మా అమ్మ లేకుంటే నేను లేను.
ఒక చదువుకున్న మహిళ ఒక తరాన్ని మారుస్తుందనటానికి ఒక చక్కటి నిదర్శనం మా అమ్మ జయమ్మ. ఎరుకల కుటుంబంలో మహిళలు చదువు కోవటమే చాలా అరుదైన కాలంలో ఆమె తొమ్మిదవ తరగతి వరకు చదువుకుంది. ఆమె ద్వారానే పత్రికలు పుస్తకాలు కథలు చదవడం నాకు అలవాటయ్యింది.

సమాజంలో నిత్యం అణచివేతకు , అవమానాలకు గురవుతున్న ఎరుకల జాతిలో చదువుకున్న వారు చాలా తక్కువ మంది. కష్టాలలో నుంచి, అవమానాల నుంచి , దుఃఖం నుంచి ఓర్పును ఓదార్పును, ఇంత ధైర్యాన్ని ఇచ్చింది పుస్తకాలే. పుస్తకాల వెలుతురులో నుంచి చూసినప్పుడు చీకటి ఇంకా ఇంకా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎక్కడ ఎవరు మోసం చేస్తున్నారో, ఎక్కడ ఎవరు ఎలా అవమానం చేస్తున్నారో స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇప్పటికీ అమాయకంగా మోసపోతున్న ఎంతోమంది ఆడవాళ్లకు దిక్కులేదు.
చదువు రాని వాళ్లే కాదు చదువుకున్న వాళ్ళు కూడా అవమానించబడుతున్నారు, అనుమానించబడుతున్నారు. ఇది ఒక కొత్త కోణం. చదువు వల్ల కానీ ఉద్యోగాల వల్ల కానీ రాజకీయ పదవుల వల్ల కానీ ఎరుకలకు ఎలాంటి గౌరవం లభించకకపోవడం ఒక విషాదకరమైన పరిస్థితి.
*
విద్యార్థుల్లాగా సంవత్సరానికి ఒకసారి రాసేది పరీక్షలు కాదు, ఎరుకలు ప్రతిరోజు ఎదుర్కొనేవే నిజమైన పరీక్షలు. ఎలాంటి పరీక్షలంటే ఎప్పటికీ ఉత్తీర్ణత పొందలేని పరీక్షలివి. పరీక్షలు పాస్ అయిన విద్యార్థులు, ఉద్యోగాలు సంపాదించిన నిరుద్యోగులు, అధికారం సంపాదించిన రాజకీయ వ్యక్తులు, చదువుకున్న మహిళలు ఇంకా ఇంకా పరీక్షలు రాస్తూనే ఉన్నారు, అవమాన పడుతూనే ఉన్నారు. ఏ రంగంలో అయినా కావచ్చు కానీ, ఇంకా గుర్తింపు గౌరవం దొరకడం లేదు.
మరో వైపు ఆధార్ కార్డుల కోసం కుల ధ్రువీకరణ పత్రాల కోసం విద్య వైద్యం గూడు కోసం మంచినీళ్ల కోసం ఇంకా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు ఎరుకలు. అర్థ సంచార జీవితం ఒకవైపు, అడవుల్లో ఉండలేనితనం ఒకవైపు. ఆర్థిక భద్రత లభించిన మనుషులకు ఆ ఉద్యోగాలు సమాజంలో అందరితో సమంగా పొందాల్సిన సమానత్వం ,గౌరవం పట్ల ఏ మాత్రం నమ్మకాన్ని భరోసాని ఇవ్వటం లేదు. కొత్త కొత్త ఉపాధులు వస్తున్నప్పటికీ, కొత్త అవమానాలు ఎదురవుతున్నాయే తప్ప ఊరట లభించడం లేదు.
*
చదువుకున్నంత మాత్రాన, ఉద్యోగాలు చేస్తున్నంత మాత్రాన, రాజకీయ పదవులు వచ్చినంత మాత్రాన ఎరుకల జీవితాల్లో వచ్చిన గొప్ప మార్పులు ఏమీ లేవు. ఒక తరం మరొకతరాన్ని ఇంకా తయారు చేసుకోలేని సందిగ్ధ పరిస్థితిలోనే అవస్థలోనే ఇంకా ఎరుకల జాతి నలిగిపోతూనే ఉంది. ఎక్కడా ఎలాంటి ఆశ్చర్యకరమైన మలుపులు లేవు. చీకటి జీవితాల్లో ఇంకా వెలుగులోకి రావాల్సిన మనుషుల కథలు ఎన్నో ఉన్నాయి. ఒక్కోగుండె కథ వింటూ ఉంటే, విప్పుతూ ఉంటే దుఃఖం ఆగదు. ఇది ఏ ఒక్కరి దుఃఖమో కాదు. ఒక సామూహిక దుఃఖం. ఈ కాలంలో ఇంకా పరువు హత్యలు జరుగుతున్నాయంటే ఎంత బాధ కలుగుతుందో ?
పై కులాల్లోనే కాదు కింద కులాలలో కూడా ఈ రకం ధోరణి ఎంతోమంది పసి జీవితాలను మాయం చేసింది. ప్రకృతికి మనిషికి మధ్య ఉన్న అనుబంధం తెగిపోతున్న వేళ, మనుషుల మధ్య ఉండాల్సిన వంతెనలేవో కూలిపోతున్న వేళ, ఎంతటి చైతన్యం కావాలి ఎలాంటి చైతన్యం రావాలి?
సమాజంలో అందరితో సమానంగా కలిసి కూర్చుని ఎరుకలు భోం చేయలేని పరిస్థితి ఈనాటికీ ఉంది. ఈ కులం వాళ్ల కులాంతర వివాహాలకు కూడా అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి.అడుగడుగునా అవమానాలు అన్యాయాలు అసమానతలే భయపెడుతున్నాయి. ఈ భయం నుంచి, అసమానత్వం నుండి స్వేచ్ఛగా ధైర్యంగా బయటపడటానికి కథలు కవితలు ఇప్పుడిప్పుడే ఎరుకల గుండెల్లో నుంచి సూటిగా వస్తున్నాయి. నా వాళ్ళ గురించి నేను రాసిన ఎరుకల కథలకు వచ్చిన ఆదరణ స్పందన ఒక ఊరట.అయినా ఈ కన్నీళ్లు ఇంకా ఉన్నాయి, దుఃఖం ఇంకా ఉంది. ఎన్నో బాధలు కథలు గాయాలు ఉన్నాయి. అయినా మనిషితనం పైన ఆశ కూడా ఉంది. ఇంకా చాలామంది నా వాళ్ళు నాతో కలిసి నడుస్తారని ఆశగా ఉంది.
ఏకలవ్య కాలనీ ఎరుకల కథా సంపుటి తర్వాత, మరో 19 జీవితాలు వెలుగులోకి రాబోతున్నాయి. ఎన్నో ఖాళీలు… ఎంతో దుఃఖం…. జీవితం పట్ల గొప్ప ఆశతో ఓడిపోతున్న మనుషుల గురించి కాదు , భవిష్యత్ పట్ల గొప్ప నమ్మకంతో గెలిచే మనుషుల గురించి రాస్తున్న కథలివి. రాయకుండా ఉండలేని స్థితిలో రాస్తున్న కథలు ఇవి.
ఏకలవ్య కాలనీ- ఎరుకల జీవన గాథలను ఆదరించిన పాఠకులకు విమర్శకులకు సమీక్షకులకు నేను తప్పకుండా ధన్యవాదాలు చెబుతాను. ఈ ఆత్మగౌరవ పోరాట కథలను గురించి మాట్లాడకుండా మౌనంతో అవమానించే వాళ్ల గురించి మాత్రం ఆలోచించకుండా ఉండలేను.
*








Add comment