ఎవరో నిన్ను గాయపరిచి ఉండవచ్చు,
నువు ఎవరినో
గాయపరిచినందుకు గాయపడి ఉండవచ్చు
ఈ పగలు అలానే ఉంటుంది నిన్ను చూస్తూ,
ఈ గాలి అలానే వీస్తుంది నెమ్మదిగా తాకుతూ,
తాబేలు నడకలా కదిలే కాలం
నీ గాయాలని ఏమంత పట్టించుకోదు
పట్టించుకోకపోవటంలో దాని కరుణ దాగి ఉంది
కాలంతో నిదానంగా ఎదిగే చెట్లు అంటాయి
ఊరుకో, ఇక్కడ ఏదీ ఏమంత విశేషం కాదు
మళ్ళీ అంటాయి
జీవించటం ఆనందం కదా, ఏమంటావు అని
గాయపడనివాళ్ళు ఇతరుల్ని గాయపరచలేరు
ఇది చాలా లోతైన రహస్యం,
కలలాంటి నువు, గాలిలాంటి నువు
ఫలానా అనుకోవటమే గాయపడటం
ఏమీ కాని నువు, వేకువల తెరచాపలెత్తి
విశాల ప్రపంచంలో ఉరకలేస్తూ సాగాలి
అవన్నీ అలా ఉంచి,
గాయాలని గాలిలో ఆరబెట్టి
ఊరికే ఒక కప్పు టీ తాగి చూడాలి
దాని రుచిలో, వెచ్చదనంలో
కాసేపు మునిగి ఈతలు కొట్టాలి
ప్రశ్నలూ, జవాబులూ
కాగితాల్లా చించి గాలిలో ఎగరేయాలి
గాయమూ నిజం కాదు,
గాయపడేవాడూ శాశ్వతం కాదు
శ్వాసల చేపపిల్లల్ని కాలం నదిలో వదులుతూ,
ఊరికే తమకంగా బతికి వెళ్ళిపోవాలి
*








ప్రసాద్ గారి కవిత్వంతో నాకు చాలా.కాలంగా పరిచయం ఉంది. చెప్పాలంటే నా అభిమాన కవుల్లో ప్రాసాద్ గారు ఒకరు. ఈ కవితలో “గాయాలని గాలిలో ఆరబెట్టి, ఊరికే ఒక కప్పు టీ తాగి చూడాలి” అనే వాక్యం జీవిత సత్యాన్ని ఎంతో అందంగా కవితాత్మకంగా చెప్పారు. గతం తాలూకు ప్రశ్నల కాగితాలను గాలికి వదిలేసి, ఈ క్షణపు వెచ్చదనాన్ని ఆస్వాదించమనే ఈ జీవన తత్వం చాలా గొప్పగా ఉంది. నిజంగా, చలికాలపు ఉదయాన్ని ఒక వెచ్చని టీ ఆస్వాదిస్తూ మనసును సేదదీర్చినంత హాయిగా ఉందీ కవిత. బి వి వి గారు మీకు శుభాకాంక్షలు
ధన్యవాదాలు సర్ 🙏
గొప్ప స్ఫూర్తి కలిగించే కవిత. అభినందనలు సార్.