సోంపేట ఒక కొత్త కొట్లాట నేర్పింది.

దొంగలెపుడూ దొంగ దెబ్బే కొడతారు. జనసముద్ర కెరటం – యెనక్కి తిరిగినపుడు బలుసాకు కోసం బతుకు జీవుడా అని పారిపోయే ఓ దొంగ తుపాకి పేల్చేడు. నేలని నెత్తుటితో తడిపేడు ఖూనీకోర్!         

దిగదిగో తీరప్రాంతమదేనంట ఉద్దానం – ఉద్దానం కాదుర ఉద్యానవనం రా! ఆ ఉద్యానవనం లో భూమికి పచ్చాని చీర గట్టినట్టూ – అని గద్దర్ పాడీవోడే అలగ ఆకుపచ్చని సీర కడతాది సోమ్ పేట. నీలాల కురుల్ని మెట్టలు  ముడిసినట్టగ సోమ్ పేట నెత్తిన మూడు కొండలు. ఆట్ని కొండలన్రు, మెట్టలే అంతారు. పాముల మెట్ట, యెర్రమట్టి మెట్ట, కాకులమెట్ట అనంతారు. ఆ మెట్టలకీ, ఆకుపచ్చ భూమికీ మధ్దెన చిత్తడి నేల…దాన్నే బీల అంతారు. ఆ మెట్టలకీ ఈ బీలకీ వారగా యెత్తయిన ఇసక దిబ్బలు ఆట్ని ఆనుకొని కళింగసముద్రం !     కళింగసముద్రమంటే మీకు తెల్దు. బంగాళాఖాతం సముద్రమని మీరు అంటారే అదే కళింగసముద్రం. ఈస్టిండియా కంపెనీవోడు తొలీత బెంగాల్ ఒచ్చినపుడు…అక్కడ సముద్రాన్ని సూసి – దానికి బే ఆఫ్ బెంగాల్ అనన్నాడు. ఇకప్పుడికాంచి కళింగసముద్రం బంగాళాఖాతమయిపోనాది. రాజ్జెం మారినా కంపెనీవోడు పెట్టిన పేరు మారలే! తెల్లోడు పెట్టిన సట్టాలే మార్సనోళ్ళు పేర్లు మారుస్తారేటి?

అందికే మా వోళ్ళంతారు  –  రంగు మారింది తప్పా రాజ్జెం మారలేదంతారు. తెళ్ళోడుకి బదులు నల్లోడు సిమ్మాసనమెక్కేడు… అనంతారు. ఇది సొతంత్రం కాదంతారు! ఆ వూసు అలగున్నీయండి.

సిమ్మాసనానికి సంబందించి వూసులకి దిగినామా…ఈ పూటకి తేల్తామా? సిమ్మాసనం యెలాగ యెక్కుతారు? యెవులు యెక్కుతారు? సిమ్మాసనమ్మీదున్నోడిని  యెవుళు సిగ్నేలిచ్చి పరిపాలన నడపతారు? ఆళ్ళూ, సిమ్మాసనమ్మీదోళ్ళూ జెనానికి యేటి సెప్తారు? అరిసేతిల వొయికుంఠాలెలాగ సూపుతారు…అదిగా వూసులన్నీ సెప్పాల. అవి మరొకసారి సెప్పుకుందుము, ఇపుడు సోమ్ పేట వూసే…ఇనండి!

అద్గదండీ…ఆకుపచ్చ భూమీ, కొండలూ, సముద్రమూ…కొబ్బరి తోటలు, మామిడి తోటలు, జీడితోటలు, పనస, మునగ, అరటి, అవేటి ఇవేటి పంటల తోటలే తోటలు. వరి, చోడి,జొన్న, నువ్వు వొవ్వో…పంటల భూములు.  రైతన్నవాడు వొర్సం కోసం మోర యెత్తి ఆకాశం కేసి సూడక్కర లేదు…బీల నీళు మున్నూరుగాలమూ పంటభూమిని తడుపుతాది. బీలల పిత్తపరిగిలు, మిట్టగిడుసులు, నానా రకాల సేపలు దొరకతాయి. దుంపజాతి పంట దొరకతాది. పేదోళ్ళకి మెత్తటి పరుపు – తుంగ చాపకి కావలసిన తుంగ గడ్డి దొరకతాది.

అదిగా బీల, ఆ ఆకుపచ్చ నేలా, ఆ నీలాల సముద్రం మీద యెవుళి కళ్ళు పడ్డాయనుకుంతారు? కార్పొరేటోళ్ళ కళ్ళు ! కళింగం మీద అడ్డమయిన సెక్రవొర్తులూ, రాజులూ, ఆ తర్వాత ఈస్టిండియా కంపెనీ కళ్ళూ పడలేదా? అలాగ కార్పొరేటోళ్ళ కళ్ళు బడ్డాయి. ఆళ్ళకి మద్దతుగ గవరమెంట్ !

ఉద్దానమే కాదు ఉత్తరాంధ్రా వెనకబడిపోనాది. దాన్ని ముందుకి ఈడ్చికి పోవాలంతే కార్పొరేటోడు రావాల. ఆడు కంపెనీలెట్టాల. రానో – నా..నో .. – అని  హిందీ, ఇంగ్లీషు భాషల్లో చెప్పీసి గుజరాతెళిపోబోతన్న కార్పొరేటోళ్ళ  కాళ్ళు పట్టుకొని ఇద్గిదిగిదిగో సోమ్ పేటకి తీసికొచ్చినాం. ఇక కంపెనీవోడు సోమ్ పేటని, ఉద్దానాన్ని, ఉత్తరాంధ్రని ముందుకు ఈడ్చికిపోతాడు. ఇచ్చీయండి, ఇచ్చీయండి…భూములిచ్చీయండి. ఇచ్చీయండని రాగమందుకున్నారు రాజకీయ నాయకులు.

ఆకుపచ్చ నేల కొంత రైతుల్దీ మరి కొంత గవర్మెంటుదీ!

రైతుల కాడ భూమిని మీరు కొనండి,  మా దగ్గరి  భూమిని మేమిస్తామని గవర్మెంటు కార్పొరేటోళికి సెప్పింది. ఇకంతే…భూమి భాగోతం మొదలైపోనాది. యెవుడి పద్యం ఆడు పాడీసి, యెవుడి నటన ఆడు నటించీసి…భాగోతం రసవత్తరం సేసీడానికి సిధ్దమయిపోనారు. కంపెనీ వోడు వూళ్ళంట మంచినీళ్ళు సప్లీ, మెడికల్  కేమ్ పులు, ఇస్కూలు పిలగాళ్ళకి పుస్తకాల బేగులు, క్రికెట్ బేట్లు సప్లయిలే సప్లయిలు…ఇంకోపక్క యెవులెవులో వొచ్చి భూమి ధర బంగారం ధరకి సమానం సేస్సి  అమ్మెత్తారేటి కొంతాము అనడగడం!

మరోపక్క కలక్టేరు బంగ్లా వొదిలి బయటికి రానోడు పొద్దూరక ముందర యెలిపొచ్చి జెన్మభూమి సభలు యెట్టడం, పద్దుకుమాలిన పధకాలు రండ్రండ్రని పిలవడం, యెలక్సన్ అయిపోయినాక రాజధానిల తప్ప నియోజక వర్గంల  అడుగెట్టని యెమ్మెల్లే నియోజక వర్గం వదలక పోవడం, లాఠీతోటి తప్పా నోటితోటి మాటాడని పోలీసోలు ఫ్రెండ్లీసు డవిలాగులు కొట్టడం – ఒక్కసారి సోమ్ పేటల సీను మారిపోయీసరికి మనలాటోళ్ళమయితే నాటకాన్ని కనిపెట్టలేక పోదుము. గానీ ఆళ్ళు సోమ్ పేట వాళ్ళు!

ఔనువోయ్ తాడి చెట్టు యెందుకెక్కుతున్నావు?

దూడకి గడ్డి కోసరం !

మనమయితే – అవును గావోలు గడ్డి కోసమేనేమో అనుకుంతాం.

సోమ్ పేట వోళ్ళు అలగనుకోరు. గడ్డీ, గాదం భూమ్మీద ఉంటాది గానీ చెట్ల మీద యెలా ఉంటాదోయ్ ? అనడుగుతారు.

ఔనౌను,అందికే దిగిపోతన్నానని ఆ ఆసామీ చెట్టు దిగినాడనుకో – మనమేమ్ అనుకుంటాం? సోమ్ పేటోళ్ళేమనుకుంటారు?

మనమంటే మనమేనండీ!

యెవుడేనా అదిగదిగో అది నంది అనంటే ఔను నందేననీ: కాదు కాదు పంది అనంటే ఔనా…అయితే పందే అనీ అడ్డమయిన వాడూ చెప్పే అడ్డమయిన మాటలకీ తలలూపే బసవన్నలం. మనకి కళ్ళుంటాయి గాని యెవుడో సూపిందే సూస్తాం. మనకి చెవులుంటాయి,గాని మరెవుడో చెప్పిందే వింటాం. మనకి మెదడుంటాది గానీ మరెవుడి ఆలోచనో మనదనుకుంటాం. మనకి పంచేమ్ ద్రియాలుంటాయి గానీ అవి పరాయోడి అదుపాగ్యలలో ఉంటాయి. అలాగని మనమేమీ తక్కువోళ్ళం కాము. మనకి కార్లూ,మేడలూ,కనకాలూ, శునకాలూ జాస్తిగా ఉంటాయి. మన లేడీస్ బాడీలు మోయలేనన్ని నగా,నట్రా మనకుంటాయి. ప్రపంచం లోని బెంకులన్నింటా బేలన్సులుంటాయి. మన నోటికి మన మాత్రు భాషే కాక మరెవురి మాత్రు భాషలో నాలుగైదు నోటికి వొస్తాయి. మన భుజమ్మీద కండువాలుంటాయి. భుజకీర్తులుంటాయి. మన చేతుల్లో తుపాకులుంటాయి. మన ఇలాకాల్లో జెయిల్లుంటాయి. మనం యెంతెంతో వారలం! యెవరెవరికో దాసులం! దొంగల్ని పోల్సలేమో, మనలోనా దొంగ ఉన్నాడో?

గానీ సోమ్ పేటోళ్ళు ‌ – తాడి చెట్టు కల్లు దొంగతనానికే యెక్కావంటారు. పీక పట్టుకుంటారు. తాగింది కక్కిస్తారు దోచి,దాచింది లోకానికి సూపిస్తారు.                                     కంపెనీవోడి డ్రామా, రాజకీయనాయకులి పద్యాలూ, పోలీసు, కలెట్రుల భాగోతాల్ని ఆపండన్నారు  సోమ్ పేటోళ్ళు. భూమీ,పుట్టా,బీలా, సముద్రం సమస్తం తీసీసుకొని మమ్మల్ని నాశినం చేసీసి నిన్ను నివ్వు ఉద్ధరించుకుంటావు. నీకు రాజ్జెం తోడు. మీరంతా తోడు దొంగలన్నారు. దొంగల కి దొంగధీరీలుంటాయన్నారు. ధీరీలకి తగ్గ చట్టాలు చేస్తారన్నారు. బీల, సముద్రం, ఆకుపచ్చ భూదేవినీ ఒదలము గాక ఒదలము అన్నారు.  ధర్నాలు, బంద్ లు, నిరాహారదీక్షలు, రాస్తా రోక్ లు, ఉద్దానం… ఉద్యానవనం…ఉద్యమాల వనం అయ్యింది.

అప్పుడు…ముసుగులు తీసీసినారు దొంగలు.

చిత్తడినేలలోని నీటివూటల  బీల  రెవిన్యూ రికార్డుల్ల – బీడు అయిపోయింది.  పంటభూముల్ల నూటానలభై నాలుగు సెక్సన్ పైరు మొలిసింది.  పశుల కాపలా కోసరం పట్టిన గొడి ముక్క మారణాయుధమయిపోయింది. రైతులూ, కూలోలూ రౌడీషీట్లు తొడుక్కున్నారు. పల్లెలు చుట్టూ చట్టాల పల్లేరు ముళ్ళ కంచె లేచింది. రాజ్యం ‘ధర్మాన’ ధర్మల్ విద్యుత్ కంపెనీకి దారులు పడ్డాయి. దినానికో రంగుల్లో దినపత్రికల్లో కంపెనీ మెరిసి, మురిపించీది. విలేకరుల కంటికి విలేజర్లే విలన్లగా కనిపించీవోరు. గొడ్డూగోదా, పిల్లామేకా, సెట్టూసేమా,పిట్టా బిక్కసచ్చిపోనాయి. సముద్రకెరటమూ యెనక్కి యెళిపోయింది.

జనసముద్రమూ యెనక్కి యెళిపోద్దనుకున్నారు. భూమి పూజ సరంజామా సిధ్దం చేసారు. పోలీసులూ, కంపెనీ రౌడీలూ, మందీమార్బలం దడిగట్టి ధర్మల్ విద్యుత్ కంపెనీ భూమి పూజకి దిగేరు. పెట్టుబడి విషపుత్రికల విలేకరులు కెమేరాలు, కలాలు వార్తల వంటకి సిధమయినాయి. ఆకాశాన మేఘం కోపంతో మండిపోతాంది. కాకులమెట్ట మీది కాకులు పూజా సామాగ్రి మీదుగా గింగిర్లు కొడతన్నాయి. పాముల మెట్ట మీది పాములు పడగలు యెత్తినాయి. బీల భూమిల చేపాజెళ్ళలు కిందుకీ మీదకీ యెగురుతున్నాయి. ఇసకదిబ్బల మీంచి గాలి బిగిలూదుతంది. యెనక్కి యెళిపోయిన సముద్రకెరటం…హోరున ముందుకు ఇరుచుకుపడింది.

భూమిపూజ మీదకి సర్వే కర్రల జనసముద్రం ఉరికింది. పోలీసులు, కంపెనీ గూండాలు తుపాకులు తీసారు, కత్తులు దూసేరు. కాసేపు అక్కడ కళింగయుధ్దం జరిగింది.   కారువాకల వారసులు గాజుల చేతులెత్తి కదిలేరు . పశులకాపరుల గొడి ముక్కలు నిజంగానే మారణాయుధాలైనాయి. తలపాగాలు పోరుపతాకాలైనాయి. ఇనపటోపీలనూ, బుల్లెట్ గన్నులనూ బురదమట్టిలో కుమ్మేసాయి. కలాలు, కెమేరాలు ఒదిలేసి పరిగెత్తేరు విషపుత్రికా విలేకరులు. సస్తే తులసాకు పెట్టే వోడూ ఉండడు, బతికుంటే బలుసాకు తిందామని దండాలు పెట్టి పారిపోయారు…కంపెనీవోరు, వారి దండూ!

దొంగలెపుడూ దొంగ దెబ్బే కొడతారు. జనసముద్ర కెరటం – యెనక్కి తిరిగినపుడు బలుసాకు కోసం బతుకు జీవుడా అని పారిపోయే ఓ దొంగ తుపాకి పేల్చేడు. నేలని నెత్తుటితో తడిపేడు ఖూనీకోర్!

అది అశోకుని యెదిరించిన నేల. రైతు రక్షణ యాత్ర నడపిన నేల. జమీందారీ రద్దుకు ఉద్యమించిన నేల. మార్పు కొరకు పద్మనాభులయిన నేల. జముకు మోగిన నేల. జనతంత్ర దళ గణపతుల నేల ! అది ఉద్దానం! ఉద్యమాల వనం!

భూమిని కంపెనీల కోసం ఒదిలేది లేదని సోమ్ పేట నెత్తుటి మీద ప్రమాణం చేసింది. ఊళ్ళన్నీ సోమ్ పేటల నిరాహారదీక్షకు దిగినాయి. అయిదేళ్ళకు పైగా శిబిరం నడచింది. కోర్టుల్లో కేసులేసినాయి. అధికార పార్టీ నాయకుల్ని ఘొరావ్ చేసాయి. పీఠాల మీది నాయకులు పీఠాలు దిగిపోయేరు. కోర్టు ప్రజలకు మద్దతుగా తీర్పు ఇచ్చింది. కంపెనీ తట్టాబుట్టా సర్డేసుకు పోయింది…పోరాడితే పోయేదేమీ లేదు కాదు, పోయే దాన్ని పొందగలమని సోమ్ పేట ఒక కొత్త కొట్లాట నేర్పింది.

*

 

అట్టాడ అప్పల్నాయుడు

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు