చున్నీ కింద..

వును,
చున్నీ ఎరగని, నా చుడీదార్ కింద రొమ్ములే ఉన్నాయి!

ఆడది తారసపడగానే
రతిక్రీడ తప్ప మరో ఆలోచన చేయలేని
పశువుకు మాత్రమే కనిపించే రొమ్ములు!
వ్యక్తిని, వ్యక్తిత్వాన్ని చూడలేని
గుడ్డి వెధవను మాత్రమే ఆకర్షించే రొమ్ములు!!
అంగస్తంభనలు ఉడిగిపోయిన వాడికి కూడా
భావప్రాప్తిని అందించే రొమ్ములు!!

నావైన చైతన్యాలు.. ఊపిరాడనివ్వని కార్య భారాల మధ్య
నా దృక్కులలో ఏ ప్రత్యేక విలువనూ సంతరించుకోక..
నా చేతలలో ఏ కొత్త గౌరవమూ పొందలేక..
నా పొగరులో ఏ కొంత గర్వమూ జతచేయలేక..
నా అశ్రద్ధకు పాత్రమైన- అవే రొమ్ములు
పదిలంగా అలాగే ఉన్నాయి!

హిజాబ్ మాటున దాగిన మొహం లాగా..
పైటముసుగులో ఒదిగిన సిందూరపు శిరసులాగా..
బురఖా చాటున లుప్తమైపోతున్న శిథిల శరీరంలాగా..
వాటికి ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చే కోరికే లేదు నాకు!
చేతి వేళ్లు.. నడిచే కాళ్లు..
ముక్కు చెవులూ.. దాగని కనుల లాగా
అది కూడా ఒక మామూలు అంగమే నాకు
ఆ రొమ్ములను,
దాచడం, కప్పడం గురించిన ప్రసక్తి ఎందుకు??

వాటి స్పృహే లుప్తమైన నా వస్త్రధారణలో
చున్నీతో కప్పి దాచిపెట్టలేదని..
నిన్ను క్రుద్ధుడిని, క్షుద్రుడిని చేసిన రొమ్ములు!
నగ్నంగా ఊరేగమని నన్ను శపించిన..
నీ కురచత్వానికి ఆనవాళ్లయిన రొమ్ములు!

నీ బుద్ధి లాగానే..
ముడుచుకుపోయిన నీ పురుషాంగాన్ని
కప్పెట్టినంత ఈజీ కాదు…
నా రొమ్ములను చున్నీ కింద దాచిపెట్టడం!

శవం మీద కప్పిన కఫన్ లాగా..
సమాధి మీద కప్పిన చద్దర్ లాగా..
చున్నీ కింద ఎందుకు కప్పెట్టాలి నేను!

నువ్వు నిర్వచిస్తున్న పవిత్రత
నా మస్తిష్కంలో ఉంటుందా..
నా అస్తిత్వంలో ఉంటుందా..
నా మనసులో ఉంటుందా..
నా దేహంలో ఉంటుందా..
కేవలం, వస్త్రాల మాటున దాగిన
నా మర్మాంగాలలో మాత్రమే ఉంటుందా..?

వస్త్రం ఒక సౌకర్యం నాకు!
వస్త్రం ఒక నియమం నీకు!
నీ సంకుచితత్వాల విషపు ఊబిలో..
నన్ను మునక వేయమంటావు ఎందుకు?
నువ్వు ఊహించుకునే పవిత్రతల సంకెలలనే..
నన్ను ధరించి తరించమంటావు ఎందుకు?

అదృష్ట వశాత్తూ
నీ హృదయం ప్రకటితమైన విషకుంభం!
ఖర్మ వశాత్తూ
పయోముఖాలను తగిలించుకొని
మరెన్ని హృదయాలు ఎంతగా దురపిల్లుతున్నాయో?!

చున్నీని విడిచిపెట్టేశాను నేను..
పాపం.. నిర్వ్యాపారంగా మిగిలింది అది-
వగలుగా మెడకు తగిలించుకుని, ఉరికొయ్యకు వేళ్లాడు!

*

(‘చున్నీలేని చుడీదార్’ ఆహార్యంతో ఒక స్నేహితురాలు, అదే ఆహార్యంలోని మరొక స్నేహితురాలిని కలిసిన ఫోటోను తన ఫేస్ బుక్ వాల్ మీద పోస్టు చేసుకుంది. ఆమె ఫ్రెండ్ లిస్ట్ లోని ఓ మేధావి వ్యక్తి ఆమె మీద దూషణలకు దిగాడు. చున్నీ లేకపోవడంపై నీచంగా, లేకిగా కామెంట్స్ పోస్టు చేశాడు. ఆ కామెంట్స్ ను ఆమె డిలిట్ చేసింది. ఫేస్ బుక్ మెసెంజర్ లోకి వచ్చి.. అత్యంత అసహ్యకరంగా జుగుప్సాకరంగా ఆమెతో సంభాషణ జరిపాడు. ఆమె అతడిని బ్లాక్ చేసింది. ఆమె నెంబరు దొరకబుచ్చుకుని వాట్సప్ లో మళ్లీ నీచమైన కామెంట్లకు తెగబడ్డాడు. ఆమె ‘ఇగ్నోర్’ చేసింది.
మోతాదులో తేడా ఉండొచ్చు గానీ.. ఇలాంటి అనుభవాలు మనలో చాలా మందికి ఎదురవుతుంటాయి. చున్నీ లేదని చులకనగా మాట్లాడేవాళ్లూ, పెద్దరికంగా అదిలించేవాళ్లూ, యింకోరకంగా బెదిరించేవాళ్లూ బోలెడుమంది ఉంటారు. విన్నాను. చూశాను.

కానీ ఆ అనుభవాల్లో పరాకాష్ట అనదగిన ఈ ఉదంతం నాతో చెప్పినప్పుడు ఆమె తక్కువ బాధపడి, ఎక్కువగా వాడి మీద జాలి పడ్డారు.

ఒక మహిళ ఫోటో ఫేస్‌బుక్ లో కనిపిస్తే.. వెకిలి వ్యాఖ్యలతో వేధించిన అలాంటి ‘కాలా ఆంఖేఁ’ ధూర్తుడి అపవిత్ర స్మృతికి ఈ కవిత అంకితం.)

మునిసురేష్ పిళ్లె

సురేష్ పిళ్లె స్వతహాగా జర్నలిస్టు. శ్రీకాళహస్తిలో పుట్టి, పెరిగి హైదరాబాదులో స్థిరపడ్డారు. కథలు, కవితలు, రాజకీయ వ్యంగ్య రచనలు, సీరియల్ నవలలు రాశారు. కార్టూన్లు గీస్తారు. వృత్తి ప్రవృత్తి ఒకటే కావడం అదృష్టం. జర్నలిజంలో పీజీ, బీఎల్ చేశారు.
Facebook :: https://www.facebook.com/kamspillai

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా బాగుంది కవిత. వాస్తవాలను చాలా సూటిగా నిర్మొహమాటంగా ఖండించి రాశారు. మనం ఆత్మ పరిశీలన చేసుకో దగ్గదిగా ఉంది ఈ కవిత. ధన్యవాదాలు

  • మీ ఉద్వేగం నన్ను కదిలించింది. ధన్యవాదాలు మిత్రమా

  • నీతి వన్నె కాముకుల సంకుచితత్వం మీద కాండ్రించి ఉమ్మిన కవిత. కురచ బుద్దుల చెంప మీద పేటేల్మని కొట్టిన కవిత ఇది. ఆడదాని ఆవేదనకు అద్దం ఈ కవిత. సురేష్ పిళ్ళై గారికిఅభినందన ధన్యవాదాలు

  • ‘ఆమె’ పడే హింసను సూక్ష్మదర్శినిలో చూపుతూ, అదే చున్నీతో పలుకురాళ్లను మూటగట్టి ఆ నీతి ‘అయోగ్యుడి’ని చితక్కొట్టినట్టు ఉంది కవిత.

  • కవితలో ఆర్తి ఉంది. ఆవేదన ఉంది. అమ్మాయిలు బయట
    కనిపిస్తే వెకిలిచేష్టలు చేసే ఆవారాగాళ్ళకు చెంపపెట్టు ఈకవిత. అభినందనలు.

  • చోళీకే పీఛే క్యా హై… అనేది అందరూగతంలో విన్న మాట, చున్నీ కే పీఛే క్యా హై అనేది మీరు ఘంటాపథంగా తెలియజేసిన మాట. కుత్సితబుద్దికలవారు మేల్కొనాలనేట్లుగా రాశారు 👌👏 అభినందనలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు