నిజమే సావిత్రి గారు మరణించలేదు

ఇప్పుడీ పుస్తకం సావిత్రిగారిలా ముక్కుసూటిగా, పురుషాధిపత్య సమాజం పై “కరవాల చాలనం” చేసే ఎందరినో తయారుచేస్తుందన్న నమ్మకంతో అందరితో చదివిద్దాం.

బందిపోట్లు కవిత పేరే ఇంటి పేరుగా మారిపోయిన సావిత్రిగారిని ఇప్పటి తరానికి పరిచయం చేయడానికి ఒక ప్రయత్నమే ఈ రచన. 27 యేళ్ళ క్రితం ఆవిడ కలంతో పాటు శ్వాస కూడా ఆగిపోకపోయి ఉంటే ఈ పరిచయం ఏమాత్రం అవసరం లేని కవీ రచయితా విమర్శకురాలు ఆమె. ఆమె చేసిన ప్రతి రచనా ఇప్పటి తరానికి చాలా అవసరమైనవీ విలువైనవీ. అందుకే ఈ పుస్తకాన్ని తాజాగా మరికొన్ని చేర్పులతో తీసుకువచ్చిన ఈ పుస్తక సంపాదకులు అరణ్య కృష్ణ గారికి అభినందనలు.

1991 అక్టోబర్ లో సావిత్రిగారు మరణించారని విశాఖపట్నానికి చెందిన స్త్రీశక్తి సభ్యులొకరు హైదరాబాదులో కలిసినప్పుడు చెప్తే, అప్పుడప్పుడే ప్రగతిశీల రాజకీయాలు పరిచయం అవుతున్న నాకు ఆవిడెవరో తెలీక అడిగాను. ఆ వార్త చెప్పిన స్నేహితురాలు వెంటనే కాగితమ్మీద బందిపోట్లు కవితని గబాగబా రాసి ఈ అద్భుతమైన కవిత రాసినావిడ అని చెప్పింది.

“పాఠం ఒప్పజెప్పకపోతే పెళ్లి చేస్తాన”ని

పంతులు గారన్నప్పుడే భయమేసింది.

“ఆఫీసులో నా మొగుడున్నాడు!”

అవసరమొచ్చినా సెలవివ్వడ”ని

అన్నయ్య అన్నప్పుడే అనుమానమేసింది.

“వాడికేం మగమహారాజు” అని

ఆడా మొగా వాగినప్పుడే అర్థమైపోయింది.

“పెళ్ళంటే పెద్ద శిక్ష” అనీ

“మొగుడం”టే స్వేచ్చా భక్షకుడనీ

మేం పాలిచ్చి పెంచిన సగమే

మమ్మల్ని విభజించి పాలిస్తుందనీ!

పురుషాధిక్యత గురించి ఇంత అద్భుతమైన కవిత మరొకటి లేదు. ఈ కవిత సావిత్రిగారిని కవిగా రచయితగా చిరస్థాయిగా నిలిపింది. స్త్రీవిముక్తిని కాంక్షించేవారికి ఆప్తురాలిని చేసింది.

నేను సావిత్రిగారిని ఎప్పుడూ కలవకపోయినా ఆవిడ రచనల వల్ల ఆవిడ పరిచితమైన మనిషిగానే అనిపించేవారు. కొందరికి మరణానంతర జీవితమే ఎక్కువుంటుంది. సావిత్రిగారు ఆ కోవలోకి వస్తారు. ఈ పుస్తకం ప్రచురించి 26 యేళ్ళు దాటినా ఇప్పటికీ ఇందులోని విషయాలు ప్రాసంగికమే. ముఖ్యంగా ఇప్పటి తరానికి అవసరమైనవి కూడా.

పురుషాధిపత్య భావజాలం అనేది మన నిత్య జీవితంలో ఎంతగా అల్లుకుపోయిందంటే ఒక్కోసారి దానిని తేలికగా గుర్తించలేకపోతాము. సావిత్రి గారికి ఎంత నిశితమైన దృష్టి ఉందంటే మనం నిత్యజీవితంలో ఉపయోగించే భాష లోని పురుషాధిపత్యాన్ని ఆమె చాలా బాగా పట్టుకొని చీల్చి చెండాడుతారు. చాలా వరకు కవితలలో ఇది బాగా వ్యక్తం చేయగలిగారు కూడా.       “భాషే రాని బడుద్దాయిలంటారు

భారమెంత వహిస్తున్నా నేనే భార్యనని”

అలాగే పితృస్వామ్య సమాజం స్త్రీల గురించి వాగే చెత్తనీ దాని ద్వంద వైఖరిని ఎత్తిచూపుతూ “సామ్యవాదం” అనే కవిత లో “గాజులేసుకున్న చాన పౌరుష హీన” /  తీసివేసిన నాతి తిరుగుబోతు”

“పితృస్వామ్యమ్మందు పిచ్చికూతలె మెండు / సామ్యవాదమొకటే దీన్ని పిండు”- అంటారు.

ఒకే తల్లి కడుపున పుట్టినా పురుషాధిపత్యం తలకెక్కిన అన్న చిన్నప్పటినుండి చెల్లిపై ఎలా దాష్టీకం చేస్తాడో, అధీనురాలిగా ఉండడం చెల్లికి ఎలా అలవాటయిపోతుందో  చెప్తూ చివరికి-

“అన్నీ అననిచ్చి, అనవసరంగా భరించి,/యింత ఆలస్యంగా లేచి/యీ జూలు దులిపితే

అదిరిపడ్డాడు, అరాయించుకోలేకపోయాడు/వెక్కిరించాడు, గుక్కపట్టి యేడ్చాడు/ఏది ఏమైనా మరి – సారీ బ్రదర్

నన్ను నేను తెలుసుకున్నాక – ఇక ఐ కాంట్ హెల్ప్ యూ!’’ – అని ముగిస్తారు.

తాను రాసిన 23 కవితల్లో చాలా వరకు స్త్రీ విముక్తి గురించినవే.

సావిత్రిగారికి చిన్నతనంలోనే పెళ్లయిపోయింది. కుటుంబంలోని ఆధిపత్యం, అణచివేతలకింద నలిగిపోతూ ఎంతో ఘర్షణ పడ్డారు. దొరికిన ప్రతి పుస్తకం చదివే అలవాటువల్ల ఎంతో మంచి సాహిత్యం చదవగలిగారు. ఆ చదువు వల్ల వచ్చిన చైతన్యం ఆమెను పురుషాధిపత్యాన్ని అనుభవిస్తూ పడిఉండనివ్వలేదు. చివరికి బయటికి వచ్చి తన కాళ్ళ మీద తాను నిలబడ్డారు. పేదరికం కన్నా స్వేచ్చా, ఆత్మగౌరవాలే ముఖ్యమనుకున్నారు. ప్రూఫ్ రీడర్ గా చాలీ చాలని జీతంతో బతికినా గౌరవంగా బతికారు. ఆమె చదివిన కొన్ని పుస్తకాలకు పరిచయాలను, సమీక్షలను రాశారు. నామిని గారి “పచ్చనాకు సాక్షిగా, ఉప్పల లక్ష్మణరావు గారి “బతుకుపుస్తకం”, నవీన్ గారి “అంపశయ్య”, స్త్రీశక్తి సంఘటన వెలువరించిన “మనకు తెలియని మన చరిత్ర” మొదలైన పుస్తకాలను సమీక్షించారు.

రేడియో ప్రసారాలకి, వార్తా పత్రికలకీ నిత్యం ఏదో ఒకటి రాస్తూ ఉండేవారు. “స్వర్ణకమలం” సినిమా చూసి దర్శకుడు విశ్వనాథ్ లో పితృస్వామ్య భావజాలాన్ని ఎండగట్టారు. ఆయన సంస్కృతిని నిలబెట్టే “బృహత్తర కర్తవ్యం” మీదవేసుకుని స్త్రీలలో పెరుగుతున్న చైతన్యం చూసి గుండెలు బాదుకొని మళ్ళీ వాళ్ళకి వాళ్ళ స్థానాన్ని చూపించి వెనక్కి తీసుకుపోయే కార్యక్రమాన్ని సినిమాల మాధ్యమంతో చేయతలపెట్టారు. ఆత్మగౌరవం కల హీరోయిన్ పాత్రని హీరో పాత్ర ద్వారా విశ్వనాథ్ ఎంత కష్టపడినా పశ్చాత్తాప పడేలా చిత్రించినా ఆయన బండారం బయటపడిందని ఏకిపారేస్తారు సావిత్రి. అందులోని ఆమె న్యాయమైన ఆగ్రహం అక్షరం అక్షరంలోనూ చురకత్తిలా పదునుగా ఉంటుంది. అంతే కాదు “విశ్వనాథ్ తో జానకి విముక్తి కోటిసార్లు యింపోజిషన్ రాయిస్తే ఈ కళాస్రష్ట కాస్త దారిలోకి రాగలడా ఆ తవ్వకాల్లోంచి?” అంటారు. తన సమీక్షకి “దొరికిపోయిన దొంగ కళాస్రష్ట” అని పేరు పెట్టారు.

అంతే కాదు నామిని పుస్తక సమీక్ష రాసేటప్పటికి కూడా ఆమెకు ఇంకా ఈ “దొంగ కళాస్రష్ట” మీద కోపం తగ్గలేదు. అందుకని మరోసారి శిక్ష వేశారు. నామిని పుస్తకం గురించి ఎంతో కదిలిపోయి రాస్తూ “ అక్షరం అక్షరం, పేరా పేరా, పేజీ పేజీ మన కళ్ళలో మెరుపులు మెరిపిస్తాయి. బావురుమంటూ ఏడ్పిస్తాయి. కుదిపి కుదిపి కూచోపెడతాయి. గుంజి గుంజి లేపి నిలబడతాయి. ఆశగా పరుగులు పెట్టేలా చేసి అంతలో గుండెడు దిగులు నెత్తిన గుమ్మరించి, మనకు తెలియకుండానే కళ్ళు నిండితే ప్రేమగా ఒడి చేర్చి తుడిచి ఓదార్చుతాయి” అని మెచ్చుకుంటారు. వెంటనే ఆమెకు విశ్వనాథ్ గుర్తుకువచ్చినట్టున్నాడు. తరవాతి పేరాలో-

“కళాత్మక చిత్రాల పేరిట వెన్నెముక లేని పాత్రల్ని సృష్టించే దర్శక శిఖామణులకీ, సిగ్గు ఎగ్గూ వదిలేసి భూమి మీద లేనివన్నీ కల్పించి రాసే కవీ, కథక పిశాచాలకీ, రీడబిలిటీ పేర నీచాతినీచమైన కల్పనా సాహిత్యాన్ని సమర్థించే విమర్శక, సమీక్షక చక్రవర్తులకి ఈ నిజాయితీ, ఈ పదాల పోహళింపూ, వాక్య విన్యాసం, ఈ స్పష్టతా, ఈ తెగువా అలవడేవరకూ, పది లక్షల సార్లు ఇంపోజిషను రాయమని ఈ పుస్తకం ఇవ్వాలి”, అంటారు.

రచయితలకు తాము చేసే రచనల పట్ల నిజాయితీ ఉండాలనే కాంక్ష ఎంత బలంగా ఉంటుందంటే అలా రచనలకి, ఆచరణకీ తేడా లేకుండా రెండురకాలుగానూ నిజాయితీగా నిలబడిన వారిపట్ల ఆమె తన మనసు లోలోతుల్లోంచి ప్రశంసలు అందచేస్తారు.

ఉప్పల లక్ష్మణరావుగారి బతుకు పుస్తకం గురించి రాస్తూ “ధీరోదాత్త హీరోల వికృత వర్ణనలతో గబ్బుకంపు కొట్టే గాధల్ని, లిపి పుట్టకముందు నుంచీ విని వినీ విసుగెత్తిపోయిన సమాజానికి లక్ష్మణరావుగారి వంటి నిజాయితీ గల సాహితీమూర్తుల ఆవిర్భావం ఒక చారిత్రక అవసరం అనే చెప్పాలి. వారి “అతడు-ఆమె” చదివినప్పుడు దశాబ్దాల తరబడి నాలో పేరుకుపోయిన నీరసం పటాపంచలై ఎక్కడలేని ఉత్సాహమూ పుట్టుకొచ్చింది. తనతో సమంగా ప్రతి ఒక్కరూ జీవించాలనే సదాశయం గల వ్యక్తి తప్పించి మరొకరు రాయలేరా పుస్తకం అన్పించింది. “బతుకు పుస్తకం” నా ఆశ నిజమేనని నిరూపించింది. ‘అతడు-ఆమె’ వంటి పుస్తకం రాయగలిగే అర్హత వారికే ఉన్నదని నిరూపించింది బతుకుపుస్తకం.

సావిత్రిగారు సమీక్షించిన పుస్తకాలన్నీ ఈనాటి తరానికి చాలా అవసరమైన పుస్తకాలు. ఆ సమీక్షలు చదివినవారు తప్పక ఆ పుస్తకాలను వెతుక్కొని మరీ చదువుతారు. అంత బాగా ఆ సమీక్షలు రాశారు.

ఈ పుస్తకంలో సావిత్రిగారు రాసిన 9 వ్యాసాలు కూడా ఉన్నాయి. “స్వాతంత్రానంతరం స్త్రీ స్వేచ్ఛ” అనే వ్యాసంలో కొడవటిగంటి కుటుంబరావు గారు ఒక రచనలో “అవివాహిత మాతలు”, “అక్రమ సంబంధాలు” అనే పదాలు వాడడం గురించి ప్రశ్నిస్తూ తాను లేఖ రాయడం ఆయన దానికి సంజాయిషీ ఇవ్వడం గురించి పేర్కొన్నారు. పొరపాటు చేసినవారెవరైనా సరే ప్రశ్నించాలని అనుకోవడం చాలా అభినందించవలిసిన విషయం.

ఈ వ్యాసంలో, ఇంకా ఘోరంగా మారిపోయిన స్త్రీల పరిస్థితి గురించి రాస్తూ అసలు స్వాతంత్ర్యం వచ్చిందనుకోవడమే వెర్రితనం అంటారు. సైన్సును సైతం స్త్రీలను అణచివేయడానికే ఉపయోగించడాన్ని గురించి కూడా ఇందులో రాస్తారు. అలాగే ప్రజారచయితగా పేరుగాంచిన లూసన్ రచనలో వ్యక్తమైన స్త్రీ వ్యతిరేక భావనల గురించి కూడా తీవ్రంగా విమర్శిస్తారు. ఎంత గొప్ప రచయిత అయినా స్త్రీల పట్ల గౌరవం లేకపోతే ఆమె క్షమించరు. క్షమించకూడదు. ఏదేశంలోనైనా స్త్రీల గురించి రాసే రాతలు ఎట్లా పురుషాధిపత్యంతో “కంపు” కొడుతూ ఉంటాయో బాగా విశ్లేషిస్తారు. చివరకు “స్త్రీల కోసం ఎవరు రాసినా అది సగం న్యాయమే అవుతుంది స్త్రీలకి. తన కష్టం గురించి, తనకి రావలిసిన ప్రతిఫలం గురించి, తనకు రుద్దబడిన కంపులు గురించి, వాటి నుంచి విముక్తి గురించి స్త్రీలు రాసుకోగలిగిన స్థితే సొంపైనది. ఇది తప్ప ఏదైనా స్త్రీకి తీరని కంపే!” అని ముగిస్తారు.

ఇలా ఇంకా మరికొన్ని వ్యాసాలు కూడా ఇందులో ఉన్నాయి. నిర్మొహమాటంగా ముక్కుసూటిగా రాయడం సావిత్రిగారి ప్రత్యేకత.

ఇంకా ఈ పుస్తకంలో సావిత్రిగారి గురించి ఆమె మిత్రులు పంచుకున్న అనుభూతులు, అభిప్రాయాలూ కూడా ఉన్నాయి. మొదటిసారి 1992 లో ఈ పుస్తకం అచ్చయినప్పుడు చేకూరి రామారావు గారు తమ “చేరాతలు”లో ఈ పుస్తకం గురించి రాసిన విషయాలు సావిత్రి గారికి ఒక మంచి యోగ్యతా పత్రం లాంటిది. అందులో తాను బి.ఏ తెలుగు విద్యార్థులకోసం మౌలికాంశాల కోర్సుకు పాఠాలు రాస్తున్నపుడు వచన కవిత్వం అనే పాఠంలో కవిత్వ లక్షణాలను పరిచయం చేయడానికి తనకి సావిత్రి గారి బందిపోట్లు కవిత పనికి వచ్చిందని రాశారు. “భాషా శాస్త్రం సాహిత్య విమర్శకు ఎట్లా పనికివస్తుందో రుజువు చేయడానికి ఈ కవిత ను వాడుకున్నాను.” అని రాశారు. ఇది చాలా గొప్ప ప్రశంశ. “స్త్రీ విముక్తి ధోరణి సాహిత్యంలో సావిత్రి స్థానం ఆధునికాంధ్ర సాహిత్యంలో గురజాడ అప్పారావు గారి స్థానంతో పోల్చదగింది” అని కితాబు కూడా ఇచ్చారు. బందిపోట్లు ఇంగ్లీషులోకి అనువాదం కూడా చేశారు కానీ, కొన్ని అభివ్యక్తీకరణలకి ఉండే స్థానికత వలన అన్నీ పరాయి భాషల్లోకి ఒదగలేవు. ఇది కూడా అలాంటిదే.

సావిత్రిగారు స్వయంగా తన తల్లి గురించి రాసిన రచన వల్ల కానీ తన గురించి మిత్రులు రాసిన విషయాల వల్ల కానీ ఆమె వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించుకోవచ్చు.

“మా అమ్మగారు తప్పించి ప్రతి ఒక్కరూ నా చదువుకు వ్యతిరేకం. చదువుకోవాలనే పంతం పెరిగింది నాలో. తల్లే దైవంగా, గురువులే సోదరులై నన్ను ప్రోత్సహించడంతో బడి చదువూ, పత్రికా పఠనమూ పదేళ్ళ వయసు నుంచీ వ్యసనాలుగా తయారయ్యాయి. ఇంట్లో క్లాసు పుస్తకం తియ్యనివ్వకపోయినా గురువులందరి ప్రశంశలూ పొందడం సహించలేక మా అమ్మగార్నీ నన్నూ మోసగించి నాగుబాము వంటి మనిషితో నా పెళ్లి జరిపించారు. 14 యేళ్ళ నరకయాతన అనంతరం ఆ బంధం నుంచి బయటపడ్డాను, ఇద్దరు పిల్లలతో” అని రాసుకున్నారు. జీవితంలో తీవ్రమైన అణచివేత, కష్టాలు అనుభవించిన అందరూ సావిత్రిగారిలా ఎదురు నిలిచి పోరాడలేరు. తాను కేవలం పురుషాధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడితే చాలని అనుకోలేదు. తనకు దొరికిన సాహిత్య పఠనం వల్ల ఆమె స్త్రీ విముక్తికి మార్గం ఏమిటన్నది కూడా అర్థం చేసుకోగలిగారు. మార్క్సిజం చదివారు. మహిళా సంఘాలతో కలిసి పనిచేశారు. సాహితీ మిత్రుల సమావేశాల్లో పాల్గొని తన విశ్లేషణ శక్తిని పెంచుకున్నారు. ఆమెలోని మృదుత్వం వల్ల తల్లిని బాగా అర్థం చేసుకోగలిగారు. అదే మృదుత్వం కారణంగా పితృస్వామ్య అణచివేత పట్ల అంత కఠినంగా ఉండగలిగారు. ఆమె మిత్రులు రాసిన జ్ఞాపకాల్లో సావిత్రిగారి గురించిన విభిన్న కోణాలు మనకి అర్థం అవుతాయి. అందరూ రాసిన ఒక్క విషయం – ఆవిడకు రచయితలు కళాకారుల నిజ జీవితంలో నిజాయితీ లోపించినట్టు తెలిస్తే తట్టుకోలేక పోయేది” అనే విషయం. అనేకమంది ప్రముఖ రచయితలు ఆమె గురించిన జ్ఞాపకాలు పంచుకున్నారంటే ఆమె ఎంతమంది సాహిత్యకారులను స్నేహితులుగా సంపాదించుకున్నారో అనిపిస్తుంది. సావిత్రిగారి గురించి రాస్తూ ఆమె “అగ్ని శ్వాశ” అనీ, “ఆరని జ్యోతి” అని, “రాయని కవిత” అని, “జీవితం మలిచిన కవిత” అని “మౌన సముద్రంలో కవిత్వపు ఉప్పెన” అనీ “రాలీ రాలని పువ్వు” అని మిత్రులు ప్రసంశించారు. ఆమె తనని పట్టి పీడిస్తున్న అనారోగ్యం పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉండేవారని మిత్రులంతా రాశారు. నిజానికి ఆవిడ వ్యక్తిత్వంలో ఇదొక వైరుధ్యం. ఇన్ని గొప్ప రచనలు చేసిన ఆవిడ జీవితం విలువను గుర్తించలేదే అని బాధ కలగక మానదు. మిగతా విషయాలలో ఆవిడ నమ్మిన, ఆచరించిన విలువలు ఆదర్శనీయం. కడుపునిండిన తరవాత చెప్పిన ఆదర్శాలు కావు ఆవిడవి. విలువల కోసం కడుపు కాల్చుకున్న జీవితం ఆమెది.

సావిత్రిగారు అద్ధాంతరంగా మరణించకపోయి ఉంటే మరెన్నో రచనలు చేసిఉండేవారు. ఇప్పుడీ పుస్తకం సావిత్రిగారిలా ముక్కుసూటిగా, పురుషాధిపత్య సమాజం పై “కరవాల చాలనం” చేసే ఎందరినో తయారుచేస్తుందన్న నమ్మకంతో అందరితో చదివిద్దాం.

“ఆమె అస్తమించలేదని……”

సావిత్రి.

సంపాదకులు – అరణ్యకృష్ణ.

పేజీలు 189; వేల 150/-

 

బి.అనూరాధ

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • వెంటనే చదవాలని అనిపించింది. ఇన్ని రోజులూ తెలియనందుకు నేను ఏ లోకంలో ఉన్నానా…అనుకుంటూ..

  • చాలా మంచి సమీక్ష. ధన్యవాదాలు అనూరాధ గారూ!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు