తెలుగు సాహిత్య లోకంలో కవిత్వ విమర్శకు సరికొత్త దిశను చూపిస్తూ ప్రముఖ రచయిత్రి శైలజామిత్ర అందించిన విశిష్ట గ్రంథం ఆమ్లాన. ఆధునిక తెలుగు కవితా రంగాన్ని సుసంపన్నం చేసిన ముప్పై మూడు మంది కవుల అంతరంగాన్ని ఆవిష్కరించే క్రమంలో, ఇందులో చర్చించిన కవుల కవిత్వ చైతన్యం పాఠకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఈ వరుసలో అఫ్సర్ గారి కవిత్వంలోని తాత్విక చింతన, “వలస” ప్రతీకల వెనుక ఉన్న ఆంతర్మానసిక యాత్రను రచయిత్రి నిశితంగా విశ్లేషించారు. అఫ్సర్ కవిత్వంలో సూఫీ తత్వంతో కూడిన మానవీయ విలువలు ప్రతిబింబిస్తాయి. అలాగే డాక్టర్ వోలేటి పార్వతీశం కవిత్వాన్ని కేవలం అక్షర విన్యాసం కాకుండా “భావజ్ఞానంగా మలచిన జ్ఞానిగా” శైలజామిత్ర కొనియాడారు. సృజనాత్మక స్ఫూర్తితో “రెక్కలు సాచిన ఊహలు” వంటి గేయ సంపుటాల ద్వారా ప్రకృతిని, మానవ సంబంధాలను వారు అద్భుతంగా ఆవిష్కరించారు.
వోలేటి కవితలలో కనిపించే “విశ్వమానవతా దృక్పథం” వారి కవిత్వ గంభీరతను చాటుతుంది. ఈ క్రమంలోనే ఏనుగు నరసింహారెడ్డి కవిత్వంలో ఉట్టిపడే ప్రాంతీయ అస్తిత్వం, సామాజిక అన్యాయం మరియు “తెలంగాణ రుబాయీల” రాజకీయ చైతన్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. నరసింహారెడ్డి “మట్టిపాట” శతకం సామాజిక వాస్తవికతను రేకెత్తిస్తుందని వివరించారు.
మరోవైపు, ప్రజాస్వామిక విప్లవ దృక్పథంతో కలం పట్టిన జూకంటి జగన్నాథం కవిత్వం అక్షరా లా “ఊరి దుఃఖమే” అని రచయిత్రి పేర్కొన్నారు. జూకంటి గారి రచనలలోని గ్లోబలైజేషన్ వ్యతిరేకతపట్ల శైలజామిత్ర నిశిత విశ్లేషణ చేశారు. ఇదే వైవిధ్యాన్ని కొనసాగిస్తూ, పాలపర్తి ఇంద్రాణి కవిత్వంలో కనిపించే మృదుస్వర భావసౌకేమార్యం, “స్త్రీ అంతరంగ ఆవేదన”ను రవూఫ్ కవిత్వంలోని అస్తిత్వ చైతన్యాన్ని, విశ్వ మానవతా వాదాన్ని శైలజామిత్ర అంతే సమర్థవంతంగా ఆవిష్కరించారు.
ఇక కవి కొప్పర్తి కవిత్వంలోని “విషాద మోహనం” గ్రంథంలో వ్యక్తమయ్యే మానవీయ విలువలను, కాల గమనాన్ని రచయిత్రి అద్భుతంగా చర్చించారు. ఈ క్రమంలోనే కవి ఎమ్.ఎస్. నాయుడు వచన కవిత్వంలోని నిగూఢార్థాన్ని, ఆలోచనాత్మకమైన అంతర్ముఖ స్వరూపాన్నివిశ్లేషించారు. రేణుక అయోలా కవిత్వంలో కనిపించే ఖచ్చితమైన స్త్రీవాద ముద్రను, “రవిక”, “ఎర్రమట్టి గాజులు” వంటి సంపుటాల ద్వారా సమాజంలో స్త్రీ ఉనికిని, వైధవ్య ఆచారాలపై ఆమె చేసిన తిరుగుబాటును అత్యంత శక్తివంతంగా ఆవిష్కరించారు.
చివరిగా, స్వాతి శ్రీపాద కవిత్వ భాష అలంకారాల కంటే అనుభూతికి దగ్గరగా ఉంటుంది అని కొనియాడుతూ, ఆమె కవితల్లోని అంతర్ముఖ భావోద్వేగం, స్త్రీవాద చైతన్యం, తాత్విక ఆలోచన, సామాజిక విమర్శ అనే నాలుగు ప్రవాహాల సమ్మేళనాన్ని అత్యంత ప్రతిభావంతంగా సమీక్షించారు.
ఈ పది మంది కవుల సాహిత్య వైవిధ్యాన్ని చర్చిస్తూనే, పుస్తకంలో ఉన్న మిగతా కవుల అంతరంగాన్ని కూడా శైలజామిత్ర అంతే నిష్పాక్షికంగా, సమదృష్టితో సమీక్షించడం ఈ గ్రంథం గొప్పతనం. ఏ ఒక్కరినీ తక్కువ చేయకుండా అందరి కవిత్వ స్పృహను ఒకే సంకలనంలో క్రోడీకరించి భావి తరాల సాహిత్య పరిశోధకులకు ఒక అద్భుతమైన దిక్సూచిగా అందించారు. శీర్షికకు తగినట్లే ఈ వ్యాసాలు ఎప్పటికీ వాడిపోని అక్షర పరిమళాలను వెదజల్లుతూ ప్రతి ఒక్కరూ తప్పక చదవదగిన ఒక విశిష్ట గ్రంథంగా ఆమ్లానను నిలబెట్టాయి.
*








Add comment