


మైదానం కోరికలు వేరే. అవి ఏనాడూ అడివితో ముడిపడవు. అడివి అంతరంగాన్ని చేరుకోలేవు. సాగినంత మేరా అడివిని కబళించాలన్న దోపిడీ కాంక్ష మైదానం. బతికినంత మేరా పచ్చగా గుండె నిండుగా స్వచ్ఛంగా బతకాలని అడివి. ఆ అడివిలో విషాదాన్ని జయించే మాత్ర ఏదో వుంది. చిరు నగవుల్ని దోచేసే దొరల బలాన్ని నిర్వీర్యం చేసే మంత్రం ఏదో వుంది. అదిగో- ఆ మాత్రని, ఆ మంత్రాన్ని దృశ్యాలుగా అనువదిస్తాడు కందుకూరి రమేష్ బాబు తన “సామాన్య శాస్త్ర” నేత్రంతో- చూడండి. ఈ దృశ్యాలకు వ్యాఖ్యానం అక్కర్లేదు. రమేష్ రాసిన కొన్ని ముందు మాటలు మాత్రం మీకు అందిస్తున్నాం.
*
చాల కాంప్లెక్స్ అనిపిస్తుంది గాని సింపుల్.
ఒకానొక ఆదీవాసీ తెగ ఎంత సామాన్యమో చెప్పడం మాటల్లో కష్టం.
ఒక్క మాటలో జీవితానికి విలువ ఇవ్వకపోవడం వారి పద్ధతి.
అవును, వాళ్ళు జీవితానికి విలువ అసలే ఇవ్వరు.
మన దృష్టిలో వారు ఏ మాత్రం విలువ ఇవ్వని ఒకానొక ఆదివాసి తెగ.
వాళ్ళను చూస్తీ ఎవరైనా అచ్చేరువొందుతారు.
నిజం.
చావును గానీ పుట్టుకను గానీ రెంటిని ఉదాసీనంగా చూడగల వారి యోగం, అందలి వివేకం అర్థ కావడం కష్టమే.
కానీ దాని విలువ అర్థం అవుతేనే మన విలువలు ఎంత కురచైనవో, మన మైదాన వాసుల నాగరీకత లోని డొల్లు మరెంత విశాలమో తెలిసి వస్తుంది. అందుకనే నా పర్యటన పొడవునా “వారు అమాయకులు” అని అన్నవారిని చూస్తే నవ్వు వచ్చింది. వారితో విభేదించాను. ‘వారు కాదు మనం అమాయకులం’ అని బోధపడింది. “వారు ప్రకృతి, మనం వికృతి” అని ఈజీగా అర్థమైనది.
ఒక ఉదాహరణ చూడండి. వారివి నాలుగు గుడిసెలు ఉన్న కాడ మనం వెళ్లి గుడిసె వేసుకుంటే వాళ్ళు అక్కడినుంచి వెంటనే వెళ్ళిపోతారు. మరోచోట తమ గుడిసెలు వేసుకుని జీవిస్తారు. పన్నెత్తి మాట్లాడరు.
చర్చ పెద్ద విషయం. సంబాషణ కూడా వారు చేయరు. అనాగరీకులకు నాగరీకులు అర్థం అవుతారా? అందుకే వారు మనల్ని మన మానాన వదిలి వెళ్ళిపోతారు. అలాంటి ఆదివాసి తెగ- కొలాం (Kolam Tribe) లది.

















Add comment