చివరి జడ

1

 నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఆ పాత చెక్క పెట్టె తెరుచుకుంది.

కర్పూరం వాసన… పాత బట్టల వాసన. సక్కుబాయి వణుకుతున్న చేతులు ఆ పెట్టె అడుగున ఉన్న తెల్లగుడ్డను వెతికాయి. ఎంతో జాగ్రత్తగా మడిచి ఉన్న ఆ వస్త్రాన్ని బయటకు తీసి, గుండెల దగ్గర పెట్టుకుంది. అందులో పదిలంగా చుట్టి ఉన్న పొడవాటి నల్లటి జడను చేతుల్లోకి తీసుకుంది. దాన్ని ముఖానికి హత్తుకోగానే ఆమె కళ్లలోంచి కన్నీళ్లు రాలి ఆ నల్లటి వెంట్రుకల్లో ఇంకిపోయాయి. ఆ జడకు ప్రాణం లేదు. కానీ, అందులో ఆమె కూతురు ఆయుష్షులోని వసంతకాలమంతా నిక్షిప్తమై ఉంది. ఆ జడను నిమురుతుంటే, సక్కుబాయికి గతం ఒక ప్రవాహంలా కళ్ల ముందు కదిలింది.

చిత్తూరు సరిహద్దుల్లోని ఎర్రటి మట్టి కొండల పాదాల దగ్గర ఆనుకుని ఉండే ఆ బంజారా తండా ఎప్పుడూ ఒక నిశ్శబ్దమైన అడవి కవిత్వంలా ఉంటుంది. అక్కడ గాలికి అడవి పూల సుగంధం, కట్టెల పొయ్యిల నుంచి లేచే సన్నటి పొగ వాసన అంటుకుని ఉంటాయి. ఆ తండాలో రూప్లి ఒక అడవి మల్లెలా పెరిగింది. ఆమె నడిస్తే ఆమె ఒంటిపై ఉన్న కాంచలి మీది అద్దాలలో సూర్యుడు వేలాది ముక్కలుగా పగిలి మెరుస్తున్నట్లు ఉండేది. ఆమె కట్టుకున్న ఎర్రటి ఫేటియా కుచ్చులు మట్టిని తాకుతుంటే, ఆ నడకలో ఒక గర్వం ఉట్టిపడేది. కానీ తండా మొత్తానికి రూప్లి అనగానే గుర్తొచ్చేది ఆమె కళ్లు లేదా ఆమె నవ్వు కాదు, ఆమె జడ.

ఆ జడ ఒక నల్లటి నదిలా ఆమె నడుము దాటి ప్రవహిస్తూ ఉండేది. బంజారా స్త్రీలకు జుట్టు కేవలం శరీరంలో ఒక భాగం కాదు. అది వారి వంశ వృక్షానికి ప్రతీక. వారి స్వేచ్ఛకు ఒక భౌతిక రూపం. సక్కుబాయి, రూప్లికి ఊహ తెలిసినప్పటి నుంచి ఆ జుట్టును ఒక పవిత్రమైన మొక్కలా పెంచుకొచ్చింది. కొండల అవతల దొరికే అటవీ మూలికలతో కాచిన నూనెను గోరువెచ్చగా చేసి, రాస్తూ ఆమె పాడే పాటలు ఆ జుట్టు మూలాల్లోకి ఇంకిపోయాయి. తీజ్ పండుగ వచ్చిందంటే చాలు, తండాలోని అమ్మాయిలందరూ గోధుమ నారు పెంచిన వెదురు బుట్టలను తల మీద పెట్టుకుని నృత్యం చేస్తుంటే, రూప్లి జడ చివర కట్టిన రూపేరో గంటలు చేసే శబ్దం తండా నాయక్ గుడిసె వరకు వినిపించేది. ఆ గంటల చప్పుడు ఆమె స్వేచ్ఛా గీతం.

కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక సాధారణమైన ఉదయం, రూప్లి తన గొర్రెలను తోలుకుని కొండవాలుగా వెళుతున్నప్పుడు గాలికి ఎగురుతున్న తన జడను వెనక్కి వేసుకుంటూ, మెడ దగ్గర ఒక చిన్న గడ్డను స్పృశించింది. చేతికి తగిలిన ఆ స్పర్శను ఆమె పెద్దగా పట్టించుకోలేదు. బంజారా ఆడపిల్లలకు అడవిలో తిరిగేటప్పుడు తగిలే చిన్న చిన్న గాయాలు అలంకారాలు లాంటివి. కానీ, ఆ గడ్డ తన ఉనికిని ఎవరికీ చెప్పకుండా, చాప కింద నీరులా, మౌనంగా, క్రూరంగా ఆమె శరీరంలో పెరుగుతూనే ఉంది. రూప్లి శరీరంలో జరుగుతున్న ఆ నిశ్శబ్ద విధ్వంసం బయటకు కనిపించలేదు.

రోజురోజుకూ ఆమె అడుగుల్లో వేగం తగ్గింది. తీజ్ పండుగ నాడు గోధుమ నారు బుట్టను ఎత్తుకుని నృత్యం చేస్తున్న రూప్లికి అకస్మాత్తుగా కళ్ల ముందు చీకటి కమ్మింది. గజ్జెల మోత ఆగిపోయింది. చేతిలో బుట్ట నేలజారింది. ఆమె స్పృహ తప్పి కుప్పకూలిపోయింది. ఒక వైపు తీజ్ పండుగలో పచ్చని మొలకలు ప్రాణం పోసుకుంటుంటే, రూప్లి దేహంలో మాత్రం ఆకురాలు కాలం మొదలైందన్న నిజం ఆ తండాకు అప్పుడే తెలిసింది.

 2

 తండాలో ఎవరికి కష్టం వచ్చినా అది ఊరంతటి కష్టం. రూప్లి స్పృహ తప్పి పడిపోగానే, గుడిసెలన్నీ ఖాళీ అయిపోయాయి. డాక్టర్ల దగ్గరకు వెళ్లడం బంజారాలకు ఎప్పుడూ ఆఖరి అస్త్రమే. వాళ్ల నమ్మకమంతా అడవి తల్లి మీద, తండా నాయక్ ఇచ్చే తాయత్తుల మీద. మూలికలు దంచి పసరు తీసి రూప్లి మెడ మీద గడ్డకు పూశారు. నాయక్ పూజ చేసి, ఎర్రటి దారంతో ఒక తాయత్తును ఆమె మెడలో కట్టాడు. యాడి సక్కుబాయి అయితే దేవుళ్లకు మొక్కుకోని చెట్టు లేదు, పుట్ట లేదు. కానీ ఆ పసరులకూ, తాయత్తులకూ లొంగని రాక్షసి ఏదో రూప్లి దేహాన్ని ఆక్రమిస్తోందని క్రమంగా అర్థమైంది. తప్పనిసరి పరిస్థితుల్లో, ఆ పచ్చని అడవిని వదిలి, చిత్తూరు దాటి తిరుపతిలోని పెద్ద ఆసుపత్రికి రూప్లిని తీసుకువెళ్లారు.

ఆసుపత్రి లోపలికి అడుగుపెట్టగానే రూప్లికి ఊపిరి ఆడినంత పనైంది. అడవి పూల గంధం, తడి మట్టి వాసనతో పెరిగిన ఆమె నాసికాపుటాలకు, ఆ ఆసుపత్రి గోడల నుంచి వచ్చే ఘాటైన ఫినాయిల్ వాసన వికారాన్ని పుట్టించింది. సక్కుబాయికి ఆ ఆసుపత్రిలోని యంత్రాలు, పీక్కు తినే రాక్షసుల్లా కనిపించాయి. వాళ్ల తండాలోని ముసలి వేపచెట్టుకు ఉన్న జాలి, ఆ తెల్లకోటు వేసుకున్న డాక్టర్ల కళ్లలో ఆమెకు కనిపించలేదు. ఎన్నో పరీక్షలు, రక్తం తీయడాలు, కాంతి విరజిమ్మే గదుల్లో చుట్టూ తిరగడాలు. ఆసుపత్రి కారిడార్‌లో సక్కుబాయి తన కూతురి చేయి పట్టుకుని కూర్చున్నప్పుడు ఆమె గుండెల్లో చావును తలపించే ఒక ఢావళో గీతం నిరంతరంగా మోగుతూనే ఉంది. డాక్టర్ ఎక్స్-రేలు చూస్తూ భారంగా నిట్టూర్చాడు. ఆసుపత్రి గదిలో నిశ్శబ్దం ఆవరించింది.

“అమ్మాయికి క్యాన్సర్… కీమోథెరపీ చేయాలి.”

ఆ క్షణంలో సక్కుబాయి ప్రపంచం కుప్పకూలింది. ఆమె పెదాలు వణికాయి.

“నా బిడ్డ బతుకుతుందా దొరా?”

డాక్టర్ నిస్సహాయంగా చూశాడు. “ధైర్యంగా ఉంటే బతుకుతుంది. కానీ చికిత్స చాలా కష్టంగా ఉంటుంది.”

మొదటి కీమోథెరపీ మొదలైంది. నరాల్లోకి ఎక్కుతున్న ఆ రసాయనాలు క్యాన్సర్ కణాలతో పాటు, రూప్లిలోని ప్రాణశక్తిని కూడా పిండేయడం మొదలుపెట్టాయి. బస్సులో తిరుపతి నుంచి తండాకు వెళ్లే దారిలో ఆమెకు ప్రతి కుదుపు ఒక నరకంలా అనిపించింది. భరించలేని అలసట. పచ్చని అడవిని చూస్తే ఎప్పుడూ ప్రాణం లేచి వచ్చే రూప్లికి, ఇప్పుడు ఆ చెట్లు, ఆ కొండలు అన్నీ శూన్యంగా కనిపించాయి. సక్కుబాయి రాత్రుళ్లు తన బిడ్డ పక్కన పడుకుని, చీకట్లో ఆమె తల నిమురుతూ తనలో తాను కుమిలిపోయేది. ఆ కన్నీళ్ల వేడి రూప్లికి తెలుస్తూనే ఉండేది, కానీ ఓదార్చడానికి ఆమె దేహంలో సత్తువ లేదు.

 3

 చలికాలం మంచు తండాను కప్పేసిన ఒక ఉదయం. రూప్లి పాత చెక్క దువ్వెనతో నెమ్మదిగా జుట్టు దువ్వుకోవడం మొదలుపెట్టింది. దువ్వెన కిందకు దిగుతున్నప్పుడు ఏదో అడ్డుపడినట్లు అనిపించింది. నెమ్మదిగా లాగింది. అంతే… చేతిలోకి ఒక పెద్ద వెంట్రుకల పాయ వేళ్లతో సహా ఊడి వచ్చేసింది.

రూప్లి గుండె ఆగిపోయినంత పనైంది. కళ్లలో నీళ్లు తిరిగాయి. చేతిలో ఉన్న తన సొంత జుట్టును ఒక పరాయి వస్తువును చూసినట్లు భయంగా చూసింది. ఆ సాయంత్రానికి మంచం మీద, తలగడ నిండా నల్లని వెంట్రుకలు రాలిపోయి ఉన్నాయి. అద్దం ముందు నిలబడితే తనను తాను గుర్తుపట్టలేనంతగా మారిపోతోంది. ముఖం పాలిపోయింది. కళ్ల కింద నల్లటి వలయాలు. ఒకప్పుడు నదిలా ఉన్న జడ ఇప్పుడు సగం ఎండిపోయిన కాలువలా మారిపోయింది. జుట్టు రాలిపోవడం అనేది కేవలం భౌతిక మార్పు కాదు, అది ఆమె అస్తిత్వపు విధ్వంసం. తన అందం, తన గుర్తింపు, సమాజంలో తన స్థానం అంతా ఆ జుట్టుతో పాటే రాలిపోతోందని ఆమె మానసికంగా కుంగిపోయింది.

సక్కుబాయి వెనక నిలబడి ఆ దృశ్యాన్ని చూడలేకపోయింది.

“వదిలేయమ్మా… దాన్ని అలా పీకకు.”

రూప్లి తల్లి వైపు తిరిగింది. కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి.

“అవి రాలిపోతే… నేను కూడా కొంచెం కొంచెంగా రాలిపోతున్నట్టే కదా యాడి?”

ఆ మాట సక్కుబాయి గుండెను కోసేసింది. వెంటనే రూప్లి నోటిని చేత్తో మూసేసి ఆమెను గుండెలకు హత్తుకుంది.

నాలుగో కీమోథెరపీకి ముందు డాక్టర్ చెప్పాడు, “మిగిలిన జుట్టు కూడా ఊడిపోతుంది. తలగడ మీద, బట్టల మీద రాలిపోతుంటే మానసికంగా మరింత కుంగిపోతారు. కాబట్టి ముందే జుట్టు మొత్తం కత్తిరించుకోవడం మంచిది.”

ఆ రాత్రి రూప్లికి నిద్ర రాలేదు. ఆమె గుడిసె బయటకు వచ్చి, మట్టి అరుగు మీద కూర్చుంది. ఆకాశంలో నిండు పౌర్ణమి. వెన్నెల తండా అంతా పరుచుకుని ఉంది. తన జడను మెల్లగా తడిమింది. ఒకప్పుడు చేతికి నిండుగా తగిలే ఆ జడ, ఇప్పుడు సన్నబడిపోయింది. మరణం అంచులకు వెళ్లి వచ్చిన మనిషికి మాత్రమే ప్రాణం విలువేంటో, ఈ భౌతిక సౌందర్యం ఎంత అశాశ్వతమో అర్థమవుతుంది. ఆ రాత్రి ఆ వెన్నెల్లో, గాలికి రాలిపోతున్న ఎండిన ఆకులను చూస్తుంటే రూప్లిలో ఒక కొత్త వేదాంతం మొగ్గ తొడిగింది.

మరుసటి రోజు ఉదయం. తండా మంగలి చేతిలో కత్తెర పట్టుకుని సక్కుబాయి గుడిసె ముందు నిలబడి ఉన్నాడు. రూప్లి పాత అద్దాల కాంచలి వేసుకుంది. వెండి కడియాలను సరిచేసుకుంది. మంగలి ఎదురుగా ఉన్న చాప మీద కూర్చుంది.

“అన్నా… ఇప్పుడు కత్తిరించు.”

ఆ మంగలి చేతులు వణికాయి. పసిగట్టి చూస్తున్న కళ్లు చెమర్చాయి. “అక్కా… నా వల్ల కావడం లేదు,” అంటూ కత్తెర కింద పెట్టబోయాడు.

రూప్లి నవ్వింది.

“జుట్టే కదా అన్నా, జీవితం కాదు కదా. కత్తిరించు!”

కత్తెర మొదటిసారిగా తెరుచుకుని మూసుకుంది. ‘చక్…’ అనే ఆ కర్కశమైన శబ్దం ఒకప్పుడు ఆ జడలో మోగిన వెండి గంటల శబ్దాన్ని చెరిపేస్తూ సక్కుబాయి గుండెల్లోకి దిగింది. కుప్పగా నేల మీద పడుతున్న జుట్టును చూస్తూ రూప్లి కళ్లు మూసుకుంది. కొన్ని నిమిషాల్లో అంతా పూర్తయింది. సక్కుబాయి మెల్లగా నేల మీద పడిన ఆ పొడవాటి జడను రెండు చేతులతో ఎత్తుకుంది. ఆమె చేతులు వణుకుతున్నాయి. ఆ జుట్టును ముఖానికి హత్తుకుని నిశ్శబ్దంగా ఏడ్చింది. ఆ తర్వాత ఒక పాత తెల్లని వస్త్రాన్ని తీసుకువచ్చి, ఆ జడను ఎంతో జాగ్రత్తగా మడిచి తన పాత చెక్క పెట్టెలో పదిలంగా దాచింది.

 4

 ఆ రోజు నుంచి రూప్లి ఇంట్లో అద్దం ముందు నిలబడటం పూర్తిగా మానేసింది. అద్దం ఎప్పుడూ అబద్ధం చెప్పదు. అది ముఖం మీద ఉన్న నవ్వు వెనుక ఉన్న భయాన్ని, తల మీద ఉన్న శూన్యాన్ని నిర్దాక్షిణ్యంగా చూపిస్తుంది. తలకు ఎప్పుడూ ఒక దళసరి గుడ్డను కట్టుకుని ఉండిపోయేది.

కీమోథెరపీ కోసం నెలకు ఒకసారి ఆసుపత్రికి వెళ్లడం దినచర్యగా మారింది. ఒకరోజు ఆసుపత్రి కారిడార్‌లో ఒక ఆరేళ్ల చిన్నారి కూర్చుని ఉంది. ఆమె తల మీద ఒక్క వెంట్రుక కూడా లేదు. కానీ ఆ చిన్నారి చేతిలో ఒక ప్లాస్టిక్ బొమ్మ ఉంది, ఆ బొమ్మకు ముద్దులు పెడుతూ ఆమె పెదవులపై ఒక అందమైన, స్వచ్ఛమైన చిరునవ్వు ఉంది. రూప్లి ఆ పాపను చాలాసేపు అలాగే చూస్తూ ఉండిపోయింది.

ఆ పాప తల్లి దగ్గరకు వెళ్లి నెమ్మదిగా అడిగింది, “పాపకు భయం వేయదా అక్కా?”

దానికి ఆ తల్లి నవ్వి, “భయం మాకేనమ్మా. పిల్లలకు అవేవీ తెలియవు. వాళ్లకు కావాల్సింది అద్దంలో ముఖం కాదు, మనసులో ఆనందం.”

ఆ మాట రూప్లి గుండెల్లో ఒక విత్తనంలా పడింది. ఎన్నో రోజులుగా ఆమెలో పేరుకుపోయిన “నాకే ఎందుకు ఇలా జరిగింది?” అనే ప్రశ్న మెల్లగా కరిగిపోవడం మొదలైంది.

కొద్ది రోజుల తర్వాత తండాలో ఒక ఉదయం మట్టి అరుగు మీద కూర్చుని చూస్తుండగా, ఎండాకాలంలో పూర్తిగా ఆకులు రాల్చి మోడుబారిపోయిన ఒక పాత వేప చెట్టు కొమ్మ చివర ఒక చిన్న ఆకుపచ్చని చిగురు తొడిగింది. ఆ నిశ్శబ్దమైన ప్రకృతి దృశ్యం రూప్లి అంతరంగాన్ని మథించింది. ప్రాణం పోతుందనుకున్న చోట కూడా మళ్లీ జీవం చిగురిస్తుంది. భౌతికమైన అందం నాశనమైనా, లోపలి ప్రాణశక్తి అజేయమైనది. ఆ క్షణంలో ఆమెకు తన మీద తనకు ఉన్న జాలి, సానుభూతి పూర్తిగా తొలగిపోయాయి.

కొన్ని నెలలు గడిచాయి. తీజ్ పండుగ మళ్లీ వచ్చింది. తండా అంతా కళకళలాడుతోంది. రంగురంగుల దుస్తులు ధరించిన అమ్మాయిలందరూ దారాలతో ఒకరికొకరు జడలు అల్లుకుంటున్నారు. రూప్లి గుమ్మం దగ్గర కూర్చొని ఆ వేడుకను చూస్తోంది. అప్పుడే పక్కింటి పదేళ్ల పాప, చాందిని పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకు వచ్చింది.

“రూప్లి అక్కా… నా జడ నువ్వే అల్లాలి. ఈ తండాలో నీలా అందంగా ఎవరూ జడ అల్లలేరు.”

రూప్లి చేతులు వణికాయి. ఎన్నో నెలలుగా ఎవరి జుట్టునూ ఆమె తాకలేదు. నెమ్మదిగా చాందిని తల మీద చేతులు వేసింది. ఒక్కో పాయను అల్లుతున్న కొద్దీ, “జడ బిగిగా అల్లకూడదు రూప్లీ, నీకు నొప్పి పెడుతుంది,” అని చిన్నప్పుడు తన జడ అల్లుతూ యాడి సక్కుబాయి ప్రేమగా చెప్పిన మాటలు ఆమె చెవుల్లో ప్రతిధ్వనించాయి. తన తల్లి తనను ఎంత సున్నితంగా చూసుకుందో గుర్తుతెచ్చుకుంటూ, అత్యంత సున్నితంగా చాందినికి జడ అల్లింది. అద్దంలో చూసుకుని చాందిని గంతులేస్తుంటే, రూప్లి చాలారోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వింది.

ఆ రాత్రి, రూప్లి తన తల్లి దగ్గరకు వెళ్లింది.

“యాడి… నీ పెట్టెలో ఉన్న ఆ జడను తీసుకురా. అది ఇలా చీకటి పెట్టెలో శవంలా మగ్గిపోవద్దు. దీనివల్ల ఇంకో అమ్మాయి పెదవులపై నవ్వు పూయాలి. అప్పుడు మాత్రమే దానికి ఒక అర్థం ఉంటుంది.”

సక్కుబాయికి ఆమె మాటల్లోని పరిపక్వత అర్థమైంది. ఆ వెన్నెల్లో రూప్లి ముఖం ఒక యోగినిలా ప్రకాశిస్తోంది.

 5

 మరుసటి వారం తిరుపతి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు రూప్లి అడుగుల్లో ఎప్పటిలాంటి నీరసం లేదు. డాక్టర్ దగ్గరకు వెళ్లి, “దొరా… నా జుట్టు… నాలాంటి వాళ్ల కోసం, జుట్టు పోయి అద్దం చూసుకోవడానికి భయపడే వాళ్ల కోసం ఇవ్వాలనుకుంటున్నాను,” అని అడిగింది. డాక్టర్ ఆశ్చర్యంగా, సంతోషంగా చూసి, ఆసుపత్రి ఆవరణలోనే క్యాన్సర్ రోగులకు విగ్‌లు తయారు చేసి ఉచితంగా ఇచ్చే ఒక స్వచ్ఛంద సంస్థ గురించి చెప్పాడు.

ఆ సంస్థ ప్రతినిధి దగ్గరకు వెళ్లి రూప్లి తన జడను టేబుల్ మీద పెట్టింది. ఆ యువతి ఆ పొడవాటి జడను చూసి, “ఇంత అందమైన జుట్టును ఎంతో ప్రేమగా పెంచుకుని ఉంటారు కదా,” అంది మెత్తగా.

రూప్లి నవ్వింది. “అవును, అందుకే దీన్ని ఇంకొకరికి అంతకంటే ఎక్కువ ప్రేమగా ఇవ్వాలనుకున్నాను.”

జుట్టు అనేది కేవలం శరీర భాగం కాదు, అది మనలోని అహం. ఆ అహాన్ని కత్తిరించి, మరొకరికి దానం చేసినప్పుడే తన విముక్తి పూర్తయిందని రూప్లికి ఆ క్షణంలో అనిపించింది. సక్కుబాయి ఆ దృశ్యాన్ని చూసి కన్నీరు పెట్టుకుంది. కానీ ఆ కన్నీటిలో బాధ లేదు, తన బిడ్డ ఔన్నత్యాన్ని చూసి పొంగుకొచ్చిన గర్వం ఉంది.

మరో మూడు నెలలు గడిచాయి. రూప్లి ఆరోగ్యం మెరుగుపడింది. కీమోథెరపీ ప్రభావం తగ్గడంతో ఆమె తల మీద చిన్న చిన్న వెంట్రుకలు, కొత్త చిగురుల్లా మొలకెత్తడం మొదలైంది. ఒకరోజు ఆసుపత్రికి చెకప్ కోసం వెళ్ళినప్పుడు, నర్సు ఒక బ్రోచర్ తెచ్చి రూప్లి చేతిలో పెట్టింది. ఆ బ్రోచర్ ముఖచిత్రం మీద ఒక పదేళ్ల చిన్నారి ఫొటో ఉంది. ఆమె తల మీద అందంగా అల్లిన ఒక విగ్ ఉంది, ఆ విగ్ రూప్లి జడతో చేసినదే అని స్పష్టంగా తెలుస్తోంది. ఆ పాప ముఖంలో వెయ్యి పౌర్ణమి చంద్రులు ఉదయించినంత పెద్ద నవ్వు ఉంది.

రూప్లి ఆ ఫొటోను చాలాసేపు కళ్లార్పకుండా చూసింది. ఆమె గుండెలో ఎక్కడో అట్టడుగున పేరుకుపోయిన చివరి బాధపు ఛాయ కూడా కరిగిపోయి, ఒక సుగంధంలా వ్యాపించింది. ఇంటికి వచ్చాక ఆ ఫొటోను సక్కుబాయి చేతిలో పెట్టింది.

“చూడు యాడి… నా జడ మళ్లీ నవ్వుతోంది. అది చనిపోలేదు.”

ఆ రోజు సక్కుబాయి తన పాత చెక్క పెట్టెలో పదిలంగా దాచింది ఆ జడను కాదు… ఆ చిన్నారి చిరునవ్వుల ఫొటోను. పాత జ్ఞాపకాలను వదిలేసి, కొత్త జీవితాన్ని ఆమె ఆహ్వానించింది.

మరో ఏడాది గడిచింది. తండాలో మళ్లీ తీజ్ పండుగ సందడి మొదలైంది. డప్పులు మోగుతున్నాయి. అమ్మాయిలందరూ రంగురంగుల దారాలతో జడలు అల్లించుకుంటున్నారు. ఈసారి రూప్లి కూడా వారి మధ్యే వెళ్లి కూర్చుంది. ఆమె తలపై ఉన్న చిన్న చిన్న వెంట్రుకలు గాలికి స్వేచ్ఛగా అల్లరి చేస్తున్నాయి. మళ్లీ చాందిని పరుగెత్తుకుంటూ వచ్చింది.

“రూప్లి అక్కా… నా జడ అల్లు.”

రూప్లి ఆప్యాయంగా ఆమె జుట్టును తన చేతుల్లోకి తీసుకుంది. ఒక్కో పాయను అల్లుతుంటే రూప్లికి ఒక గొప్ప సత్యం అవగతమైంది. జడ అంటే తల మీద పెరిగే వెంట్రుకలు కాదు, అది ఒక తరం నుంచి మరో తరానికి ప్రవహించే ఆత్మీయత. దాన్ని పంచుకుంటేనే అది మరింత పొడవుగా పెరుగుతుంది.

నిజానికి, కొన్ని జడలు భుజాలపై మాత్రమే పెరుగుతాయి, మరికొన్ని జడలు మనుషుల మనసుల్లో పెరుగుతాయి. భుజాలపై పెరిగినవి ఏదో ఒకరోజు రాలిపోతాయి లేదా కత్తిరించబడతాయి. కానీ మనసుల్లో పెరిగినవి మాత్రం… తరాల పాటు అలా అల్లుకుంటూ, ప్రాణాన్ని ఇస్తూనే ఉంటాయి. అడవి మల్లెల సువాసన గాలిలో కలుస్తున్నట్లుగా, రూప్లి పెదవులపై విరిసిన ఆ నిర్మలమైన నవ్వు ఇప్పుడు ఆ తండా వాతావరణంలో శాశ్వతంగా కలిసిపోయింది.

*

చిత్రం: సృజన్ రాజ్

భూక్యా గోపినాయక్

అధ్యాపకులు, కథా రచయిత, సాహిత్య విమర్శకులు. ఆయన తొలి కథ ‘కోతిబుద్ధి’ 1991 లో బాలజ్యోతి లో ప్రచురితమైంది. విద్యార్థి దశ నుంచే సాహిత్యం, జర్నలిజంపై ఆసక్తి పెంచుకున్న ఆయన కొంతకాలం జర్నలిస్టుగా, అనంతరం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేశారు. ఆ అనుభవం సమాజాన్ని, సామాన్యుల జీవితాలను దగ్గరగా పరిశీలించే దృష్టిని ఆయనకు అందించింది. ప్రస్తుతం అధ్యాపక వృత్తిలో కొనసాగుతూనే సాహిత్య అధ్యయనం, కథా రచన, విమర్శ రంగాల్లో కృషి చేస్తున్నారు.

సమకాలీన తెలుగు కథా సాహిత్యాన్ని సామాజిక, సాంస్కృతిక దృక్పథాలతో విశ్లేషిస్తూ సాహిత్య విమర్శకుడిగానూ రాణిస్తున్నారు. వివిధ దినపత్రికల ఆదివారం అనుబంధాల్లో ప్రచురితమయ్యే కథలను వారం వారం అధ్యయనం చేసి, కే.ఏ.మునిసురేష్ పిళ్లె‘ఆదర్శిని’ వెబ్ పత్రికకు సమీక్షలు రాస్తున్నారు. కథలోని వస్తువు, శిల్పం, సామాజిక నేపథ్యం, రచయిత దృక్పథాలను విశ్లేషించడం ఆయన విమర్శ ప్రత్యేకత.
బహుజన జీవితం, అట్టడుగు వర్గాల అనుభవాలు, సామాజిక వాస్తవికతను అధ్యయనం చేస్తున్నారు. కథను కేవలం సాహిత్య ప్రక్రియగా కాకుండా సమాజాన్ని అర్థం చేసుకునే సృజనాత్మక సాధనంగా భావిస్తూ తన సాహిత్య ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.