“అమ్మా, నువ్వు ఒకసారి నాతో చెప్పావు గుర్తుందా, నేను లాండ్రీ చేస్తే నాకు ఫైవ్ డాలర్స్ ఇస్తాను అని అన్నావు?” అడిగాడు సుముఖ్.
“అవును అన్నాను, గుర్తుంది. కానీ నువ్వు చేయలేదు ఎపుడూ అని అడగడం మానేసాను” అని బదులు ఇచ్చింది సుముఖ్ వాళ్ళ అమ్మ, అపర్ణ.
“అబ్బా, అది కాదు అమ్మా. నేను లాండ్రీ చేస్తే నాకు ఫైవ్ డాలర్స్ ఇస్తావా అని అడుగుతున్నాను” అడిగాడు సుముఖ్.
“ఓహ్ తప్పకుండా. కానీ నీకెందుకు సడన్ గా డబ్బులు కావాలా అని ఆలోచిస్తున్నాను” బుగ్గ మీద వేలు వేసుకుని అడిగింది అపర్ణ.
అమ్మ అడిగిన ప్రశ్న ని పట్టించుకోకుండా “అంటే రెండు లాండ్రీలు చేస్తే ఫైవ్ అండ్ ఫైవ్ పది డాలర్స్ ఇస్తావా?” కళ్ళు పెద్దవి చేసి అడిగాడు సుముఖ్.
“న్యాయంగా ఇవ్వాలి కదా. అసలు నీకు ఎంత కావాలి?” సూటిగా అడిగింది అపర్ణ.
వేళ్ళతో కష్టపడి లెక్కలు వేస్తూ “ఐ థింక్ సిక్స్టీ డాలర్స్” అన్నాడు సుముఖ్.
“అరవై డాలర్లా! దానికి నువ్వు పన్నెండు సార్లు లాండ్రీ చేయాల్సి వస్తుంది. అసలు ఎందుకు ఇన్ని డబ్బులు నీకు?” సమాధానం కావాలి నాకు అన్నట్టుగా చేతులు కట్టుకొని అడిగింది అపర్ణ.
“తరువాత చెబుతానులే అమ్మా. లాండ్రీ తో పాటు ఇల్లు క్లీనింగ్ అండ్ గిన్నెలు తోమింగ్ లో నేను హెల్ప్ చేస్తే కూడా ఇస్తావా డబ్బులు? అప్పుడు తొందరగా సంపాదించేస్తాను” ఎంతో ఆశగా అడిగాడు సుముఖ్.
“షూర్. నువ్వు పనులు చేస్తానంటే నాకు మహదానందం. ఇంతకీ అంత డబ్బులు…” అని అపర్ణ అంటూండగానే “థాంక్ యూ అమ్మా” అని అనేసి అక్కడ నుండి పారిపోయాడు సుముఖ్.
ఈ సంభాషణ జరిగిన రోజు నుండి వచ్చిన వారంలో ఈ పని ఆ పని అని ఎన్నో పనులు చేయసాగాడు సుముఖ్. మామూలుగా అసలు టాయ్స్ సర్దడానికి కూడా ఇష్టపడడు. ఏమైనా చిన్న చిన్న పనులు చెప్తే తెగ బద్ధకించేవాడు. అలాంటిది ఇన్ని పనులు చాలా ఇంటరెస్ట్ తో, విసుగు లేకుండా చేస్తుంటే అపర్ణ కి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. రొట్టెలు కాల్చడంలో, కూరలు కట్ చేయడంలో, వంటగది క్లీనింగ్ లోనూ ఎంతో సాయం చేసి మొత్తానికి అరవై డాలర్స్ సంపాదించేసాడు. శుక్రవారం రాత్రి అయింది. రోజులాగానే పుస్తకం చదివేసి పడుకొనే ముందు అపర్ణ తో “అమ్మా రేపు నన్ను డాలర్ స్టోర్ తీసుకొని వెళ్తావా ప్లీజ్? నాన్న ని అడిగితే కుదరదు అన్నాడు” నెమ్మది గొంతు తో అన్నాడు సుముఖ్.
“ఓహో అదా సంగతి! అరవై డాలర్స్ సంపాదించింది డాలర్ స్టార్ లో బొమ్మల కొనుక్కోవటానికా?” ఆవలిస్తూ అడిగింది అపర్ణ.
“కాదు…”
“మరి? హాలోవీన్ వస్తోంది కదా, కాస్ట్యూమ్ ఏదైనా కొనుక్కోవడానికా?”
“ఊహూ కాదు…”
“ఒరేయ్ నాకు సరిగ్గా చెప్పు. అసలే నిద్రొస్తోంది…”
“‘గొడుగూస్’ కొనడానికి”
“‘గొడుగూస్’ అంటే?”
“గొడుగు… అంబ్రెల్లా! ఎక్కువ కొంటే ‘గొడుగూస్’ అంటారు కదా..”
అపర్ణ నవ్వేస్తూ, “ఏడిసినట్లుంది! గొడుగులు అనాలి. సరే, ఇన్ని గొడుగులు నీకెందుకు?”
“ట్వంటీ కావాలి…”
“ఇరవై గొడుగులు ఏం చేసుకుంటావురా? ఇరవై రంగులలో కొనుక్కొని రోజుకొకటి చొప్పున వాడుకుంటావా?”
“కాదమ్మా, నాకు కాదు. డెన్నీస్ పార్క్ ఉంది కదా, అక్కడ చాలా హోంలెస్ వాళ్ళున్నారు. వాళ్లకి ఇద్దామని..”
ఆ మాట వినగానే అపర్ణ నిద్రమత్తు ఒక్కసారిగా వదిలిపోయింది. మంచం మీద నిటారుగా లేచి కూర్చొని, “అసలు నీకు ఈ ఆలోచన ఎలా వచ్చిందిరా?” అని అడిగింది.
సుముఖ్ కూడా లేచి కూర్చొని చెప్పడం ప్రారంభించాడు. “రెండు వారాల క్రితం నేనూ, నాన్న కార్‌లో ఇంటికి వస్తున్నప్పుడు రోడ్డు మీద పాపం ఒక తాత గొడుగు విరిగిపోయి కింద పడిపోయింది. అప్పుడు నాన్నకు అది చూపించి, ‘పాపం వాన పడితే తాత ఎలా తడవకుండా ఉంటాడు నాన్నా?’ అని అడిగాను. వెంటనే నాన్న పక్కనే ఉన్న డాలర్ స్టోర్‌కి తీసుకెళ్లి మూడు డాలర్లు పెట్టి ఒక గొడుగు కొన్నాడు. మళ్లీ కార్ ఎక్కి ఆ తాత దగ్గరికి వెళ్లి ఆ కొత్త గొడుగు ఇచ్చాడు. ఆ తాత చాలా సంతోషపడ్డాడు.”
కొంచెం ఆగి మళ్లీ చెప్పసాగాడు, “నాన్న కార్ లోకి వచ్చాక నేను అడిగాను, ‘ఎందుకు కొనిచ్చావు నాన్నా?’ అని. దానికి నాన్న, ‘పాపం అతను హోమ్‌లెస్, తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు సరిగ్గా ఉండవు. ఇప్పుడు వానాకాలం కదా, విరిగిన గొడుగుతో చాలా కష్టపడతాడు’ అని చెప్పాడు. అప్పటి నుండి నేను డెన్నీస్ పార్క్ దగ్గర హోమ్‌లెస్ వాళ్ళు కనిపించినప్పుడల్లా కౌంట్ చేస్తూ వచ్చాను. ఇప్పటివరకు ఇరవై మంది అయ్యారు. నాన్నను డబ్బులు అడిగితే, ‘అంత మందికి ఇవ్వాలంటే కష్టం రా, నువ్వు పెద్దయ్యాక సంపాదించి ఇవ్వు’ అన్నాడు. అప్పుడే నాకు ఈ ఐడియా వచ్చింది. నిన్ను అడిగి పనులు చేశాను. ఇప్పుడున్న డబ్బులతో వాళ్ళందరికీ ‘గొడుగూస్’ ఇచ్చేస్తాను. ఆ తర్వాత మరికొన్ని పనులు చేసి, ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించి మిగతా వాళ్లకు కూడా గొడుగులు కొనిస్తాను” అని ఎంతో గర్వంగా చెప్పాడు సుముఖ్.
సుముఖ్ ని దగ్గరగా తీసుకొని, వాడి బుగ్గ మీద ముద్దు పెట్టి, “రేపు నిన్ను పక్కా తీస్కువెళ్తాను డాలర్ స్టోర్ కి. నీకు ఇంకొన ఇరవై ఎక్స్ట్రా డాలర్స్ ఇస్తాను నువ్వు హాలోవీన్ కాస్ట్యూమ్ కూడా కొనుక్కో. పక్కవాళ్ళకి సహాయం చేయాలి అనుకోవడం చాలా మంచి ఆలోచన. అలాగే నాన్న మాట విని సంపాదించి నీ డబ్బుల్తో సహాయం చేయాలి అనుకోవడం ఇంకా మంచి ఆలోచన. ఐ యాం ప్రౌడ్ అఫ్ యూ” అని అపర్ణ మురిసిపోయి కొడుకు బుగ్గ మీద ఇంకొక ముద్దు ఇచ్చింది.
“చాలు అమ్మా, నిద్రొస్తోంది, గుడ్ నైట్”
“గుడ్ నైట్ పండూ…..
మరుసటి రోజు ఉదయం, సుముఖ్ ఎంతో హ్యాపీగా డాలర్ స్టోర్‌కి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. అతని చేతిలో కష్టపడి సంపాదించిన అరవై డాలర్లు ఉన్నాయి, ఆ ఇరవై మందికి గొడుగులు ఇవ్వబోతున్నందుకు వాడు మనసులోనే ఎంతో సంబరపడిపోతున్నాడు.
*








Add comment