అరుదైన సంపద పఠాభి కథలు

“కవిత్వం కాయితాల మీద వచ్చేదే కాదు. దారిలో వెళ్తూ ఉంటే  ఎవరో బాధ పడుతుంటే మనకు జాలి కలగడమూ కవిత్వమే” దీన్నే కవిత్వ దృష్టి అన్నాడు పఠాభి. వందేళ్లక్రితం పుట్టిన పఠాభి ఈ కవిత్వ దృష్టిని మనల్ని పాలించే మార్కెట్ ఎకానమీని ప్రతిఘటించే శక్తిగా భావించాడు. చాలా విషయాలలో పఠాభి అప్పటి తన సమకాలీకులకంటే, ఇప్పటి మనకంటే ముందున్నాడు. కవిత్వ దృష్టిని పెంపొందించడమే కవిత్వపు మెయిన్ పర్పస్ అన్నాడాయన.
‘What Life has taught me’ అనే వ్యాసంలో తన చిన్ననాటి గురించి చెబుతూ “As a child, I could not bear to see even insects and worms being killed or mutilated. Sometimes even plucking of flowers would cause me a shudder” అని తన కవిత్వ దృష్టిని చాటుకున్నాడు.
ఒకానొక సాహిత్య చారిత్రిక సందర్భంలో నా ఈ వచన పద్యాలనే దుడ్డుకర్రల్తో పద్యాల నడుముల్ విరగదంతాను అన్నాడు గానీ ఆయనకి భావకవిత్వమన్నా, భావుకత్వమన్నా ఏవగింపు ఏమీ లేదు. అహాన్ని వదిలేసి లేనిపోని అసహజ, అమలిన శృంగారం అంటూ రాసిన ప్రణయ కవిత్వమంటేనే ఆయనకు ఏవగింపు. అందుకనే తనను ‘భావకవిన్మాత్రము కాన్నేనహం భావకవి’ నని ప్రకటించుకున్నాడు.
ఏమైనా ఆయనకీ స్త్రీ అంటే ప్రేమే. కవిత్వం విషయంలో ఏమోకానీ పఠాభి ఈ కవిత్వ దృష్టిని తన కథల్లో పండించుకున్నాడు. స్త్రీని ‘బానిసకు బానిస’ గా అవగాహన చేసుకొన్నవాళ్లలో పఠాభి ముందున్నట్లున్నాడు. (1944). స్త్రీ జీవితంలోని అసహాయత, దుఃఖం పఠాభిని కథలు రాసేలా చేసింది. పఠాభి కథలు రాసాడని చాలామందికి తెలియదు. పఠాభికి ఎంతోకాలం సన్నిహితుడైన రావెల సోమయ్య గారిని కదిలిస్తే పఠాభి కథలు రాసాడని తనకు కూడా తెలియదని చెప్పారు.
మనసు ఫౌండేషన్ ఇటీవల వెలువరించిన పఠాభి సర్వలభ్య రచనల సంకలనంలో పఠాభి రాసిన తొమ్మిది కథలు చోటు చేసుకున్నాయి. పాత పత్రికలను గాలించి, ఎంతో శ్రమకోర్చి పరిశోధకులు షేక్ రసూల్ అహ్మద్ (గూడూరు) ఈ కథలను వెలికి తీసినట్లు ముందుమాటలో చెప్పారు. ఈ వివరాల ప్రకారం పఠాభి కథలు మొత్తం పది. అయితే మొదటి కథ ప్రతిధ్వనులు (1934) దొరకకపోవడం వల్ల ఇందులో తొమ్మిది కథలే ఉన్నాయి. దాదాపు అన్ని కథల్లో స్త్రీ జీవితం, స్త్రీ పురుష సంబంధాల చిత్రణే ఉంది. ఈ కథలన్నీ ఆయన 1934 నుండి 1940 లోపు రాసినవే.
ఇందులో అనువాద కథలు రెండు.  మూకలు (1935), చిలుక చదువు (1938).  అల్లరిమూక స్వభావము ఎచ్చటికి పోయినా ఒకేవిధంగా ఉంటుంది. ఇండియాలోనే కాదు. ప్రపంచంలో ఎక్కడికి పోయినా ఒకే రూపం దానికి. వార్తాపత్రికలు అల్లరిమూకలో కొంతభాగం వహించుతాయి. వాటి తత్వము ఎక్కడ చూసినా ఒకటే” అని మొదలవుతుంది ఈ ‘మూకలు’ కథ.
అమెరికాలోని ‘ఒక్లహామా ‘ లో ఒక తెల్ల పిల్ల సృహతప్పి పక్కన ఉన్న నీగ్రో మీద పడుతుంది. పడేటప్పుడు ఆ నల్లవాడ్ని చూసి భయపడి అరుస్తుంది. అలా భయం కలిగించడంవల్ల ఆ నీగ్రో తనని అవమానించాడని పోలీసులకు చెబుతుంది. పోలీసులు నీగ్రో ని అరెస్టు చేస్తారు. అది తెల్లవారి రాజ్యం కాబట్టి ఈ సంఘటనతో నల్లవారి మీద మూకుమ్మడి దాడులు మొదలవుతాయి. అల్లరి మూకలు బ్రతికి ఉన్నవారిని మంటల్లో కాల్చి, పరిగెత్తేవారిని తుపాకులతో కాల్చి రాక్షస వినోదాన్ని అనుభవిస్తారు. ఇలా అక్కడి నీగ్రోలను పూర్తిగా నాశనం కావించటంతో కథ ముగుస్తుంది. ఈ కథ  అనువదించేనాటికి పఠాభి ట్రిప్లికేన్ లో ఉంటూ మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు.
విద్యావ్యవస్థ మీద రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన వ్యంగ్య కథను ‘చిలుక ఛదువు తో పఠాభి అనువదించాడు. చదువు పేరుతొ చిలుకను బంగారు పంజరంలో బంధిస్తారు. అది ‘విద్య యొక్క కైలాస శిఖరము’ . చిలుకకు చదువు నేర్పే నిమిత్తం పండితులు వచ్చి నస్యం పీలుస్తూ “పుస్తకాలు అధికంగా ఉంటేనే గాని చదువు సాగద”న్నారు. చివరకు చిలుక చచ్చింది. ఇదేమిటన్నాడు రాజు.
“పక్షికి శిక్షణ పూర్తి అయింది” అన్నారు రాజుగారి అల్లుళ్ళు.
“అదింకా ఎగురుతుందా?”
“రామ! రామ!” అన్నారు రాజుగారి అల్లుళ్ళు.
అదింక పాట పాడ్తుందా?
“ఆహా”
“ఇంకా ఎరకల టపటప కొట్తుందా?”
“అలా సాహసింపలేదు”
రాజుగారు చిలుకను ఒకసారి చూడాలన్నాడు. చిలకను రాజు వేలితో పొడిచాడు. “అది ఆ అనలేదు, ఊ అనలేదు. దాని కడుపులోనమటుకు గ్రంధప్రతుల యొక్క శుష్క పత్రములు కసకస గజగజ చేయసాగినవి” ఇలా ముగుస్తుంది కథ.
మిగిలిన కథలతో పోలిస్తే ‘పాదరక్షలు’ ప్రత్యేకమైనది. చెక్కకాళ్ళు కలిగిన అవిటివాడు ముత్యం. బ్రహ్మయ్య కుట్టే చెప్పుల్ని రోజూ చూస్తూ వెళ్తుంటాడు. వాటి మీద ఉదయ కాలపు సూర్యరశ్మి పడి ధగధగా వెలుగుతుంటాయి.  వాటిని ఎప్పటికైనా వేసుకోవాలని ఆశ ముత్యానికి. బ్రహ్మం అతడిని రోజూ చూస్తూ గమనిస్తుంటాడు.
ఒకరోజు అక్కడికి చాలా దూరంలో ఉన్న గ్రామానికి  మహిమలున్న సన్యాసి వచ్చాడని అతడి కరస్పర్శతో రోగాలు నయమౌతున్నాయని చెబుతాడు బ్రహ్మం. ముత్యం కాలినడక మీద ప్రయాణం మొదలుపెడతాడు. అంతదూరం కుంటుకుంటూ ఎలా వెళతావు అని జాలిగా అడిగి బ్రహ్మం ఒక కొత్త చెప్పులజోడుని బహుమతిగా ఇచ్చి సన్యాసి మహిమతో నీకు కాళ్ళు వస్తే ఇవి ధరించమని చెబుతాడు. కొన్ని వారాలు నడిచి, మధ్యలో  ఎద్దులబండిలో కూర్చుని, నడిచి చివరకు ఆ ఊరు చేరి సన్యాసి కాళ్ళమీద పడి కరస్పర్శను అనుభవిస్తాడు. వరం కోరుకోమంటే వచ్చిన కార్యం మరిచిపోయి తనని శిష్యునిగా స్వీకరించమంటాడు. మరి కొత్త కాలిజోళ్ళు తొడుక్కోవాలనే కోరిక  నీకు లేదా  అని సన్యాసి అడిగితె అది అంత ముఖ్యం కాదు స్వామీ, కుంటివారు కూడా నిన్ను అనుసరిస్తారు. నన్ను శిష్యుడిగా స్వీకరించు అంటాడు. కాసేపటికి అతడికి కాళ్ళు వస్తాయి. చెప్పులు ధరించి మహావృక్షాన్ని అధిరోహించే లత లాగా లాస్యం చేస్తాడు సంతోషంతో ముత్యం.
బ్రహ్మ శాపం తన కాళ్లనుండి వీడిపోయింది. సాయంత్రం అయింది. ఆశ్రమ ద్వారం వద్ద అందరూ చెప్పులు విడవాలి. ముత్యం పాదరక్షలతోపాటు ఈ ప్రపంచపు దుమ్మునంతా విడిచి లోనికి పోయాడు. లోనికి పోయి దీర్ఘ సమాధిలోకి పోయినాడు. మనిషి  పరిమితులు,కోరికలు, తాపత్రయ, ప్రయాసల దూరాభారాలు, మృత్యువు లేదా మోక్షం జీవన మార్మికతను ఈ కథ ప్రతిబింబిస్తుందా అనిపించింది.

మిగిలిన కథలన్నీ స్త్రీ జీవితం, స్త్రీ పురుషుల సంబంధం గురించినవి. తనను ప్రేమ పేరుతో మోసం చేసిన యువరాజు గుండెల్లో ఖడ్గం దింపి, తాను కూడా ఆత్మాహుతి చేసుకునే సరళ కథ ‘ప్రణయ జ్వాల? కాదు ప్రళయ జ్వాల ‘. వయసు మళ్ళిన భర్త ద్వారా సంతానం కలగకపోగా అతడి అనుమానాలకు అవమానపడే గృహిణి ఒక దొంగ సన్యాసి ద్వారా సంతానం పొందడం ‘మూడు తలల తాటిచెట్టు’ కథలో చూడవచ్చు.

ప్రేమ ప్రకటన తెలీని యువతీయువకులు, ప్రేమానుభవం అంచులదాకా వెళ్ళినా, అది పొందలేని బిడియం మరణతుల్యం అని చెప్పిన కథ ‘పరాన్ కుట్టి’. ఇది కేరళ  ప్రాంతీయ నేపథ్యంలో రాసిన కథ. ‘హోలీ పండుగ ‘ కథ బెంగాలీ నేపథ్యంలో రాసిన మరో కథ. హోలీ పండుగరోజు యువతీయువకులు గులాములు చల్లుకుంటూ  యౌవ నృత్యాన్ని వయో కల్లోలాన్ని సృష్టిస్తూ ఆనందిస్తుంటే మరోవైపు రోగగ్రస్తుడైన భర్తను కోల్పోయిన ఒక పడుచు భార్య కథ ఇది. ‘రవణ సాహసం’ అనే కథలో రవణది ఇష్టంలేని పెళ్ళి. 50 ఏండ్ల రెండొ పెళ్ళికొడుకు. రవణకు ఇది ఇష్టం లేదు. మనసు పడిన సుందరయ్యతో చెప్పలేదు. భర్తతో కాపురానికి వెళ్ళకముందే మంచినీళ్ళ మడుగు దగ్గర సుందరయ్యతో ఏర్పడిన సమాగమం. అది అలవాటయ్యాక పదిహేనురోజుల్లో భర్త వచ్చి కాపురానికి తీసుకెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు దెయ్యం పట్టినదానిలా నటిస్తుంది రవణ. అలా మూడుసార్లు కాపురానికి వెళ్ళకుండా తప్పించుకొన్న రవణ, ఇక భర్త నాలుగోసారి తప్పదన్నట్లు వస్తే, ఆ ఉదయం అదే నీళ్ళ మడుగులో ఎర్రతామరలలో కలిసిపోయిన రవణ, ఆమె మరణంతో ముగిసిన కథ ‘రవణ సాహసం’.

ఈ కథలన్నిట్లో స్త్రీ బాధకి కవిత్వ దృష్టితో చలించాడు పఠాభి. భావకవుల్లాగా కాకుండా, స్త్రీ జీవితంలోని దుఃఖం,  ప్రేమరాహిత్యానికి నిష్కృతిగా  రక్తమాంసాలతో కూడిన ప్రేమను ఈ కథల్లో పఠాభి చూపించాడు. ప్రేమరాహిత్యంలో బాధపడే రవణ నీటి మడుగు దగ్గరకు పోయినప్పుడు చీకటిపడుతుండగా వర్ణించిన దృశ్యం ఇది. “తామర పూవులన్నీ మూసుకుపోయియున్నవి. జాబిలి ప్రతిబింబము గడ్డకట్టిన నిరాశలాగ జలాంతరంగంలో కనిపిస్తుంది”.హోలీ పండగలో శేఫాలికను వర్ణిస్తున్నప్పుడు “తన లలాటముననున్న కుంకుమపు చుక్క ఈడేరని కోరికలచేత నిండిన తన గుండియలాగా మండుచున్నది” అంటాడు.

స్త్రీలన్నా, పువ్వులన్నా మనసు పోగొట్టుకొనే పఠాభి ఆ తర్వాత కథకీ, కవిత్వ రచనకీ దూరమై సినిమా, గణిత శాస్త్రంలో తన అభిరుచిని మళ్ళించుకున్నాడు.
మనసు ఫౌండేషన్ ప్రచురించిన ఈ సంకలనం వెలువడక పోయి ఉంటే  పఠాభి కథలు దాదాపు శాశ్వతంగా కనుమరుగయ్యేవి.
*
Avatar

కాకుమాని శ్రీనివాసరావు

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మొన్న మీ ఉపన్యాసం కి పూర్తి పాఠం గదూ ! చాలా సమగ్రంగా ఉంది వ్యాసం .

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు