ఘో అంటా పండగ వెళ్లిపోయింది!

‘అబ్బా ఇంకొంచం ముందోచ్చింటే బాగున్ను’ అనుకుంటా గోపాలోళ్ల ఇంటికాడ కుచ్చున్నా ఆ పిల్లను చూస్తా.

రాత్రి కూడు తింటావుండాను. అప్పుడే ఇంటికొచ్చిన మానాయిన…‘.రే! మూదేవీనాకొడక…. దొడ్డికి వేసిండే కంపనంతా తగలబెట్టబోతారు పెతరనాయాళ్లు, కొంచెం మెలకవగావుండి కట్టెలు, కంపను తగలబెట్టకుండా చూసుకుని ఏడువు’ అని అరస్తావుండాడు.

రేపు బోగిపండగ కదా. .రాత్రికి జాగారం వుండాదైతే నాకు. బోగిపండగ ముందురాత్రింటే మా వూళ్లో నా ఈడోళ్లకంతా కంటిమీద కునుకుండదు. వూళ్లోవాళ్ల వామిల్లో వుండే సొరకాయిలు, గుమ్మిడికాయలు, పువ్వులు సైగ్గా తెంపుకోనొచ్చి బోగిమంటలకు ముందే అందరి ఇళ్లముందూ తలా ఇన్ని పెట్టేస్తాం. బోగి దొంగలుగా ఊళ్ళో తిరగడమంటే భలే కుశాల మాకు. రాతిరికి చేయాల్సిన పనులు గురించి మాట్లాడుకునేందుకు మాలాడగుంట దగ్గిర వుంటే సురేషోళ్ల వామికాడికి బయలుదేరినా. సురేషు, రవిగోడు, నేను చడ్డీలు ఏసుకోక ముందు నుంచే సావాసగాళ్ళం.

దినామూ చికటిపడితే చాలు సురేషు, రవిగోడు వామికాడకి చేరుకుంటారు. అదొక రహస్యిం వుందిలే. సురేషుగోడు ఎవరికీ తెలియకుండా బీడీ తాగతాడు, దానికి రవిగోడు కాపలా వుంటాడు. నేను మాత్రం మూడునెలల పరీక్షలు అయినాక వొచ్చే లీవులకు, పండగ లీవులకు, సంవత్సరం పరీక్షలైనాక వచ్చే లీవులకీ మాత్రం వామికాడ వాళ్ల జతన ఉంటా. ఆ నాయాళ్ళ కోసరం కాదులే నేను వామికాడికి జేరుకునేది. లీవులిచ్చినప్పుడే మాత్రమే బొమ్మంగి సరిత మావురుకొస్తాది. సరితంటే నాకు మూడోతరగతి నుంచే ఇష్టం. లీవులకు రేవతోళ్లు మావురుకొస్తే వాళ్లింటి చుట్టూ చాటుమాటుగా తిరగతానే వుంటాన్నేను. ఎదురుపడి మాట్లాడాలంటే సిగ్గు, బయిం. ఎప్పుడైనా ఎదురు బడితే నవ్వతాందింతే. ఈ రహిస్యం వూళ్లో ముక్కాలుమందికి తెలుసు…ఆ పిల్లకే తెలియదు, అదే నాదరిద్రం. సురేషోళ్ల వామికి ఎదురుగానే సరితోళ్ల అత్తిళ్లు. సరితోళ్ల నాయినది మావూరే. పెళ్లయినాక ఆయన ఇరగలంకి ఇల్లిరికం పోయినాడు. లీవులకి మాత్రమే వాళ్లు సొంతూరికి వస్తారు. కాబట్టి బడోళ్లు ఇచ్చే లీవులంటే నాకు ఎంతో ఇష్టిం. లీవుల్లో మా పిలకాయిలు వూళ్లకు పోయినా నేనుమాత్రం యాడికీ పోను. ఆయమ్మిని తలసుకుంటా వామికాడికి చేరుకున్నాను.

ఆడ రవిగోడు కన్పించినాడు. ‘ఎమిరా….వామికాడికి దారి కన్పించినాదే నీకు’ అని ఎక్కిసిండంగా అన్నాడు. ‘నువ్వుండ్రా….చాలుగాని..ఇళ్లుకాలి ఏడాస్తావుంటే, మిండగాడొచ్చి రాళ్లేనాడంట….అట్టవుండాది నీ యవ్వారం….వామికాడికి వస్తావుంటే గొట్టి ముళ్లు గుచ్చుకుని బలే బాధలే’ అన్నా నొప్పిని నటిస్తా.
‘ నువ్వుమూయిరా దొంగనాకొడక….ఆ పిల్ల వచ్చింటాది చూసిపోదామని వచ్చినావుగాని’ అంటా వచ్చినాడు సురేష్‌ తాటిమాను కాటినుంచి. నాది, సురేష్‌ది మామ అల్లుళ్ల వరసలే. ఆ పిల్లవిసియం దాడేసి ‘బావా! రేత్రికి ఎట్టచేద్దాం చెప్పు’ అని అడిగినా అమాయకంగా.

‘అబ్బే పోయినేడు మాదిరిగా అన్నీ సరితోళ్ల ఇంటి ముందే పెట్టాలంటే మాత్రం దొబ్బదబ్బా’ అంటా రవిగోడు మొదిట్లోనే అడ్డుకు దిగినాడు.
‘ఈ సారి ముగ్గరం కలిసే అన్ని యీదల్లో తిరగదాం పాండి. మొదటిజాములోనే బేరోళ్ల సందులోకి పాదాం. పనైనాక గోల్లోల్లసందు, లాస్టులో ముత్తరాసోళ్లో ఇళ్లకాడ పువ్వుల్ని తెంపి తెద్దాం’ అని సురేషు ప్లానుగీసినాడు. అట్టా మాట్లాడతా వుండామా.. అప్పుడే సరితోళ్ల పెల్లో లైటు ఎలిగింది. అబ్బా సరితోస్తే బాగున్ను అని గట్టిగా దేవుడ్ని మొక్కతావుండా నేను లోపల్లోపల్నే. మసిగుండాలను ఎత్తుకోని పెల్లోకి వొచ్చింది సరిత. ఆయమ్మి కనపడంగానే నా గుండె దూదికన్నా పలసనగా గాల్లోకి ఎగరతావుండాది. చాల్రానాయినా అనుకున్నా.

ఆయమ్మి ఇంట్లోకి పొయినాక దేవలం కాడికి పోయినామో లేదో నడ్డోడు, ఇసుకుపూరోడు మాకోసరం కాసుకుని కుచ్చోనుండారు. మావూర్లో చానామందికి మారుపేర్లే దిక్కు. నన్నుగూడా బెలకప్పని కొందురు, ముక్కోడని కొందురు పిలస్తారులే. ఐదుమందిమీ కలిసి తొలీత బేరోళ్ల సందులోకి దూరినాం. పయ్యాశెట్టి వాళ్ల ఇంటికాడ వుండిన ఒక్క సొర్రకాయిని కూడా వదల్లేదు మేము. ఆపక్కనే గుడ్డితాతోళ్ల రోజాపూలు కూడా తురిమేశినాం. గోళ్లోళ్ళ సందులో దూరి బుల్లిమామ పెళ్లో బడి గుమ్మిడు కాయలు మాయం చేజేసినాం. అలికిడి లేకుండా బలే నైసుగా జేసినాములే ఈ దొంగపనంతా. దండిగా జేరినాయి దొంగ సరుకు మా దెగ్గిర. అన్ని రకాలనీ సమానంగా చేసి వడ్డోల్లో ఇంటికాడి నుంచి నారయ్య కొడుకు గడప దాకా ఇంటింటికాడా పెట్టినాం.

‘సరేరా మంటలేసినాక మళ్ళా వస్తా’ అని చెప్పి మా డొడ్డికాడికి వచ్చినా. మంచం కాడ మా అబ్బను చూడ్డమే నాకు గుండెగుబేళ్‌మనిపిచ్చింది.
‘దొడ్డికాడ లేకుండా ఏడకిపోయినావ్‌రా..’ అని మానాయిన అడిగినాడో లేదో, తడుముకోకుండా ‘కయ్యకాడ కంపను యానాది సెంటరోళ్లు తగలబెడతారేమోనని అడికి పోయి వస్తావుండా’ అన్నా.

‘సరేబో ఇంటికాడ పడుకో’ అన్నాడు ఆయన నిమ్మళంగా.

‘నా బట్టలు….నాచాడు తాగ…ముదినష్టం నాబట్టల్ని నా కోళ్లు ఏమిజేసినాయంటా’ మా నసత్త వూరువూరు కదిలిపోయేమారిగా నోరేసుకోని పడతా ఉంటే మెలక వచ్చింది నాకు. నాలుగోజాము అయినట్టుంది అందురూ బోగుల్ని తగలబెడతావుండారు. మా నసత్త సుప్రబాతం ఇంటా వీధిలోకి వచ్చినా. గంగరాయి దగ్గిర రవిగోడు, సురేషు ముసిముసిగా నవ్వుకుంటా వుండారు. అప్పుడే అనుమానం వచ్చింది నాకు. ‘రే! దొంగనాకొడకల్లారా సత్తింగా చెప్పండి….మానసత్త కోళ్లు ఎందుకు ఎత్తినార్రా ’ అడిగినా. నసత్తకి వంత పాడతా, సొరకాయలు కోసేసినారని, గుమ్డికాయలు ఎత్తుకెళ్నారని తూర్పు వీధికాడినుంచి వడ్డోళ్ళ సందు వరకు ఒకటే బండబూతులు చెవుల్లో తిరగతావుండాయి. ఎప్పుడూ వుండే బాగోతమేకదా అనుకుని నేను సురేషును తీసుకుని వాళ్ల వామికాడికి పొయినా బైయిటికి పోవాలనే సాకుతో.

సరిత వాళ్లత్తతో కలిసి ముగ్గులేస్తా మా వైపు చూసింది. తెల్లారకముందే నాకు పండగొచ్చింది. అయితే నా అనుమానమేందంటే మొదులే చికటి, ఈ చికట్లో నా మసిబొగ్గు మొకం ఆ పిల్లకు కన్పించిందో లేదోనని. మన పోబిడి ఆయమ్మికి తెలియాలని గొంతు పెంచి, ‘దార్లో అంతా ముళ్లులే బావ…చూసి నడువు అన్నా.’
ఆరోజు. పద్దన్నే చమురంటుకోని బోగిమంటల్లో బిందెల్తో కాగబెట్టిన నీళ్లతో తలకిపోసుకోవడమే. తెల్లారకముందే ఆకిలేత్తుకునింది. కూరతో ఇడ్నీలు తిని మా ఆపీసు కాడికి అదే సురేషోల్ల వామికాడికి పోయినా. ఆమారిగా తొలి దినం పండగ సంతోసంగా గడిచిపోయంది.

మరసటి దినం తెల్లారి మూడు గంటల నుంచే మాయమ్మ ఆ గుండాం ఈ గుండాం కడగతా వుంటే నిద్దరపట్టి చస్తేకదా. సంక్రాతి పండగ ఇంటికాడ్నే గడిచిపోయింది. కాలు కదల్నీలా నన్ను. మా అబ్బ ఒకవార, మా అన్నొకవార చేరినారు యముడ్లు మాదిరిగా. సాయింత్రం తంగేడుపూల కోసం అని బయటపడినా సరిత కనపడ్నే లేదు.
ఇంకన పసుల పండగ వొచ్చేసింది. పసువుల్ని యమగండం లోపే దొడ్లునుంచి తరమాలని పద్దన్నే లేని బర్రులు దొడ్డికాడ పేడతో దోడ్డివేసినా. మా అన్న వాటి కొమ్ముల్లో ఒకదానికి తెలుపు, ఇంకోకదానికి ఎరుపురంగు పూసినాడు. మానాయిన బండీఎద్దుల్ని కడుక్కొని వచ్చినాడు. నిన్న తెచ్చిన తంగేడుపూల్ని మాలలు గట్టి అన్ని గొడ్ల మెడల్లో వేసినాం. అక్కడే పొయిబోట్టి బెల్లపకూడు వండతావుంటే పొంగు వచ్చింది. మానాయిన ‘పచ్చాపొంగలు పాలపొంగళో.. ఆలపాకోళ్ల ఇంటిమీద దెంగులో దెంగుల్‌’ అని అరిసినాడు.

నేను కూడా ‘పచ్చా పొంగలు పాలా పొంగళో.. మర్రోళ్ల ఇంటిమీద దెం… దెం…’ అని అరిసినా.

ఇక్కన పక్కన ఇళ్లకాడి నుంచి మాకు ఎదురు అరుపులు మొదులైనాయి. మా వీరాగల్‌ మామ ఒకవార, మర్రిమామ ఒక వార ‘తిరగాబత్తినోళ్ల ఇంటిమీద దెంగులోదెంగులు’ అంటావుండారు. వరసగా వుండేవాళ్ల ఇంటిపేరుమీద ఆవిధంగా మావూళ్లో పసువులపండగ పూట తమాషా పడుకుంటారు.

వూరి గెవిలో డప్పులు మొగిస్తా వుండాడు వెట్టోడు. అందరం గొడ్లని వదిలి పెట్నాం. ఎనక శంకరగోడు, చెంగడు, జయిరాముడు ఎగిరెగిరి మేలాలను వాయిస్తా వుంటే, గొడ్లు లఘువందుకున్నాయి. గుంటకాడ దాకా అట్టా గొడ్లును తరిమినాక, గోడ్లోళ్లు వాటిని మేతకు తోలుకెళ్లినారు. వాళ్లవాళ్ల ఎద్దుల్ని పొలినీళ్ల(పొంగలి వండేటప్పుడు వచ్చే ఎసురు నీళ్లు)ను తీసుకుని వాళ్లోళ్ల కయ్యిల్లో చల్లేందు బయిలుదేరినారు మొగోళ్లు.

ఆడోళ్లు చిన్నపెద్ద అనిలేకుండా గుంపులుగుంపులుగా గబ్బెమ్మలను పెట్టి గబ్బియాళ్లు తడతావుండారు. నేను ఒకే లగ్గుతో మా కయ్యిల్లోకి చేరుకుని పొలినీళ్లు చల్లేసినా. చుసుకుంటే నాసామిరంగా తొడలదాకా ఉత్తిరేని ఇత్తుల మయంగా వుండాది. వాటిని గీరేసి దేవలంకాడికి లగెత్తినా. అప్పిటికే గొబ్బియాళ్లు గుంపు దేవలం దాటి చలపతిమామోళ్లఇంటిదాకా వెళ్లింది. అప్పుడే సరిత గొబ్బియాలుపాట పాడతావుండాది. ‘అబ్బా ఇంకొంచం ముందోచ్చింటే బాగున్ను’ అనుకుంటా గోపాలోళ్ల ఇంటికాడ కుచ్చున్నా ఆ పిల్లను చూస్తా.

‘యానాధి పండగదాకా వదిన ఇక్కేడ్నే వుంటాదిలేరా…గజ్జికుక్కలాగ ఎందుకు అట్టా జొల్లుకారస్తా వుండావు’ అంటా నా భుజంపైన చేయ్యేసినాడు రవిగోడు. అదీనిజమేలే….ఇట్టా ఆపిల్లకోసం గోబ్బియ్యళ్లతోనే పోతే మా సిద్దడు…. అదే మాఅన్న విషియం చీల్చీ నన్ను ఉతికారేస్తాడని మనసులోనే అనుకున్నా.

పసువలపండగ మధ్యాన్నం చానామంది పేటలో సినిమాకు పోతారు. సరితాకూడా పోతాదేమో తెలుసు కుందామని జయరామన్నోళ్ల ఇంటికి పొయినా. ‘ఏం నా, వదినోస్తేనే మా ఇళ్లు కనిపిస్తాదా’ అని విజియ కుశాలగా అడిగింది. ఇననట్టే, ‘మద్దాన్నం సినిమాకి పొతావుండారా విజియా’ అనడిగిని. ‘లేదునా మద్దేల్నుంచి మావోళ్లు వూరికి పోతారంట’ అని చెప్పింది యిజియ.

దెబ్బతో నెత్తిమింద పిడుగుపడినట్టైంది నాకు. ‘సరేలే యిజియా మళ్లీ వస్తా’ అని చెప్పి మద్దేల కూడు కూడా తినకుండా పేటకి బయిదేలినా. కుంటోడి యాపచెట్టుకాడ కి చేరుకున్నా గెసపోసుకుంటా. దూరంగా సరితోళ్లు వస్తాకినిపించినారు. ఎంటనే దెయ్యాలబొందకాడ వుండే తూములో దాంకున్నా. వాళ్లు నన్ను దాడుకున్నాక పైకొచ్చి ఎనకే బస్టాండు దాకా పొయినా. వాళ్లకి కనిపించకుండా బస్సుల ఎనకెనకే నిలబడ్డా. సరితోళ్లు బస్సు ఎక్కి నారు. బస్సు బైదేలింది. నాకు అక్కడ్నే ఘోఅని ఏడుపోచ్చింది. ఎవరైనా చూస్తారని ఒకే లగ్గుతో మావూరి దారిలో వుండే ఈశురుడి దేవలం కాడ ఆగి, ఘో అని ఏడస్తా వుండా. ఎంతకీ ఆగితే గదా ఏడుపు.

*

ఫోటో: ఝాన్సీ పాపుదేశి

పరంధామయ్య తిరుగబత్తిని

23 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నేను సదవతావుంటే ..తరవాత ఏమి జరుగుతుందోనని అదే పనిగా సదవతావుంటే మన పల్లెల్లో ఆప్యాయతగా అందరినీ వరసలు కలుపుకుని కపటంలేని కాలాన్ని గురుతు చేశారయ్యా మీ కథలో..ఐతే మీ ఏడుపుకు ఫలితం దక్కిందా..లేదా..

    మన మాండలికాలతో ఇలాంటి కథలు రాయాలబ్బా లేకపోతే మన జనపదాలు..పల్లెబాస..యాసలు కనుమరుగవతాయి.

    చిన్న నాటి చిలిపిచేష్టలును పండగపూట కథారూపంలో సారంగ పాఠకలోకానికి పరిచయమైన కథా రచయిత పరందామయ్య గారికి..శుభాభినందనలు.

  • అదిరింది అయ్యా.. పరందామ్.. పల్లెటూరి బాషా, పల్లెటూరి సంగతులు పల్లెటూరి విశేషాలని చిన్న నాటి తీపి గురుతులు ను, కళ్ళకు కట్టినట్లు రాసిన కథ అద్బుతం

  • అచ్చతెలుగు పల్లే భాష,యాషను కూర్చిన మీ కథను చదువుతున్నంతసేపు కల్లేదుటే కల్పన అనుభూతి కల్గుతున్నది..‌నిజంగా ఒకసారి మా జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను గుర్తుచేశారు…మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరెన్నో పల్లే పరవళ్ళు మీకలం నుంచి జాలువారాలని మనసారా ఆకాంక్షిస్తూ.మీ గురు..

  • అచ్చతెలుగు పల్లే భాష,యాషను కూర్చిన మీ కథను చదువుతున్నంతసేపు కల్లేదుటే కల్పన అనుభూతి కల్గుతున్నది..‌నిజంగా ఒకసారి మా జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను గుర్తుచేశారు…మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరెన్నో పల్లే పరవళ్ళు మీకలం నుంచి జాలువారాలని మనసారా ఆకాంక్షిస్తూ.మీ గురు..

  • అన్నా చదవతావుంటే శానా కుశాలగాఉంది….. బాల్య జ్ఞాపకాలను పదిలంగా తీసుకువచ్చిన మీకు శతకోటి వందనాలు…. ఆత్మీయ శుభాకాంక్షలు… మీరు మీ కలాన్ని మరింత బాగా ఝళిపించాలి

  • పాత కథని కొత్త తరానికి అందించే ప్రయత్నం చేసిన కవికి కృతజ్ఞతలు.అయితే పధ సమన్వయం లోపించింది.మరియు.భావుకత కుడా లోపించింది..ప్రయత్నం అభినందనీయం. కవి ముందు తన భావుకథని తనే అనుభవించాలి లేకపోతే పాటకుడు ఆస్వాదించే పధసమెల్లనం రాధు.ఈ కవికి ఇధి లోపంగా కనిపిస్తున్నది. మంచి ప్రయత్నం చేసిన పరంధామ థంగబథులకి కృతఙ్ఞతలు.

  • చాలా చాలా స్వచ్చమైన మేలిమి బంగారంలా ఉంది.

  • తీపి జ్ఞాపకాలు, మధుర స్మృతులు గుర్తుచేశారు. చాలా బాగుంది మీ రచనా సౌందర్యం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు