“రేపు క్లాస్ తర్వాత ఫ్రెండ్స్ బేకరీ దగ్గర కలుద్దామా?” అని వాట్సాప్‌లో మెసేజ్ చేసాడు అంకిత్.
అటు నుంచి ఏదో పెద్ద మెసేజ్ రాబోతున్నట్టు చాలా సేపు ‘టైపింగ్ టైపింగ్’ అని వచ్చింది కానీ తీరా చూస్తే “వీలు కాదు” అని మాత్రమే వచ్చింది.
“ఎందుకు?”
“రేపు డాడీకి సెలవు. ఎర్లీగా ఇంటికి పోవాలి”
డీపీలో ఆ అమ్మాయి ఫొటో జూమ్ ఇన్ చేసి చూసుకున్నాడు. కళ్ళూ పెదాలూ నవ్వూ…
“మిస్సింగ్ యూ” అని టైప్ చేసాడు. ఇదెలాగూ పంపనులే అన్న ధీమాతో ఆ పదాల వంకే చూస్తున్నాడు. కానీ లోపలి నుంచి ఏదో తెగింపు బొటన వేలి మీద పని చేసింది. సెండ్ కొట్టేసి, చేతి లోంచి ఏదో గాజు వస్తువు జారిపడినట్టు కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు తెరిచేసరికి ఆ మెసేజ్‌కి బ్లూటిక్స్ ఉన్నాయి. ఫోన్‌కి దగ్గరగా ముఖం పెట్టి మరీ ఎదురు చూసాడు.
అతని మెసేజ్‌కే థంబ్స్ అప్ ఈమోజీ ఏడ్ అయ్యింది తప్ప రిప్లయ్ ఏమీ రాలేదు.
వేళ్ళలో సంకోచం– “ఏమైంది నీకు ఇవాళ” అని టైప్ చేసి, డిలీట్ చేసి, “ఎవ్రీథింగ్ ఓకె?” అని పంపాడు.
“వై డూ యూ ఆస్క్?”
“మామూలుగా లేవు”
“మామూలుగానే ఉన్నాను”
“ఏదైనా కోపమా?”
“ఎందుకు కోపం?”
“ఏమో?”
“మళ్ళీ మాట్లాడదాం… బై”.
కొట్టినట్టు వచ్చింది ఈ లాస్ట్ మెసేజ్.
దానికి తంబ్స్ అప్ కొట్టి, ఫోన్ కోపంగా పక్కన పెట్టాడు.
ఇప్పుడిప్పుడే “స్నేహం” హద్దులు దాటి, దాటుతున్నాం అని ఇద్దరికీ తెలిసినా పైకి ఆ మాట రానివ్వకుండా, “ప్రేమ” అన్న మాట ఎక్కడా పైకి తేకుండా, ఆ రెండింటి మధ్యనుండే పొలిమేరల్లో ఎక్కడో తిరుగుతున్నారు ఇద్దరూ. ఇవాళ ఎక్కడో ఏదో చెడింది. ఏంటో తెలీటం లేదు. నిన్న కూడా బానే మాట్లాడింది. ఈలోగా ఏమైయ్యుంటుంది? ఎక్కడైనా మాట తూలాడా, ఎవరైనా మూడో మనిషి జోక్యం చేసుకున్నారా….
మెట్ల మీద వెనక్కి వాలి, చేతిని తల కింద పెట్టుకుని, అలా అసౌకర్యంగానే పడుకున్నాడు.
ఆదివారం రాత్రి. కింద వీధిలో పిల్లల సందడి. ప్లాస్టిక్ బేట్ మీద రబ్బర్ బాల్ చప్పుడు. పరుగులు, అరుపులు ‘క్యాచ్ క్యాచ్!’ అని. మధ్యలో ఏదో బాల్కనీ లోంచి ‘రేయ్ పొద్దున్నే స్కూల్’ అని ఆడ గొంతు.
రేపు కాలేజీకి వెళ్ళే దాకా ఈ అయోమయం భరించాలీ అనుకుంటే కష్టంగా ఉంది అంకిత్‌కి. ప్రేమ అంటే నమ్మకంగా ధీమాగా ఉండాలి కదా? మరి ఇలా ఎక్కడ అడుగేస్తే నేల కుంగుతుందో అన్నట్టు భయం భయంగా ఎందుకుంది? ఆడా మగా రిలేషన్‌షిప్స్ అంటేనే ఇంతా….
సాయంత్రం అమ్మానాన్నల మధ్య జరిగిన గొడవ గుర్తొచ్చింది. ఏవో ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్. అమ్మ డబ్బుల గురించి వర్రీ అవుతుంటే, నాన్నకి కోపం వచ్చింది. ఇద్దరూ మాటకి మాట అనుకున్నారు. నాన్న కోపంగా అరిచి బైటికి వెళ్ళిపోయాడు.
ఇప్పుడు ఇంట్లో అమ్మ ఒక్కతే ఉంది.
ఏం చేస్తుందో!
లేచి మెట్లు దిగి కిందకు వెళ్ళాడు.
***
అమ్మ వంటగదిలో పిండి కలుపుతూంది. ఆమె ముఖం నిండా నిశ్శబ్దం.
ఆమెని ఎలా కదపాలో అంకిత్‌కి తెలీలేదు. స్టాండ్ లోంచి గ్లాస్ తీసుకుని ఫిల్టర్ కింద నీళ్ళు పట్టుకున్నాడు. “ఆయన తిట్టిన తిట్లన్నీ తినేసి ఇప్పుడు ఆయనకి చపాతీలు చేసి పెడుతున్నావా?” అన్నాడు.
అమ్మ ఆలోచన లోంచి తేరుకున్నట్టు చూసింది. నిట్టూర్చింది.
“అది అదే, ఇది ఇదే,” అంది.
“ఏంటింతకీ గొడవ?”
“ఏదో పెద్దాళ్ల గొడవలే, నీకెందుకు.”
“డబ్బుల విషయమా.”
“ఎప్పుడూ ఉండేదేలేరా.”
“ఈమధ్య ఎక్కువ వర్రీ అవుతున్నావు.”
“మరి! యాభైల్లోకి వచ్చేశాం. ఇక మీదట ఏవో ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. కనీసం ఒక నాలుగైదు లక్షలైనా బేంకులో లేకపోతే ఎలాగ. ఏదైనా అనుకోనిది వస్తే ఎక్కడికి పరిగెత్తాలీ. చెప్తే అర్థం చేసుకోడు మీ నాన్న.”
“ఆయన చేయగలిగేది చేస్తున్నాడు కదామ్మా.”
అమ్మ నవ్వింది. “మీ నాన్నకి సపోర్ట్ రమ్మంటే ముందే ఉంటావే!”
అంకిత్ నవ్వాడు.
“చేయగలిగేది చేస్తున్నాడు లేరా. ఒరేయ్… ఆయన్ని నేనెప్పుడైనా అది తేలేదు ఇది తేలేదు అని గానీ, చీరలూ బంగారాలని గానీ అడగటం నువ్వు చూసావా. ఎప్పుడైనా అడిగితే ఒక చిన్న ఇల్లు సంపాయించుకోగలమేమో చూడూ అని అడుగుతాను. అది కూడా ఈ సిటీలో కాదు. రేపు నీ చదువైపోయి ఉద్యోగమొచ్చి బైటికి వెళ్ళిపోయాకా మాకు ఇక్కడేం పని. ఈ సిటీలో అద్దెయింట్లో చచ్చిపోతే ఇంటి ముందు టెంటు కూడా వేసుకోనీయరు. ఊళ్ళో ఓ వందా రెండొందల గజాల స్థలం ఉన్నా చాలు రేకుల షెడ్డైనా వేసుకుని బతికేయొచ్చు. పోనీ ఇంటి సంగతి వదిలేయి. ఏదైనా అనారోగ్యమొస్తే ఖర్చుపెట్టడానికైనా కొంచెం డబ్బు పక్కన ఉంచుకోకపోతే ఎలాగ. ప్రతిదానికీ తడుముకుంటూ ఎన్నాళ్ళిలాగ. ఎల్లకాలం ఒకేలా గడుస్తుందా. మొన్న మీ నాన్నకి షుగర్ అంటే ఎంత కంగారుపడ్డాం! ఈమధ్య ఒక రీల్లో చూశాను- షుగర్ వల్ల ఎన్ని కాంప్లికేషన్స్ వస్తాయో చెప్తుంటే భయమేసిపోయింది. దానికితోడు బీపీ! అలా అని జార్తగా ఉంటాడా అంటే ఉండడు మనిషి. ఇప్పుడు చూడు. మళ్ళీ తాగుతానని బైటికి పోయాడు.”
అమ్మ మాట్లాడిన ఇన్ని మాటల్లో ఒక మాట దగ్గరే అంకిత్ మనసు ఆగిపోయింది- తను ఉద్యోగం తెచ్చుకుని బైటికి వెళ్ళిపోవటం అన్న మాట దగ్గర. మామూలుగా ఐతే చదువయ్యాకా మొదలయ్యే జీవితం గురించి ఎప్పుడెప్పుడా అన్నట్టు ఉత్సాహం… కానీ ఇప్పుడు తను బైటికి వెళ్ళిపోగానే ఈ ఇల్లు కూడా కదిలిపోతుంది అనుకుంటే… బెంగ.
అమ్మ అది చూసింది.
“సరేలే… ఈ గోలంతా ఎప్పుడూ ఉండేదే. నువ్వేమీ పట్టించుకోకు. బాగా చదువుకోరా. మంచి ఉద్యోగం తెచ్చుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలి.”
ఉత్తప్పుడైతే కెరీర్ మాటొస్తే- అందర్లా ఉద్యోగం చేయనూ ఇంకేదో అవుతానూ అని వాదనకి దిగేవాడు. ఇప్పుడు వాదించబుద్ధి కాలేదు. ఎలాగూ ఇక్కడి నుంచి బైటికి వెళ్ళిపోయేదానికి, బైటికి వెళ్ళి ఏం పీకితే ఏముందిలే అన్నట్టు.
“ఒరే, టైమ్ తొమ్మిదైపోతుంది! ఆయన కోపంలో బారుకి బండేసుకుని వెళ్ళిపోయాడు. కాస్త నువ్వెళ్ళి తీసుకురా,” అంది అమ్మ.
“కోపంలో ఏం కాదులే. తన రెగ్యులర్ ఆదివారం ప్లాన్ ప్రకారమే వెళ్ళాడు. పైకి మాత్రం ఇంట్లో కోప్పడి బైటికి వెళ్ళిపోతున్నట్టు కలరింగ్ ఇచ్చాడంతే.”
“వెళ్తే వెళ్ళాడు లేరా. అది కాదు. ఇప్పుడు తాగి బండి నడుపుతాడు కదా!”
“వస్తాడులేమ్మా. ఎన్నిసార్లు రాలేదు.”
“ప్లీజ్ రా! నాకు ఈమధ్య కంగారుగా ఉంటుంది. ఇదివరకూ అంటే తప్పేది కాదు. చెప్తే వినేవాడూ కాదు. ఇప్పుడు నువ్వున్నావు కదా.”
“డ్రైవింగ్ లైసెన్స్ రావటం కాదు గానీ పనులన్నీ నాకే చెప్తున్నారే!”
“ఇంట్లో పనులకి కూడా అలా అంటే ఎలారా!”
“సర్లే ఆటోకి డబ్బులేయి.”
అమ్మ సింక్‌లో చేతులు కడుక్కుని ఫోన్ వైపు నడిచింది.
***
నాన్న రెగ్యులర్‌గా వెళ్ళే బారు హైవే వారన ఉంటుంది. ‘శ్రీదుర్గా బార్ అండ్ రెస్టారెంట్’ అని బోర్డు ఉన్నచోట అంకిత్ ఆటో దిగాడు. పార్కింగ్‌లో నాన్న బైక్ కోసం వెతుకుతూ, నాన్నకి కాల్ చేశాడు. రింగ్ అవుతుంది కానీ ఎత్తటం లేదు. పాన్ మరకల గోడ పక్కన మెట్లు ఎక్కి పైకి వెళ్ళాడు.
అంకిత్ బార్‌లో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. లోపల నీడలదే రాజ్యంలా ఉంది. సీలింగ్ మీద మసక లైట్ల చుట్టూ సిగరెట్ పొగ కదులుతుంది. అంకిత్‌కి ఏ కొత్త గదిలో అడుగుపెట్టినా ఉండే ఇబ్బంది ఇక్కడ రాలేదు. ఎందుకంటే ఎవరూ అతని వైపు చూడటం లేదు. ఒక్కో టేబిల్ చుట్టూ ఒక్కో లోకం అన్నట్టు ఎవరికి వాళ్ళు ఉన్నారు. ఎక్కువమంది సంతోషంగా కనపడుతున్నారు. నవ్వులూ గట్టిగా మాటలూ వినపడుతున్నాయి. నాన్న కూడా ఒక మూల టేబుల్ దగ్గర కనపడ్డాడు. టేబిల్ మీదకి వంగి ఏదో విషయం మీద సీరియస్‌గా మాట్లాడుతున్నాడు. అస్సలు తనకి తెలిసిన నాన్నలా లేడు. ఆ టేబిల్ దగ్గర నాన్నతో కలుపుకుని మొత్తం నలుగురు ఉన్నారు.
అంకిత్ టేబిల్ దగ్గరకి వచ్చి నిలబడే దాకా నాన్న అంకిత్ వైపు చూడలేదు. చూడగానే ముఖం నిండా సంతోషంతో, “ఒర్రేయ్!” అన్నాడు. తన పక్కన కూర్చున్న ఫ్రెండ్‌ని కొంచెం గోడ వైపు జరగమని చెప్పి తను కూడా జరిగి అంకిత్‌ని పక్కన కూర్చోబెట్టుకున్నాడు.
నాన్న ఫ్రెండ్స్ ముగ్గురూ అంకిత్‌కి పరిచయమే. అమ్మ ఎప్పుడూ తిట్టుకునే ఫ్రెండ్స్ వీళ్ళంతా. వీళ్ళల్లో ఇద్దరు నాన్నకి అప్పులిచ్చారు. వడ్డీలతో సహా వెనక్కి వసూలు చేశారు. ఒకడైతే ఇంటికి వచ్చి గొడవ కూడా పెట్టుకున్నాడు. అయినా నాన్నకి కోపం ఉండదు. ఫ్రెండ్స్‌ని సులువుగా క్షమించేస్తాడు.
“అప్పుడే మీ నాన్నకి తోడు వచ్చేస్తున్నావ్ రోయ్,” అన్నాడు ఒక ఫ్రెండ్.
అంకిత్ మొహమాటంగా నవ్వాడు.
రంగేసిన జుట్లతో, గరుకు చెంపలతో, పెద్దవాళ్ళముఖాలు.
“కాసేపు కూచోరా. ఇంక లాస్ట్ పెగ్గు,” అన్నాడు నాన్న. చిన్నప్పుడు తాగిన నాన్న అంటే అంకిత్‌కి భయంగా ఉండేది. సినిమాల్లో తాగుబోతు సీన్స్ గుర్తొచ్చి పారిపోయి మంచం కిందా తలుపు మూలా దాక్కునే వాడు. కానీ ఇప్పుడు తాగిన నాన్న బానే నచ్చుతున్నాడు.
“వాడికీ ఒక గ్లాసు పోస్తే మనతో కూర్చుంటాడు కదా,” అన్నాడు ఫ్రెండ్.
“ఛ ఛ! వాడు తాగడు. ఏరా కూల్ డ్రింక్ ఏమైనా తెప్పించనా!”
“వద్దు. నువ్ కానీయ్. అమ్మ త్వరగా రమ్మంది.”
“ఎందుకు? నా బుర్ర తింటానికా,” అన్నాడు నాన్న, అంకిత్‌కే వినపడే లాగ మెల్లగా.
“నీ గురించే కద చెప్పేది,” అన్నాడు అంకిత్.
“ఆ! అమ్మకి సపోర్ట్ రమ్మంటే ముందే తయారు,” అన్నాడు నాన్న.
అమ్మ అన్న మాటే నాన్న కూడా అనటం చిత్రంగా అనిపించింది.
వెయిటర్ ఇంకో రౌండ్ పెగ్గులు, స్టఫ్ ఉన్న ప్లేట్లు తెచ్చి, టేబుల్ మీద ఖాళీ చూసి సర్దాడు.
ఆ ప్లేట్లలో పచ్చ బఠానీ వేపుడు ఉన్న ప్లేటుని అంకిత్ తన వైపు తీసుకున్నాడు. నాన్నా, ఆయన ఫ్రెండ్సూ మాట్లాడుకునే మాటలు చిన్నప్పటిలా గాక ఇప్పుడు తనకూ అర్థం కావటం, ఆ టాపిక్స్ మీద తనకూ ఒపినియన్స్ ఉండటం అంకిత్ కొత్తగా గమనించుకున్నాడు. మధ్యలో ఒక సందర్భంలోనైతే కలగజేసుకుని మాట్లాడాడు కూడా. వెయిటర్ ముస్లిం అని తెలిసి నాన్న ఫ్రెండ్ ముస్లింల మీద మాట్లాడటం మొదలెట్టాడు. ముస్లింలు ఎంతమంది పిల్లల్ని కంటే అంత ఆస్తి అనుకుంటారనీ, ఒకపక్క వాళ్ళేమో ఇలాగే పిల్లల్ని కనేస్తూపోయి ఇంకోపక్క హిందువులేమో ఫేమిలీ ప్లేనింగ్ అంటూ ఆగిపోతే కొన్నాళ్ళకి హిందువులే మైనారిటీ ఐపోతారనీ, అది ఎంత ప్రమాదమో ఫలానా యూట్యూబ్ ఛానెల్ ఫాలో ఐతే తెలుస్తుందనీ చెప్తున్నాడు. “అప్పుడు మనం కూడా ఆ మతానికి మారిపోతే ఏ గొడవా ఉండదు కదా అంకుల్!” అన్నాడు అంకిత్. నాన్న నవ్వేడు కానీ నాన్న ఫ్రెండ్ మాత్రం నాలుగో పెగ్గులో ఎంత హర్ట్ అవ్వాలో అంతా ఐపోయాడు. ఇంకో ఫ్రెండ్ కలగజేసుకుని టాపిక్ మార్చాడు. తర్వాత కాసేపు అందరూ స్థలాల రేట్ల గురించీ, ఎలక్ట్రిక్ కార్ల గురించీ, మసాజు పార్లర్ల గురించీ మాట్లాడుకున్నారు. ఇందాక ముస్లింల మీద మాట్లాడిన ఫ్రెండే సిటీలో ఏ స్పాలో ఎక్‌స్ట్రా సర్వీసులు ఇస్తారో చెప్పబోయాడు. అంకిత్ నాన్న “ఏయ్ ఆపరా పిల్లల ముందు!” అని కసురుకున్నాడు. కాసేపటికి ఫ్రెండ్స్ ముగ్గురూ ఇంకో పెగ్ తెప్పించుకున్నారు. నాన్న ఇంక వెళ్తానని లేచాడు.
మెట్లు దిగుతున్నప్పుడు నాన్న అంకిత్ భుజం మీద చేయి వేశాడు. “చూశావారా అలా లైఫ్‌ని గజాల్లెక్కన కొలవగలిగితే నేనూ బాగుపడేవాడ్ని. మనకేమో అది అబ్బలేదు.”
తెల్లటి ముఖంతో, తెలుపూ నలుపూ కలిసిన గెడ్డంతో, ఎక్కడి నుంచో పడుతున్న స్ట్రీట్ లైట్ వెలుగులో నాన్న అందంగా కనపడ్డాడు. అందంలో నాన్న పోలిక రాలేదని అప్పుడప్పుడూ లోపల బాధ పడుతుంటాడు అంకిత్.
“ఏం ఫర్లేదు. ఇలాగే ఉండు. నువ్వు కూడా వాళ్ళలాగా మాట్లాడితే అస్సలు భరించలేం.”
“నేను ఇలా ఉంటేనే నీకు నచ్చుతుందంటావ్?”
“అవును”
“ఫెయిల్యూర్ లాగ”
“అలా ఎందుకనుకుంటావ్? నువ్వు ఫెయిల్యూర్ అని నేనెప్పుడూ అనుకోలేదు. అసలు నేను ఆ లెక్కలో ఆలోచించను.” మామూలుగా ఐతే ఇక్కడితో ఆపేసేవాడే కానీ, అలా మెట్ల మీద తన ముందు అందంగా, కొంచెం బేలగా, మందు మత్తులో పెండ్యులమ్ లాగా ఊగుతున్న నాన్న ముఖాన్ని చూస్తూ, ఇప్పుడు ఏమన్నా రేపు ఎలాగా మర్చిపోతాడని తెలుసు కాబట్టి, “అసలు సక్సెసా ఫెయిల్యూరా అని కాదు, యు ఆర్ ఎ గ్రేట్ ఫాదర్, అది చాలు,” అన్నాడు.
“పెద్ద పెద్ద మాటలొచ్చేస్తున్నాయిరా చిన్నమ్మా నీకు,” అని మీదకి వొంగి బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు నాన్న.
“సర్సరే పద,” అన్నాడు అంకిత్ చెంప తుడుచుకుని.
కానీ నాన్న ఇంకా టాపిక్ అవలేదన్నట్టు అంకిత్‌ని మెట్టు దిగకుండా ఆపాడు, “నిజంగా చెప్పరా- వీడి దగ్గరే ఎందుకు పుట్టాన్రా బాబూ అని ఎప్పుడూ అనిపించదా?”
“అబ్బా పద నాన్నా!”
“చెప్పురా. ఏ పైసలున్నోడికో పుట్టుంటే బావుండేది అనిపించదా?”
“అనిపించదు.”
“నువ్ మంచోడివిరా. కానీ నాకు మాత్రం అనిపించేది రోయ్. నేను మంచి బలిసిన ఫేమిలీలో పుట్టుంటే బావుండేదీ అని. డబ్బు లేకపోతే.. యమ్మా ఏం చేయాలన్నా చుట్టూ అంతా నొక్కేసినట్టు ఉంటాదిరా. సంపాయించాలి, బాగా సంపాయించాలి. నా వల్ల ఎలాగా కాలేదు. ఆ ఎదవ ఏక్టింగ్ పిచ్చి తోటి లైఫ్‌లో అసలైన టైమంతా వేస్ట్ చేసుకున్నాను. తెలివొచ్చి చూసేసరికి అందరూ సెటిలైపోయున్నారు. నువ్వ నాలా రాంగ్ ట్రాకులేం పట్టకూడదు. ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాలి.”
అంకిత్ ఇంకో అప్పుడైతే, నేను అందర్లా ఉద్యోగం చేయనూ అని వాదనకి దిగేవాడు కానీ, ఇప్పుడు ఏమనలేదు. నాన్నకి కోపం తెచ్చేలా మాట్లాడి ఈ గారం పోగొట్టుకోబుద్ధి కాలేదు. “సర్లే బండి కీస్ ఇవ్వు,” అని తీసుకున్నాడు.
అంకిత్ బండి నడపటం మొదలుపెట్టి రెండేళ్ళవుతుంది గానీ లైసెన్స్ లేదని ఎప్పుడూ హైవే మీదకి రాలేదు. ఇప్పుడు ఇలా ట్రాఫిక్ లేని ఆదివారం రాత్రి నాన్నని వెనకాల కూర్చోబెట్టుకుని, హేండిల్ బార్ మీద దర్జాగా చేయి వేసి, రోడ్డు వారన స్ట్రీట్ లైట్ల వెలుగు కింద బండి నడపటం బాగుంది.
నాన్న అంకిత్ భుజం మీద తల వాల్చాడు.
“నాన్నా నిద్రపోకు,” గట్టిగా అన్నాడు అంకిత్.
“కళ్ళు వాలిపోతున్నాయిరా…”
“బేలన్స్ ఉండదు బండి!”
నాన్న ఇక తప్పదన్నట్టు నిటారుగా కూర్చున్నాడు. నాన్నకి ఒక విషయం గుర్తొచ్చి నవ్వొచ్చింది. “చిన్నప్పుడు నిద్రలేపి స్కూలుకి తీసుకెళ్తుంటే ఇలాగే భుజం మీద పడి నిద్రపోయేవాడివి. నేనూ ఇలాగే కసురుకునేవాడ్ని. ఎదవా ఇప్పుడు నన్ను కసురుకుంటున్నావ్!”
ఆ జ్ఞాపకంతో అంకిత్ ముఖం మీద కూడా నవ్వు వచ్చింది. చిన్నప్పటి నాన్న వీపు వేడి, నాన్న పొట్ట చుట్టూ కలిసీ కలవని తన చేతులు….
బండి స్పీడుగా తోలితే ఇల్లు త్వరగా వచ్చేస్తుందన్నట్టు మూడో గేరు లోకి దించి, చేతి కింద ఇంజన్ తిరగటాన్ని ఫీలవుతూ, మెల్లగా పోనిచ్చాడు.
దారిలో దాబాలు దాటుతున్నప్పుడు నాన్న, “తినేసి పోదామారా?” అన్నాడు.
“అమ్మ చపాతీలు చేసింది,” అన్నాడు అంకిత్.
నాన్న కాసేపు నిశ్శబ్ధంగా ఉండి, “ఎలా ఉంది మీ అమ్మ మూడు?” అన్నాడు.
“నువ్వెళ్ళాకా కాసేపు బెడ్రూమ్ లోంచి బైటికి రాలేదు. ఏడిచిందనుకుంటాను.”
“బుర్ర తినేస్తుందిరా మనుషులది! నేనేమన్నా ఆడుకు దొబ్బుతున్నానా? చేతనైన పని చేస్తున్నానూ, చేతనైనంత సంపాయిస్తున్నాను! ఒకేసారి రిచ్ ఐపోవాలంటే ఎక్కడైపోతాం. చుట్టాలని చూసి పోల్చుకుంటే ఏమొస్తది. ఎవరి తాహతుని బట్టి, శక్తిని బట్టి ఆళ్ళ సంపాదన. నా శక్తిని బట్టి నా సంపాదన ఇంతే! నువ్వు నా బండెక్కి కూర్చున్నప్పుడు నా స్పీడు లోనే కదా తోల్తాను.”
నాన్న తాగిన మత్తులో ఉన్నాడు కాబట్టి తనతో ఈ టాపిక్ మాట్లాడుతున్నాడని అర్థమైంది. నాన్న మాటల్లో తెలుస్తున్న ఫేమిలీ సిచ్యువేషన్ కలిగించే బాధ కంటే- ఈ టాపిక్ డిస్కస్ చేసేంత పెద్దరికాన్ని తనకి అప్పజెప్పాడన్న సంతోషమే అంకిత్‌కి ఎక్కువ కలిగింది.
“అమ్మ వర్రీ డబ్బుల గురించి కాదు. నీ ఆరోగ్యం గురించి. ఏమైనా అయితే మన దగ్గర సరిపడా సేవింగ్స్ లేవని.”
“ఖర్చు పెట్టగలిగినంత ఖర్చు పెడతాం, ఖర్చు పెట్టలేనప్పుడు ఆ వచ్చిన రోగమేదో దాని చెయ్యి పట్టుకుని అటే పోతాం.”
“పిచ్చి మాటలు కాదా నాన్నా?”
“మరీ…? ముందసలు ఈ టెన్షన్‍తో కొత్త రోగాలొచ్చేలా ఉన్నాయిరా!”
“నీకు షుగర్ అని తెలిసినప్పటి నుంచి అమ్మ కూడా టెన్షన్ పడుతుంది. నువ్వేమో అలవాట్లేం మార్చుకోవు. అదే తిండి, అదే తాగుడు.”
“నా తాగుడు మిమ్మల్నేం చేసిందిరా? నెలకొకసారి?”
“ఈ నెల ఇది రెండోసారి.”
“ఇంట్లో తలకాయ తినేస్తుంటే ప్రశాంతత కోసం ఇంకాస్త తాగాలనిపిస్తది.”
“ఆ అనిపిస్తది అనిపిస్తది! నాన్నా… అమ్మ డబ్బు మనిషి కాదని నీకూ తెలుసు. ఇన్నేళ్ళల్లో నువ్వు అమ్మకి ఓ నగ కొనిపెట్టింది లేదు, కాస్త సరదాగా అటూ ఇటూ తిప్పిందీ లేదు. ఐనా ఏ రోజూ తను కంప్లయింట్ చేయగా నేను చూళ్ళేదు. ఇప్పుడు సడెన్‌గా డబ్బు గురించి ఎందుకు మాట్లాడుంటదో ఆలోచించవా? నీ ఆరోగ్యం కోసమనే కదా. నీ కోసమే బ్రౌన్ రైస్ తింటుంది, షుగర్ లెస్ టీలు తాగుతుంది. కొంచెం అర్థం చేసుకోవాలి కదా.”
నాన్న కాసేపు సైలెంటుగా ఉండి తర్వాత మాట్లాడాడు: “సరదాగా అటూ ఇటూ తిప్పిందే లేదా! దొంగెదవా… లాస్ట్ ఇయరే కదరా షిరిడీ పోయాం!”
“దాన్ని సరదాగా తిప్పడం అంటారా- పుణ్యక్షేత్రం తీసుకుపోయి, మెట్లెక్కించి, క్యూల్లో నిలబెట్టీ?”
“మరి ఈ వయసులో ఊటీ కొడైకెనాల్ హనీమూన్లకి పోతావేంట్రా? ఐనా ఒరేయ్– ఏం వత్తాసు పలుకుతున్నావ్ రా మీ అమ్మకి! ఎన్నెన్ని మాటలు నేర్చావ్!”
అంకిత్ ముఖం మీద చెంపలు నొప్పెట్టేంత నవ్వు.
“కానీ… అలాగే ఉండాల్రా. నువ్వు మీ అమ్మ పక్కన అండగా ఉంటేనే నాకూ నా ఆరోగ్యం గురించి ఏ దిగులూ ఉండదు. రేపు నేను టపా కట్టేసినా… ఫర్లేదు, నువ్వుంటావన్న ధైర్యం ఉంటుంది!”
“నా మీద తోసేయకు. నా లైఫ్ నాకుంది. నువ్వే కాస్త ఆరోగ్యంగా ఉండి మీ ఆవిడ్ని చూసుకో! ఆవిడకి ముందు నువ్వు కావాలి, తర్వాతే నేను.”
నాన్న వెనక నుంచి అంకిత్ పొట్ట మీద చేతులు ముడేసాడు.
“ఇదిగో… పడతాం!” అని విసుక్కున్నాడు అంకిత్.
***
గొడవ పడిన తర్వాత ఉండే నిశ్శబ్దం అమ్మానాన్నల మధ్య. అమ్మ చపాతీలు గిన్నెలోంచి తీసి కంచాల్లో పెట్టి, గుంట గరిటెతో చికెను కూర తీసి వడ్డిస్తా ఉంది. నాన్న అవసరం లేనంత శ్రద్ధగా, గంభీరంగా అమ్మ చేతి వంక, వడ్డన వంక చూస్తున్నాడు. ఆ గాంభీర్యంలోకి మరీ ఇన్వాల్వ్ ఐపోయి అమ్మ అంకిత్‌కు వడ్డిస్తున్నప్పుడు కూడా అంతే శ్రద్ధగా అమ్మ చేతుల వంక చూస్తున్నాడు. అమ్మ నవ్వు ఎలా ఆపుకోగలుగుతుందో అంకిత్‌కి అర్థం కాలేదు.
అమ్మ తనకీ వడ్డించుకుని కూర్చుంది. నాన్న తూగుతూ కంచం మీదకి వంగి, చపాతీ తుంచుకుని నోట్లో పెట్టుకోబోతుంటే, “టాబ్లెట్ వేసుకోవా,” అంది. నాన్న చపాతీ ముక్కని కంచంలో వదిలేసి అమ్మ ఏదో అనరాని మాట అన్నట్టు తీవ్రంగా చూసాడు. అమ్మ అటువైపు చూసే పని కూడా పెట్టుకోకుండా తన చపాతీ తను తింటుంది. నాన్న అలాగే అమ్మ వైపు చూస్తూ కుర్చీ లోంచి లేచాడు. నాన్న తాగి ఉన్నప్పుడు ప్రతి కదలికా దశలు దశలుగా విడగొట్టినట్టు చేస్తాడు. ఇప్పుడు కుర్చీ లోంచి లేవడం, నిలబడటం, అక్కడ్నించి బెడ్రూములోకి నడవటం… మధ్య మధ్యలో గ్యాపులిస్తూ చేసాడు.
“నీకెందుకురా నవ్వొస్తుందీ!” అంది అమ్మ నిష్టూరంగా మొహం పెట్టి.
అంకిత్ ఇంక ఆపుకోలేక బైటికే నవ్వాడు.
“పళ్ళు బైట పెట్టింది చాలు, తినిక!” అంది.
నాన్న టాబ్లెట్ తీసుకుని టేబిల్ దగ్గరకు వచ్చాడు. టాబ్లెట్ నోట్లో వేసుకుని కంచం పక్కన నీళ్ళ గ్లాసు తీసుకుని తాగబోతే-
గొంతులో పొలమారింది.
పరిగెడుతున్నట్టు సింకు దగ్గరకు వెళ్ళి నీళ్ళు మొత్తం ఊసేసాడు. సింకులో పడిన టాబ్లెట్ తీసి చూపుడు వేలి మీద పెట్టుకుని కాసేపు దాని వంకే చూసాడు. దాన్ని మళ్ళీ సింకులో పడేసి చేతిని లుంగీకేసి తుడుచుకున్నాడు. నీలం లుంగీ మీద టాబ్లెట్ పొడితో తెల్లటి చార.
“అబ్బబ్బ!” చిరాకు పడుతూ లేచింది అమ్మ. బెడ్రూము లోకి వెళ్ళి ఇంకో టాబ్లెట్ తుంచి తెచ్చింది.
“ఇదిగో పట్టు!”
సింక్ దగ్గర ఇద్దరి సీన్. నాన్న అమ్మ ఇచ్చిన టాబ్లెట్ తీసుకుని గ్లాసులో నీళ్ళు లేవన్నట్టు ఖాళీ గ్లాసు ఆడించాడు. అమ్మ టేబిల్ దగ్గరకు వచ్చి నీళ్ళ జగ్గుతో సింకు దగ్గరకు వెళ్ళింది. గ్లాసులో నీళ్ళు పడుతున్నంతసేపూ నాన్న అమ్మ వైపే చూస్తున్నాడు. “వేసుకో!” అంది. ఈసారి సరిగా వేసుకున్నాడు.
ఈ మూకీ సినిమాని నవ్వుతూ చూస్తూ అంకిత్ చపాతీ తింటున్నాడు.
ఇద్దరూ ఈ ప్రేక్షకుడి వంక చూస్తూ టేబిల్ దగ్గరకు వచ్చి కూర్చున్నారు.
“ఏరా మనిషి తల్లకిందులై పోతుంటే కదలకుండా చోద్యం చూస్తావ్?” అంది అమ్మ.
“బారు నుంచి తీసుకురమ్మన్నావ్. అక్కడితో నా పనైపోయింది, ఇక నీ బాధ్యత!”
నాన్న ఇదంతా తనకి సంబంధం లేదన్నట్టు తింటున్నాడు.
“ఎవరూ ఇంతకీ అక్కడ ఈయన గారి కంపెనీ? ఆ ముగ్గురు మహానుభావులేనా?” అంది అమ్మ.
అంకిత్ అవునన్నట్టు తలూపాడు.
“నా విషయాలు నన్ను అడిగితే చెప్తాను,” అన్నాడు నాన్న, ఆత్మాభిమానం దెబ్బతిన్నట్టు.
“ఆ చెప్పే లాగే ఉన్నావు,” అని తీసి పారేసింది అమ్మ.
“ఐనా నాతో ఎవరు కలుస్తున్నారో, ఎవరు తాగుతున్నారో నీకెందుకు చెప్పాలీ, నీకేం అవసరం?” అన్నాడు.
“చెప్పకు, నీ దగ్గరే ఉంచుకో.”
“సపాయించి బేంకులో పోయాలి. అంతే కదా నీకు కావాల్సింది?”
“అలాంటి దాన్నయితే బానే ఉండేది.”
“అబ్బ ఆపండి ఇద్దరూ!” అన్నాడు అంకిత్.
“చూడరా మరి! నా నోటెమ్మటా ఎప్పుడూ రానిది డబ్బు మాట ఎందుకు వచ్చిందో ఆ మాత్రం అర్థం కాదా మనిషికి? అస్సలు ప్రేమే లేనట్టు ఎంత దూరం పెట్టేసి మాట్లాడాడో సాయంత్రమంతా…”
నాన్న తినటం ఆపి, కంచం మధ్యలో ఎంగిలి వేళ్ళు నిలబెట్టి, ఎడం చేయి గాల్లో ఆడిస్తూ పాట అందుకున్నాడు.
“ప్రేమ లేదనీ… ప్రేమించ రాదనీ… సాక్ష్యమే నువ్వనీ… నన్ను నేడు చాటనీ…” అని పాడుతూ, “సాక్ష్యమే నువ్వనీ” అన్న దగ్గర అమ్మ వైపు వేలెత్తి కూడా చూపించాడు.
అమ్మ ముఖంలో వెంటనే కన్నీళ్ళు వచ్చేశాయి. నాన్న ఇంకా రాగం తీస్తుండగానే- అమ్మ కుర్చీ లోంచి లేచి సింకు దగ్గర చేయి కడిగేసుకుని లోపలికి వెళ్ళిపోయింది.
“తిన్నగా ఉండవు నాన్నా నువ్వు!” అన్నాడు అంకిత్.
నాన్న మొహంలో అల్లరి ఇంకా పోలేదు గానీ, ఇలా అవుతుందని ఆయన ఊహించలేదని కూడా ఆ మొహంలో తెలుస్తుంది. ఒక ముద్ద తినబోయి, మళ్ళీ దాన్ని కంచం లోనే వదిలేసి, పైకి లేచాడు.
“ఆగు! ఇంకా పెంట చేయకు,” అన్నాడు అంకిత్.
అమ్మ వదిలేసిన కంచాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు నాన్న. “రిలాక్స్ చిన్నమ్మా! నాకు తెలుసు ఇయ్యన్నీ ఎలా డీల్ చేయాలో!” అని స్టయిల్‌గా ఓ నవ్వు నవ్వి అమ్మ కంచంతోపాటు ఆ గది లోకి వెళ్ళాడు.
***
అంకిత్ తినేసి, చేతులు కడుక్కుని, మళ్ళీ డాబా మెట్ల మీదకి వచ్చాడు.
కింద కాలనీ వీధులు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. రోజంతా రోడ్ల మీద తిరిగిన బైకులు ఇప్పుడు ఇళ్ళ ముందు వరుసగా ఆగి ఉన్నాయి. ఇంటి కింద దేవగన్నేరు చెట్టు రాత్రిలోకి సర్దుకుంటుంది.
మెట్ల మీద కూర్చుని, ఫోన్ ఓపెన్ చేసి, ఇందాకటి అమ్మాయి ప్రొఫైల్ ఫొటోని మళ్ళీ చూసాడు, ఇద్దరి మధ్యా నడిచిన మెసేజులు మళ్ళీ చదివాడు.
ఆ మెసేజుల్లో మాట్లాడుకుంటున్న మనుషుల మధ్య ఏదో తెర వాలింది… అలాగే వదిలేస్తే గోడలా గట్టిపడే తెర.
ఇప్పుడు లొంగిపోయి మాట్లాడితే అలుసవుతానా!
కానీ అలుసయ్యేది ఎవరి దగ్గర?
వాయిస్ మెసేజ్ ఆన్ చేసి, మాట్లాడాడు: “ఇవ్వాళ నువ్వు… నిన్నలా లేవు. రీజన్ ఏంటో తెలీదు. నా వల్ల ఏమైనా జరిగిందా… అర్థం కాలేదు. ఏమై ఉంటుందా అని జరిగినవన్నీ మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నాను. నిన్న నీ ఫ్రెండ్ దగ్గర నీ గురించి ఒక మాట అన్నాను. అదేమైనా నీకు కోపం తెప్పించిందా? ఈ మధ్య నా ఆలోచనలన్నీ నీ గురించే ఎక్కువ ఉంటున్నాయి. ఒక్కోసారైతే నీ దగ్గర లేకపోయినా.. నీ ఆలోచన వస్తే చాలు నీ ప్రెజెన్స్ లోనే ఉన్నట్టుంటుంది. అదే ఫీలింగ్ వల్ల ఇవాళ నీ ఫ్రెండ్ దగ్గర నీ టాపిక్ వస్తే ఆ మాట అలా వచ్చేసింది. నిన్ను ఏడిపించటానికి నీతో కూడా చాలాసార్లు అన్న మాటే. కానీ అది ఇంకొకరి దగ్గర అని, అది వాళ్ళ నుంచి నీకు చేరితే, అప్పుడు దాని మీనింగ్ మారుతుంది కదా. అలా ఏదైనా నా వల్ల నీకు బాధ కలిగి ఉంటే, అందుకు సారీ! నీ కోపం పోవాలని సారీ చెప్పటం లేదు. నిజంగా నోరు జారాను, అలా అనకుండా ఉండాల్సింది. ఒకవేళ అసలు ఇది కారణం కాకపోవచ్చేమో కూడా. కానీ ఆ మాట అన్నందుకు నాకు ఇబ్బంది గానే ఉంది. అందుకే చెప్పేస్తున్నాను. ఇంకేదైనా కారణమైతే కూడా చెప్పు… ప్లీజ్! నీ డెసిషన్ మీద ఆర్గ్యూ చేయను. కానీ రీజన్ తెలుసుకోవాలనుకుంటాను. అంతే.”
మెసేజ్ సెండ్ కొట్టాడు. తర్వాత దాన్ని మళ్ళీ ప్లే చేసి విన్నాడు. ఆ మెసేజ్ చెప్పదల్చుకున్న విషయంతోపాటు చెప్పాలనుకోనిది కూడా ఏదో చెప్తున్నట్టు అనిపించింది. కానీ అది కూడా బావుందనిపించింది. ఫోన్ క్లోజ్ చేసి తేటపడిన మొహంతో రాత్రి ఆకాశంలోకి చూస్తున్నాడు.
వాట్సాప్ నోటిఫికేషన్ సౌండ్ వచ్చింది. ఆమె నుంచి వాయిస్ మెసేజ్. ఫోన్ మరీ దగ్గరగా పెట్టి మాట్లాడటం వల్ల అలుక్కుపోయినట్టు ఉండే తన జీర గొంతుతో… “రేపు క్లాసయ్యాకా బేకరీలో కలుద్దాం అంకిత్. నాకేం కోపం రాలేదు. కాదు కాదు, కొంచెం వచ్చింది. కానీ ఇప్పుడు లేదు. మిస్సింగ్ యూ టూ!” అని.
*








నాకు ఊహ తెలిసి నప్పుడు అచ్చం మా నాన్న కూడా ఇలాగే చదువుతుంటే మా ఇంట్లోకి మీరు తొంగి చూశారా అనిపించింది ధన్యవాదాలు మీ గంగోత్రి సాయి
బాగుందండీ కథ 👏👏
కనకప్రసాద్ ఓసారి నాతో ఒక మాటన్నాడు. “If you attempt to write something profound, it may end up being boring as a wall of bricks, but if you attempt to write something mundane, like a wall of bricks, you may actually convey something profound”. ఆ మాటలకి అచ్చమైన నిదర్శనంలా ఉంది మీ కథ!
బాగుంది
కథ చాలా బాగుంది..
సున్నితమైన కథనంలో స్వచ్చమైన జీవితం… మెహర్ గారికి ధన్యవాదాలు.