నిశ్చయ

రాత్రంత, పొద్దున్నుంచి మల్ల మల్ల ఆ మాటే యాదికొస్తున్నది యాదమ్మకు-

‘‘నువ్వు నాకు ఉండు యాదమ్మా.. నీకు ఏ ఇబ్బంది లేకుంట సూసుకుంట. పిల్లల సదువుల కర్సు గుడ నాదే!’’ పెద్ద మేస్త్రీ ఎవరు లేంది సూషి అడిగిండు మెల్లగ.

ఏమనాల్నో పాలుపోక.. మాల్‌ ఏసిన జబ్బ ఎత్తుకొని ఎల్లిపోయింది ఆడ్నించి యాదమ్మ. బాగుండదని ఒకటి రెండుసార్లు అతని దిక్కు సూషింది, అతను తన దిక్కే సూస్తుంటే సూపు దించుకున్నది.

పొద్దుగూకాల పని దిగినంక కూలి పైసలు చేతిల పెట్టుకుంట, ‘ఏ విషయం రేపు పొద్దుగాల చెప్పు యాదమ్మ. మంచిగ సూసుకుంట నిన్ను. నన్ను నమ్ము’’ అన్నడు మల్ల.

ఆటోలాగే కాడికి జయమ్మ, ఎంకటమ్మతోని కలిసి నడిషి పిల్లల కోసం అరటిపండ్లు తీసుకుంది. ఆటో ఎక్కి ఇంటికొచ్చింది.

అప్పట్కే పిల్లలొచ్చి ఎదురుసూస్తున్నరు. తను రాంగనే ఉరికొచ్చి అల్లుకుపోయింది చిన్నది. పండుగాడు చేతిలున్న అరటిపండ్లు అందుకొని ఇంట్ల పెట్టి ఒకటి తీస్కొని తినుకుంట, ‘బడి నుంచి రాంగనే ఆకలేస్తుందమ్మా!’ అన్నడు.

‘అన్నం పెట్టుకొని తినకపోయినవ్‌రా’ అన్నది. ‘నాకా కూర వద్దు’ అన్నడు. ‘అన్ని తినాల్రా.. అదొద్దు ఇదొద్దు అంటే నీకు నచ్చేయే యాన్నుంచి వస్తయ్‌ చెప్పు’ అని ఆన్ని దగ్గరికి తీస్కొని తల నిమిరి ముద్దు పెట్టుకున్నది యాదమ్మ.

ఇంటెన్కకు పోయి కాల్లు చేతులు కడుక్కొనొచ్చింది. పిల్లలు హోం వర్క్‌ చేస్కుంటానికి కూసొని బడిల సంగతులు చెప్తుంటే ఇనుకుంట వంట పనిల పడ్డది. తిని కింద సాపేసుకొని పండుకున్నంక పిల్లల్ని దగ్గర్కి పొదువుకున్నది యాదమ్మ.

వాళ్లకు నిద్ర పట్టినంక పెద్ద మేస్త్రీ యాదికొచ్చిండు.

ఫస్టు ఫ్లోర్‌ల సద్ది ఇప్పుకొని తిన్నంక ఇసుకల ఒక కునుకు తీసింది. పక్కన జేరిండు మేస్త్రి. మెలకువొచ్చి బయంగ సుట్టు సూషింది. ‘ఎవర్లేరు. జయమ్మ గుడ ఇంటికి పొయ్యొస్తనని పొయింది.. తలుపు ఏసిన’ అన్నడు. రెండేండ్లాయె మగ సుకం లేక. కాదనలేకపోయింది..

ఎర్రగ బుర్రగ బానే ఉంటడు మేస్త్రి. మనిషి మంచోడే. ఎన్నాళ్ల నుంచో అడుగుతుండు గని ఇయాల దైర్నం చేసిండు. తృప్తిగ అనిపించింది. గనీ.. ఎప్పటికి ఉండు మంటె.. ఏం జెప్పాలె. నలుగుర్కి తెల్యకుంట ఉంటదా.. మజ్జానమే ‘జర ఓలతోని జెప్పకు. ఏతులకు బొయ్యేవు. నేనసొంటిదాన్ని కాను. నిద్రమత్తుల ఏమర్దం కాలె..’ అన్నది జర గట్టిగనే.

అప్పుడప్పుడు అనిపిస్తది, మగ తోడు లేకుంట బతుకెల్తదా? సైదులు సచ్చిపోయి రెండేల్లెల్లిన్నయి. ఒంటి సుకానికంటే ఓర్సుకుంటది గనీ తన ఒక్క దాని కూలి పైసలతోనే ముగ్గురం బతకాలె. ఎట్లనో ఏమో.. అన్న ఉన్నా బాగుండేది. పైసలకు అర్సుకునేటోడు. యాక్సిడెంట్ల సచ్చిపాయె. వదిన పిల్లలతోని అమ్మగారింటి కాడ ఉంటున్నది.

నాయన సచ్చిపోయినంక అమ్మ అక్కకు తోడుంటున్నది ఊర్ల. ‘అమ్మ! రారాదే, నా దగ్గర ఉందువు’ అంటే ‘బిడ్డా! రావాలనే
ఉంటది, గనీ నీ కూలి పైసలతోని నువ్వు నీ పిల్లలు బతుకుడే కస్టం. మల్ల నేను గుడ ఎందుకే ఆడ. ఈణ్ణంటే మీ అక్క, బావ ఉన్న రెండెకరాల ఎవసాయం చేస్కుంట బతుకుతున్రు. నేను ఆల్లకు తోడుండి పనులు సూసుకోవాల్నని మీ బావ అన్నడు. నువ్వే అప్పుడప్పుడు వచ్చి పోతుండే’ అన్నది. అమ్మకు ఊరొదిలిపెట్టి రావడం ఇష్టం లేదసలు అనుకొని ఊకున్నది తను.

సైదులు ఏసిన రెండు సిమెంటు రూములున్నై. ఇగ ఇక్కన్నే ఇట్లనే తన బతుకు అనుకొని ఎల్లదీస్తున్నది. అప్పుడప్పుడు పైసలకు కష్టమైతుంటది. పిల్లల డ్రెస్సులు, పుస్తకాలు, ఫీజులు, ఆటో కిరాయి ఇయ్యే ఎల్లడం కష్టం..

పక్కకు తిరిగి పండుకుందామని చూసింది యాదమ్మ. కండ్లు మూసుకోంగనే పెద్ద మేస్త్రీ కనిపించిండు. అవును, రేపేం చెప్పాలె. బానే ఉంటదా ఆయన్ని ఉంచుకుంటే..! యాడ కలుస్తం.. బండి మీద కూసొబెట్టుకొని ఇంటికి తీసుకొస్తే ఊర్లె, సందుల ఉన్నోల్లు సూషి ఏమంటరు? తను ముందుగాల ఆటోల, ఎనక బండి మీద మేస్త్రి వస్తే.. దొంగతనం లంజరికం దాగయంటరు. సూషినోల్లు ఏమంటరు? ఏమంటరు, ఇప్పుడేమన్న ఎవరన్న ఆదుకుంటున్నరా.. కష్టం సుకం అర్సుకుంటున్నరా..

ఈమజ్జె రాత్రిళ్లు నిద్ర పట్టనప్పుడు యాదికొస్తుండె మేస్త్రి. అందుకె ఇయాల కాదనలేకపోయింది. ఒప్పుకుంటే బానే ఉంటదేమో.. పైసలకు తనుకులాట ఉండదు. ఒంటి సుకం గుడ తీర్తది. మజ్జాన్నం ఎంత సుకమనిపించింది.

సైదులున్నప్పుడు ఫుల్లుగ తాగిండంటే సోయే ఉండకపోయేది. తనకు కావాలన్పిచ్చినప్పుడు ఎంత రెచ్చగొట్టినా పట్టిచ్చుకునేటోడు గాదు. పైంగ తాగుడెక్కువైనంక ఒంట్లె పట్టు తగ్గింది. దాంతోని ఇగ తనగ్గూడ ఇంట్రస్టు పోయింది. పిల్లలే లోకమైన్రు. ఇప్పుడు పిల్లలు పెరుగుతుంటే తనకు జరంత ఒంటి మీద సోయి పెరుగుతున్నది. ఎట్లనో ఏమో..

రంగు సామనసాయ అయినా తన మొకం కళగ ఉంటదంటరు. ఒంటి మీద కండ ఉందంటె ఎంటబడేటోల్లు ఎక్కువ. ఎంతమందొ ఆ వంకన ఈ వంకన పల్కరించి ఆఖరికి ఆ ముచ్చట తీస్తరు. గయ్యిన లేస్తది తను, ఆళ్లు బెదిరిపోయి మల్ల తన వంక సూడరు. పక్క సందు సాయిగాడు తన కన్నా చిన్నోడే, ఒకటే సూస్తుంటడు, వదినా వదినా అని పల్కరిస్తుంటడు. ఒకరోజు ఇంట్లకు రాబోతే మొఖం మీదనే తలుపేసింది. ఇగ అప్పట్సంది సరిగ మాట్లాడ్తలేడు…

పెండ్లయి ఇద్దరు పిల్లలు పుట్టిందాంక మంచిగనే ఉండేటోడు సైదులు. అటెంకనే తాగుడెక్కువైంది.
ఆఖరి ఆర్నెల్లయితె నరకం చూసింది తను..

**
ఒకరోజు పొద్దుగూకాల్నే పుల్లుగ తాగి వచ్చిండు సైదులు. వస్తుంటే సందు మొదుగాల సాయిగాడు కనిపించిండంట. సైదుల్ను సూడంగనే ఆడు చట్ట చట్ట ఎల్లిపొయిండంట. వచ్చి యాదమ్మను యియ్యరమయ్యర కొడతనే ఉండు సైదులు. తనేదో పని చేస్కుంటున్నదల్ల ఏమర్దం గాక పరేశానయ్యింది. ‘ఆడెందుకే నన్ను సూషి ఉరుకుతున్నడు’ అంటడు.

‘ఏ.. నీకు తిక్క తిక్కగుందా.. బాడ్‌కావ్‌.. పొద్దుగూకేతలికి పుల్లుగ తాగొచ్చింది గాక కొడుతున్నవేందిరా శాతగాని ముండాకొడకా! ఆడెవడో నిన్ను సూషి ఉరికితే నన్ను కొడతవేందిరా..’ అని తిట్లందుకుంది యాదమ్మ.

సైదులు ఉరికురికి కర్ర ఎతికి కొట్టబట్టిండు. రెండు దెబ్బలు గట్టిగనే పడ్డయి యాదమ్మకు. మర్లబడ్డది. గోలగోల.

సుట్టుపక్కల మొగోల్లు గుమిగూడిన్రు గనీ ఆపుతానికి ఎవలొస్తలేరు. వస్తె యాడ అనరాని మాట అంటడో, మొగుడు పెళ్లాల కొట్లాట మజ్జెలకు పోవద్దని ఆల్లు దూరం నుంచే సూస్తున్నరు.

అంతల పక్కింటి ముసలవ్వ వచ్చి గేట్ల నిలబడి ‘దాన్ని సంపేటట్లున్నడే.. ఓ జయమ్మ, ఎంకటమ్మ జర రారి..’ అని కూతేసింది. ‘ఓరి సైదిగా.. లంగ గాడ్ది! దాన్ని కొట్టి సంపుతావ్‌రా..’ అని తిట్టబట్టింది. అమ్మలక్కలు ఉరికొచ్చి సైదులు చేతిల్నుంచి కర్ర గుంజి గోడవతల పడేసి నాలుగు మాటలని ఊకుండబెట్టి జరసేపుండి పోయిన్రు.

యాదమ్మ ఏడ్సుకుంటనే గిన్నెలు ఎత్తేసుకుంట పనులు చేసుకుంటున్నది. పిల్లలు జడుసుకుని ఏడ్సుకుంట మూలలకు నక్కిన్రు.

సైదులు సోలుతున్నడు. బూతులు తిడుతున్నడు. ఇంటి సుట్టు తిరుగుతున్నడు.

పిల్లలకు అన్నం పెట్టింది యాదమ్మ. పిల్లలు గబగబ తిన్నరు. తనకు తినబుద్ది కాలేదు. పక్కేసి పిల్లల్ని దగ్గర్కి తీస్కొని పండుకున్నది.

అన్నం పెట్టవానే? అంటున్నడు సైదులు. ముద్ద ముద్దగ ఒస్తున్నై మాటలు. నీతల్లి, సంపుత ఏమనుకుంటున్నవో అంటున్నడు. నోటికేదొస్తె అది తిడ్తున్నడు. పిల్లలు తల్లిని కర్సుకొని పండుకున్నరు. సన్నగ ఒనుకుతున్నరు. దుక్కం తన్నుకొచ్చింది యాదమ్మకు. ఈడు సస్తనన్నలేడు అనుకుంది మనసుల.

ఇట్ల తాగుడెక్కువై గొడవ చేసినా సమ్జాయించి గింత అన్నం తినిపించి నిద్రపొమ్మనేది షానాసార్లు. ఇయాల కర్ర దెబ్బలు పడి ఈపు, బుజం నొప్పి పెడుతున్నయి. మనసుల మంటగుంది. అన్నం పెట్టవానే అని మల్ల అడిగినా సప్పుడు జెయ్యకుంట కండ్లు మూసుకున్నది. గిన్నెలెత్తేసిండు. పిల్లలు జడుసుకుని మరింత కర్సుకుని పండుకున్నరు. అటుపక్కన ఒరిగి కిందనే పండుకున్నడు. మత్తుల ఏందేందో ఒర్లుతున్నడు.

ఆ రాత్రంత నిద్దర పట్టలేదు.. ఏం జెయ్యాల్నో ఎట్ల జెయ్యాల్నో తోస్తలేదు యాదమ్మకు. ఎంతజెప్పినా ఇనడు. పొద్దటీలి సరేనంటడు. పొద్దుగూకేసరికి తాగి ఊగుకుంట వస్తడు. బతుకు యాష్టకొస్తున్నది యాదమ్మకు.

కొన్నాళ్లకు సైదులు పానం కరాబైంది. దవాకానకు పోతే లివర్‌ పాడైందన్నరు. జాయిన్‌ జేసుకున్నరు. ఆపరేషన్‌ జెయ్యాలన్నరు. మందులకు పై కర్సులకు పైసలు కావాలె. అస్సలు లేవు. ఇంటికాడ పిల్లలు. ఇంటికొచ్చి గోడకు కూలబడ్డది. ఏం జెయ్యాల్నొ తోస్తలేదు. ఆల్లీల్లు ఒచ్చి సైదులు కెట్లున్నదని అడిగి పోతున్నరు.

ముసలవ్వ వచ్చి అన్నది, ‘యాన్నన్న అప్పోసప్పో చెయ్‌ బిడ్డా! తొండోడో మొండోడో మగ తోడుండాలె. లేకుంటే సుట్టు మగగద్దలు పొడుసుకు తింటరు. దవాకాన్ల పడ్డడు గద, ఆడు గుడ ఈపాలి సక్కగైతడేమో..’ అన్నది.

యాదమ్మ కెందుకో సైదులు మీద నమ్మకం పోయింది. ఎన్ని తీర్లుగ చెప్పి చూసిందో.. బంగారమసొంటి పిల్లలున్నరయ్యా.. నువ్వీ తాగుడొక్కటి తగ్గిచ్చినవంటే ఇద్దరం పనిజేస్కుంట పిల్లల్ని మంచిగ సూస్కుంట, సదివించుకుంట సుకంగ బతకొచ్చు అని ఒక్క తీర్గ చెప్పినా ఇంటున్నడా.. పైంగ రాత్రిల్లు నిమ్మలం లేకుంట జేస్తుండె. ఎట్లబడితె అట్ల కొట్టుడొకటి షురు జేసిండు. దాంతో మనసిరిగింది సైదులు మీద. బలంగ ఎట్లుండేది తను. బొక్కలు తేలినయ్‌.

ఇప్పుడు తెల్ల రేషన్‌ కార్డు మీద సర్కారు దవాకానల ఆపరేషన్‌ చేసినా ఆల్ల కీల్లకివ్వాలె. మందులు బైటినుంచే తెచ్చుకొమ్మంటరు. పైన అవో ఇవో కర్సులుంటై. ఎట్లేదన్న ఇరవై వేల దాంక అయితయంట. అప్పు జెయ్యాలె. తీర్చగలుగుతమా అంటే సైదులు తీరు సూస్తె నమ్మకమనిపిస్తలేదు. షానసేపు ఆలోచించింది..

లేషి గబగబ ఊర్లెకు పోయింది. పెర్కోల్ల మల్లయ్య కాడికి పోయి విషయం చెప్పి అప్పు కావాలన్నది. మల్లయ్యకు పైసలు తిరిగొస్తయని నమ్మకం కలగక లేవన్నడు. జర సూడరాదన్నా అని బతిమాలినా లెవ్వన్నడు. బాగ్యమ్మ కాడికి పోయింది. అయ్యో బిడ్డా నిన్ననే ఇరవై ఏలుంటే గా సాకలి బిచ్చమయ్యకు ఇచ్చిన్నే అన్నది.

మనసు వద్దంటున్నా దుక్నం మారయ్య కాడికి పోయింది. ‘ఏం యాదమ్మా! సైదులు బతుకుడు కష్టమే నంటున్నరేందే’ అన్నడు. ‘అట్లంటవెందుకు గనీ ఇర్వై వేలు మిత్తికి యియ్యయ్యా! ఆపరేషన్‌కు కావాలె’ అన్నది యాదమ్మ.

ఇంట్ల దిక్కు సూషి బార్య లోపలర్రల ఉందని నిర్ధారించుకున్నంక గొంతు తగ్గించి అన్నడు మారయ్య, ‘ఇస్త గనీ, సైదులు బతికితె సరే.. లేదంటె ఎట్ల తీరుస్తవు? నాకు ఉంటవా మరి.. ఉంటే నువ్వు తీర్చకున్నా పర్వాలేదు’ అన్నడు. ఓకరొచ్చింది యాదమ్మకు, ‘థూ.. నీ బతుకు చెడ.. అద్దంల మొకం జూస్కున్నవార ఎన్నడన్న. సిగ్గన్న ఉండాలె ఇట్ల అడుగుతానికి.. ఇజ్జత్ తక్వ బాడ్ కావ్!’ అనుకుంట ఎనక్కు మల్లింది.

ఇంటికొచ్చి వంటజేసి పిల్లలకు బెట్టి తను గింత తిని సద్ది కట్టుకొని పిల్లల కాడ జర పండుకొమ్మని పక్కింటి ముసలవ్వకు జెప్పి దవకానకు బయల్దేరింది. పొద్దున ఆపరేషన్‌ చెయ్యాలన్నడు డాక్టర్‌.

బావకు ఫోన్‌ చేసింది. నేనే అప్పుల్ల బడ్డ. అడిగితె ఎవడిచ్చేటోడు గుడ లేడు అన్నడు.

ఇంటి కాయితం పెడితే ఎవరన్న ఇస్తరేమో నన్నడు పక్కింటి జానయ్య. మనసొప్పలేదు యాదమ్మకు. ఇగ ఎవరితోని ఏం జెప్పలేదు. ఎవరినేం అడగలేదు. మనసు గట్టి జేస్కున్నది…

**
తెల్లారి లేషిన కాణ్నుంచి మేస్త్రి మాటలు యాదికొస్తనే ఉన్నై. పిల్లలకు వండి పెట్టి టిఫిన్లు కట్టి తను గుడ సద్ది కట్టుకుంది. పిల్లల్ని ఆటో ఎక్కించినంక ఇంట్లకొచ్చి ఎటు తోయక కూలబడ్డది గోడకు. ఎందుకో ఏడుపొచ్చింది యాదమ్మకు. ఏంది తన బతుకు.. ఇంటిని, ఒంటిని పట్టించుకునేటోడు అన్యాయం చేసి పాయె! అనుకుంటే మరింత దుక్కమొచ్చింది. జరసేపు ఏడ్షి ముక్కు షీది లేషి మొఖం కడుక్కున్నది. పనికి పోదామని తువాల బుజం మీదేసుకొని సద్ది అందుకుంది. మేస్త్రి కేం చెప్పాలె అనిపించింది ఒక నిమిషం. సద్ది ఆడ పడేసి తువాల దండెం మీద ఏసి సాపేసుకొని ముడుసుకొని పండుకున్నది.

కండ్లు మూసుకుంటే, ‘ఏమంటవ్‌?’ అని మేస్త్రి అడుగుతున్నట్లనిపిచింది. తను ఇట్లనే ఇంట్ల పండుకుంటే మేస్త్రి వచ్చి అల్లుకుపోతడు గదా! అనుకుంటే మనసు కేదేదో అయితున్నది. ఎల్లకిల తిరిగి ఫ్యాను దిక్కు సూస్కుంట ఆలోచన్ల పడ్డది.
తనేం చెయ్యాల్నో.. ఏది మంచో ఏది చెడో చెప్పేటోల్లేరి. తనే నిశ్చయించుకోవాలె ఏ విషయమైన. పిల్లల మొఖాలు యాదికొచ్చినై. ఆళ్లు తన పానం. ఇద్దరు సదువుల షానా ఉషారు. ఎన్ని ముచ్చట్లు చెప్తరో.. పండుగాడు ఇప్పట్సందే పనులు పంచుకుంటుంటడు. వాడికి రెండు జతలే అయిపోయింది డ్రస్సు. బట్టలు గుడ ఎక్కువ లేవు. రేపు బడికి పోతానికి గుడ ఉతికి లేనట్లుంది అని యాదికి రాంగనే లేషింది. మాసిన బట్టలు ముగ్గురివి తీసి నానబెట్టింది. ఇల్లు జర సర్ది బట్టలు పిండి జాడించి ఎండేసింది.

అంతల పక్కింటి ముసలవ్వ ఒచ్చింది ‘పనికి పోలేదేందే యాదమ్మా!’ అనుకుంట. ‘పోలేదవ్వా.. ఇయాల షాతకాలేదు’ అన్నది యాదమ్మ.

‘ఎట్ల బిడ్డా.. షాత కాలేదని ఊకుంటే, ఊకూకె పని దొరకొద్దు.. పని దొరికినప్పుడే పోవాలె బిడ్డా! మల్ల మేస్తిరి ఇంకోలనన్న పెట్టుకుంటే!’ అన్నది.

అవును, ఇంకోలనన్న సూస్కుంటే?! అనిపించింది ఒక నిమిషం. నవ్వొచ్చింది యాదమ్మకు. తనే నచ్చితే కాచుకునుంటడు, లేదంటే పోనియ్యి అనుకుంది.

అదో ఇదో మాట్లాడి పోయింది ముసలవ్వ. ఎన్నాల్ల నుంచో చెయ్యకుంట ఉన్న పనులు చేసుకుంట చినిగిన పిల్లల గుడ్డలు తీసి, తనదో రైక గుడ్డ ఉంటే తీస్కొని మిషిన్‌ కుట్టే శంకరమ్మ కాడికి పోయింది. జరసేపు ముచ్చట పెట్టి వచ్చింది.

పిల్లలు తింటానికి ఏం చెయ్యక షాన్నాళ్లాయెనని యాదికొచ్చింది. బయట కట్టెల పొయి ఎలిగించి అప్పలు, షోబిల్లలు చేసింది.

పొద్దుగూకాల ఆటో దిగిన పిల్లలకు ఎదురుంగ అమ్మ కనిపించేసరికి ఎక్కడ్లేని హుషారొచ్చింది. తల్లిని సుట్టుకుపొయిన్రు.
పిల్లలు కాల్‌చేతులు కడుక్కున్నంక అప్పలు, షోబిల్లలు పెట్టింది. ఆల్లు మస్తు కుష్షయి తిన్నరు.

చీకటి బడే యాలకు జయమ్మ వచ్చింది. ‘ఏం పొల్లా! ఇయాల పనికి రాకపోతివి?’ అన్నది.
‘రాబుద్ది కాలేదక్క. ఇంట్ల పనులుంటే చేస్కుంట ఉండిపొయిన..’

పిల్లలు ఆడుకుంటానికి పోయిన్రు.

మెల్లగ మేస్త్రి ముచ్చట తీసింది జయమ్మ, ‘మేస్త్రి యాజ్జేసిండు గదనే.. నిన్న అడిగిండంట గదా.. ఏం జెప్పకపోతివని ఇయాల ఒకటే సూషె నీకోసం. నన్నడిగిండు. యాదమ్మ ఎందుకు రాలేదని. ఏమో మేస్త్రి.. నాకు జర ఆలిషెమయ్యేతలికి ఉరుక్కుంట వస్తి అన్న.’

‘ఇంకా ఏమన్నడక్కా!’ అన్నది బట్టలు మడతబెట్టుకుంట.
‘ఒప్పుకోరాదు పిల్లా! మంచోడే గదా.. బాగుంటడు. ఎందరు ఎంటపడ్డా పోడు తెల్సా. నియ్యతి ఉన్నోడు. మనకు ఏనాడన్న పైసలు తక్కువిచ్చుడు గాని, గట్టిగ కోప్పడుడు గాని చేసిండా చెప్పు..’
‘అది కాదక్కా! నేనెటూ తేల్చుకోలేక పోతున్న. ఏం చెప్పాల్నో తెల్యకనే ఇయాల రాబుద్ది కాలేదు.’

‘ఏముంటదే.. సాటుంగ అన్నీ కానియ్యాలే.. ఎవరు సొక్కం జెప్పు. ఎందరు ఎందరికి అలవాటు కాలేదు. మనకు తెల్యని ముచ్చటా.. మీ ఆయనేమో 30 ఏండ్లు గుడ నిండకుంటనే నిన్ను ముండమోపిచ్చే. ఇగ బతుకంత మగ సుకం లేకుంట ఎట్లుంటవే. ఒప్పుకో.. నమ్మకస్తుడు. నిన్ను అన్ని ఇదాలుగ అర్సుకుంటడు. నాకైతే మీ జంట బాగుంటదనిపిస్తుంది..’

‘ఏమో అక్క! ఆని కాడికైతె పోతవు, నాకాడికెందుకు రావు అని రేపింకొకడు ఎంటపడడా? ఆలోసిద్దామక్కా! ఆత్రమేందంట ఈయనకు, ఇన్రోజులు ఆగలేదా..’ అన్నది.

‘ఇగ నీ యిస్టమే. నేన్‌ బోతున్న. ఇంట్ల షానా పనుంది’ అనుకుంట ఎల్లిపొయింది జయమ్మ.

జరసేపు ఆలోచించి బట్టలు దుగిట్ల పెట్టి, పక్క సందులున్న గొల్లోల్ల సైదవ్వ ఇంటికి పోయింది యాదమ్మ,

‘అవ్వా! కోడిపెట్టేమన్న ఉందా.. పిల్లలు తినక షాన్నాల్లాయె’ అనడిగింది.
‘నాటు కోడి దర పెరిగింది గదనే యాదమ్మా.. కిల 350 అంట’ అన్నది సైదవ్వ.
‘అయితెమాయె తీ.. ఉంటే పట్టియ్యి’ అన్నది యాదమ్మ.

ఇంటెన్కకు పోయి మూసిన గంపల్నుంచి ఒక గుడ్లకొచ్చిన పెట్టను పట్టుకొచ్చింది సైదవ్వ.

‘రెండ్రోజులే ఆయె గుడ్లు పెట్టబట్టి. ఇగ నువ్వు అడక్కడక్క అడిగినవని పట్టుకొచ్చిన.. ఓరి, కిరన్‌గా! యాదమ్మ ఎంట బోయి ఈ కోడిపెట్ట ఎంత బరువుంటదో సూషి ఎంతైతదో షికెన్‌ షాపు మల్లయ్యను అడిగి రాపో’ అన్నది.

కిరన్‌ ఎంటరాంగ రోడ్డు మీదికి పోయి జోకిచ్చి కోయించి ముక్కలు కొట్టిచ్చుకుని వచ్చింది యాదమ్మ. ఉప్పు కారం మంచిగ ఏసి కమ్మగ వండింది.

పిల్లలు ఎగిరి గంతేసిన్రు. కమ్మగ తిన్నరు. తిన్నంక అన్ని సర్దిపెట్టి పిల్లల్ని దగ్గర్కి తీస్కొని పండుకుంది యాదమ్మ. ఈ రెండేండ్లల్ల తను, పిల్లలు జర కండబట్టిన్రు. ఉన్నంతల నిమ్మలంగుంటున్నరు. సైదులు ఉన్న రోజుల్ల షానాసార్లు ఇట్ల నిమ్మలంగ పండుకుంటానికి గుడ ఉండేది కాదు.
**
పొద్దున్నే లేషి ఆలోచించుకుంటనే పనిల బడ్డది యాదమ్మ.
సైదులు సచ్చిపోయినంక అమ్మతోబాటు అమ్మలక్కలు ‘ఇరవై ఆరేండ్లే గదా, మారుమనువు పోతవా బిడ్డా!’ అని అడిగిన్రు. ‘నా పిల్లలు ఆగమైతరు. నేనెవర్నీ చేస్కోనిగ’ అని నిశ్చయంగ చెప్పిన సంగతి యాదికొచ్చింది యాదమ్మకు.

మనసుకేదొ తట్టినట్లయి, తోముతున్న గిన్నెలు ఆడ పడేసి చేతులు కడుక్కొని గొల్లోల్ల బజారుకు పోయింది. మేస్త్రి నర్సిమ్మను కలిసి మాట్లాడి ఒచ్చి, మల్ల పనిల బడ్డది.

అంతల పండ్ల పుల్లేసుకొని జయమ్మ ఒచ్చింది.
‘ఏమె యాది! ఏమాలోచించినవే?’ అన్నది మురిపెంగ.
‘నాకన్నెక్కువ నీకే తొందరున్నట్లుందేందక్కా!’ అన్నది నవ్వుకుంట యాదమ్మ.
‘ఏ.. అదేం లేదే.. నువ్వేమాలోచించినవో.. ఇయాల ఏం జెప్తవో మేస్త్రికని అడగాలనిపించిందిలే’ అన్నది జయమ్మ.

‘అక్కా! అన్నిటికన్నా నాకు నా పిల్లలే ఎక్కువ. ఇయాల నా ఒంటి సుకం సూసుకున్నననుకో.. రేపు నా పిల్లలు పెద్దగయితుంటే  మీ అమ్మ పలానోన్ని ఉంచుకున్నదని ఎవరన్న అంటే ఆల్లు మొకాలు యాడ పెట్టుకుంటరు? ఎంత బాద పడ్తరు చెప్పు! ఆల్ల పసి మనసులకు ఆ కష్టం రాకూడదక్కా! నా సుకమే ముక్యమనుకుంటే మారుమనువు చేసుకోకపోదునా..! నా పిల్లలు తల ఎత్తుకుని బతకాలక్కా! ఆల్ల కోసం ఎన్ని కష్టాలైనా పడతా! గనీ ఉంచుకున్నోని సొమ్ముతోని ఆల్లను సాకిన్నన్న పేరొద్దక్కా..’ అంటుంటే దుక్కమొచ్చింది యాదమ్మకు.

జయమ్మకు ఏం పాలుపోలేదు. ‘సరేలేవే.. నీ యిష్టం.. నీ కష్టం. పనికైతె వస్తున్నవు కదా!’ అన్నది.

‘ఇగ ఆ మేస్త్రి కాడికి రానక్క. ఇయాల్టి నుంచి మేస్త్రి నర్సిమ్మన్న కాడికి పనికొస్తనని చెప్పొచ్చిన’ అన్నది యాదమ్మ.

ఇంకింత పరేషానైంది జయమ్మ. జరసేపు నిలబడిపోయి ఆలోచించుకుంట పండ్లు తోముకుంట మెల్లగ ఎల్లిపోయింది.

పిల్లల్ని బడికి పంపి తను సద్ది కట్టుకొని మేస్త్రి నర్సిమ్మ కాడికి పనికి బయలుదేరింది యాదమ్మ.

*

 

స్కైబాబ

12 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • Commentఆత్మగౌరవం తో జీవించే ఎందరో యాదమ్మ లకు‌.. శతకోటి వందనాలు 🙏🙏 గ్రామీణ జీవితంలో ఇలాంటి పరిస్థితుల్లో కొందరు లొంగుతారు కొందరు యాదమ్మ లాగే నిలబడి గెలుస్తారు‌..కథ ను నడిపిన తీరు బాగుంది రచయిత కు హృదయపూర్వక శుభాకాంక్షలు 💐💐🤝🤝

 • గుండె సడినీ.. కంటి తడిని ఏకం చేసిన కథ.
  ఒంటరి స్త్రీ జీవిత సంఘర్షణను వాస్తవిక కోణంలో ఆవిష్కరించారు. బతుకు పోరాటంలో తానేదుర్కునే అనేక సంఘటలను కళ్లముందుసాక్షాత్కరింప చేశారు. చివరాఖరుకు ఇద్దరు పిల్లల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు తను సరైన నిర్ణయం తీసుకునేలా గొప్ప ముగింపు నిచ్చారు.
  చాలా రోజుల తర్వాత పల్లెచుట్టు అల్లుకున్న జ్ఞాపకాలను,మనుషులను,గుర్తు చేసింది మీ కథ.చాలా చాలా బాగుంది సర్ అభినందనలు
  …ఆది ఆంధ్ర తిప్పేస్వామి

 • పేరు కూడా కతకు సరిపడా భాష లో పెట్టుంటే బాగుండు.

 • మంచి కథ. 99% ఉమెన్ ఇలాగే ఉంటారు. అందుకే కుటుంబాలు భద్రంగా ఉన్నాయి. ఇంట్లో ఆర్థిక ఒడుదుడుకులు, అనారోగ్యాలు, చివరికి ప్రక్రుతి వైపరీత్యాలు, చావులు వీటివల్ల వచ్చే ఇబ్బందులు అన్నీ ఆడవాళ్ళ నెత్తిమీద పడి వాళ్ళ కష్టాలకు కారణమౌతాయి.

 • బాగుంది. ఎత్తుగడ బాగుంది, కథా గమనం బాగుంది, నడిపించిన తీరు బాగుంది, మొత్తంగా కథ చదివించేలా సాగింది. ముగింపు చాలా బాగుంది. రచయిత పేరుకు తగ్గట్టుగా…శిఖరాన్ని తాకింది యాదమ్మ నిర్ణయం!ఆత్మగౌరవానికి, బాధ్యతకు ప్రతీకగా నిలిచింది. రచయితకు అభినందనలు.

 • యాదమ్మ గెలిచన కథ అన్న ఎందరికో స్పూర్తి కవాలి.మీ రచన విభన్నంగా ఉంది శుభాకాంక్షలు

 • Mana chuttu jaruguthunna yenno kathale ee Katha. Raasina vidhanam , bhasha, yaasa Anni bagunnayi . Mukyamga yadamma nirnayam alanti inkendhariko ontariga bhathike dhairyanni isthundhi.

 • కథ నడిపిన తీరు బాగుంది, ఆసక్తిగా చదివించింది కానీ,
  మేస్త్రీకి ఒకసారి లొంగిపోయిన యాదమ్మ అప్పుడు ప్రతిఘటించకుండా తర్వాత గొప్ప నిర్ణయం తీసుకోవడం వాస్తవికంగా లేదు.
  కేవలం ఇంటికి వేస్తేనే తప్పయినట్టు, చాటు మాటుగా అయితే పర్వాలేదన్నట్టు అనిపిస్తుంది. ఇది స్త్రీల ఆత్మగౌరవాన్ని బలహీనపరచినట్టే!

 • ‘నిశ్చయ’ కథ చదివి స్పందించిన మిత్రులకు బహుత్ షుక్రియా!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు