జనులున్నంతకాలం జి.వై.గిరి

ఇంట్లో నాన్న పాటలు, నాన్న సేకరించిన అద్భుత గ్రంథాలు అమ్మతోపాటు చదువుకుంటున్న నాకు, సులభశైలిలో నాన్నలాగ పదాలతో పఠాకత్తులను ప్రయోగించగల శక్తివంతమైన కవి జి.వై.గిరిగారు మా ప్రాంతీయవాసి కావడం నాకు కొంత ఉత్సాహం కలిగించింది.

నాకు ఊహ తెలిసేప్పటికే జి.వై.గిరి గారు కవి, గాయకుడు, నటుడు, జనకళా ప్రదర్శనకారుడు. ఆయన వందల పాటల్లో నన్ను తొలిసారి అచ్చెరువు కలిగించిన తన పాట ‘మారాలి మన సమాజము.. మారాలి మారాలి మన సమాజం’ మరీ ముఖ్యంగా….

‘ఎవరిదీ ఎక్కువ కులము ఎవరిదీ తక్కువ కులము…’

ఇందులో కులాలు పాటించే అనేకులు పూజించే పౌరాణిక పాత్రల జీవన విశేషాలను ఉపమిస్తూ ఆయన కులభేదాలను, కుల వివక్షతలను సత్కారికంగా పాటతో ఖండించడం, గర్హించడం నాలో ఒక కొత్త చైతన్యం కలిగించింది.

ఇలా పౌరాణిక పాత్రల తీరుతెన్నులను తనకనుకూలంగా మలుచుకొని విజృంభణం చేసిన కవి శ్రీశ్రీ…

‘ఇంద్రదేవుని మదపుటేనుగు ఘీంకరిస్తూ సవాలు చేసింది

యముని మహిషపు లోహఘంఠలు

మబ్బుచాటున ఖణేల్మన్నాయి’

ఇవి అప్పటికి కంఠదఘ్నంగా చదువున్న నాలో చాలా సులభరీతిలో (శ్రీశ్రీది సులభశైలి కాదు కాస్త పాండితీశౌండిర్యంతో వుంటుంది)

జి.వై.గిరి ‘మన విశిష్ఠుడు మాల కన్యను పెళ్ళియాడెరా’ ఇలా రచనలో బాలకులమైన మాలాంటివారికి ఒక కొత్త పంథా స్ఫురింపచేసింది.

ఇంట్లో నాన్న పాటలు, నాన్న సేకరించిన అద్భుత గ్రంథాలు అమ్మతోపాటు చదువుకుంటున్న నాకు, సులభశైలిలో నాన్నలాగ పదాలతో పఠాకత్తులను ప్రయోగించగల శక్తివంతమైన కవి జి.వై.గిరిగారు మా ప్రాంతీయవాసి కావడం నాకు కొంత ఉత్సాహం కలిగించింది. ఆ తర్వాత జి.వై.గిరిగారు మా ఇంటికి వచ్చి నాన్నను కలవడం తన కొత్త పాటలు వినిపించడం మేమంతా కలిసి భోంచేస్తూ ప్రజాగీతాల సాహితీ లోతుపాతులు చర్చించుకోవడం నాకు బాగా జ్ఞాపకం వుంది.

అలాంటి సందర్భంలో మాభూమి సినిమాలో ‘పల్లెటూరీ పిల్లగాడ’ నాన్న పాట పాడిన సంధ్యను జి.వై.గిరిగారే తొలిసారి మా ఇంటికి తీసుకువచ్చారు. అప్పుడే మానాన్న ‘పల్లెటూరీ పిల్లగాడ’ పాట వారికి వినిపించారు. అక్కడే సంధ్య ఆ పాటను రాసుకు వెళ్ళింది.

ఇలాంటి సందర్భాలలో నేను ఒకసారి జి.వై.గిరిగారికి నేను రాసిన ‘నిరుద్యోగి’ ఏకపాత్ర నటించి చూపించాను. ఆ ఏకపాత్ర చివరిలో గుండె ఆగి మరణిస్తుంది. అప్పటికే ప్రజాకవిగా, అభ్యుదయ రచయితగా ధిక్కార కళాకారుడిగా ప్రజాబాహుళ్యంలో ప్రఖ్యాతిగన్న జి.వై. గిరిగారికి ఆ ముగింపు నచ్చలేదు.

‘నో… అశోక్.. నిరుద్యోగి చనిపోవద్దు. తిరుగుబాటు చేయాలి. నిరుద్యోగుల నాయకుడై ప్రభుత్వాన్ని కదిలించాలి’ అన్నాడు. నేను… కాని ఆ మరణ సన్నివేశంలో నేను ఎన్నుకున్న నటనా విన్యాసం నాకు అనేక బహుమతులు తెచ్చి పెట్టింది. అందుకని నేను ఆ సీన్ తీసేస్తే నా సంచలనాత్మక నటనా ప్రదర్శన మిస్ అవుతాను… ఎలా? అన్నాను. జి.వై.గిరిగారు నవ్వి ఓహెూ అదా అయితే ఇలా చెయ్.. ఆ సన్నివేశం నటించి పడిపోయి, తిరిగి లేచి నేనెందుకు మరణిస్తాను… లేదు… వేలాది నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తాను. ఈ గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిస్తాను.. ‘నిరుద్యోగులారా ఏకంకండి! పోరాడితే పోయేదేం లేదు… సంకెళ్ళు తప్ప’ అని ముగించు అన్నారు. ఆయన స్ఫూర్తిదాయకమైన సూచనను, ఆయన ప్రతిభగల ఆలోచనకు ఆశ్చర్యపోతూ సహృదయంతో సరే అన్నాను. ఆ తర్వాత తను చెప్పినట్టే చేసేవాణ్ణి. ఇది జి.వై.గిరిగారితో జరిగింది. ఎప్పటికీ మరచిపోలేనంతగా మనసులో నిలిచిపోయింది.

జి.వై.గిరిగారు ‘ప్రజానాట్యమండలి, శాంతి సంఘం, అరసం… ఇలా పలుచోట్ల కనిపించేవారు. ఆయన ‘ధర్మవడ్డి’ చలనచిత్రానికి ఒకపాట రాసినట్టు కూడా పత్రికలలో చదివి ‘సినీ కవిగా కూడా చరిత్ర సృష్టించాలి’ అనేవాణ్ణి తనతో. కానీ, ఆయన సినీరంగంలో కొనసాగలేదు. ప్రజారంగంలో ‘చదువు’ వెలుగు కార్యక్రమంలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఎన్నో సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ఎన్నో జానపద కళారూపాలతో జీవితాంతం కొనసాగిన గొప్ప కవి, కళాకారుడు.

ఆయన రచలన్నీ సేకరించి కొడుకు కృష్ణ ఒక యజ్ఞంలా ప్రచురణ చేయడం ఎంతో సంతోషంగా వుంది. తండ్రిని నీవు ఎంత సంపాదించావు, ఎంత మిగిలించావు. మాకు ఎంత పంచావు అని నిర్ధాక్షిణ్యంగా దూషిస్తున్న కాలంలో ఇలా కన్నతండ్రిని ఈతరానికి పుస్తకరూపంగా పరిచయం చేయడం ఒక ప్రజాకవి కొడుకుగా అభినందిస్తున్నా. ఇద్దరం ప్రజాకవి పుత్రులం అని గర్విస్తుంటాను. ఆయన పాటలు ఈతరం వాళ్ళు కూడా వేనోళ్ళతో పాడుకోవాలని కోరుకుంటున్నాను. ‘సుకవి జీవించు జనుల నాలుకలందు’ అని జాషువా అన్నట్టు జనులున్నంతకాలం జి.వై.గిరి ఉంటారు. కృష్ణకు అభినందనలు.

*

సుద్దాల అశోక్ తేజ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.