హురూబ్

“నిన్న అన్వర్ భాయ్ వాళ్ల అమ్మ ఫోన్ చేసింది…”

“ఏమన్నది?”

“‘ఆఖరి చూపులు చూసుకునే భాగ్యం కలిగించు బిడ్డా… చచ్చి నీ కడుపున పుడతా!’ అంటూ ఏడ్చింది.”

(1)

రియాద్, సౌదీ అరేబియా.

కింగ్ అబ్దుల్లా ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్. పదిహేనవ అంతస్తులోని కార్పొరేట్ ఆఫీస్. మార్నింగ్ స్టాండప్ మీటింగ్ నడుస్తోంది. డెస్క్ మీద ఉన్న తెల్లని కప్పుల్లోంచి కమ్మటి కాఫీ వాసన వస్తోంది. ఫారూఖ్ హెడ్‌ఫోన్స్ పెట్టుకుని, మైక్ మ్యూట్ లో పెట్టి తన వంతు కోసం ఎదురుచూస్తున్నాడు. కానీ అతని ఆలోచనల రైలు మాత్రం ఆఫీసు గోడలు దాటి, ఇండియాలోని తన ఊరి వైపు, అమ్మానాన్నల జ్ఞాపకాల చుట్టూ పరుగులు తీస్తోంది.

డెస్క్ మీద ఉన్న ఫోన్ వైబ్రేట్ అయ్యింది. చేతిలోకి తీసుకుని చూశాడు.

> “ఫారూఖ్ భాయ్… రియాద్ మలజ్ ఏరియాలో మన తెలంగాణా హౌస్ డ్రైవర్ ఒకతను సూసైడ్ చేసుకున్నాడట. ఇప్పుడే ఫోన్ వచ్చింది. మీరు ఉండేది ఆ ఏరియాలోనే కదా, మన SATA తరపున మీరే అటెండ్ అయ్యి, ఆ కేసు చూసుకోండి. డీటెయిల్స్ పంపుతున్నాను.”

సాటా (సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్) వాట్సాప్ గ్రూప్‌లో వచ్చిన మెసేజ్ అది. నిట్టూరుస్తూ థంబ్స్-అప్ సింబల్ పెట్టి, ఫోన్ పక్కన పడేశాడు. స్క్రీన్ లోకి తల దూర్చాడు గానీ, మనసు మాత్రం ఆ సూసైడ్ చేసుకున్న అభాగ్యుడి వైపు మళ్లింది.

లంచ్ బ్రేక్‌లో ఆ మెసేజ్ లో ఉన్న నంబరుకి ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నాడు. చనిపోయిన వ్యక్తి పేరు అన్వర్.

(2)

ఫారూఖ్ పది రోజులుగా నేషనల్ కేర్ హాస్పిటల్ డైరెక్టర్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాడు. ఈరోజు కూడా ఆఫీసు నుంచి నేరుగా హాస్పిటల్‌కే వచ్చాడు. రియాద్ ట్రాఫిక్‌లో ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లి, మళ్ళీ ఇటు రావడం అంటే పెనంలోంచి పొయ్యిలో పడ్డట్లే. అలసిపోయి, రిసెప్షన్ ఏరియాలోని స్టీల్ కుర్చీలో కూర్చుని కునుకుపాట్లు పడుతున్నాడు.

రిసెప్షనిస్ట్ వచ్చి, “యా ఫారూఖ్, తాల్ (లోపలి రండి ),” అని అరబిక్‌లో పిలిచేసరికి ఉలిక్కిపడి లేచాడు. ఫారూఖ్ కళ్లు నలుపుకుంటూ, చేతిలోని ఫైల్ తీసుకుని డైరెక్టర్ ఆఫీసులోకి నడిచాడు.

“సలామ్, ఫారూఖ్. చెప్పండి.”

“సార్, అన్వర్ డెత్ సర్టిఫికెట్ కోసం వచ్చాను. ఏదైనా అప్డేట్ ఉందా సార్ ?”

“ఎస్, ఉంది. కానీ చిన్న సమస్య. అన్వర్‌పై రెండేళ్ల క్రితం వాళ్ళ యజమాని ‘హురూబ్’ (పారిపోయినట్లు) కేసు రిజిస్టర్ చేశాడు. అందుకే సిస్టమ్ లో ఫైల్ మూవ్ అవ్వట్లేదు.”

“ఓహ్… ఇప్పుడేం చేయాలి డాక్టర్?”

“మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ (కోర్టు) ఆఫీసుకు వెళ్ళండి. ఆ కేసు క్లియర్ అయితేనే మేము పేపర్ ఇవ్వగలం.”

“ఓకే, థాంక్స్ డాక్టర్.” ఆ మాట అన్నాడే గానీ, పదిరోజులుగా తాను పడ్డ కష్టానికి ఫలితం దక్కలేదన్న బాధ, అలసిపోయి ఉన్న అతని ఎర్రని కళ్ళల్లో స్పష్టంగా కనబడుతోంది.

ఇంటికి చేరేసరికి రాత్రి తొమ్మిది అయ్యింది. పిల్లలిద్దరూ అప్పటికే పడుకుని ఉన్నారు.స్నానం చేసి వచ్చి, భార్యతో కలిసి భోజనానికి కూర్చున్నాడు.

“ఏమైంది? ఫైల్ క్లియర్ అవ్వలేదా? మొహం అలా ఉంది?” డైనింగ్ టేబుల్ మీద గిన్నెలు సర్దుతూ అడిగింది భార్య.

“హ్మ్మ్… హురూబ్ కేసు ఉంది. అందుకే హాస్పిటల్ వాళ్లు డెత్ సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. కోర్టుకు వెళ్ళమంటున్నారు.”

“హురూబా? అంటే?”

“అంటే, రెండేళ్ల క్రితం అన్వర్ భాయ్ తన పాత కఫిల్ (యజమాని) దగ్గర నుంచి పారిపోయాడు. ఆ యజమాని అన్వర్‌పై హురూబ్ కేసు పెట్టాడు. అంటే రెండేళ్లుగా అన్వర్ ఇక్కడ ఇల్లీగల్‌గా ఉంటున్నాడన్నమాట.”

“అయ్యో… అయితే ఇది చాలా కాంప్లికేటెడ్ కేసు అయ్యేలా ఉంది కదా? ఆత్మహత్య ప్లస్ హురూబ్?”

“అవును. చూద్దాం ఏమవుతుందో.”

“మీ సాటా టీంలో ఇంకెవరూ లేరా? మీరొక్కరే ఎలా హ్యాండిల్ చేస్తారు? మీరొక్కళ్ళే ఎందుకు ఇంతలా కష్టపడటం? నాకేం అర్థం కావట్లేదు.”

“నిన్న అన్వర్ భాయ్ వాళ్ల అమ్మ ఫోన్ చేసింది…”

“ఏమన్నది?”

“‘ఆఖరి చూపులు చూసుకునే భాగ్యం కలిగించు బిడ్డా… చచ్చి నీ కడుపున పుడతా!’ అంటూ ఏడ్చింది.”

కాసేపు ఇద్దరూ మాట్లాడలేదు. స్పూన్లు, పింగాణీ ప్లేట్ల మీద “టక్… టక్…” అని శబ్దం చేస్తున్నాయి.

“నాకు అర్థమవుతోంది, మీరిదంతా ఎందుకు చేస్తున్నారో. కానీ పిల్లలు? వాళ్లకి అర్థం చేసుకునే వయసు లేదు. ఈరోజు పార్కుకు తీసుకువెళ్లలేదని ఎంత బాధపడ్డారో తెలుసా? వాళ్ల గురించి కూడా ఆలోచించండి. ఈ సమయం మళ్లీ రాదు.”

ఇంతలో పెద్దమ్మాయి నిద్రలోంచి మేల్కొని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చింది. నిద్ర కళ్ళతో

“హాయ్ –  అబ్బా – ఇవాళ కూడా లేట్ అయ్యిందా  ? ఆఫీసులో వర్క్ ఎక్కువగా ఉందా ?”

అంటూ జవాబు కోసం చూడకుండా వాష్రూమ్ లోకి వెళ్ళింది. ఐదు నిమిషాల  తరువాత బయటకి వచ్చి –

“గుడ్ నైట్ – అమ్మీ – అబ్బా ” చెప్పి బెడ్ రూమ్ వైపు నడిచింది.

“గుడ్ నైట్ బెటా –  రేపు తప్పకుండా వెళ్దాం పార్కుకి.”  నవ్వుతూ అన్నాడు ఫారూఖ్ .

బెడ్ రూమ్ వైపు నడుస్తున్న పెద్దకూతురు వెనక్కి తిరిగి చూసి, నవ్వి

“ఒకే అబ్బా” అని జవాబిచ్చి బెడ్ రూంలోకి వెళ్ళిపోయింది.

ఫారూఖ్ మొహం చిన్న బోయింది. మళ్ళీ మౌనం – స్పూన్లు, పింగాణీ ప్లేట్ల మీద “టక్… టక్…” అని శబ్దం చేస్తున్నాయి.  ఆ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ ఫారూఖ్ భార్య మాట్లాడింది.

“ దే ఆర్ గ్రోయింగ్ అప్ , అన్నీ అర్థం అవుతున్నాయి . అది సరే కాని , మరి ఏంటి ప్లాన్ ఇప్పుడు? “

“హ్మ్మ్ – ఏముంది, రేపట్నుంచి కోర్టు చుట్టూ తిరగాలి.”అంటూ లేచి ప్లేట్ తీసుకుని కిచెన్ లోకి నడిచాడు.

(3)

అన్వర్ భాయ్ ఆత్మహత్య చేసుకుని అప్పటికే నెల రోజులకు పైనే అవుతోంది. ఒకవైపు అన్వర్ వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. ఒక అరబిక్ లాయర్ కేసు చూస్తున్నాడు. ఐదు వాయిదాల తరువాత ,  కోర్టులో ఏం జరిగిందో తెలియకుండానే ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేసింది: పది వేల రియాల్ల ఫైన్ (సుమారు రెండు లక్షల ఇరవై వేల రూపాయలు) వేశారు . అది కట్టి క్లియరెన్స్ తీసుకుంటే గానీ బాడీ ఇండియాకు కార్గో చెయ్యలేరు.

సాటా గ్రూపులో చర్చలు జరుగుతున్నాయి. ఫండ్ రైజర్ కూడా మొదలు పెట్టారు.  అన్వర్ భాయ్ వాళ్ల ఫ్యామిలీని కూడా డబ్బులు ఏమైనా అడ్జస్ట్ చేయగలరో అడిగారు.

“మావీ అతుకుల బతుకులే కదా సార్, మా దగ్గర ఏముంటాయి? మీరే ఎట్లన్నా చేసి  పుణ్యం కట్టుకోండి ! ” అన్నాడు అన్వర్ వాళ్ల పెద్దన్నయ్య.

ఫండ్స్, చందాలు అన్నీ కలిపి ఎనిమిది వేల రియాళ్లు మాత్రమే జమయ్యాయి. ఇంకా రెండు వేలు తక్కువ పడుతున్నాయి.ఫారూఖ్‌కు మళ్లీ సందిగ్ధం. మిగిలిన ఆ రెండు వేల రియాళ్లు (సుమారు యాభై వేల రూపాయలు) నువ్వే కలిపి, అన్వర్‌ను ఆ నరకం నుంచి విముక్తి చెయ్ అని మనసు చెబుతోంది.

మెదడేమో… “యాభై వేల రూపాయలు అంటే మాటలా? ఇంటి దగ్గర రెండు నెలల అమ్మానాన్నల ఖర్చు. అయినా గ్రూపులో ఎవరూ మాట్లాడట్లేదు, నువ్వే ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు? అందరిలాగా వందో, రెండు వందలో ఇచ్చి పక్కకు తప్పుకో!” అని హెచ్చరిస్తోంది.

ఈ ఆలోచనలతో రెండు రోజులు కుస్తీ పడ్డాడు. రాత్రిళ్ళు నిద్ర పట్టట్లేదు. కళ్ళు మూస్తే ఫ్రీజర్లో ఉన్న అన్వర్ శవం కనిపిస్తోంది, అన్వర్ అమ్మ మాటలు చెవుల్లో మారుమోగుతున్నాయి. మనిషికి తన అంతర్గత సంఘర్షణను మించిన యుద్ధం మరొకటి లేదు.

ఒంటరిగా నిర్ణయం తీసుకోలేడు. తన భార్యతో చెప్పకుండా అస్సలు చెయ్యలేడు. మూడు రోజుల తరువాత ఎలాగోలా ధైర్యం చేసి విషయం చెప్పేసాడు.

“అనుకున్నాను, మళ్లీ ఇలాంటిదేదో వస్తుందని! వెయ్యో, రెండు వేలో అంటే పర్లేదు… యాభై వేలు అంటే మాటలా? ఆ డబ్బులు మిగుల్చడానికే కదా మనం కన్నవాళ్లని, ఊరిని వదిలేసి ఇంత దూరం వచ్చి బతుకుతున్నది! మీరు ఇలా ప్రతిసారీ దానాలు చేస్తూ, సొంత డబ్బులతో శవాలను ఇండియా పంపుతూ పోతే, మనం ఎప్పటికీ ఇండియా వెళ్లలేము. మీ ఇష్టం, ఏదైనా చేసుకోండి..ఎన్ని సార్లు చెప్పినా – అదే తీరు.” విసుగ్గా అంటూ లోపలి వెళ్లిపోయింది.

ఫారూఖ్ మాట్లాడలేదు. రాత్రి అందరూ పడుకున్నాక రెండు రకాతుల ‘ఇస్తిఖారా’ నమాజ్ (దేవుని మార్గదర్శకత్వం కోరడానికి చేసే ప్రార్థన) చదువుకున్నాడు. నమాజ్ పూర్తయ్యేసరికి  తనకు చెయ్యాల్సింది అర్ధం అయ్యింది.

లేచి పిల్లలు, భార్య పడుకుని ఉన్న మంచం దగ్గరకు వెళ్లి, భార్య పక్కన కూర్చున్నాడు.

“ఇస్తిఖారా చేసారా ?” అంటూ గొంతు తగ్గించి అడిగింది.

“హా – చేశాను” అన్నాడు ఫారూఖ్ .

“ఏమనిపించింది”

ఫారూఖ్ మాట్లాడకుండా, తల పైకి కిందకి ఆడించాడు.

“హ్మ్మ్ ఇదే లాస్ట్  టైం…ప్లీజ్ ”

ఫారూఖ్ నవ్వుతు భార్య నుదుటి మీద ముద్దు పెట్టాడు. మనసులోని చికాకు అంతా గాలివానకు కొట్టుకుపోయినట్లుగా ఉంది.వెంటనే ఫోన్లో మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి, అన్వర్ భాయ్ కేసు మీద పెండింగ్ ఉన్న ఆ రెండు వేల రియాళ్లు తన క్రెడిట్ కార్డు ద్వారా కట్టేశాడు. మొత్తం పదివేల ఫైన్ క్లియర్ అయ్యింది. మనస్సంతా ప్రశాంతత. ఆ రోజు హాయిగా నిద్రపోయాడు.

మరుసటి రోజే రావాల్సిన అప్రువల్స్ వచ్చేశాయి. ఆ వారంలోనే అన్వర్ భాయ్ శవాన్ని దగ్గరుండి ఫారూఖ్ ఇండియా పంపించాడు.

(4)

అన్వర్ భాయ్ బాడీ ఇండియా వెళ్ళిపోయిన రెండు వారాల తర్వాత…

ఒక శనివారం ఉదయం. ఫారూఖ్ నాష్టా కోసం ఎదురు చూస్తూ సోఫాలో పడుకుని ఫోన్లో రీల్స్ చూస్తున్నాడు. వంటింట్లోంచి పూరీ, ఆలు కుర్మా వాసన ఘుమఘుమలాడుతోంది. పిల్లలు యూట్యూబ్‌లో కార్టూన్స్ చూస్తున్నారు.

ఇంతలో ఫారూఖ్‌కు వాట్సాప్ కాల్ వచ్చింది. ఇండియా నెంబర్. VPN ఆన్ చేసి, పచ్చ బటన్ స్వైప్ చేసి, స్పీకర్‌లో పెట్టాడు.

“హలో ఎవరు?”

“సలామ్, ఫారూఖ్ భాయ్… ఖైరీయత్…”

“వాలేకుం సలాం. ఎవరు మీరు?”

“ఫారూఖ్ భాయ్.. నేను అన్వర్ వాళ్ల పెద్ద అన్నను మాట్లాడుతున్నాను.”

ఫారూఖ్ మొహంలో ఒక చిన్న సంతోషం. కనీసం బాడీ చేరాక కృతజ్ఞత చెప్పడానికైనా ఫోన్ చేశారే అనిపించింది. “వాలేకుమ్ సలామ్. చెప్పండి భాయ్. అంతా సవ్యంగా జరిగిందా?”

“అదంతా అయ్యింది లే సార్!. ఒక విషయం అడుగుదామని చేసినా.. గల్ఫ్‌లో పని చేస్తూ చనిపోతే, అక్కడ గవర్నమెంట్ నుంచి ఏవో ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయంట కదా?”

సోఫాలో పడుకుని ఉన్న ఫారూఖ్ ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. టీవీ సౌండ్ తగ్గించాడు.

“మీకు ఎవరు చెప్పారు భాయ్?”

“మాకు తెలుసు సార్, మా బంధువులు చానా మంది ఉన్నారులే గల్ఫ్‌లో.”

“అవునా, మరి మొన్న అన్వర్ భాయ్ శవం ముప్పై రోజులు ఇక్కడే ఉంటే కనీసం ఎవరూ ఫోన్ చేయలేదు? ఒక్క రియాల్ సాయం చేయలేదు?”

అటు నుంచి జవాబు లేదు. “సరే… ఇప్పుడు మీరేమంటారు?”

“మా అన్వరు ఇరవై ఏళ్లుగా గల్ఫ్‌లో ఉన్నాడు, ఆనికి ఎన్ని బ్యాంకు అకౌంట్లు ఉన్నాయో, దాంట్లో ఎంత డబ్బుందో, అదంతా మీకు తెలుస్తదంట కదా? దానికితోడు మా అన్వర్ సూసైడ్ చేసుకుండు కదా, ఇంకా ఎక్కువ పైసలు వస్తాయంట. అదే మాట్లాడుదాం అని ఫోన్ చేసినా.”

ఫారూఖ్ తల పట్టుకున్నాడు. “భాయ్, మీ అన్వర్ మీద ఇక్కడ హురూబ్ కేసు అయ్యింది. అతను ఇల్లీగల్‌గా పనిచేస్తున్నాడు. దానికి తోడు కోర్టు వేసిన ఫైన్ మేమే మా డబ్బులతో కట్టి డెడ్ బాడీ ఇండియా పంపించాము. ఇన్సూరెన్స్ రాదు, ఏం రాదు. మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు.”

“భాయ్, అదంతా మాకు తెలియదు. ఆ ఇన్సూరెన్స్ డబ్బులు అవన్నీ మీ దగ్గరే ఉంటాయంట. మాకు రావాల్సింది మాకు ఇచ్చేయండి, లేదంటే ఇక్కడ పోలీస్ కంప్లైంట్ ఇస్తాం.”

“పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? ఏమని ఇస్తారు? ఎవరి మీద ఇస్తారు?” ఫారూఖ్ గొంతు జీరబోయింది.

అటు నుంచి జవాబు రాలేదు. ఫారూఖ్ ఫోన్ కట్ చేసి సోఫాలో విసిరేశాడు. అటు నుంచి మళ్లీ ఫోన్ రింగ్ అవుతోంది. ఫోన్ సైలెంట్ లో పెట్టి తల వెనక్కి ఆన్చి కళ్ళు మూసుకున్నాడు.

ఇంతలో నాష్టా ప్లేట్ తీసుకుని ఫారూఖ్ భార్య లివింగ్ రూమ్‌కి వచ్చింది. “ఎవరండీ ఫోన్లో?పోలీస్ కంప్లైంట్ అవీ అంటున్నారు?”

ఫారూఖ్ నిస్సహాయంగా నవ్వాడు. “మొన్న మనం ఇండియా పంపిన అన్వర్ వాళ్ల అన్నయ్య. పోలీస్ కేసు ఇస్తాడంట. అన్వర్‌కి రావాల్సిన డబ్బులు, ఇన్సూరెన్స్ లు దాచుకుని మనం ఎగ్గొట్టామంట.”

ఆమె చేతిలోని ప్లేట్ టేబుల్ మీద పెట్టింది.

“పోలీస్ కంప్లైంటా? ఎవరి మీద ఇస్తాడంట?? – మా తమ్ముడు గల్ఫ్‌లో దిక్కులేకుండా చచ్చిపోతే… శవాన్ని ఇంటికి పంపడానికి ఎవరూ లేకపోతే…హాస్పిటల్ చుట్టూ ,  కోర్టు చుట్టూ తిరిగినందుకు మన మీద ఇస్తాడటనా? ఇండియన్ ఎంబసీ చేతులెత్తేస్తే, ఆఖరి చూపులు చూసుకోవాలని వాళ్ల అమ్మ ఏడుస్తుంటే… తమ ఆఫీస్ పనులు, పెళ్లాంబిడ్డలని వదిలి, హాస్పిటళ్ల చుట్టూ తిరిగినందుకు ఇస్తాడటనా? వాళ్ళని వీళ్లని డబ్బులు అడిగి, చాలకపోతే తమ జేబుల్లోంచి యాభై వేలు తీసి మరీ కోర్టులో ఫైన్ కట్టి, డెడ్ బాడీని ఇంటికి పంపించినందుకు మన మీద పోలీస్ కేసు పెడతాడటనా???”

ఆమె గొంతులో అప్పటిదాకా  దాగున్న బాధ, కోపం , చిరాకు ఒక్కసారిగా బయటకు వచ్చింది.  ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి.

ఫారూఖ్ మౌనంగా ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు.

*

సంజయ్ ఖాన్

నా పేరు సంజయ్ ఖాన్. ప్రస్తుతం రియాద్, సౌదీ అరేబియా లో ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో ప్రోడక్ట్ మేనేజర్‌గా పని చేస్తున్నాను. స్వస్థలం తెలంగాణలోని ఖమ్మం జిల్లా, మధిర మండలం, ఖాజీపురం గ్రామం.

చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం , కథలు , కవిత్వం ఇష్టంగా చదువుతున్నాను, ఇవి నా జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించాయి. ఎప్పుడు కథలు చవడమే గాని రాయాలని అనుకోలేదు . అనుకున్న నేను రాయలేను ,లేదా రాసేంత సాహిత్య జ్ఞానం నాకు లేదులే అని తప్పించే వాడిని. కానీ గల్ఫ్ దేశాల్లో నేను చూసిన , మాట్లాడి తెలుసుకున్న మన తెలుగు వాళ్ళ వ్యధలు, కథలు నన్ను కదిలించి ఈ కథలు రాయడానికి నన్ను ప్రేరేపించాయి. పుస్తక పఠనంతో పాటు ట్రావెలింగ్, రన్నింగ్ నా హాబీస్.

5 comments

Leave a Reply to Azeena Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సంజయ్ గారు.. మీరు ఏ కథ రాసినా గుండె కు హద్దుకుంటుంది.. వలస వెళ్ళి చనిపోయిన తర్వాత కూడా చాలా కష్టాలు ఎదుర్కోవాలి అని.. అక్కడ్నుంచి స్వదేశానికి తీసుకుని రావటానికి ఉండే పద్ధతులు చిక్కులు బాగా వర్ణించారు .. మంచి చేసేవాళ్ళకు చెడు ఎలా అంటకడతారు అన్నది కూడా చెప్పారు.. చాలా మంది కి జరిగే ఉంటుంది.. మరిన్ని కథల కోసం ఎదురుచూస్తున్నాం.
    Thank You Sanjay Khan Garu.

  • Sanjay garu,
    Meeru raase kathallo padhajalam naaku chala baga nachuthundhi.”Thellani kappulo kammani coffee “…”Gnapakala parugulu “..baga anipinchai..story chadivinaka…manchithananiki viluvaledhu ani anipinchindhi.Maa amma garu eppudu oka proverb cheppevaru naaku..”Baagaa kaasina chettuke Raalla dhebbalu bidda” ani. Ee proverb suit ayye Fharukh lanti vallu endharooo vunnaru..Vallandhariki ee story ankitham avvalani korukuntunna… maa ammagari proverbs gnapakala purugulo nannu theeskelli nandhuku thank you Sanjay..God bless you..

  • More than a story ,we got to know about many things like huroob, formalities to be done and struggles to be faced before sending a dead body to their families and so on…… Very informative story …. Felt the pain and struggle of the main character while reading it. As usual Topnotch naration….

  • Sanjay –

    You are keep on impressing with your writings ,

    Starting with “Dubai Mallanna”
    Till this “Hurub”

    You have given great stories so far .

    Sanjay Boss , Keep writing the good stories like this .

    This story is the perfect example how Human mind set changes very quickly when it comes to money and it was well explained .
    Thank you

    Thank you Saranga for giving the beautiful stories every month.

  • చివర్లో మలుపు వాస్తవికం.
    నాకూ ఇలాంటి అనుభవమే వుంది. ఒక చెయ్యి మొత్తం కాలిపోయిన ఒక అమ్మాయికి అంతో ఇంతో సాయం చేసి నాకు తెలిసిన ఏదాఇయినా డాక్టరును సలహా అడుగుదామని ఫోటోలు తీసుకుంటున్నా. వెనుక నుంచీ ఆ అమ్మాయి తండ్రి అంటున్నాడు, “అమ్మా బాగా చూపెట్టు, సార్ బాగా ఫోటోలు తీసుకుంటే వాటిని చూపిస్తే అక్కడ డబ్బులు ఇచ్చేవాళ్ళుంటారు.”
    నాకేం కోపం రాలేదు, అజ్ఞానం మీద జాలేసింది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు