మృత్యువెంత అసాధారణం, అతి సాధారణం?!

ఇప్పుడు మరణించాడు గనుక ఆయనను సర్వనామంగా కాక నామవాచకంగానే చూడవచ్చు.

రోజూ చచ్చేవాడికి ఏడ్చేవాడెవడు?

జాతస్య మరణం ధ్రువమ్.

మృత్యు అనివార్యతనూ సాధారణత్వాన్నీ చెప్పే తరతరాల వివేక సంచితాలైన సామెతలెన్నో ఉన్నాయి. నిజంగానే మామూలుగా మనం మరణాన్ని అతి సాధారణమైన సంగతి గానే తీసుకుంటాం. కాని ఆ మరణం కుటుంబ సభ్యులదో, సన్నిహిత మిత్రులదో, పరిచితులదో అయినప్పుడు అది అసాధారణమని అనిపిస్తుంది. ఆ లోటును పూడ్చలేమనీ, ఆ విషాదాన్ని అధిగమించలేమనీ అనిపిస్తుంది. అసలీ జీవితమెందుకు వ్యర్థం అనిపిస్తుంది. శ్మశాన వైరాగ్యం వంటి మాట కూడ అట్లాగే పుట్టింది.

కాని ఇవాళ చస్తే రేపటికి రెండు అన్నట్టు మర్నాటికల్లా కాలమూ స్థలమూ వ్యావృత్తులూ ఎంత అసాధారణ మరణాన్ని కూడ అతి సాధారణంగా మార్చేస్తాయి. కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. మరణానికి ఉన్న ఈ అసాధారణ, అతిసాధారణ స్వభావం అనుభవంలోకి రాని మనుషులు బహుశా ఉండరు. నిజానికి అటువంటి ఎరుక మృత్యువు పట్ల మాత్రమే కాదు జీవితం పట్ల కూడ ఒక నిర్మమకారమైన తాత్విక దృష్టిని ఇవ్వాలి. కాని మృత్యువు ఎంతగా మన మునివేళ్ల చివరల కదలాడుతున్నా జీవితాన్ని మితిమీరి ప్రేమించడం మాత్రమే కాదు, జీవితమంటే ఆస్తినో, అధికారాన్నో, అహంకారాన్నో పోగు చేసుకోవడం మాత్రమే అనే భ్రమలో, ఇలియట్ అన్నట్టు జీవించడంలో పడి జీవితం కోల్పోతూనే ఉన్నాం.

మృత్యువు అసాధరణత్వాన్నీ, అతి సాధారణత్వాన్నీ ఒకే మనిషి అనుభవం నుంచి, కొద్ది రోజుల వ్యవధిలోనే చూపిన ఒక ఉదంతాన్ని, అత్యంత విషాదకర అనుభవాన్ని ఈ శీర్షిక పాఠకులతో పంచుకోవాలి.

ఈ అతి సాధారణ సందర్భాలు శీర్షిక ప్రారంభించినప్పుడు అసాధారణ, అతి సాధారణ సందర్భాల మధ్య మన సమాజంలో, ఆలోచనల్లో ఉన్న తేలికపాటి వైఖరిని చూపి, అసాధారణత్వం గురించీ అతి సాధారణత్వం గురించీ, వాటి మధ్య సంబంధం గురించీ కొన్ని ఆలోచనలయినా చర్చకు పెట్టగలనా, కొంతయినా సున్నితత్వాన్ని ప్రేరేపించగలనా అనుకున్నాను. అది స్థూల చర్చ కాదనీ, ఆ అతి సాధారణ, అసాధారణ అంశాల ఐక్యతా ఘర్షణా మన ముఖం మీద గుద్దినంత విస్ఫోటకంగా మన సమాజంలో అమలవుతున్నాయని ఎరుక కలిగించిన అనుభవం ఈ వారం జరిగింది.

ఈ శీర్షిక తొలి రచన మోటర్ సైకిల్ మీద రాత్రివేళ పయనిస్తూ ప్రమాదవశాత్తూ రోడ్డు పక్క బావిలో పడిపోయి, ఆ బావిలోని పంప్ సెట్ పైపులు పట్టుకుని ఒక రోజున్నర పాటు మృత్యువుతో పోరాడి జయించిన వ్యక్తి గురించి రాశాను. ఆ పైపులను పట్టుకుని అతి సన్నని దారంమీద ముప్పై గంటల పాటు వేలాడుతూ ప్రాణాలు కాపాడుకోవడానికి అవకాశం ఇచ్చిన చేతుల గురించి రాశాను. మన శరీరంలోని చేతులు అనే అతి సాధారణమైనవిగా మనం గుర్తించకుండా విస్మరిస్తున్న అవయవాలు నిజానికి ఎంత అసాధారణమైనవో చూపడానికి ప్రయత్నించాను.

అలా ప్రాణాలు కాపాడుకున్న అసాధారణ అనుభవం పొందిన మనిషి రెండు నెలలు తిరగకుండానే మరొక ప్రమాదంలో మరణించాడు. మృత్యువూ, మృత్యువును అధిగమించడమూ ఎంత అసాధారణమో చూపిన మనిషే రెండు నెలల తర్వాత మృత్యువెంత అతి సాధారణమో కూడ చూపించాడు.

ఇప్పుడు మరణించాడు గనుక ఆయనను సర్వనామంగా కాక నామవాచకంగానే చూడవచ్చు.

ఆయన పేరు వజ్రమౌళి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందినవాడు. మే చివరి వారంలో వరంగల్ జిల్లా ముచ్చర్ల వెళ్లి వస్తూ ప్రమాదానికి గురై, వెంట్రుకవాసిలో తప్పించుకుని, ఎంతో మంది చేత మృత్యుంజయుడు అని కూడ అనిపించుకున్నాడు. ఇప్పుడు జూలై చివరి వారంలో తన ఊరినుంచి కాగజ్ నగర్ కు ప్రయాణిస్తూ, మధ్యలో బెల్లంపల్లి స్టేషన్ ముందర క్రాసింగ్ కోసం రైలు ఆగితే, పక్కన ఉన్న పట్టాల మీదికి దిగి, అటు నుంచి వస్తున్న రైలు ఢీకొని చనిపోయాడు. అప్పుడు చేతులు కాపాడాయి గాని, ఇప్పుడు దిగాలని ఆలోచన కల్పించిన మెదడో, ముందుకు సాగిన కాళ్లో ఆయనను మృత్యువు దగ్గరికి తీసుకుపోయాయి.

మృత్యువెంత సాధారణమైనది!

మృత్యువెంత అసాధారణమైనది!

  *

ఎన్. వేణుగోపాల్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు