశాలు ఇంకా అలికిడి లేదు.

అలాంటి కాలంలో నేను కథలెలా రాయాలో దేవులాడుతుండేవాణ్ణి. ఏది కథ చెయ్యాలో తెలీక తడబడుతుండేవాణ్ణి. తొలి కథ అచ్చులో చూసుకోడానికి ఇంకా పేజీలకి పేజీలు రాస్తుండే వాణ్ణి. అప్పటి నా లక్ష్యం గురువు గంటేడ గౌరునాయుడు గారి నుంచి ’ఓకే.. ఇది పనికొస్తుంది, పత్రికకు పంపిద్దాం’ అని అనిపించుకోవడం. అంతదాకా రాస్తూనే వుండేవాణ్ణి.

అలాంటి ఒక వెన్నెల సాయంత్రాన డప్పుల వరసకి తుడుం కలపడానికి నాకు మిత్ర బృందం నుంచి పిలుపొచ్చింది. నాకు అలాంటి పిలుపొచ్చిందంటే వీధిలో తుడుం కుండని పలికించడానికి మనుషులెవరూ లేరని అర్ధం. ఆశ్చర్యంతో వీధిలోకొచ్చి చూస్తే మనుషుల్లేని సమూహం ఎదురయ్యింది. నాలుగు డప్పులున్నాయి ముగ్గురు మనుషులున్నారు. తుడుం కుండలు రెండు… కొట్టడానికి మనుషులు లేరు. అందుకే నాకు పిలుపొచ్చింది.

అంతకు ముందు వెన్నెల సాయంత్రాల్లో ఊరు నిశ్శబ్దంగా వుండేది కాదు. కొండలు మౌనంగా వుండేవి కాదు. తుడుం డప్పుల దరువులతో… థింసా ఆటలతో, పిన్ల కర్ర పాతలతో ఊరు ఊరంతా వీధుల్లోకొచ్చి ఆడితే అడవి అడుగులేసేది, కొండలు దద్దరిల్లేవి. కానీ ఆ రోజు? డప్పు కొట్టడానికి మనుషుల్లేరు, తుడుం ముట్టడానికి చేతులు చాలడం లేదు.

ఏర్రా మనోలంతా? అని ఆరా తీస్తే… కొందరు టీవీల ముందు చిత్ర లహరుల్లోనూ, మరికొందరు క్రీస్తు సంఘాల ప్రార్ధనల్లోనూ ములిగిపోయేరని తెలిసొచ్చింది. మా సంప్రదాయ కందికొత్తల పండుగకు డప్పు కొట్టడానికి రమ్మని పిలిస్తే ’మతం తీసుకున్నాము… రాము” అని తెగేసి చెప్పడం నాకు స్పష్టంగా గుర్తుంది. ఆ కొన్ని రోజులకి మీటింగ్ పెట్టి మాట్లాడుదాం రమ్మని పిలిస్తే… సంఘంలో ఉన్నాము రాము” అని తిరస్కరించడం గుర్తుంది.

మా పండుగ కందికొత్తలు… అడవికి నీరజనాలు అర్పించే ఒక సందర్భం. ఆ ఉత్సవంలో జట్టు కట్టి థింసా అడుగులు వేయడం ఒక సామూహిక తత్వానికి సంకేతం. తుడుం, డప్పులు మా సంస్కృతిక వారసత్వం. శతర మా ఇంటి దేవత. శ్రామిక పనిముట్టు గొడ్డలిని దేవత చేసి, గొడ్డలమ్మగా పూజించడం మా సంప్రదాయం.

అలాంటి పండుగలో డప్పు కొట్టడానికి, తుడుం కుండ వాయించడానికి మనుషులు దొరక్కపోవడం విషాదం. టీవీలు, డిష్ యాంటెన్నాలతో బాటు… వినాయక చవితిలు, చర్చి ప్రార్ధనలు మా వూర్లోకి ప్రవేశించడం ఆరంభమయ్యింది ఆ కాలంలోనే. ఆ మూలంగానే సమూహంగా వుండే మా లో విభజన మొదలయ్యింది. మతం మా వూరిని రెండు గా విభజించింది. ప్రకృతి మార్పులకు అనుగుణంగా పండుగల రూపంలో ఉన్న మా జీవన విధానాన్ని భగ్నం చేసేయి ఈ మత విశ్వాసాలు, ఆధునిక సౌకర్యాలు.

దీన్ని కథగా రాయాలనుకున్నాను. రాసాను. ఆ కథ పేరు ”గాయం”

ఇది నాకు నాలుగో కథో ఐదో కథో గుర్తులేదు. కానీ దాని కోసం నేను చేసిన ఎక్సర్సైజ్ మాత్రం స్పష్టంగా గుర్తుంది. ఒక కథని ఒకసారో రెండు సార్లో రీరైట్ చేస్తాం. మహా అయితే ఐదు లేక ఆరు సార్లు రీరైట్ చేస్తాం. నాకు బాగా గుర్తుంది. ఈ గాయం కథ మాత్రం ఇరవై సార్లకి పైగా రీరైట్ చేసేను. ఎంత రాస్తున్నా ఏదో ఒకటి మిగిలిపోవడమో, కొత్త అంశం చేరడమో జరుగుతూ వచ్చింది. ఆ సబ్జక్ట్ అంతగా డిస్టర్బ్ చేసింది నాకు.

అంతకు ముందు ”కలలు కాలుతున్న వాసన’ కథ ప్రజా శక్తి కథల పోటీలో తృతీయ బహుమతి గెలుచుకుంది. ఈ కథ గ్లోబలైజేషన్ ప్రభావంతో మా మధ్య వస్తు వ్యామోహం దాని ప్రభావము మీద చర్చించింది. దీని నెరేషన్ నాకు ఇష్టమైన చైతన్య స్రవంతి లో సాగుతుంది. దానికా పేరుందని, అదొక పద్ధతని నాకు అప్పటికి తెలీనే తెలీదు.

ఈ రెండు కథలూ నా రాత దృష్టి కోణాన్ని స్పష్టం చేసాయని చెప్పగలను. నేను ఏది రాయాలో, ఏది రాయకూడదో నిర్ణయించుకునేలా చేసాయి. టిహిలికి పెళ్ళి, గత వర్తమానం, తాండ్రచుట్ట, అడవితనం లాంటి కథలు నన్ను ఇంకా పరీక్షకు గురి చేసాయి. అవేమీ అలవోకగా రాసినవైతే కాదు. ఆ పాత్రలు రూపేణా నేను పడ్డ సంఘర్షణ, అంతర్మధనం అంతులేనిది.

నాకు తొలి కథలు రెండు. ఏడేళ్ళుగా రాస్తున్న కథల్లో రెండు కథలు ఒకే నెలలో అచ్చయ్యాయి. ఒకటి ”అక్షరాల దారిలో” నేను చదువుకున్నపుడు హాష్టల్ అనుభవాల కథ.  రెండోది ”అరణ్యరోదన”. అటు అన్నలకి, ఇటు పోలీసులకి మధ్య నలిగిపోతున్న ఒక ఆదివాసీ స్త్రీ కథ. ఈ రెండు కథల్లోనూ పాత్రలు నేను, నా పక్కనే వున్న మా వూరి మహిళ.

అది మొదలు. కథలు రాస్తూనే వున్నాను. ఈ రోజుకి రాస్తూనే వున్నాను. నా కథా ప్రయాణపు కాలానికి, నా కథా ప్రచురణల సంఖ్యకు లెక్క సరిపోదు. చాలా తక్కువ కథలు. అందుకు గల కారణాలు కూడా ఉన్నాయనిపిస్తుంది.

నా కథల ప్రయాణంలో నాకు అర్ధమయింది ఏమిటంటే ఒక రచయిత కథలో ఒక పాత్రగా జీవించగలిగితే ఆ కథ బలంగా వస్తుందనే అభిప్రాయానికి వచ్చాను. ఉత్తమ పురుష కథనానికి మాత్రమే కాకుండా సర్వసాక్షి కథనానికి కూడా ఇది సాధ్యపడుతుంది. (ఇది రూలేమీ కాదు) ఈ వాక్యం సాధ్యాసాధ్యాల గురించి కాకుండా కథాబలానికి సంబంధించినదిగా చూడగలగాలి. నా కథానుభవాల దృష్ట్యా చెప్పదలచుకున్నదేమంటే తెలిసిన కథే రాయాలి. ఇంకా చెప్పాలంటే అనుభవించిన కథే రాయగలిగితే ఇంకా బలమొస్తుంది కథకి. దీనిని ఇంకా కొనసాగించాలంటే కథ కోసం చాల పరిశోధన చేయాల్సి వుంటుంది.

అదే చేసాను. నా కథల్ని అలాగే ప్రయత్నించాను. ఈ ప్రయాణం లో చాలా ఫెయిల్యూర్స్ ని ఎదుర్కొన్నాను. ఆ విషయం నా కథల్లో స్పష్టంగా తెలిసిపోతుంది. ఒప్పుకోడానికి కూడా వెనుకాడను. ఉదాహరణకు ఒకే అంశం మీద రెండు కథలు రాయాల్సి రావడం. ఆ అవసరం వచ్చిందంటే మొదటి కథలో చెప్పలేనిది రెండో కథలో చెప్పామని అర్ధం. అంటే చెప్పాల్సిన అంశం సరిగ్గ  చెప్పలేకపోయామని అర్ధం. ఈ పొరపాట్లు జరక్కుండా కథలు రాయాలని తదుపరి కథల్లో ప్రయత్నించాను.

ఈ దారిలోనే నన్ను ఇబ్బంది పెట్టిన నా కథలు చాలా వున్నాయి. ఇబ్బంది అంటే నెరేషన్ లోనే. దీనికి సంబంధించి నా కారణాలు నాకున్నాయి.

నా పాఠకులెవరు? నా పాఠకులు నన్నూ, నా కథల్ని ఎలా అంచనా వేస్తారు? నా కథల్లో పాత్రల్ని ఎలా అర్ధం చేసుకోగలుగుతారు? కథ చెప్పే ప్రాసెస్ లో నా పాఠకుల్ని గౌరవిస్తున్నానా లేదా? నా నెరేషన్, నా పాత్రల గౌరవానికి భంగం కలిగిస్తున్నదా? ఉన్నతీకరిస్తున్నదా? స్థూలంగా నేను కథ చెప్తున్నపుడు పాఠకుడు శ్రద్ధగా వినాలి. నా మాటే కదలకుండా వినాలి. అటు ఇటు జరిగేడా… నా స్వరంలో తేడాని సరి చేసుకోవాలి. ఇలాంటివన్నీ నాకు ఇబ్బంది పెడుతుంటాయి.

ఇప్పటి వరకు ”శిలకోల, ’గురి” రెండు కథా సంపుటులగానూ, దుర్ల’ కవితా సంపుటిగానూ ప్రచురించినా ”అడవిపూల దారిలో” పుస్తకం చిన్న కథలుగా రావడం అదొక ప్రత్యేక అనుభూతిని మిగిల్చింది. దానికి కారణం అవన్నీ నా కథాంశాలు. కాని పూర్తి చేయడానికి వీలు లేని కథాంశాలు. అందుకే వాటన్నింటినీ మ్యూజింగ్స్ అనొచ్చేమో! మా వూరి జ్ఞాపకాలుగా ఆ పుస్తకం నాకు ప్రత్యేకం.

ఇప్పుడు మా వూళ్ళు మా వూళ్ళులా లేవు. మా ఆట లేదు, మా పాట లేదు. మా పండుగలు లేవు, పంటల్లేవు, కందికొత్తల పండుగలు లేవు, మా థింసా నృత్యం లేదు. తుడుం డప్పులు లేవు.

అసలు మా వూర్లో మా మనుషులే లేరు. పనుల్లేక పొట్ట కూటికై వలస పక్షులై పట్టణాల వైపుకి ఎగిరి పోయేరు. ఉన్నదల్లా మందు, మార్కెట్టు. రాజకీయ పార్టీలు, సంక్షేమ పథకాల వల. ఇప్పుడు మా అడవికి మార్కెట్ మరింత దగ్గరయ్యింది. ఎక్కడో తయారైన సెల్ ఫోను, జీను ఫేంటు లాంటి ఆధునిక వస్తువులు నేరుగా మా ఊర్లోకి వచ్చేస్తున్నాయి, కానీ మా వూర్లో కాసిన పనస కాయ, సీతా ఫలాలు సంతకి చేరలేక ఇక్కడే కుళ్లిపోతున్నాయి. ఎందుకని?

మొన్నామధ్య మన దేశం అభివృద్ధి చెంది చంద్ర మండలానికి అవతల వైపు అడుగుపెట్టిందని ప్రధాన మంత్రిగారు ప్రకటిస్తూ చప్పట్లు కొట్టించేరు. అదే రోజు మా వూరి మిలంతి పురిటి నొప్పుల్తో ఆసుపత్రి చేరడానికి రోడ్డు లేక గెడ్డ అవతలే వుండిపోయింది. దేశమేమో అభివృద్ధిలో అకాశం దాటి చంద్రుడికి అవతల వైపుకి చేరిపోయింది. అదే దేశంలో ఉన్న మేము ఇంకా పురిటి నొప్పుల్తో గెడ్డ దాటలేక అవతలే ఆగిపోయేం. ఇదేమి అభివృద్ధి?

ఈ ప్రశ్నలే నా కథలు.

  *

జగదీశ్ మల్లిపురం

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.