చిత్తూరు పరిసర ప్రాంత గడ్డమీద నడిచే మనుషుల మాటతీరును, ఆ మట్టి వాసనను కవిత్వపు నరనరాల్లోకి ఎక్కించిన కవి పల్లిపట్టు నాగరాజు. రాయలసీమ జనజీవన వేదనను, వర్తమాన సంక్షోభాలను తనదైన మట్టిభాషలో పలికిస్తూ సమకాలీన తెలుగు కవిత్వంలో తనదొక విశిష్ట గొంతుకగా నిలిచాడు. తొలి అడుగులోనే ‘యాలైపూడ్సింది’ అంటూ తెల్లవారిన పల్లె బతుకును అచ్చమైన సీమ పలుకుబడితో పలవరించి, కేంద్ర సాహిత్య అకాడెమీ యువ పురస్కారంతో తన ముద్రను బలంగా వేశాడు. ఆ తర్వాత ‘నీలికళ్ళ నేల’ అంటూ జీవన సముద్రపు లోతులను, వేదనలను కళ్లకు కట్టాడు. కవిత్వానికే కాక ఆలోచనల తూకానికి కూడా తన నేల బాసనే కొలబద్దగా నిలుపుతూ తాజాగా ‘యిడమర్సి’ అంటూ విమర్శనా వ్యాసాలను విప్పి చెప్పాడు. పుస్తకాల శీర్షికల దగ్గరనుంచి రాసే ప్రతి అక్షరం దాకా చిత్తూరు ప్రాంత మాండలికపు ఒడుపును, ఒడుపును, ఆ యాసలోని సహజమైన జీవాన్ని పట్టుకుని అద్భుతమైన సాహిత్యంగా మలచడంలో పల్లిపట్టు అందెవేసిన చేయి.
అలాంటి రాయలసీమ నేల భాషా సౌందర్యం నుంచి, తాత్విక ఘర్షణ నుంచి జాలువారిన విశిష్టమైన కవితే ఈ ‘ఏమో..’. ఈ కవితపై నాదైన విశ్లేషణ “సారంగ” పాఠకులకు ప్రత్యేకం.
ఏమో..
ఇప్పుడున్న పరిస్థితుల్లో
ఎప్పుడేమైనా జరగొచ్చు
ఏమో
ఊరేగే బండి ఇరుసు..
పుటుక్కున ఇరిగిపోవచ్చు
కందిరీగలు దండు కట్టి
మూకుమ్మడిగా దాడి చేయొచ్చు
కప్పుకున్న దుప్పటి జారిపోవచ్చు
చెప్పుకు వున్న వుంగటం తెగిపోవచ్చు
కట్టుకున్న కొట్టం కూలిపోవచ్చు
ఎప్పుడేమైనా జరగొచ్చు !
కాలవైనా
కాలమైనా
ఎల్లకాలం ఒకలాగే సాగతాదా ?
ఏమో
దినమంతా మొక్కుల్లో మునిగే నాలిక
ఇట తిరిగి అట తిరిగి
నూనె కట్టడ పామై కాటెయ్యచ్చు
ఏమో
దినాం భజన పాడిన చేతులే
పాడి కట్టే పున్నెకార్యానికి పూనుకోవచ్చు
ఏమో
దింపుడు కళ్ళం కాడ
పెంపుడు కుక్క కూడా
పిక్కలు కొరికేసి పారిపోవచ్చు
దేముని సీకారం నుంచి
దేముడి అవతారం దాకా
జరుగుతున్న రంగుల యాతర
ముట్టుమోపుకొచ్చి
పుట్టి మునిగిపోవచ్చు
ఎవురూ చీల గొట్టుకుని
చిరంగా వుండిపోరు ఈడ !
ఏమో
ఇప్పుడున్న పరిస్థితుల్లో
ఎప్పుడేదైనా జరగొచ్చు.!
*
ఒక్కోసారి
దేముడు కూడా కాపాడలేడు.
-పల్లిపట్టు నాగరాజు
ఈ కవిత నిత్యజీవితంలోని తీవ్రమైన అనిశ్చితిని, మనుషుల ద్వంద్వ ప్రవృత్తిని, అశాశ్వతమైన అస్తిత్వాన్ని అత్యంత సహజమైన పల్లె జన జీవన సంస్కృతిలోంచి ఆవిష్కరణ జరిగిన తాత్విక రూపం. సమాజంలో ముసుగులు కప్పుకున్న సంబంధాలు, అనుక్షణం వెంటాడే అభద్రత, నమ్మకద్రోహాలు పెరిగిపోయిన సంక్షోభ నేపథ్యం నుంచి ఈ కవిత పురుడుపోసుకుందని చెప్పవచ్చు.
ఈ కవితా నిర్మాణంలో ప్రారంభ, ముగింపు వాక్యాల పాత్ర ఎంతో కీలకమైనది. కవిత ప్రారంభంలో పలికిన “ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడేమైనా జరగొచ్చు” అనే మాట పాఠకుడిని వెంటనే ఒక అనిశ్చిత వాతావరణంలోకి తీసుకెళ్లడానికి బలమైన పునాది వేస్తుంది.
ఇందులో ప్రతి ఆవృతానికి ముందు ‘ఏమో’ అనే పదం పునరుక్తి కావడం కేవలం ఒక సందేహం మాత్రమే కాదు; అది కవిత అంతటా కలవరపెట్టే ఒక జీవనాడిలా నిరంతరం ప్రవహించే అంతర్లయను సృష్టిస్తుంది. ఆ ఒక్క పదం పాఠకుడి గుండెల్లో ఒక అనిశ్చితమైన నిట్టూర్పును నింపి, తర్వాత క్షణంలో ఏ ప్రమాదం విరుచుకుపడుతుందోనన్న అంతర్గత ఘర్షణను రేకెత్తిస్తుంది.
శిల్ప పరంగా చూసినప్పుడు, రాయలసీమ మాండలికం జీవద్భాషగా మారి కవితకు అపారమైన బలాన్ని, మట్టివాసనను అద్దింది. ‘వుంగటం’, ‘కొట్టం’, ‘సాగతాదా’, ‘పున్నెకార్యం’, ‘దింపుడు కళ్ళం కాడ’, ‘సీకారం’, ‘ముట్టుమోపుకొచ్చి’, ‘చీల గొట్టుకుని’ వంటి పదాలు గ్రామీణ జీవన ఉపకరణాల నుంచే గొప్ప రూపసార గుణాన్ని కలిగి కవితా నిర్మాణంలో గొప్పగా అమిరాయి. ఊరేగే బండి ఇరుసు పుటుక్కున విరిగిపోవడమైనా, కందిరీగలు మూకుమ్మడిగా దాడి చేయడమైనా వైభవం నడుమ హఠాత్తుగా ముంచుకొచ్చే పతనానికి ప్రతీకలు. రక్షణనిచ్చే దుప్పటి జారిపోవడం, నడకకు ఆధారమైన చెప్పు వుంగటం తెగిపోవడం, తలదాచుకునే కొట్టం కూలిపోవడం లాంటి సూక్ష్మ దృశ్యాల ద్వారా పారుతున్న కాలువైనా, గడిచే కాలమైనా ఎప్పటికీ ఒకేలా ఉండదనే చలనశీల సత్యాన్ని ఆవిష్కరించిన తీరు బాగుంది.
అక్కడి నుంచి కవిత మానవ నైజంలోని కపటత్వాన్ని స్పష్టంగా చూపుతుంది. దినమంతా దేవుడి మొక్కుల్లో మునిగే నాలుక ఒక్కసారిగా విషాన్ని చిమ్మే ‘నూనె కట్టడ పామై’ కాటేయవచ్చని చెప్పడంలో అద్భుతమైన రూపక అలంకారం ప్రస్ఫుటమవుతుంది. నిన్నటివరకు భజన చేసిన చేతులే రేపు శవానికి పాడె కట్టే పుణ్యకార్యానికి సిద్ధపడటం మనుషుల నైజంలోని కర్కశత్వాన్ని పట్టి చూపుతుంది.
ముఖ్యంగా ఈ కవితలోని ఆరవ ఆవృతం పాఠకుడిని తీవ్రమైన ఆత్మశోధనకు గురిచేస్తుంది. ఇది విశ్వాస ఘాతుకానికి పరాకాష్ఠ. రాయలసీమ జీవనంలో ‘దింపుడు కళ్లెం’ అనేది మనిషి ఇక తిరిగిరాని నిర్జీవమైన మట్టిముద్దగా మిగిలిపోయే ఘట్టం. బతికున్నంత కాలం తన దర్పంతో శాసించిన మనిషి, ఊపిరి ఆగిపోగానే ఎంత నిస్సహాయ స్థితికి చేరుకుంటాడో కవి ఇక్కడ అత్యంత సహజంగా ఆవిష్కరించారు. అంతవరకు తనపక్కనే ఉండి తాను చెప్పినదానికి తోక ఆడించిన ‘పెంపుడు కుక్క’ దృష్టిలో కూడా ప్రాణం పోయిన ఆ దేహం ఇక యజమాని కాదు; కేవలం కొరుక్కుతినదగిన ఒక మాంసపు ముద్ద మాత్రమే. మనుషుల అధికారాలూ, దర్పాలూ ఆ ప్రాణం ఉన్నంతవరకేనని; ఊపిరి పోయాక ఆత్మీయతలు, విశ్వాసాల వంటి భావనలన్నీ కరిగిపోయి దేహం ఎంతటి నిస్సారమైన శూన్యంలోకి పడిపోతుందో పట్టిచూపే గొప్ప తాత్విక, బీభత్స సత్యం ఈ దృశ్యం.
చివరిగా, దేవుని శ్రీకారం నుంచి దేవుడి అవతారం దాకా సాగే రంగుల యాత్ర ఎంత ఘనంగా కనిపించినా, అంతిమంగా అదంతా ‘ముట్టుమోపుకొచ్చి పుట్టి మునిగిపోవాల్సిందే’నని, ఈ భూమిపై ఎవరూ శాశ్వతంగా ‘చీల కొట్టుకుని’ ఉండిపోలేరని అశాశ్వతత్వాన్ని స్పష్టపరుస్తాడు.
“ఒక్కోసారి దేముడు కూడా కాపాడలేడు” అనే ముగింపు వాక్యం, ఆరంభంలో మొదలైన భయానికి పరాకాష్ఠగా నిలుస్తూ ఆలోచింపజేస్తుంది. విధి లేదా కాలం విరుచుకుపడే వేళ మానవ నిర్మిత విశ్వాసాలు సైతం నిస్సహాయంగా మిగిలిపోతాయనే వాస్తవాన్ని సున్నితంగా మన ముందుంచుతూ కవితను పరిపూర్ణం చేస్తుంది.
సహజమైన గ్రామీణ నుడికారంతో మానవ జీవితంలోని లోతైన అగాధాన్ని, అనిశ్చితిని పట్టిచూపిన గొప్ప తాత్విక వ్యక్తీకరణ ఈ ‘ఏమో’ కవిత.
*








కవి అంతరంగాన్ని ఆవిష్కరించే విమర్శ కు ఆహ్వానం
చాలా బాగా రాశారు