ఏడోచేప కోసం… ఎనిమిది కథలు

జీవించడమంటే యథాలాపంగా బతికెయ్యడం కాదు. ఏదో ఒకటి సాధించడం. ఆ సాధించినదానిలోని ఉచితానుచితాల గురించి శోధించడం.

ఆ శోధన-మనలో ఉన్న మనకోసం, మనలో ఉన్న ఇతరులకోసం, ఇతరుల్లో ఉన్న మనకోసం, ఇతరుల్లోనూ మనలోనూ కూడా లేని ఇతరేతరులకోసం నిరంతరంగా సాగే ప్రక్రియ. సాగాల్సిన ప్రక్రియ. వివిధకళా రూపాలుగా సాగే శోధనలో సాహిత్యం పాత్ర ఎనలేనిది. ఆ సాహిత్యరూపాల్లోకూడా కథ పాత్ర అతి సాధారణంగా కనిపించే అసాధారణమైన ప్రభావం చూపించగలది.

తెలుగువాళ్ళందరూ వినే కథల్లో మొదటిది ఏడుచేపల కథ. అందులోని శోధనాక్రమం మనకి జీవితాంతమూ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఏడో చేప ఎండకపోవడానికిగల కారణాలని శోధిస్తూ శోధిస్తూ మనం బంగారు పుట్ట దగ్గరకి చేరుకుంటాం. అందులోంచీ చీమ వచ్చి “కుట్టనా కుట్టనా కుట్టనా” అంటూ మనల్ని జీవితాంతమూ కుడుతూనే ఉంటుంది. అలా కుట్టించుకునీ కుట్టించుకునీ ఆధునిక కాలానికొచ్చేసరికి మనల్ని మనం సరిదిద్దుకోవడం ఎలాగో చెప్పే తొలినాటి కథల్లో దిద్దుబాటంత సౌష్ఠవమైనది మరొకటి ఉండదు. ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఎందరో రచయితలు తెలుగు కథని పరిపుష్టం చేశారు. చేస్తున్నారు. తాము సాగించిన శోధనాఫలాలను ముందుతరాలకు అందిస్తూనే ఉన్నారు. కానీ తక్కువమంది మాత్రమే కథని విశ్వవ్యాప్తం చేస్తూ విశ్వాన్ని తెలుగు కథావ్యాప్తిలోకి  తీసుకొస్తున్నారు. వారిలో టి. సంపత్ కుమార్ ఒకరు.

*

రణం, కరణం, కారణం, వ్యాకరణం ఈ నాలుగూ కథకి నాలుగు స్తంభాలు. ఆ నాలుగింటితో కంకణం కట్టుకున్న కథాజీవకణాలను గుదిగుచ్చి దండకట్టి అందించిన కథాసంపుటం మీ చేతుల్లో ఉంది. ఈ కథల్లో స్థానికత, జాతీయత, అంతర్జాతీయత కలగలసి కొనలుసాగుతాయి. కథావస్తువునించి మొదలుపెట్టి ఆ వస్తువుకు ఎంచుకునే నేపథ్యం, పాత్రచిత్రణం, సంభాషణలు, కథనం, సంవిధానం, శైలి శిల్పాలో మాత్రమే కాకుండా కథనభాషతో సహా అన్నింటిలోనూ  ఈ కలనేత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

*

రిజర్వుబ్యాంకు రద్దు చేసేంతవరకూ పదిరూపాయల నాణెం చేశమంతా చెల్లుబాటవ్వాలి. అది శాసనం. కానీ ఎవరు ఎప్పుడు ఎందుకు మొదలుపెట్టారో తెలియదుగానీ తెలుగు వ్యాపారులందరూ పదిరూపాయల బిళ్ళని తీసుకోవడం మానేశారు. దాంతో ఆ నాణాన్ని తీసుకోకపోవడం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆచారంగా మారిపోయింది. ఆ ఆచారం ఎలా మొదలైందో అలాగే చడీ చప్పుడూ లేకుండా సమసిపోయింది. పదిరూపాయల బిళ్ళని చూసినప్పుడల్లా ఈ ఉదంతం గుర్తొస్తూనే ఉంటుంది. దీని కాలావధి చాలా తక్కువ. కనుక కథల్లోకి తీసుకురాకపోయినా పరవాలేదు.

మన సంప్రదాయాలు కూడా ప్రభుత్వం చేసే శాసనాల్లాంటివే. వాటి కాలావధి చాలా ఎక్కువ. అవి వందలు వేల సంవత్సరాలపాటు అనేకావేక సవరణలతోనూ సద్దుబాట్లతోనూ స్థిరపడతాయి వాటిలో కొన్ని సదాచారాలుగా కొనసాగుతూంటాయి. వాటిని కొనసాగనివ్వాలి. మరికొన్ని  దురాచారులాగానూ మూఢాచారాలుగానూ వికృతంగా నర్తిస్తూనే ఉన్నాయి. వాటి ఆటల్ని అరికట్టాలి.

సంప్రదాయాలకి తరతమ భేదాలుండవు. కాబట్టీ, భార్యకీ భర్తకీ ఒకే సంప్రదాయం.

భర్తలేని స్త్రీ విధవరాలైతే భార్యలేని పురుషుడు విధురుడు. ఇద్దరూ శిరోముండనం చేయించుకోవలసిందే. ఇద్దరూ కోరికలను చంపుకోవలసిందే. ఇద్దరిలో ఎవరూ మళ్ళీ పెళ్ళి చేసుకోకూడదు. ఎవరైనా ఏదైనా శుభకార్యానికి వెళుతున్నప్పుడు ఇద్దరిలో ఎవరూ ఎదురు వెళ్ళకూడదు. ఒకవేళ ఎదురువెళితే దాన్ని అపశకునంగా భావిస్తారు. కానీ సమాజంలో పురుషాధిక్యతవల్ల పురుషుడికి సంబంధించిన ఆచారాలన్నీ వేగంగా సవరణలకు లోనై క్రమంగా కనుమరుగైపోయాయి. ఒంటిబ్రాహ్మణుడు(విధురుడు)ఎదుపడితే అపశకునం అనేది మాత్రం అక్కడక్కడా పాతకాలం శకునం పుస్తకాల్లో మాత్రమే కనిపిస్తుంది.

ఈ కాలంలో స్త్రీలు కూడా శిరోముండనం చేయించుకోవడం లేదు. బొట్టు గాజులూ తీసెయ్యడం లేదు. విధురుడు మళ్ళీ పెళ్ళి చేసుకున్నట్లే వితంతువులు కూడా మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నారు.

ఇది ఆధునిక సమాజం. బయటి సమాజం ఎంత అభివృద్ధి చెందినా ఇంటిసమాజం అంత సహృదయంతో స్పందించదు. ఎందుకంటే బయటి సమాజంలో బయటపెట్టుకోలేని మూర్ఖత్వాల్నీ అమాయకత్వాల్నీ దురవగాహనల్నీ ఇంటి సమాజంలో బయట పెట్టుకునేందుకు బోలెడు అవకాశాలుంటాయి. ఆ అవకాశాల దుష్పరిణామంగా వ్యక్తులు ఇంట్లో ఒకలాగా బయట మరొకలాగా ప్రవర్తిస్తూంటారు. అందుకే కోడళ్ళు నిస్సంకోచంగా ఇళ్ళలో అత్తగారికి “చాటుగదులు” ఏర్పాటు చేస్తారు. ఆ చాటుగదినుండి ఆవిడకి విముక్తి కలిగించడానికి చేసిన ప్రయత్నం ఎలా ఫలించిందో “ఫుట్ బాల్”అనే కథ తెలియజేస్తుంది. ఇది పాత సమస్యకి కొత్త పరిష్కారం. చదువుకున్న ఇంటి కోడళ్ళు కూడా మామగారు పోయాక అత్తగారిని శుభకార్యాలకు దూరంగా ఉంచడం చాలా బాధాకరం.

ఆచారాలన్నీ సంప్రదాయాలను కొనసాగించడానికి చేసుకున్న ఏర్పాట్లు.

మన ఆచారాలని మనుషుల ముఖాలతో పోల్చుకోవచ్చు. ఏ రెండు ముఖాలూ ఒకేలా ఉండవు. ఒకే మనిషి ముఖంలో కూడా కాలనుగుణమైన మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. కానీ ఈ ఆచారాలన్నీ ఏ సంప్రదాయాల్ని కొనసాగించడానికి ఏర్పాటు చేయబడ్డాయో అవి క్రమానుగతంగా ఆచారాల్ని దాటి మనుషులతో రెండువైపులా పదునున్న కత్తులై పోరాడతాయి.  వాటిని మనుషుల్లో ప్రవహించే రక్తంతో పోల్చుకోవచ్చు. రక్తంలోలాగే సంప్రదాయాల్లో కూడా గ్రూపులుంటాయి. ఆ గ్రూపుల్ని మంచి చెడులుగా వింగడించుకోవడంతో మొదలౌతుంది అసలు సమస్య. మన మంచి ఎదుటివారికి చెడుగానూ, ఎదుటివారి మంచి మన కంటికి చెడుగానూ కనిపిస్తాయి. దాంతో ఏది మంచో ఏది చెడో తేల్చుకోలేని పరిస్థితి ఎదురౌతుంది. ఫలితంగా మంచి చెడుల మధ్య ఘర్షణ ఆరంభమౌతుంది. ఆ ఘర్షణల్లో చెడుమీద మంచిని గెలిపించడానికి నిరంతరంగా కృషి చేసేవి సత్సంప్రదాయాలు. అవి ఓ నెగెటివ్ బ్లడ్ గ్రూప్ లాంటివి. అందరికీ పనికొస్తాయి. అందుకే అవి సార్వత్రిక సార్వకాలిక సత్యాలు.

ఓ నెగెటివ్ గ్రూపులాంటి గొప్ప పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే బ్లడ్ గ్రూప్ మరొకటి లేదు. అలాంటి పాజిటివ్ గ్రూపుకి నెగెటివ్ పేరెందుకు పెట్టారో తెలియజేసే కథ-అందమైన నరకం. ఇది ఒక కోమలి కథ. అతి సామాన్యంగా మొదలై అసామన్యమైనరీతిలో ముగుస్తుంది. ఆ అసామాన్యతలోని మాన్యత పేరే జయంత్. అతడు అందరూ ముద్దన్నప్పుడు వద్దన్నవాడు. అందరూవద్దన్నప్పుడు ముద్దన్నవాడు. మల్లెలు వాడిపోవచ్చు. వాటి పరమళాన్ని వాడిపోకుండా చూసే దృష్టి కలిగినవారికి ఆ మల్లెలనుండి సెంటు తీయడమెలాగో తెలుస్తుంది. మల్లెల గుబాళింపును ఇంపుగా దాచుకోవడమెలాగో తెలుస్తుంది. అలాంటి సెంట్ పర్సెంట్ సెంటిస్టు సంకల్పించుకుంటే అతను మానవీయతను నిలబెట్టే సైంటిస్టు కావడం కష్టమేమీ కాదని నిరూపిస్తుందీ కథ.

సంప్రదాయాలన్నీ మన సంసృతిని కొనసాగించడానికి చేసుకున్న ఏర్పాట్లు. మన జాతి సంస్కృతి మన రక్తంలో ప్రవహించే డి ఎన్ ఏ లాంటిది. పరాయి నాగరికతలు ఎన్ని దాడులు చేసినా ఆ సంస్కృతి కొనసాగుతూనే వస్తుంది.

మనం భారతీయులం. మనది భరతజాతి. హిందూస్థానో ఇండియానో కాదు. మన సంస్కృతిలో భక్తికున్న ప్రాధాన్యత దేవుడికి లేదు. అందుకే ఈ భారతదేశంలో బీబీనాంచారిని వెంకటేశ్వరుడికిదేవేరిని చేయడంగానీ, మేరీమాతని ఆరోగ్యమాతగా కొలవడంగానీ, ఊరూరా సాయిబాబాకి గుళ్ళు కట్టి పూజించడంగానీ ఆశ్చర్యంకలిగించదు. విచిత్రమనిపించదు. అంతేకాదు ఇంతటి ఏకాత్మత మరే జాతి సంస్కృతిలోనూ కనిపించదు. ఇంక దేశ భక్తివిషయానికొస్తే …

మాతాచ మాతృభాషాచ మాతృ భూమిశ్చ సర్వదా|

చతుర్వర్గ ఫలాప్త్యైవా సంసేవ్యాః సర్వమానవైః||

అంటూ ధర్మార్ధకామమోక్షాలనే చతుర్విధ పురుషార్ధాలను సాధించడానికి మాతృమూర్తినీ మాతృభాషనీ మాతృభూమినీ సేవించమని చెబుతుంది మన సంస్కృతి.

ప్రతాప్, అజీజ్ ఇద్దరూ బాల్యస్నేహితులు. అజీజ్ సంపాదనకోసం కువైట్ వెళ్ళాడు. ప్రతాప్ కి సైన్యంలో చేరాలనేది ఆశయం. ఆ ఆశయం అనూహ్యమైన రీతిలో నెరవేరింది. సైన్యంలో చేరాడు. యుద్ధం చేస్తున్నాడు. అయినా తృప్తిలేదు. అతని డీఎన్ యే లో రాముడి మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి.

అపి స్వర్ణమయీ లంకా నమే లక్ష్మణరోచతే|

జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ||

ప్రతాప్ గుండె చప్పుళ్ళను విన్న అజీజ్ చెప్పిన మాటలు గుర్తుంచుకోదగినవే కాదు, మన సంస్కృతి కొనసాగింపుకు స్ఫూర్తిదాయకాలు కూడా,”గిట్లనే ఉండు. నీ పని నువ్వు చేసుకుంటా పో. మీ దేవుళ్ళు, మా అల్లా నీవైపే ఉన్నారు. నీకేం కాదురా” ఈ మాటలకు ముందూ వెనుకా చాలా కథ ఉంది. అది స్థానీయతనీ జాతీయతనీ మించిన అంతర్జాతీయత. అది మన జన్మభూమి పరిధి విస్తరించే క్రమాన్ని సూచిస్తుంది. ఇందులోని సమస్య చాలా విభిన్నమైనది. ప్రపంచీకరణ గురించి పదే పదే మాట్లాడేవారెవరూ గుర్తించనిది. ఒకవేళ గుర్తించినా పట్టించుకోనిది. ఇది ఈ రచయితలోని అంతర్జాతీయుడిని మనకి పరిచయం చేసే కథ. దీనిపేరు,”సైనికుడు కాని సైనికుడు” ఈ కథకి ముగింపుని పాఠకులకే వదిలేశారు. ఒకవేళ దానికి ముగింపునిస్తే పాఠకుడిలోని సాంస్కృతికమైన డి ఎన్ ఏ లోని నిర్ణయాధికారంపై తన ఉద్దేశాల్ని బలంగా రుద్దినట్లౌతుంది. ఇటువంటి విషయాల్లో ఎటువైపు ఉండాలనే స్వేఛ్ఛని పాఠకుడికి ఇవ్వాలి. ముగింపు విషయంలో రచయితలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చెబుతుందీ కథ. ఇది ఎక్కడో ఉత్తర తెలంగాణా మూరుమూల పల్లెలో ప్రారంభమై దేశాలనూ ఖండాలనూ దాటి విస్తరిస్తుంది. అంతటి వస్తు విస్తృతి తెలుగు కథల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. దీనికి వైస్ వెర్సాగా ప్రపంచమంతా మన చేతుల్లోకి వచ్చేస్తే జరిగే విపరిణామాలగురించి చెబుతుంది,”చిత్తరువుల చిత్రాలు, అలియాస్ ఫోటోల తూటాలు… అలియాస్ స్టేటస్ కాక్టస్”అనే కథ. ఇలా మూడుపేర్లున్న ఒకే కథని చదవడం మనకి కొత్త.

ప్రపంచం మన చేతుల్లోకి వచ్చేసినంతమాత్రంచేత మనం ప్రపంచమంతా విస్తరించిపోతామనుకుంటే అంతకు మించిన భ్రమ మరొకటుండదు. స్టేటస్ అనే పదానికి వాడుకలో ఉండే అర్థాలు కూడా కథలోనే ఇచ్చారు. హోదా, దర్జా, అంతస్తు, స్థితి, పదవి, స్థాయి. అవస్థ, ప్రతిష్ఠ. కానీ ఈ స్టేటస్ వాటిలో ఏదీ కాదు. అదే ఈ “స్టేటస్ కాక్టస్” కథలోని పెనువిషాదం. ఇలా మూడుపేర్ల కథని చూడటమే కొత్తనుకుంటే ఒకే కథలో మూడు కథల్ని ఇమడ్చడం ఇంకా కొత్త. అలాంటి మూడుకథల బంగారం పేరు “నేను కథని”. ఈ కథ సమీప భవిష్యత్తులో కథల్నెలా కుట్టబోతారో ఊహించి చెబుతుంది.

తెలుగులో ప్రయోగాత్మకమైన కథల సంఖ్య కొంచెం తక్కువనే చెప్పాలి. అలాంటి ప్రయోగాత్మకమైన”నేను కథని” గురించి చెప్పుకోవడానికి ముందు మనం ఓ మూడు తరాలు వెనక్కి వెళ్ళొద్దాం.

ఒకప్పుడు పురాణం సుబ్రహ్మణ్య శర్మ, గొల్లపూడి మారుతీరావు, కొమ్మూరి వేణుగోపాలరావు కలిసి “ఇడియట్” అనే గొలుసు నవల రాశారు. ఆ తరువాత కొన్ని గొలుసు నవలలొచ్చినా ఏదీ దానంత ప్రాచుర్యం పొందలేదు. ఇడియట్ నవల రాసిన ఎనభైయ్యేళ్ళ తరువాత కొత్తగా వచ్చిన తొట్టతొలి గొలుసు కథ”నేను కథని”. అందులో ఒకనవలని ముగ్గురు రాస్తే ఇందులో మూడు కథల్ని ఒక్కరే రాశారు. ఈ గొలుసు కథలోని మూడు కథల్లోనూ ఒకటి అంతర్జాతీయం. మరొకటి జాతీయం. చివరిది ప్రాంతీయం.

సామాన్యంగా జానపదులు చెప్పే కథల్లోనూ పాడే పాటల్లోనూ ఒక పదమో పదబంధమో వాక్యమో పదే పదే వినిపిస్తూంటుంది. దాన్ని “మోటిఫ్” అంటారు. అది విన్న ప్రతీసారీ ఒక్కోలా అర్థమౌతూ ఉంటుంది. ఆ అర్థమైన భావం రచయిత ఉద్దేశించినదైనా కావచ్చు. పాఠకుడు స్వయంగా పూరించుకున్నదైనా కావచ్చు. కానీ అది పదే పదే పదే పునరావృతమౌతూ వస్తుంది. ఈ కథలో “నేను కథని” అనే మాటని పదే పదే వినిపిస్తూంటారు రచయిత. అది బోలెడు గొంతులతో బోలెడు భావాలతో కొనలు సాగుతూపోతుంది. వాటిని వినిపించే గొంతల పేర్లు కూడా మనకి కొత్తకొత్త అనుభూతుల్ని కలిగిస్తాయి. వాటన్నింటినీ పట్టుకోవడం అంత సులభమైతే కాదు. ఒకవేళ మనం పట్టుకున్నా అది మన కథ అవుతుందిగానీ రచయిత కథ కాదు.

సముద్రంలో ఉప్పునీ చెట్టుమీది మామిడికాయల్నీ రోట్లో దంచిన కారాన్నీ కలిపి నూనెలో ఊరేశాక అది ఆవకాయో మాగాయో అవుతుందిగానీ ఉప్పూ కారం కాయలూ కానే కావు. అలాగే ఇందులోని మూడుకథలూ కలిసి ఎండాకాలంలో చలివేంద్రమై సేదతీరుస్తాయి. అయితే ఇందులోని ప్రయోగాత్మకత కొంతమేరకైనా పఠనీయతని తగ్గించిందనే చెప్పాలి. కథల్లో గోప్యత, ధ్వని, సంక్షిప్తతలు అలంకారాలేగానీ ఆ అలంకరణలు ఎక్కువైనకొద్దీ కథపట్ల ఆసక్తిని తగ్గిస్తాయని ప్రయోగాలు చేసే రచయితలందరూ గుర్తించాలి.

*

అందరం అష్టలక్ష్మీ గుడికి వెళతాం. ప్రదక్షిణాలు చేస్తాం సిరిసంపదలు ఇమ్మని మొక్కుకుంటాం. కానీ ఆ అష్టలక్ష్ముల క్రమం మనకి ఏం చెబుతోందో పట్టించుకోము.

మన జీవితానికి శ్రీకారం చుట్టేది ఆదిలక్ష్మి, మనకి భుక్తినిచ్చేది ధాన్యలక్ష్మి, బతుకు బండిని లాగడానికి ఇంధనమిచ్చేది ధైర్యలక్ష్మి. ఆవేశంతో దూకుడుగా కాకుండా ఆలోచనతో నిదానంగా స్పష్టంగా ఆచితూచి ముందడుగు వెయ్యమని చెబుతుంది గజలక్ష్మి. మన సంస్కృతిని వారసత్వంగా ముందు తరాలకు అందిస్తుంది సంతానలక్ష్మి. అందరినీ వెన్ను తట్టి ప్రోత్సహించేదే విజయలక్ష్మి. వీటన్నిటినీ పొందడానికి తగిన అర్హతనిచ్చేదే విద్యాలక్ష్మి. ఈ ఏడుగురు అక్కగార్లనీ సంతృప్తి పరిస్తేగానీ నేను మీ దరికి రానని ధనలక్ష్మి ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటుంది. కానీ దానిని పట్టించుకోకుండా ధనమూలమిదంజగత్తంటూ యావత్ప్రపంచమూ డబ్బువెంట పరుగులు తీస్తోంది.  దురదృష్టమేమిటంటే అన్నీతెలిసిన పెద్దలు కూడా విద్యాలక్ష్మిదాకా ఏడుగురినీ పక్కన పెట్టి ధనలక్ష్మివెంటే పరుగులు తీయడం. అది మన విద్యావ్యవస్థ చేజేతులా తెచ్చిపెట్టిన అవస్థ. ఆ అవస్థీకృత వ్యవస్థని కళ్ళకి కట్టినట్లు చెప్పేదే “దేశం బోయిండ్రు”కథ.

పెద్ద పెద్ద చదువులు చదివినవాళ్ళు కూడా సంపదే ధ్యేయంగా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న కాలమిది. ఇలాంటి కాలంలో ఏమీ తెలియని అమాయక గ్రామీణులు పిల్లలని సంపాదనకోసం ఆరబ్బుదేశాలకు ఊడిగానికై పంపిస్తే అందులో తప్పేముందనిపిస్తుంది. కానీ నందిత అలా అనుకోలేదు. అందుకే పరిస్థితులతో పోరాటానికి నడుం కట్టింది. దేశంబోయినోళ్ళ సహకారంతో కార్యాచరణ ఆరంభించింది. అదిచ్చే స్ఫూర్తిని అందుకోవడానికి మీరు కూడా “దేశంబోయిండ్రు” కథలోకి వెళ్ళాల్సిందే.

*

ఎలాంటి కాలుష్యాలూ అంటని మనుషుల భాష మాండలికం. అలాంటి అచ్చమైన మాండలికంలో సాగిన కథ “మటన్”. కావడానికిది మాంసం కథైనా మెదడుని మనసులో వేసి మరిగించే కథ. అభివృద్ధిపేరిట జిల్లాలు ముక్కలు కావడం వల్ల లాభంకల్లిగిందెవరికి? ఈ ప్రశ్నకి సమాధానం కూడా మటన్ తో బాటుగా లభిస్తుంది. చివరికి మనందరి భవిష్యత్తూ ప్రభుత్వం చేతుల్లోనూ ప్రజల చేతుల్లోనూ కాకుండా అదృష్టం చేతుల్లోనే ఉందని అర్థమై మనల్ని విషాదం కమ్ముకుంటుంది. అయినా సరే కథ మాత్రం సుఖాంతమే అవుతుంది.

ఒక దీపంతో మరొకటి. దానితో ఇంకొకటి. అలా ఒకదానికి ఒకటి అండగా నిలబడిన ఆరు చేతుల కథ “సహాయ హస్తాలు”. మనం మరచిపోయినవాటిని పోగొట్టుకున్నవాటిని పోగొట్టుకోకూడనివాటిని ఎక్కడ కనిపిస్తాయా అని వెతుకుతాం. ఎక్కడా కనపడకపోతే ఏం చేస్తాం? కలల్లోకి వెళ్ళిపోతాం. కానీ మనం కోరుకున్నవేవీ మన కలల్లోకి రావు. మన కలల్లోకి వచ్చేవేవీ మనం కేవలం కోరుకునేవి మాత్రమే కావు. అందుకే కలల్ని వదిలేసి కథల్లోకి వెళతాం. అలా కథలోకొచ్చినవాళ్ళని మానవీయతలోకి తీసుకువెళ్ళే కథ ఇది.

సంపత్ కుమార్ గారి కథల్లోలాగే వారు ఉపయోగించే భాషలో కూడా స్థానీయత జాతీయత అంతర్జాతీయతల సమ్మేళనం కనిపిస్తుంది. ఉదాహరణకి “చప్పట్లు ఆలాప్ రూపంలోకి మారిపోయాయి” అంటారు. ఆలాప్ అంటే హిందూస్థానీ ఆలాపన. ఆ “ఆలాప్” కోమలి కొత్త జీవితానికి జయంత్ మనిషితనం చేసిన ఆలాపనని సూచిస్తుంది.  హిందూస్థానీ ఆలాపన శాంత గంభీరంగా ఉంటుంది. హిందీ నుడికారంమీద పట్టున్నవారే ఇలాంటి ప్రయోగాలు చేయగలరు. అలాగే “అందాల్ని గుణకారం చేసి పోషించిన ముగ్ధమనోహర రూపం’ అనగానే తెలుగువాళ్ళకి మామూలుగా గుర్తొచ్చే గణితంలోని గుణకారం కాకుండా “అందాన్ని మల్టిపుల్ డైమన్షన్స్ లో చూపించడం” అనే అర్థం స్ఫురిస్తుంది. ఆంగ్లంలో ఆలోచించి తెలుగులో రాసినప్పుడు ఇలాంటి కొత్త వ్యక్తీకరణలు పుడతాయి.. కథన భాషలో ఇలాంటి జుగల్బందీలు రసాస్వాదకుల మనసుకు హత్తుకుంటాయి.  కేవలం మాతృభాషలో మాత్రమే ఆలోచించి రాసినప్పుడు అది కూడా కొత్తదనంతో ఎలా ఆకర్షిస్తుందో చెప్పడానికి ఉదాహరణగా మటన్ కథలోని మాండలికాన్ని పేర్కొనవచ్చును. ఇలాంటి భాషాపరమైన ప్రయోగాలు, కవితామయమైన వాక్యాలు, గంభీరమైన భావతరంగాలూ చాలా చోట్ల కనిపిస్తాయి. ఇవన్నీ కలిసి పాఠకుడిలో పఠనాసక్తిని పెంపొందిస్తాయి. కథన పరంగా చూసినప్పుడు ఇందులోని కథలన్నీ(నేను కథని తప్ప) సరళసుందరమైన శైలిలో విన్యసించడం కనిపిస్తింది. సంవిధానంలో కూడా ఎక్కడా గజిబిజి ఉండదు. కథాకాలాన్ని ముందుకీ వెనక్కీ పరిగెత్తించకుండా సూటిగా చేయి పట్టుకుని నడిపించుకుపోతుంది. సంఘటనలూ సన్నివేశాలూ చాలావరకూ ఊహకందనివిగా ఉంటూ, పాఠకుడిలోని రచయితని మేల్కొలుపుతాయి.

పాఠకుల్ని ప్రాంతీయతనుండి జాతీయత మీదుగా అంతర్జాతీయ వీధుల్లోకి తీసుకెళ్ళి మనిషిని విశ్వవ్యాప్తం చేస్తాయీ కథలు. మనకి తెలియని కొత్త ప్రపంచంలోకి తీసుకువెళతాయి. మనం ఊహించలేని వాస్తవాలని కళ్ళకి కడతాయి.

*

జొన్నవిత్తుల శ్రీరామచంద్ర మూర్తి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.